
ఆర్బీఐ స్థాపనలో డా. బి. ఆర్. అంబేడ్కర్ పాత్రడా. బాబా సాహెబ్ భీమ్ రావు అంబేడ్కర్ సహకారాన్ని మరియు సేవలను కేవలం భారత రాజ్యాంగ రూపకల్పనకు మాత్రమే పరిమితం చేస్తే అది ఘోర తప్పిదమే అవుతుంది. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, సామాజిక సంస్కర్త, న్యాయవాది, ఆర్థికవేత్త మరియు అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం మరియు సమానత్వాన్ని సమర్థించిన 20వ శతాబ్దపు భారతదేశపు గొప్ప నాయకుడు. బ్యాంకింగ్ రంగాన్ని నియంత్రించడం, ద్రవ్య విధానాన్ని నిర్వహించడం మరియు కరెన్సీని పర్యవేక్షించడం ద్వారా దేశ ఆర్థిక స్థిరత్వం మరియు వృద్ధిలో కీలక పాత్ర పోషించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ని భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పరిగణిస్తారనే విషయం మనందరికీ తెలుసు.
అయితే, 1926లో హిల్టన్ యంగ్ కమిషన్ చర్చల సందర్భంగా అంబేడ్కర్ తన పీహెచ్డీ కోసం 1923లో కొలంబియా విశ్వవిద్యాలయానికి సమర్పించిన పరిశోధనా (థీసిస్) పుస్తకం “ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ: ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్” ఆధారంగా సిఫార్సులను సమర్పించారు. ఈ చర్చలు ఏప్రిల్ 1, 1935న ఆర్బీఐ స్థాపనకు పునాది వేసాయి. “స్థిర పరిమితితో మార్చలేని రూపాయిని కలిగి ఉండటం” రూపాయి స్థిరీకరణకు ఉత్తమ మార్గం అని అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు.
అంబేడ్కర్ రాసిన “ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ: ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్” పుస్తకానికి రాసిన తన ముందుమాటలో ప్రొఫెసర్ ఎడ్విన్ కానన్ ఆయన విమర్శలు మరియు వాదనలతో ఎక్కువగా విభేదించినప్పటికీ, అంబేడ్కర్ అభిప్రాయాల తాజాదనం మరియు వాస్తవికతను అంగీకరించడం గమనార్హం. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ “అంబేడ్కర్ ఆర్థిక శాస్త్రంలో తండ్రి. ఆర్థిక శాస్త్ర రంగానికి ఆయన చేసిన కృషి అద్భుతమైనది మరియు ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అని పేర్కొనడం, అంబేడ్కర్ యొక్క ఆర్థిక శాస్త్ర పరిణతికి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మూలాలకు ఆయన అందించిన సహకారానికి మరియు దేశభక్తికి ఒక తార్కాణం స్వాతంత్ర్యానంతరం …
దేశ విభజన తర్వాత, జూన్ 1948 వరకు ఆర్బీఐ భారత్ మరియు పాకిస్థాన్ రెండు దేశాల కేంద్ర ద్రవ్య అధికారిక సంస్థగా పనిచేసింది. జూన్ 1948లో స్థాపించబడిన తరువాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ (ఎస్‌బిపి) పాకిస్థాన్ కేంద్ర బ్యాంకు పాత్రను చేపట్టింది. విభజన మండలి, బ్రిటిష్ ఇండియా ఆస్తులు మరియు అప్పులలో పాకిస్థాన్‌కు 17.5% వాటా కేటాయించింది. రెండు దేశాలు ప్రారంభంలో మార్చి 31, 1948 వరకు ఉన్న నాణేలు మరియు కరెన్సీని ఉపయోగించడం కొనసాగించాయి.
దేశ ఆర్థిక వ్యవస్థ నియంత్రణలో ఆర్బీఐ పాత్ర:ఆర్బీఐ యొక్క ప్రవేశిక (Preamble) దాని ప్రధాన విధులను “భారతదేశంలో ద్రవ్య స్థిరత్వాన్ని సాధించే ఉద్దేశ్యంతో బ్యాంక్ నోట్ల జారీని నియంత్రించడం, నిల్వలను ఉంచడం మరియు సాధారణంగా దేశ కరెన్సీ మరియు క్రెడిట్ వ్యవస్థను దాని ప్రయోజనం కోసం నిర్వహించడం” అని వివరిస్తుంది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ భారతదేశ కేంద్ర బ్యాంక్. ఇది ప్రభుత్వానికి బ్యాంకర్, ఏజెంట్ మరియు ఆర్థిక సలహాదారు. ప్రభుత్వానికి బ్యాంకర్‌గా, ఇది ప్రభుత్వ ఖాతాలను నిర్వహిస్తుంది. ప్రభుత్వానికి ఏజెంట్‌గా, ప్రభుత్వం తరపున సెక్యూరిటీల క్రయవిక్రయాలు చేస్తుంది. ప్రభుత్వానికి సలహాదారుగా, ద్రవ్య మార్కెట్‌ను నియంత్రించడానికి విధానాలను రూపొందిస్తుంది.
ఆర్బీఐ ఏప్రిల్ 1, 1935న కలకత్తాలో (ఇప్పుడు కోల్‌కతా) కార్యకలాపాలను ప్రారంభించి, 1937లో శాశ్వతంగా ముంబైకి తరలించబడింది. మొదట వాటాదారుల బ్యాంకుగా స్థాపించబడి, 1949లో జాతీయీకరణ అనంతరం పూర్తిగా భారత ప్రభుత్వానికి చెందినదిగా మారింది.
ముద్రణాలయాలు:భారతదేశంలో కరెన్సీని జారీ చేసే అధికారం కేవలం ఆర్బీఐకి మాత్రమే ఉంది. నాణేలను భారత ప్రభుత్వం దేశంలోని నాలుగు టంకశాలలో ముద్రించినప్పటికీ, వాటి పంపిణీ మరియు నిర్వహణ కోసం ఆర్బీఐ భారత ప్రభుత్వం యొక్క ఏజెంట్‌గా పనిచేస్తుంది. భారతీయ కరెన్సీ నోట్లను నాలుగు ప్రెస్‌లలో ముద్రిస్తారు – నాసిక్, దేవాస్, మైసూర్, సల్బోని.
అంబేడ్కర్ సేవలు:భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో మరియు ఆర్బీఐ ఏర్పాటులో కీలక పాత్ర పోషించడమే కాకుండా, డాక్టర్ అంబేడ్కర్ ప్రధాన సహకారాలలో దళితుల హక్కులను సమర్థించడం, సామాజిక సంస్కరణల కోసం వాదించడం మరియు కార్మిక చట్టాలు, ఆర్థిక విధానాలకు గణనీయమైన కృ షి చేయడం ఉన్నాయి. అంబేడ్కర్ పరిశోధన ఆధారిత థీసిస్ భారత ఆర్థిక కమిషన్ (నేషనల్ ప్లానింగ్ కమిషన్) ఏర్పాటుకు దారితీసింది. దీని పేరును జనవరి 1, 2015న నీతి ఆయోగ్ (National Institution for Transforming India)గా మార్చడం జరిగింది.
ఆర్బీఐ స్థాపక దినోత్సవం సందర్భంగా, భారత దేశ ఆర్థిక పరిస్థితి సుస్థిరతకు మరియు ఆర్థికాభివృద్ధికి నిరుపమాన సేవలను అందించిన భారత రత్న డా. బి. ఆర్. అంబేడ్కర్‌కు ఘన నివాళి తెలుపుదాం!