అక్టోబర్ 20 – 26 : “జాతీయ రసాయనశాస్త్ర వారేత్సవాలు” సందర్భంగాతినడానికి తిండి, కట్టడానికి బట్ట, తల దాచుకోవడానికి గూడు అనే మూడు కనీస నిత్య అవసరాలను తీర్చగల ఏకైన సాధనంగా రసాయనశాస్త్రం నిలుస్తున్నది.
తిన్న ఆహారం జీర్ణం కావాలన్నా, శరీరంలోని హానికారక పదార్థాలను తొలగించాలన్నా, నివాస స్థలాలను శుభ్రంగా ఉండాలన్నా, పర్యావరణ పరిరక్షణ జరగాలన్నా, రోగాలు కట్టడి చేయాలన్నా రసాయనశాస్త్రమనే ఆయుధమే మానవాళికి శరణ్యం అని నమ్మాలి. దిన చర్యను ప్రారంభించే టూత్ పేస్ట్/బ్రష్, గుటకలేస్తూ తాగే టీ/కాఫీలు, ఆహారాన్ని ప్రసాదించే పోషకాహారం, వంటలు వండడం, సబ్బులు/డిటర్జెంట్లు, ఆహార పదార్థాల్లో వాడుకునే రసాయనాలు, ప్రాణాపాయ సూక్ష్మజీవులను నశింపజేయడం, టీకాలు/ఔషధాలు, ధరించే వస్త్రాలు, నిప్మణ రంగంలో వాడే మెటీరిల్స్ లాంటివి కెమిస్ట్రీ ప్రసాదించిన వరంగా భావించాలి.
అన్ని పదార్థాల్లో దాగిన అణువులు, పరమాణువులు, మౌళిక కణాల్లో దాగిన రహస్యాల గుట్టు విప్పుతూ, మానవాళి సంక్షేమం వైపు వాటి అనువర్తనాలను శోధించే మార్గంగా రసాయనశాస్త్రం నేడు ప్రపంచం ముందు నిలుస్తున్నది. ఆరోగ్యాన్ని కాపాడే ఔషధాలు, పంట దిగుబడులను పెంచే క్రిమికీటక నాశనులు, వైవిధ్యభరిత ఆహార పదార్థాలు, వస్త్ర పరిశ్రమ, రవాణా రంగం, టెక్నాలజీ, పరిశుభ్రత, సౌందర్య సాధనాలు లాంటి అనేక రంగాల్లో రసాయనశాస్త్రమే పునాదిగా నిలుస్తున్నది.
జాతీయ రసాయనశాస్త్ర వారోత్సవాలు-2024 థీమ్:
1986లో అమెరికన్ కెమికల్ సొసైటీ (ఏసిఎస్) చేసిన ఆలోచనల ఫలితంగా 1987 నుంచి ప్రతి ఏట అక్టోబర్ 20 – 26 వరకు నిర్వహింపబడుతున్న “జాతీయ రసాయనశాస్త్ర వారోత్సవాల్లో (నేషనల్ కెమికల్ వీక్)” భాగంగా ప్రపంచ మానవాళికి రసాయనశాస్త్ర ప్రాధాన్యాన్ని ఏకరువు పెట్టడం, సుస్థిరాభివృద్ధిలో రసాయనశాస్త్ర పాత్రను శ్లాఘించుడం, డిజిటల్ యుగంలో రసాయనశాస్త్ర పరిశోధనల ప్రగతిని వివరించడం లాంటి అంశాల్లో అవగాహన కల్పించడం గత మూడు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్నది.
“జాతీయ రసాయనశాస్త్ర వారోత్సవాలు-2024” థీమ్‌గా “పిక్షర్ ఫర్‌ఫెక్ట్ కెమిస్ట్రీ” అనే అంశాన్ని తీసుకొని ప్రచారం చేస్తున్నారు. డిజిటల్ ప్రపంచంలో రసాయనశాస్త్రంలో ముడిపడి ఉన్న ఫోటోకెమిస్ట్రీ, ఇమ్మేజింగ్ ప్రక్రియల్ని జోడించి అత్యాధునిక రసాయనశాస్త్ర ప్రయోగాలు చేస్తూ మానవాళి శ్రేయస్సుకు వినియోగించడం జరిగుతోంది. వీడియోలు, రసాయనశాస్త్ర వస్తువుగా కవితలు, రచనలు, రసాయన ప్రయోగాలు, నిపుణులతో ప్రసంగాలు, పరిశోధనలను ప్రోత్సహించడం, రసాయనశాస్త్రాన్ని బోధించడం, జీవన లక్ష్యంగా మార్చుకోవడం, పలు రకాల పోటీలు నిర్వహిస్తూ నేటి విద్యార్థిలోక మనసును రసాయనశాస్త్ర అధ్యయనం వైపు ఆకర్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
జాతీయ మోల్ దినోత్సవం-2024:
జాతీయ రసాయనశాస్త్ర వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 23న జాతీయ మోల్ దినోత్సవం ఘనంగా నిర్వహించుట జరుగుతున్నది. రసాయనశాస్త్ర విద్యార్థులు, శాస్త్రవేత్తలు, ఔత్సాహికులకు అవగాడ్రో సంఖ్య గూర్చి పరిజ్ఞానం ఉంటుంది. అవగాడ్రో సంఖ్యలో (6.023 >< 10 టు ది పవర్ ఆఫ్ 23) అణువులు లేదా పరమాణువులు ఉన్నట్లైతే దానిని ఒక మోల్ అని నిర్వచిస్తారు. ఒక మోల్ పరమాణువుల భారాన్ని పరమాణు భారం అని, అణువుల భారాన్ని అణుభారమని అంటారు. రసాయనశాస్త్రంలో మౌళిక యూనిట్‌గా మోల్ లేదా అవగాడ్రో సంఖ్య నిలుస్తున్నది. ఆ మౌళిక అంశాల పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడానికి “మోల్ దినం” వేదికలను వినియోగించుకోవాలి.
రసాయనశాస్త్రానికి ఇరువైపుల పదును ఉంటుంది. దానిని మానవాళి సంక్షేమానికి, విష పదార్థాలతో నశింపజేయడానికి కెమిస్ట్రీ ప్రక్రియల్ని వాడవచ్చు. ఈ విషయాలను ఆకలింపు చేసుకొని కెమిస్ట్రీ విజ్ఞానాన్ని మానవాళితో పాటు ప్రాణికోటి, పర్యావరణాలను కాపాడుకుంటూ మరింత సరళ జీవన విధానాలతో ముందడుగు వేద్దాం, రసాయనశాస్త్రానికి కృతజ్ఞతలు తెలియజేద్దాం.