Telugu News

భాజపాకు అసలైన రథసారథి..ఎల్. కె. అడ్వాణీ..!

దేశ రాజకీయాల్లో చెప్పుకోదగిన దిగ్గజ నాయకులలో ముఖ్యులు.. భారతీయ జనతా పార్టీ భీష్ముడుగా.. రాజకీయ కురువృద్ధుడుగా.. పార్టీ వ్యవస్థాపక సభ్యుడుగా.. మాజీ ఉప ప్రధానిగా, పలు శాఖలకు మంత్రిగా.. యాభయ్యేళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని నిర్విరామంగా కొనసాగించిన నేత… 

ఎల్. కె. అడ్వాణీ…

అట్టడుగు స్థాయి నుంచి రాజకీయ జీవితాన్ని ఆరంభించిన అడ్వాణీ… దేశ ఉపప్రధాని వరకు ఎదిగి, ఎన్నో విశేష సేవలు అందించారు. గౌరవప్రదమైన రాజనీతిజ్ఞులలో ఆయనొకరు. జాతి ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశగా అసమాన కృషి చేసిన గొప్ప నేత.

పార్లమెంట్ లో ఆయన వాక్పటిమ, ఆయా అంశాలపై లోతైన అధ్యయనం ఎప్పటికీ ఆదర్శప్రాయమే… ఇద్దరే ఎంపీలున్న పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా మారడానికి పాటుపడిన నేత.. వంశపారంపర్య రాజకీయాలను సైతం సవాల్‌ చేసి, జాతీయవాద సిద్ధాంతాలతో సమ్మిళిత వృద్ధికి దేశ ప్రజాస్వామ్యాన్ని ఆయన అనుసంధానం చేశారు. మొదట్నుంచీ ప్రజాజీవితానికి దగ్గరగా ఉంటూ దశాబ్దాలపాటు సేవలు అందించడంలో పారదర్శకత, నిజాయతీలకు కట్టుబడి ఉన్నారు. రాజకీయాల్లో నైతికత, నిష్ఠతో ఆదర్శప్రాయమైన ప్రమాణాలను పాటించిన అలుపెరగని రథసారథి.. వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు మీకోసం…

నేపథ్యం

1927 నవంబరు 8న నాటి కరాచీలో అంటే ప్రస్తుత పాకిస్తాన్ లో కిసాన్ చంద్ అడ్వాణీ, జిజియాదేవి దంపతులకు ఎల్. కె. అడ్వాణీ జన్మించారు. పూర్తి పేరు లాల్ కృష్ణ అడ్వాణీ. స్థానిక సెయింట్‌ పాట్రిక్స్‌ హైస్కూల్‌లో పాఠశాల విద్యనభ్యసించారు. 1941లో తన పద్నాలుగేళ్ల వయసులో ఆర్ఎస్సెస్‌లో చేరారు. అనంతరం దేశ విభజన తర్వాత 1947 సెప్టెంబర్ 12న భారత్​కు అడ్వాణీ వలస వచ్చారు. 1947లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్ఎస్సెస్‌) కరాచీ విభాగం కార్యదర్శిగానూ విధులు నిర్వర్తించారు. పాక్‌లోని హైదరాబాద్‌లో ఉన్న డీజీ నేషనల్‌ కాలేజీలో న్యాయవిద్య పూర్తి చేశారు. దేశ విభజన తర్వాత ముంబయిలో స్థిరపడ్డారు. తొలుత రాజస్థాన్‌లో సంఘ్‌ ప్రచారక్‌గా పనిచేశారు. 1957లో ఆర్ఎస్సెస్ పిలుపుతో దిల్లీకి వెళ్లి, జనసంఘ్‌ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1960లో ఆర్గనైజర్ పత్రికలో కొన్నాళ్లు  జర్నలిస్ట్ గా కొనసాగారు.

