
బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించినందుకు నేరంగా పరిగణించి ఓ పదిహేనేండ్ల ఓ కుర్రాడిని “వారణాసి” లోని ఒక చిన్న బ్రిటిషు కోర్టులో “ఖారేఘట్” అనే బ్రిటిషు న్యాయమూర్తి ప్రశ్నిస్తున్నాడు. నూనూగు మీసాల ఆ యువకుడికి చట్టం, నేరం వంటివి తెలియక ఉద్యమంలోకి వచ్చి ఉంటాడని, అతడిని మందలిస్తే భయపడి ఇంటికి పారిపోతారని భావించాడు ఆ న్యాయమూర్తి. అందుకని చాలా నెమ్మదిగా “నీ పేరు ఏమిటీ అని అడిగాడు. నా పేరు ఆజాద్ అని కుర్రాడు అనగానే అది నిజమైన పేరేమో అనుకున్నాడు. ఆ తరువాత నీ తండ్రి పేరు ఏమిటి అంటే “స్వాతంత్ర్యం” అని, నీ ఇల్లు ఎక్కడ అంటే “కారాగారం” అని ఆ కుర్రాడు చెప్పిన ఆ సమాధానాలకి మతిపోయిన ఆ న్యాయాధికారి “చిదిమితే పాలుగారే ముఖ వర్చస్సు” గల ఆ బాలుడిని చూస్తూ కూడా అధికార దర్పంతో, అహంకారంతో “15 కొరడా దెబ్బలు” అంటూ శిక్ష ప్రకటించాడు.
ఆ నరరూప రాక్షసులు కొరడా ఝళిపిస్తూ ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే, ఆ బాలుని శరీరమంతా రక్తసిక్తమైపోయింది. అయినా ఆ బాలుడు ఒంటి మీద దెబ్బ పడినపుడు “వందేమాతరం”, “భారత్ మాతాకీ జై” అంటున్నాడు. ఆ రోజు నుండి అదేపనిగా బ్రిటిషు వారి అన్యాయాల నుండి, అక్రమాల నుండి, వారి దాస్యశృంఖలాల నుండి దేశ ప్రజలకి విముక్తి కలుగజేయడం కోసం ఎదురొడ్డి పోరాడాడు చంద్రశేఖర్ ఆజాద్. తన అసలు పేరు చంద్రశేఖర్ సీతారాం తివారీ. అతడు దేశం గర్వించదగ్గ ఉద్యమకారుడు. “భగత్ సింగ్”, “రాజ్ గురు”, “సుఖ్ దేవ్”, “పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్”, “ఠాకూర్ రోషన్ సింగ్”, “ప్రేమ్ కిషన్ ఖన్నా” మరియు “అష్ఫాకుల్లా ఖాన్” మొదలగు వారందరికీ చంద్రశేఖర అజాద్ సహచరుడు. వీరితో కలిసి “హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్” అనే సంస్థని స్థాపించాడు. అలా 15వ యేట ప్రారంభించిన అతడి పోరాటం, ఎంచుకున్న విప్లవ మార్గం తన ప్రాణత్యాగం చేసే వరకు సాగింది. అతడు ప్రాణత్యాగం చేసే నాటికి ఆజాద్ వయస్సు కేవలం పాతిక సంవత్సరాలు మాత్రమే.
