
జనాభా దృష్ట్యా ప్రపంచంలో నూట నలభై రెండు కోట్ల జనాభాతో మొదటి స్థానంలో ఉన్న భారతదేశం సింధు లోయ నాగరికతకు పుట్టిల్లు. హిందూ, బౌద్ధ, జైన, సిక్కు ఇత్యాది మతములకు జన్మనిచ్చింది. ఇది బహుభాషా, బహుళ జాతి సంఘము. ఈ దేశంలో హైందవ మతం ప్రసిద్ధి. బ్రిటీషు వారు మన దేశాన్ని పరిపాలిస్తూ మన సంస్కృతి, సంప్రదాయాలను నాశనం చేస్తుంటే భరించలేని మన దేశ ప్రజలు తిరగబడ్డారు. ఎన్నో పోరాటాలు, ఎన్నెన్నో ఉద్యమాలు, మరెన్నో త్యాగాలను చేశారు. అలా మన దేశ హైందవ సంసృతిని నాశనం అవ్వకుండా, హిందువులందరిలో సమైక్యతను పెంపొందించడానికి “రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్” (ఆర్.యస్. యస్) ను స్థాపించారు ప్రముఖులు కేశవ్ బలీరాం హెడ్గేవార్.
హిందూ జాతి లేక హిందుత్వ భావనను వ్యాప్తి చేయుట కొరకు హెడ్గేవార్ 1925 వ సంవత్సరంలో మహారాష్ట్ర లోని నాగపూర్ పట్టణంలో ఆర్.యస్.యస్.ను స్థాపించారు. హిందూ సామాజిక ఆధ్యాత్మిక సంస్కర్తలయిన స్వామి వివేకానంద, అరబిందో వంటి ప్రముఖుల ప్రభావానికి లోనైన హెడ్గేవార్, ఆర్.యస్.యస్. మౌలిక భావజాలాన్ని నిర్మించారు. ఆయన వైద్యవిద్యను అభ్యసించుటకు కోల్ కతా వెళ్ళినపుడు పశ్చిమ బెంగాల్ లోని నాటి రహస్య విప్లవ సంస్థలైనటువంటి “అనుశీలన సమితి”, “జుగాంతర్” మొదలైనవాటి ప్రభావానికి లోనయ్యారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.యస్.యస్) అనేది ఒక హిందూ జాతీయ వాద సంస్థ. దీని యొక్క ప్రారంభ ప్రేరణ హిందూ క్రమశిక్షణ ద్వారా పాత్ర శిక్షణ ఇవ్వడం, భారతీయ హిందూ సమాజాన్ని ఒక హిందూ రాష్ట్ర (హిందూ దేశం) గా ఏర్పాటు చేయడం. ఈ సంస్థ భారతీయ సంస్కృతిని, పౌర సమాజం యొక్క విలువలను సమర్థించే ఆదర్శాలను ప్రోత్సహిస్తుంది. ఇది హిందుత్వ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, హిందూ సమాజాన్ని “బలోపేతం చేయడానికి” ఏర్పాటైన సంస్థ. ఇది రెండవ ప్రపంచ యుద్ధంలో యూరోపియన్ మితవాద సమూహాల నుండి ప్రారంభ ప్రేరణ పొందింది. భారతదేశపు ఆధ్యాత్మిక, నైతిక సంప్రదాయాలను పరిరక్షించడం ఈ సంస్థ ఆశయం. ఆర్. యస్.యస్. అనేది హైందవాన్ని ఒక మతంగా కాకుండా ఒక జీవన విధానంగా భావిస్తుంది. భారత ప్రజలను, భారతజాతిని, భారతమాత రూపంగా భావించి వారిని సేవించటం, భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల యొక్క ప్రయోజనాలను పరిరక్షించటం తమ ఆశయంగా ఈ సంస్థ ఉద్ఘాటించింది. 1948లో మహాత్మా గాంధీ హత్యానంతరం, 1975 ఎమర్జెన్సీ సమయంలో, 1992 బాబ్రీ మసీదు విధ్వసానంతరం ఈ సంస్థ మీద నిషేధం విధించారు, తిరిగి నిషేధం ఎత్తివేశారు.
“రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్” ను వ్యవస్థాపించిన కేశవ్ బలీరాం హెడ్గేవార్ 1929 వరకు హిందూ మహాసభలో సభ్యునిగా ఉన్నారు. హెడ్గేవార్ ను 1921లో ఒక సంవత్సరం జైలులో ఉంచగా, 1930 వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం చేతిలో మరలా 9 నెలలు జైలుశిక్షను అనుభవించారు హెడ్గేవార్. ఆర్.యస్.యస్. అనేది మొదటినుంచి ఒక వివాదాస్పద సంస్థగానే కొనసాగింది. హిందూ, ముస్లిం కొట్లాటలలో హిందువులకు ఆత్మరక్షణ కల్పించటం, ముస్లిం వర్గాల దాడులను తిప్పి కొట్టటం ఈ సంస్థ కార్యకలాపాలలో ఒకటి. ఈ సంస్థకు అనేకానేక అనుబంధ సంస్థలన్నింటినీ కలిపి సంఘ్ పరివార్ అని పిలుస్తారు.