రాజకీయ ప్రస్థానం

1966-67ల మధ్య జరిగిన దిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికల బరిలో దిగి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత తన రాజకీయ జీవితంలో ఆయన ఎప్పుడు వెనుతిరిగి చూడాల్సిన పరిస్థితి రాలేదు. ఆ ఏడాది నిర్వహించిన మధ్యంతర ఎన్నికల్లో జన్ సంఘ్ తరపున ఎన్నికైన అడ్వాణీ మరుసటి ఏడాది ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ కు అధ్యక్షుడయ్యారు. 

1970-72 మధ్య భారతీయ జన్ సంఘ్ దిల్లీ విభాగం అధినేతగా పనిచేశారు. 

1970లో ఢిల్లీ రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్ లో అడుగుపెట్టి సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు.

1973-76 వరకు జనసంఘ్ అధ్యక్షుడిగా పనిచేసిన అడ్వాణీ, 1974-76 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 

1975లో ఎమర్జెన్సీ సమయంలో మీసా చట్టం కింద అరెస్టై, జైలుకు వెళ్లారు. అదే సమయంలో తన జైలు జీవితాన్ని ‘ది ఫ్రీజనేర్స్ స్కాఫ్’ అనే పేరుతో ఒక గ్రంథాన్ని రచించారు.

1976-82 మధ్య గుజరాత్ నుంచి మరోసారి పెద్దల సభకు ఎన్నికయ్యారు. తర్వాత 1976లో జయప్రకాష్ నారాయణ స్థాపించిన నూతన జనతా పార్టీలో చేరారు. ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ ఘన విజయం సాధించింది. మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంలో అడ్వాణీ సమాచార ప్రసార శాఖమంత్రిగా 1977-79 వరకు పని చేశారు. 

తరువాత మరో టర్మ్ లో మొరార్జీ ప్రభుత్వం కూలిపోవడంతో 1980 జనవరి నుంచి ఏప్రిల్ వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 

భాజపాకు.. రథసారథి

1980లో ఢిల్లీలోని ఫిరోజ్ షా నేతృత్వంలో సమావేశమైన 3,500 మంది నేతలతో.. అదే ఏడాది ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ పేరుతో నూతన పార్టీని ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాజ్ పేయి, అడ్వాణీ, బైరాన్ సింగ్, షకావత్, మురళీ మనోహర్ జోషి వంటి నేతల చొరవతో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో పురుడు పోసుకుంది. 1982లో మధ్యప్రదేశ్‌ నుంచి మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తొలి అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్ పేయి ఎన్నిక కాగా అడ్వాణీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ ప్రారంభంలో భాజపా పరిస్థితి ఊహించినంత ఆశాజనకంగా లేదు. ఇందిరాగాంధీ హత్య అనంతరం పొందిన సింపథీ వల్ల 1984లో జరిగిన ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రాగా, భాజపాకు కేవలం రెండు లోక్ సభ స్థానాలు మాత్రమే లభించాయి. 1986లో అడ్వాణీ భాజపా అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1989 లోక్ సభ ఎన్నికల్లో భాజపా ఎంపీ స్థానాల సంఖ్యను 86కు పెంచడంలో అడ్వాణీ కీలక పాత్ర పోషించారని చెప్పుకోవాలి. 

1990లో అయోధ్య రథయాత్రను ప్రారంభించారు. అయోధ్య రథయాత్రతో పాటు పలు యాత్రలు చేసి, వాటిల్లో తనదైన ముద్ర వేశారు. ఆ టైమ్ లో అయోధ్య కరసేన సంఘ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. 

1991-96 మధ్య పీవీ. నరసింహారావు హయాంలో అడ్వాణీ నేతృత్వంలో భారత జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. 1996లో అడ్వాణీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాజపా అతిపెద్ద పార్టీగా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ, వాజ్‌పేయీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 13 రోజులకే కుప్పకూలింది. బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం కోసం 1997లో స్వర్ణ జయంతి రథయాత్రను ప్రారంభించారు. అనంతరం 1998లో జరిగిన ఎన్నికల్లో భాజపా మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అడ్వాణీ కేంద్రహోం మంత్రిగా పనిచేశారు.