“బ్రతికుండగా నన్ను తెల్లవాళ్లు పట్టుకోలేరు. వాళ్లకు అంత దమ్ము కూడా లేదు”. ఇదే మాట చంద్రశేఖర్ అజాద్ పదేపదే అనేవారు. నిజమే.. బ్రిటీషు పోలీసు అధికారులు అజాద్ ని పట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, చివరికి “ఝాన్సీ” లో ఆయన్ను పట్టుకునేంత పని చేశారు. కానీ ఫలితం శూన్యం. ఆఖరుకు పార్కులో దొరికినా కూడా పట్టుకోవడానికి పోలీసులు భయపడ్డారు. అంత ధైర్యశాలి, పోరాటంలో వెన్నుచూపని వీరుడు చంద్రశేఖర్ అజాద్. “నీలో ఉన్నది ఉప్పునీరయితే నీకోసమే బ్రతుకు, కానీ ఉడుకు నెత్తురయితే దేశం కోసం మరణించు”, “నీ దేహం నిప్పుకణాల కొలిమి అయితే, అనుక్షణం నీ ప్రాణాన్ని సంఘానికి సమర్పించు”, “నీ గుండెకాయ పత్తికాయ అయితే, భరతమాతను మరచిపోయి నీ సుఖమే చూసుకో”. ఇలా రోమాలు నిక్కబొడుచుకునేలా పలికేవాడు చంద్రశేఖర్ ఆజాద్. స్వాతంత్ర్య ఉద్యమాన్ని అణిచివేసేందుకు బ్రిటిషు వారు అనుసరించిన విధానాలని చూసి చంద్రశేఖర్ ఆజాద్ పూర్తిస్థాయి పోరాట వీరుడిగా మారాలనుకున్నాడు.
అచంచలమైన ఆత్మవిశ్వాసంతో విప్లవకారుడిగా మారి, బ్రిటిషు పోలీసులకు ముచ్చమటలు పట్టించిన చంద్రశేఖర్ అజాద్ చూడడానికి కాస్త పొట్టి దృఢమైన శరీరం, చామనఛాయ రంగుతో, ముఖమంతా మసూచి గుర్తులతో, విశాలమైన నుదురు, మెలితిరిగిన మీసం, దానిని మరింత మెలివేస్తూ ఎడమ చేయి, కుడి మోకాలి దగ్గర రివాల్వరు ఇది ఆజాద్ రూపం. రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యానికి వారికి మింగుడు పడని ముద్దగా, కొరకరాని కొయ్యగా, పోలీసు అధికారులను గడగడలాడించిన విప్లవవీరుడు చంద్రశేఖర అజాద్. పదిహేనెండ్లకే తక్కువ శిక్షతో మొదలయ్యి, తన పాతికేళ్ళ వయస్సులో బ్రిటిషు పోలీసులకు చిక్కి, జైలు పాలయ్యేకన్నా తన ప్రాణాలు తానే తీసుకొని భరతమాత కోసం ప్రాణత్యాగం చేయడం మంచిదని భావించి 27 ఫిబ్రవరి 1931 నాడు తుపాకీతో కాల్చుకుని తనకు తానుగా ఆత్మాహుతి చేసుకున్న అమరవీరుడు, భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు చంద్రశేఖర్ అజాద్.
జీవిత విశేషాలు…
జన్మనామం : చంద్ర శేఖర్ సీతారాం తివారీ
ఇతర పేర్లు : చంద్ర శేఖర అజాద్, ఆజాద్, బలరాజ్
జననం : 23 జూలై 1906
స్వస్థలం : బాంపరా, కాన్పూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, బ్రిటిష్ ఇండియా
వృత్తి : విప్లవాత్మకమైనది
సంస్థ : హిందూస్తాన్ సోషలిస్ట్, రిపబ్లికన్ అసోసియేషన్
ఉద్యమం : ఉద్యమం భారత స్వాతంత్ర్య ఉద్యమం
తండ్రి : సీతారాం తివారీ
తల్లి : జగరాణీదేవి
మరణ కారణం : తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య
మరణం : 27 ఫిబ్రవరి 1931 (వయస్సు 24)
నేపథ్యం…
చంద్రశేఖర ఆజాద్ అంటే చంద్రుడిని ధరించిన స్వతంత్రుడని అర్థం. అంటే శివుడిలా స్వతంత్రుడని అర్థం. చంద్రశేఖర్ ఆజాద్ తన పేరును సార్ధకం చేసిన సర్వ స్వతంత్రుడు, వీరాగ్రేసరుడు, దేశభక్తుడు. చంద్రశేఖర అజాద్ 23 జులై 1906 నాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్ జిల్లాలో బాంపరా అనే గ్రామం ఆ గ్రామంలో మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి సీతారాం తివారీ సొంత గ్రామంలోనే తోట కాపుల ఉద్యోగం చేస్తుండేవారు. తల్లి జగరాణీదేవి. అజాద్ కంటే ముందు తల్లికి ఇద్దరు మగ బిడ్డలు జన్మించారు. సంప్రదాయమైన జీవితం గడుపుతుండే సీతారాం తివారీ సజ్జనుడు. అందువలన ఊరి వారందరూ అతడిని చాలా గౌరవంగా చూసేవారు. ఎవ్వరికీ ఏ తగాదా వచ్చినా తివారీ వద్దకు తీర్పుకెళ్లి సంతృప్తిగా తిరిగి వెళ్లేవారు.