భారతీయ కిసాన్ సంఘ్, భారతీయ మజ్దూర్ సంఘ్, వనవాసి కళ్యాణ ఆశ్రమం, స్వదేశీ జాగరణ మంచ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, ఇతిహాస సంకలన సమితి, ప్రజ్ఞా ప్రవాహ్, సంస్కృత భారతి, విద్యా భారతి, సంస్కార భారతి, అధివక్తా పరిషత్, పూర్వ సైనిక పరిషత్, భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, రాష్ట్ర సేవికా సమితి వీటిలో ముఖ్యమైనవి. ఆర్.యస్.యస్. తోపాటు ఈ సంస్థలన్నింటికి చాలా పెద్ద సంఖ్యలో సభ్యులున్నారు. ఆర్.యస్.యస్. స్థాపన సమయంలో కేశవ్ బలీరాం హెడ్గేవార్ ను అనుసరించి ఉన్నవారిలో భావురావ్ దేవరస్, భయ్యాజి దాణె, వ్యంకప్ప పాట్కి, బాలసాహెబ్ దేవరస్, అప్పాజి జోషి మొదలగు వారున్నారు.
నేపథ్యం…
కేశవ్ బలీరాం హెడ్గేవార్ మరాఠీ నూతన సంవత్సర పర్వదినాన 01 ఏప్రిల్ 1889 నాడు హెడ్గేవార్ మహారాష్ట్ర లోని నాగపూర్ పట్టణంలో వలసపోయిన ఒక తెలుగుదేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. హెడ్గేవార్ పూర్వీకులు తెలంగాణ లోని మహారాష్ట్ర సరిహద్దుకు సమీపానగల బోధన్ తాలూకాలోని కందకుర్తి అనే చిన్న గ్రామానికి చెందినవారు. కందకుర్తి అనే గ్రామం వద్ద గోదావరిలో మంజీర, హరిద్ర నదులు కలసి త్రివేణి సగమం ఏర్పడుతుంది. వేద పండిత కుటుంబంలో జన్మించిన హెడ్గేవార్, బాల్యంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయారు. విదేశీ పాలకుల మీద యుద్ధం చేసిన శివాజీ మహారాజ్ అంటే బాల్యం నుండే హెడ్గేవార్ కు విపరీతమైన ఇష్టం.
బాల్యం నుండే చదివిన శివాజీ వీరగాధలను ఆయనను మరింత ఉత్తేజపరిచాయి. బ్రిటిష్ పాలకులను పారద్రోలేందుకు జరిగే పోరాటాన్ని హెడ్గేవార్ పవిత్రకార్యంగా భావించేవారు. అప్పట్లో జరిగిన వందేమాతరం ఉద్యమం ఆయనను అమితంగా ఆకట్టుకుంది. వైద్యవిద్యను అభ్యసించేందుకు హెడ్గేవార్ కలకత్తా నగరానికి వెళ్లారు. చదివేది వైద్యశాస్త్రమే అయినా తన స్నేహం చేసేది మాత్రం బెంగాలీ విప్లవకార్లతోనే. తన చదువు పూర్తిచేసుకుని తిరిగి నాగపూర్ వపట్టణం వచ్చిన హెడ్టేవార్ నేరుగా స్వతంత్ర్య పోరాటంలోకి దూకారు. వైద్యశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం మనిషి యొక్క రుగ్మతలను పోగొట్టడం. తాను చదివిన వైద్యశాస్త్రంతో ఒకరిద్దరి రుగ్మతలను పోగొట్టగలడు, కానీ సామాజిక రుగ్మతలను పోగొట్టడం వైద్యశాస్త్రానికి మించిన సేవ అని భావించిన హెడ్టేవార్, తన పూర్తి జీవితాన్ని భారతదేశానికి అంకితం చేశారు.
“రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్” స్థాపన..