ఏడాదికే ఎన్డీఏ సర్కార్ కుప్పకూలింది. 1999లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి అడ్వాణీ గెలిచారు. 2004 వరకు భాజపా పాలన సాగగా, అడ్వాణీ కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రిగా, కేంద్ర సిబ్బంది, శిక్షణా మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టారు. 2004 ఎన్నికల్లో భాజపా ఓటమి పాలు కాగా అడ్వాణీ లోక్‌సభలో సుదీర్ఘకాలంపాటు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఇదే సమయంలో వాజ్ పేయి రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోగా… భాజపా అధినేతగా అడ్వాణీ పార్టీని ముందుంచి నడిపించారు. ఆర్ఎస్ఎస్ నుంచి అలాగే 2005లో భాజపా జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అడ్వాణీ ఆ బాధ్యతలను అనంతరం రాజ్ నాథ్ సింగ్ కి అప్పగించారు.  

2009 ఎన్నికల్లో భాజపా ప్రధాన అభ్యర్థిగా అడ్వాణీ పోటీ పడినప్పటికీ ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఆ తర్వాత 2011 అక్టోబర్​లో చైతన్య యాత్రను ప్రారంభించారు. విదేశాల్లోని నల్లధనాన్ని స్వదేశానికి తీసుకువచ్చి, దేశాభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ చైతన్య యాత్ర చేశారు. 

తిరిగి 2014 ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి గెలిచిన అడ్వాణీ.. పార్లమెంటరీ బోర్డులో నిర్ణయాత్మక పాత్రను పోషించారు. ఆ ఎన్నికల్లో మోదీ ప్రధాని అభ్యర్థిగా.. బీజేపీ గెలుపుకు ఎల్. కె. అడ్వాణీ కీలక పాత్ర వహించారు.

ఆ తర్వాత 75 ఏళ్ళు పైబడిన వారిని ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అడ్వాణీకి భాజపా విశ్రాంతి ఇచ్చింది. 2019 పార్లమెంట్ ఎన్నికలకు గాంధీనగర్ నుంచి అడ్వాణీకి బదులుగా అమిత్ షా పోటీ చేయడంతో అగ్రనేత క్రియాశీలకంగా దూరమయ్యారు.

కీలకంశాలు

*1951లో భారత జన సంఘ్ ఏర్పాటు అయ్యేవరకు కూడా దేశంలో కాంగ్రెస్ దే ఏకచక్రాధిపత్యం. నెహ్రు, పటేల్ వంటి దిగ్గజాల సారథ్యంలో.. స్వాతంత్ర సంగ్రామంలో కీలక భూమిక పోషించిన నేపథ్యంలో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా బలమైన శక్తిగా ఎదిగేందుకు ఆనాటి పరిస్థితులు ఉపకరించాయి. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అటల్- అడ్వాణీ రాజకీయ ప్రతివ్యూహం.. భారతీయ జనతా పార్టీ వేదికగా సాగాయి. అడ్వాణీ, వాజ్ పేయి వ్యూహాలు ప్రత్యర్ధులకు చుక్కలు చూపించాయి. అటల్- అడ్వాణీ వేసిన పకడ్బందీ వ్యూహాలు భాజపాను విజయ తీరాలకు చేర్చాయి. వీరిద్దరి నిర్వహణ నైపుణ్యమే కమలదళంతో దాదాపు 25 పార్టీలు కలిసి వచ్చేందుకు బాటలు వేశాయి. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకి ఎంతగానో తోడ్పాటుని అందించాయి. 