సీతారాం తివారీ దంపతుల తొలి సంతానం సుఖ్ దేవ్. ఆ సుఖ్ దేవ్ తరువాత ముగ్గురు సంతానం కలిగినా బాలారిష్టాల వలన చనిపోయారు. అయిదవ సంతానంగా జన్మించిన చంద్రశేఖర్, పుట్టినప్పుడు బలహీనంగా సన్నగా పుట్టాడు. కానీ తల్లిదండ్రులు అత్యధిక శ్రద్ధతో పెంచి బలిష్టుడిగా తయారుచేశారు. చంద్రశేఖర్ అన్న సుఖదేవ్ మందకొడిగా ఉండేవాడు. కానీ చంద్రశేఖర్ మాత్రం చాలా చురుగ్గా చక్కగా ఉండేవాడు. చూసేవారికి ఎవరికైనా ముద్దొచ్చే ముఖవర్చస్సు కలిగి ఉండేవాడు. తనకు చిన్నప్పటినుండే నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా గోచరించేవి. ఆటలలోనూ, పాటలలోనూ అందరినీ ముందుండి నడిపిస్తూ ఉండేవాడు. చంద్రశేఖర అన్న పేరు సుఖదేవ్. భగత్ సింగ్ స్నేహితుడు కూడా సుఖదేవ్. కానీ ఆ సుఖదేవ్ వేరు, ఈ సుఖదేవ్ వేరు.
చిన్నప్పుడే బొంబాయి పారిపోయి..
సీతారాం తివారీ కుటుంబం పెద్దగా డబ్బున్న కుటుంబం కాదు. వారి పిల్లల్ని సంస్కృత పండితులు చేయాలని తల్లి కోరిక. కానీ పండిత కుటుంబంలో పుట్టిన పిల్లలకు చదువు అబ్బలేదు. వారిని కాశీలో చదివించాలని ఆమె కలలు కనేది. కానీ చంద్రశేఖర్ అజాద్ కి చదవంటే పెద్దగా గిట్టేది కాదు. తల్లి మాత్రం అతడు చదువుకోవాలని తనను బాగా కట్టడి చేసేది. దాంతో అతనికి నచ్చేది కాదు. తల్లిదండ్రులు చదువు కోసం చేస్తున్న ఒత్తిడి, తోటి బంధువుల అవహేళన భరించలేక ఇంటి నుండి పారిపోయి బొంబాయి చేరిన చంద్రశేఖర్, అక్కడ కూలివాడిగా పనిచేస్తూ మురికివాడిలో జీవితం గడిపేవాడు. అక్కడ కూలి నాలి చేస్తూ, వేరుశెనగ కాయలను తింటూ వికృష్ట జీవితం గడిపేవాడు. మురికివాడలో కార్మిక గదులలో తలదాచుకున్నాడు.
మురికి కంపు వాసనతో వాంతులు వచ్చేలా ఉండే ఆ గదులలోనే అన్నీ భరించి రెండేళ్లు ఉన్నాడు. ఆ తరువాత ముంబైలో ఉండలేకపోయాడు, అలాగని ఇంటికి కూడా వెళ్లాలనిపించలేదు. ఈ కష్టాల కన్నా సాంస్కృతం చదువే మంచిదనిపించింది. ఆ కష్టం కన్నా సంస్కృతం నేర్చుకోవడమే సులభమని భావించి 1921 వ సంవత్సరంలో తిరిగి “వారణాసి” వచ్చి సంస్కృత పాఠశాలలో చేరాడు. అక్కడ పాఠశాలలో ఉండగానే గాంధీజీ ఇచ్చిన “సహాయ నిరాకరణ ఉద్యమం” కు దేశం స్పందించింది. దాంట్లో చంద్రశేఖర్ అజాద్ పాల్గొన్నాడు. ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకు బ్రిటిష్ వారు అనుసరించిన విధానం చూసి ఆజాద్ పూర్తిస్థాయి పోరాట వీరుడిగా మారాలనుకున్నాడు. అలా తన 15వ యేట ప్రారంభించిన పోరాటం, విప్లవ మార్గం ఎంచుకొని ప్రాణత్యాగం చేసే వరకు కొనసాగింది.