భారతీయులు బ్రిటీషు తెల్లదొరల పెత్తనానికి విరుద్ధంగా పోరాడుతున్న స్వతంత్ర్య ఉద్యమానికి మద్దత్తుగా, తన వైద్యవృత్తిని వదిలి స్వతంత్ర్య పోరాటంలో పాల్గొన్నందుకు బ్రిటిష్ పాలకులు హెడ్గేవార్ ను జైలుకు పంపించారు. ఆయన జైలులో ఉండగా చదివిన పుస్తకాలు, దాంతో ఆయన మదిలో మెదిలిన ఆలోచనలు హెడ్గేవార్ జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. హిందూ సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్న భారతదేశ ప్రజలకున్న హిందూ సమాజ బలహీనత వల్లనే, హిందూ జాతికి వేల సంవత్సరాల బానిస బ్రతుకు శాపంగా పరిగణించిందని, హిందూ సమాజంలో ఉన్న అనైక్యతను తొలగించి, హిందువులందరూ కూడా అన్నదమ్ముల్లా, అక్కాచెల్లెళ్లుగా ఎదిగితే భారతదేశం అగ్రగామిగా నిలుస్తుందన్న దృఢనమ్మకం హెడ్గేవార్ కు ఏర్పడింది. దాంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత తన హిందూ సంఘటన ఆలోచనలకు ఒక కార్యరూపం ఇస్తూ ఒక సంస్థను వ్యవస్థాపించడానికి స్వీకారం చుట్టారు. దాని ఫలితమే 1925 సంవత్సరంలో విజయదశమినాడు నాగపూర్ లో మొదలైన “రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్”.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.యస్.యస్) బలోపేతం…
కేశవ్ బలీరాం హెడ్గేవార్ వ్యవస్థాపించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.యస్.యస్) అనేది ఒక హిందూ జాతీయ వాద సంస్థ. 1925 వ సంవత్సరలో విజయదశమి నాడు మహారాష్ట్ర లోని నాగపూర్ లో ఈ సంస్థను మొదలుపెట్టారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం భారతీయులకు హిందూ శిక్షణ ఇవ్వడం, భారతీయ హిందూ సమాజాన్ని, ఒక హిందూ దేశంగా ఏర్పాటు చేయడం. భారతీయ సంస్కృతిని, పౌర సమాజం యొక్క విలువలను సమర్థించే ఆదర్శాలను ప్రోత్సహించడం ఈ సంస్థ యొక్క విధులు. భారతదేశంలో హిందూ సమాజాన్ని “బలోపేతం చేయడానికి” హిందుత్వ భావజాలాన్ని ఇది వ్యాప్తి చేస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో యూరోపియన్ మితవాద సమూహాల నుండి ఆర్.యస్.యస్ ప్రారంభ ప్రేరణ పొందింది.
ఇది క్రమంగా ఒక ప్రముఖ హిందూ జాతీయవాద సంస్థగా ఎదిగడంతో బాటు అనేక అనుబంధ సంస్థలకు దారితీసింది. దీని యొక్క సైద్ధాంతిక విశ్వాసాలను వ్యాప్తి చేయడానికి అనేక పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు, క్లబ్‌లను కూడా ఈ సంస్థ స్థాపించింది. కానీ అనుకోకుండా స్వాతంత్ర్యం తరువాత 1948 వ సంవత్సరంలో మహాత్మాగాంధీ హత్యకు గురయ్యారు. దాంతో మహాత్మాగాంధీ హత్యకు ఆర్.ఎస్.ఎస్ కు సంబంధం ఉందనే ఆరోపణలతో ఆ సంస్థను ప్రభుత్వం నిషేధించింది. ఆ తరువాత ఎమర్జెన్సీ (1975 – 1977) సమయంలో ఒకసారి, బాబ్రీ మసీదు కూల్చివేసిన 1992 లో మూడవసారి ఆర్.యస్.యస్ పై నిషేధాజ్ఞలు విధించడం జరిగింది. కానీ ఆ తరువాత ఎలాంటి ఆధారాలు లేని కారణంగా ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. ఆ విధంగా ఆర్.ఎస్.ఎస్ సంస్థ హిందూ జాతీయవాద ఉద్యమంలో చారిత్రాత్మకంగా ప్రధాన పాత్ర పోషించింది.
ఆర్.యస్.యస్ కు అనేక అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఆ అనుభంధ సంస్థలన్నింటినీ కలిపి సంఘ్ పరివార్ అని పిలుస్తారు. భారతీయ కిసాన్ సంఘ్, భారతీయ మజ్దూర్ సంఘ్, వనవాసి కళ్యాణ ఆశ్రమం, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, ప్రజ్ఞా ప్రవాహ్, స్వదేశీ జాగరణ మంచ్, విద్యా భారతి, ఇతిహాస సంకలన సమితి, సంస్కృత భారతి, సంస్కార భారతి, పూర్వ సైనిక పరిషత్, అధివక్తా పరిషత్, విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర సేవికా సమితి వీటిలో ముఖ్యమైనవి. ఆర్.యస్.యస్. తో పాటు ఈ సంస్థలన్నింటికి చాలా పెద్ద సంఖ్యలో సభ్యులున్నారు.