*భారతీయ జనతా పార్టీకి అచ్చమైన హిందూత్వ రంగును అద్దింది.. అడ్వాణీనే. 1983నాటికి లోక్‌సభలో కాషాయ పార్టీకి కేవలం రెండే రెండు సీట్లు దక్కాయి. అలాంటి కష్టకాలంలో పార్టీ పగ్గాలను అందుకున్న… సమయంలో కాంగ్రెస్‌ పార్టీ.. అంతర్గత కలహాలు, అవినీతి లాంటి సమస్యల్లో చిక్కుకుంది. వాటిని గమనించిన అడ్వాణీ.. భాజపాను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రధానంగా హిందూ ఓటు బ్యాంకును ఆకర్షించాలని నిర్ణయించారు. ఆ అజెండాను తెరపైకి మోసుకొచ్చారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని నినదించారు. ఇందుకోసం 1989లో రథయాత్రకు శ్రీకారం చుట్టారు. దీంతోపాటు మరో ఆరు యాత్రలు చేశారు. కాంగ్రెస్ అవినీతి, వీ.పీ. సింగ్ ‘మండల్ రిజర్వేషన్‌’..

తదితర అంశాలతో సతమతమవుతున్న దేశ ప్రజలను సమీకృతం చేసేందుకు 1990 సెప్టెంబర్ 25న గుజరాత్ లోని సోమనాథ్ నుంచి ఆయన రామరథ యాత్రకు శ్రీకారం చుట్టారు. బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో రామ మందిరాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. తన యాత్రను అయోధ్యలో ముగించాలని మొదట భావించినా.. బిహార్‌లో అప్పటి ముఖ్యమంత్రి లాలుప్రసాద్ యాదవ్ ఆయన్ను అరెస్టు చేయించడంతో, రథయాత్ర మధ్యలోనే ముగిసిపోయింది. ఈ రథయాత్ర 1991 ఎన్నికల్లో భాజపాకు బాగా కలిసొచ్చిందని చెప్పాలి. ఆపై లోక్‌సభలోనే రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది.

1992లో బాబ్రీ విధ్వంసం తర్వాత భాజపాను కేంద్రంలో అధికారానికి మరింత దగ్గర చేసింది. 1993లో అడ్వాణీ చేపట్టిన జనాదేశ్ రథయాత్ర, ఆ తర్వాత స్వర్ణ జయంతి రథ యాత్ర, భరత్ ఉదయ్ యాత్ర, భారత్‌ సురక్షా యాత్ర వంటివి భాజపాకు బాగా కలిసొచ్చాయి. 1996లో భాజపా ప్రభుత్వం కొలువుదీరింది. 1984లో రెండు సీట్లతో ఉన్న ఆ పార్టీ.. అడ్వాణీ, వాజ్‌పేయీ నాయకత్వంలో 161 స్థానాలను గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇక, 2011లో యూపీఏ అవినీతికి వ్యతిరేకంగా జన చేతన యాత్రల పేరిట మరో రథయాత్ర చేశారాయన.

*ఇంత చేసిన అడ్వాణీ.. దేశానికి ప్రధాని కావాలని పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కలలు కన్నారు. కానీ 1999లో వాజ్ పేయీ ప్రధాని కావడంతో, ఆయన ఉప ప్రధాని పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2004 ఎన్నికల్లోనైనా ప్రధాని పదవిని అధిష్ఠించాలని భావించారు. కానీ, ఆ ఎన్నికల్లో కమలం ఓటమిపాలైంది.

ఆ తర్వాత 2005లో పాక్‌కు వెళ్లిన సమయంలో జిన్నా లౌకికవాది అని పొగడటం అప్పట్లో వివాదంగా మారింది. ఈ క్రమంలోనే అడ్వాణీ నేతృత్వంలోని భాజపా 2009లో మరోసారి పరాజయం పాలైంది. దీంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. 2014లో తన కల నెరవేరుతుందని ఆశించినా అది జరగలేదు. చివరకు 2019లో క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. అయినప్పటికీ ఇటీవల భారత అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న లభించడంతో.. ఆయన రాజకీయ జీవితం పరిపూర్ణమైందని చెప్పుకోవాలి.

Show More
Back to top button