“చెరసాల” నా ఇల్లు అంటూ..
సంస్కృతం చదువుకోసం 1921 లో పాఠశాలలో చేరాడు. సరిగ్గా అప్పుడే గాంధీజీ సహాయ నిరాకరణోద్యమంతో దేశం అట్టుడికి పోతుంది. దేశం నలమూలలా నడుస్తున్న ఆందోళనలు చంద్రశేఖర్ అజాద్ ని వెర్రెక్కించాయి. స్వాతంత్ర్యం కోసం తాను ఏదో ఒకటి చేయాలని అనుకొన్నాడు. అంతే తన పాఠశాల ముందే ధర్నా చేశారు. దాంతో అజాద్ ను బ్రిటీషు పోలీసులు పట్టుకెళ్లారు. న్యాయధికారి ముందు నిలబెట్టారు. అజాద్ లో పెళ్ళికెళ్ళినంత సంబరం మొదలైంది. అప్పుడు న్యాయధికారి ఆ పదిహేనేండ్ల చంద్రశేఖర్ ని అడిగారు, “నీ పేరేంటి” అని? తన అసలు పేరు చెప్పలేదు కానీ “ఆజాద్” అన్నాడు. స్వతంత్ర్యమే నా పేరు అంటూ గల్లా ఎగరేసారు. నీ తండ్రి పేరు ఏమి అని న్యాయమూర్తి అడిగారు. దానికి సమాధానంగా “స్వేచ్ఛ” అన్నాడు కన్నెగరేస్తూ.
దాంతో ఆవేశాన్ని అణుచుకుంటూ న్యాయమూర్తి మళ్ళీ అడిగారు నీ ఇల్లు ఎక్కడ? అని. దానికి “చెరసాల” అని ఠక్కున సమాధానం చెప్పాడు. న్యాయమూర్తికి ఒళ్ళు మండిపోయింది. చంద్రశేఖర్ కు పదిహేను రోజుల జైలు శిక్ష విధించారు. అప్పుడు చంద్రశేఖర్ ఊరుకోలేదు. నాకు తెలుసు సార్ నన్ను మా ఇంటికే పంపుతారని అన్నాడు. దాంతో ఆ న్యాయమూర్తికి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ఆ ఖైదు రద్దు చేసి పదిహేను కొరడా దెబ్బలు ఖరారు చేశారు. చర్మం పగిలిపోయేలా, ఒళ్లంతా రక్తం కారేలా అజాద్ ను చితకబాదారు ఆ పోలీసులు. అయినా ఆ కుర్రాడు ఏడవలేదు. తన ఒంటిపై పడిన ప్రతీ దెబ్బ తనకు కర్తవ్య బోధ చేసింది. తాను పుట్టిందే జన్మభూమి ఋణం తీర్చుకునేందుకు అని అనుకున్నాడు. అప్పటినుండి చంద్రశేఖర్ తివారీ కాస్త చంద్రశేఖర్ ఆజాద్ అయ్యాడు.
“కాకోరి రైలు దోపిడీ”…
గాంధీజీ అవలంబించే అహింసా మార్గంలో బ్రిటిష్ వారిని లొంగదీయలేమని అర్థం చేసుకున్న అజాద్, ఆయుధాలతో నడిపే మార్గమే సరైనదని నమ్మి యువపోరాట యోధులలో చేతులు కలిపాడు. రాంప్రసాద్ బిస్మిల్ ద్వారా ఆజాద్ మనసులో విప్లవ బీజాలు స్థిరపడ్డాయి. ఆ పంథాలోనే పయనిస్తున్న రాంప్రసాద్ బిస్మిల్, రోషన్ సింగ్ అమ్ముల్లాఖాన్ లతో చేరిన ఆజాద్ “కాకోరి రైలు దోపిడీ” లో పాల్గొన్నారు. 09 ఆగస్టు 1924 నాడు జరిగిన దోపిడీలో ప్రభుత్వ ధనం దోచుకున్నారు. ఆ దోపిడీలో పాల్గొన్న వారి కుట్రను ఛేదించిన బ్రిటీషు పోలీసులు వరుసగా ఒకరి తరువాత మరొకరిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. చంద్రశేఖర్ ఆజాద్ మాత్రం పోలీసులకు దొరక్కుండా అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుండి ఆజాద్ చంద్రశేఖర్ చివరి రోజులన్నీ అజ్ఞాతంలోనే గడిచిపోయాయి. అజ్ఞాతవాసంలో ఆజాద్ ఏర్పరుచుకున్న రహస్య కేంద్రము ఉత్తరప్రదేశ్ లోని ఓర్చా అరణ్యం.
ఇక్కడ “సతార్” నది ఒడ్డున ఆంజనేయ స్వామి గుడి ప్రక్కన ఒక కుటీరం ఏర్పరుచుకున్నాడు. ఆయన తన పుట్టుకతోనే బ్రాహ్మణుడు, అందులోనూ సంస్కృతం కూడా వచ్చు. కాబట్టి “హరి శంకర బ్రహ్మచారి” అనే సాధువుగా వేషం మార్చుకున్నాడు. అన్ని కుట్రలకు తాను వేసిన ప్రణాళికలన్నీ కూడా ఇక్కడినుండే. ఆజాద్ గడుపుతున్నది సాధు జీవితమే, కానీ ఆయన విప్లవాగ్ని ఆలోచనలతోనే పనిచేసేవారు. తన కుటీరాన్నే బ్రిటీష్ వ్యతిరేక కుట్రల ప్రణాళికకు స్థావరంగా మార్చుకున్న చంద్రశేఖర్ అజాద్, విప్లవ మార్గం ఎంచుకున్న భగత్ సింగ్, సుఖ్ దేవ్ లకు స్ఫూర్తిదాయకంగా మారారు. వీరంతా నమ్మిన సిద్ధాంతం సమసమాజ నిర్మాణం. అందుకోసం వీరు “హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్” అనే సంస్థను స్థాపించారు. దానితో భారతదేశంలో సోషలిస్టు పాలన తీసుకురావాలన్నది వారి ఆలోచన. “కాకోరి రైలు దోపిడీ” కేసులో ఆజాద్ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు.
సాండర్స్ అనే పోలీసుని చంపి, ఝాన్సీ కి పారిపోయి…
సెప్టెంబరు 1928 లో భగత్ సింగ్, దేవ్ గురు మొదలైన వారితో కలిసి “హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్” స్థాపించిన ఆజాద్, సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసన ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న పంజాబీ కేసరి “లాలాజపతిరాయ్” మీద లాటికి దెబ్బలు కురిపించి, ఆయన మరణానికి కారణం అయిన వారిపై పగతీర్చుకోవాలి అనుకున్నారు. అందుకు కారణమైన “స్కాట్” అనే పోలీసు అధికారిని చంపాలనుకున్నారు. భగత్, రాజ్ గురు కలిసి “స్కాట్” ని తుపాకీతో కాల్చే ఖరారు, అందరూ పారిపోయేందుకు ఆజాద్ సహకరించే ఖరారు. ఇలా ప్రణాళిక వేశారు. కానీ “స్కాట్” అనుకుని “సాండర్స్” అనే పోలీసును తుపాకీతో కాల్చారు. ఆ వెంటనే పారిపోయారు. కానీ చనణ్ సింగ్ అనే పోలీసు వారిని వెంబడించారు. ఒక దశలో ఆ ఇద్దరిని పట్టుకోగలిగే అంత దగ్గరగా వచ్చేసారు చరణ్ సింగ్. భగత్ సింగ్, రాజ్ గురు, చంద్రశేఖర్ అజాద్ ముగ్గురూ ఒకరినొకరు కాపాడుకుంటూ ముగ్గురు పరుగెడుతున్నారు. ఇలాంటి దశలో “చనణ్ సింగ్” ని కాల్చి చంపక తప్పేలా లేదు.
చంద్రశేఖర్ అజాద్ వెంటనే తన తుపాకీ పేల్చాడు. “చనణ్ సింగ్” నేల కూలాడు. సాగిపోయే వాహనంలో నుండి వెంట్రుక వాసి వస్తువులను సైతం కళ్ళు మూసుకొని గురి తప్పకుండా కాల్చగల పట్టు ఆజాద్ ది. చంద్రశేఖర్ ఆజాద్ కోసం పోలీసులు వేట మొదలైంది. కాన్పూరు లో ఓసారి పోలీసులు కంటపడ్డాడు. రాత్రి 12 గంటలకు శివవర్మతో కలిసి సంధు గొందుల గుండా పరుగు లంఘించుకున్నాడు. మూల్ గంజ్ ప్రాంతంలో ఓ చిన్న గల్లీలోకి వెళ్లేసరికి అక్కడ మేడపై నుండి అందమైన పాట వినిపించింది, దాంతో వెంటనే అక్కడ ఆగిపోయాడు. కోకిల స్వరంతో పాడుతున్నది “వేశ్య” అని తనకు అర్థం అయ్యింది. ఒకవైపు పోలీసులు తరుముతున్నారు, మరోవైపు నిశ్శబ్ద, నిశీధి వాతావరణంలో చీకటిని చీల్చుకుంటూ వెన్నెల జలపాతంలా జారుతున్న ఆమె పాటను వింటూ మంత్రముగ్ధుడైపోయాడు. పోలీసులు వచ్చేస్తున్నారు అని శివవర్మ చెబుతున్నా వినిపించుకోలేదు. ఆజాద్ కి సంగీతం అన్నా, పాటలన్నా అంత పిచ్చి. అక్కడినుండి నేరుగా “ఝాన్సీ” కి పారిపోయాడు.
“ఉరి” నుండి భగత్ సింగ్ ను తప్పించాలని పలు ప్రయత్నాలు…
చంద్రశేఖర్ అజాద్ ఝాన్సీ పారిపోయిన విషయం పోలీసులకు తెలుసు. ఎంత వెతికినా కూడా ఆజాద్ ఎక్కడున్నది పోలీసులు పసిగట్టలేకపోయారు. ఆయన ఝాన్సీలో ఏదో ఒక ఇంట్లో దాక్కున్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు ఆ ఇల్లు చుట్టుముట్టి తుపాకులతో ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులకు ఖాళీ ఇల్లు వెక్కిరించింది. మెరుపులా పోలీసులు కళ్ళు కప్పి పారిపోయాడు అజాద్. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు పార్లమెంటు మీద దాడి చేసి బాంబు దాడి బ్రిటిషు పాలకులను భయభ్రాంతులకు గురిచేసింది. పోలీసులు లొంగిపోయిన ఆ విప్లవకారులను విచారించి “ఉరిశిక్ష” విధించినట్టు తీర్పు వెలువడింది. జైలులో ఉన్న తన విప్లవ మిత్రులను విడిపించడానికి చంద్రశేఖర్ అజాద్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. జైలు మీద దాడి చేసైనా సరే వారిని విడిపించాలి అనుకున్నాడు. కానీ ఆ ప్రయత్నాలేవి కూడా ఫలించలేదు. ఇది సరికాదని రహస్య జీవితంలో ఉంటూనే ఆయన జాతీయ రాజకీయ నాయకులను కలిసి భగత్ సింగ్ విడుదలకు ఒత్తిడి తేవాలనుకున్నాడు. మారు వేషంలో జవహరలాల్ నెహ్రూను కలిసి తాను ఎవరో, తను వచ్చిన పనేమిటో చెప్పి, భగత్ సింగ్ విడుదలకు బ్రిటీషు అధికారులపై ఒత్తిడి తేవాలని కోరారు. కానీ ఆ విషయంపై నెహ్రూ ఏమాత్రం స్పందించలేదు.
వీర మరణం…
27 ఫిబ్రవరి 1936 నాడు జవహరలాల్ నెహ్రూ కలిసి విప్లవ వీరులైన భగత్ సింగ్ తదితరులను విడిపించేందుకు సహకరించమని కోరినా కూడా నెహ్రూ అందుకు అవుననలేదు, కాదనలేదు. దాంతో కలత చెందిన చంద్రశేఖర్ ఆజాద్ మారువేషంలో అలహాబాద్ చేరుకున్నారు. ఎలాగైనా భగత్ సింగ్ మరియు అతని అనుచరులను విడిపించాలని దక్షిణాదికి వెళ్లి సహాయం ఆర్థించి రావాలన్న తన పథకానికి మిత్రులతో కలిసి అలహాబాద్ లోని ఆల్ఫ్రెడ్ పార్కులో చర్చలు జరుపుతున్నారు. ఆ రోజు ఉదయం 10:30 కి ఆజాద్ పార్కులో ఉన్న విషయం ఒక ద్రోహి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు చంద్రశేఖర్ అజాద్ ను చుట్టుముట్టారు. ఆ సమయంలో ఆజాద్ మెదడు పాదరసంలా పనిచేసింది. తనతో చర్చిస్తున్న వారిలో పోలీసులు ఉన్నారని భావించిన ఆజాద్ ముగ్గురు అనుమానితులను తన దగ్గర ఉన్న తుపాకి తీసి కాల్చి చంపారు.
ఇది గమనించిన పోలీస్ అధికారి “నాట్ బీవర్” పేల్చిన బుల్లెట్ ఆజాద్ కాలికి తగిలింది. ఆజాద్ కాల్చిన బుల్లెట్ పోలీస్ అధికారి భుజం గుండా దూసుకుపోయింది. గాయమైన కాలుతోనే చంద్రశేఖర్ ఆజాద్ ఒక చెట్టు చాటుకు చేరుకున్నారు. తనతో ఉన్న మరో విప్లవకారుడు “సుఖ్ దేవ్ రాజ్” ని అక్కడినుంచి పారిపోమ్మని చెప్పి, అందుకు సహకరించాడు చంద్రశేఖర్ అజాద్. తన దగ్గర ఉన్న తూటాలతో పోలీసులకు తగిన బుద్ధిచెప్పాడు. గాయపడిన పోలీసు తప్పుకుంటూ ఉంటే కొత్త పోలీసు బృందం వస్తున్నది. చివరికి చంద్రశేఖర్ అజాద్ దగ్గర ఒక్కటే తూటా మిగిలింది. అయితే అది అయిపోతే బ్రిటిష్ పోలీసులకు చిక్కాల్సి వస్తుందని, ఇంత విప్లవ బ్రతుకు బ్రతికి పరాయి పాలకుల చేతిలో బంధీగా బ్రతకడం ఎంతో అవమానం అనుకున్నాడు.
అందుచేత ఆ ఒక్క బుల్లెట్ ఉన్న తుపాకిని తన కణితికి పెట్టుకుని తనకు తానే కాల్చుకుని పార్కులోనే అమరుడయ్యాడు. చంద్రశేఖర్ ఆజాద్ మరణించి ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గరకు వెళ్ళడానికి బ్రిటిష్ పోలీసులు చాలా భయపడ్డారు. కొన ప్రాణంతో ఉన్న ఆజాద్ తమ మీద తుపాకీ పేల్చి చంపేస్తాడన్న భయం వారిది. 27 ఫిబ్రవరి 1931 సాయంత్రానికి బయట ప్రపంచానికి చంద్రశేఖర్ ఆజాద్ అమరుడయ్యాడని తెలిసింది. పాతికేళ్ల వయసులో అతని ప్రాణ త్యాగం తలుచుకుంటే ఎవ్వరికైనా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. పాతికేళ్ళకే స్వతంత్ర్యం అంటే ఆత్మగౌరవం అని నిరూపించిన చంద్రశేఖర్ అజాద్, విప్లవ వీరులు భగత్ సింగ్ ను ఉరి తీయడానికి సరిగ్గా 25 రోజుల ముందు ఆత్మత్యాగం చేసుకున్నాడు.