ఆర్.యస్.యస్ భవితవ్యం పై ఆందోళన…
కేశవ్ బలీరాం హెడ్గేవార్ అనే ఒకే ఒక వ్యక్తి, ఒక మహా వృక్షం లాంటి సంస్థను నిర్మించారు. కానీ తన జీవిత పూర్తి కాలంలో సంస్థ యొక్క పూర్తి లక్ష్యాలు అందుకోవడం జరగలేదు. తనకు అనారోగ్యం చుట్టుముట్టడంతో, 15 సంవత్సరాలు తాను నడిపిన ఆ సంస్థ గురించి, సంస్థ భవిష్యత్తు గురించి, సంస్థ సేవల గురించి 1935 సంవత్సరం నుండి ఆలోచన మొదలయ్యాయి. ఒక పెద్ద లక్ష్యంతో తాను స్థాపించిన ఆ సంస్థలో చేరిన అనేక మంది యువకులు తమ జీవితాలను త్యాగం చేసి వారి వెంట నడిచారు. హెడ్గేవార్ మాట మీద వారందరూ బ్రహ్మచర్య దీక్షిత్‌తో తమ కుటుంబాలను వదులుకొని హిందూ సమాజ సేవలో చేరారు.
అప్పటికి ఆర్.యస్.యస్ స్థాపించి 15 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. ఈ పదిహేనేళ్లలో ఎంతో మంది దృష్టిని ఆకర్శించి దానిని మెచ్చుకున్న వారున్నారు, అలాగే వారిని విమర్శించిన వారు కూడా ఉన్నారు. అన్నింటిని తట్టుకొని నిలబడగలిగిన ఆర్.యస్.యస్ భవిష్యత్తుపై హెడ్గేవార్ కు సందేహం నెలకొంది. తనకున్న అనారోగ్యంతో వచ్చిన లోపం వలన గతంలో ఉన్న శక్తి ఆ సమయంలో లేకపోయింది. తన వ్యక్తిగత సౌకర్యాలను పట్టించుకోకుండా సంస్థ నిర్మాణ బాధ్యతలు నిర్వహించడం, దేశవ్యాప్త పర్యటనలను సిద్దమైపోవడం, సంస్థకు ఆర్థిక కృషి, ఇత్యాది ఆలోచనలన్నీ కలిపి 1940 వ సంవత్సరం నాటికి హెడ్గేవార్ శరీరం పూర్తిగా బలహీనపడింది.
పూర్తిగా క్షీణించిన హెడ్గేవార్ ఆరోగ్యం…
రాజాగర్ లో చాలా కాలం ఉన్నా కూడా హెడ్గేవార్ ఆరోగ్యం కుదుటపడలేదు. తనకు రోజులు దగ్గర పడుతున్నాయని తనకు అర్థమైపోయింది. అనారోగ్యంతోనే ఆయన కొత్త ప్రాంతాలకు వెళ్లి ఆర్.యస్.యస్ కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి చేసేవారు. జూన్ 1940 లో నాగపూర్ లో కార్యకర్తల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కానీ హెడ్గేవార్ తన అనారోగ్యంకారణంగా వారిని కలిసే పరిస్థితి లేదు. కార్యకర్తలను కలవలేకపోతున్నానన్న ఆందోళన తన మనసుకు కలుగుతూవుంది. ఒక్కసారైనా వారితో మాట్లాడితే గానీ హెడ్గేవార్ ని ఆపలేమని వైద్యులు అనుమతించారు. ఆ విధంగా 24 రోజులుగా కేవలం మంచానికే పరిమితమైన హెడ్గేవార్ ను కార్యకర్తల ముందుకు తీసుకువచ్చి కూర్చోబెట్టగా, వారికి సంక్షిప్తంగానే తన సందేశం అందించిన ఆయన హఠాత్తుగా ఆగిపోయి కళ్ళు మూసుకున్నారు. అక్కడున్న వారికి ఆయన శ్వాస ఆగిపోయిందేమోనన్న సందేహం కలిగింది.
ఆయనను నెమ్మదిగా ఇంటికి తీసుకెళ్లారు. ఆయనకు నడవడం కష్టమైంది, మాట్లాడడం కూడా తగ్గిపోయింది. నాగపూర్ లోని ప్రసిద్ధ వైద్యులు చికిత్స చేసినా కూడా హెడ్గేవార్ బాధ తగ్గడం లేదు. ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తున్నది. జూన్ 15వ తేదీన ఆయనను ఆ నగరంలోని మేయో దవాఖానలో చేర్చారు. ఆయనకు అన్ని పరీక్షలు చేసినా కూడా వ్యాధి ఏమిటో అంతుబట్టలేదు. వీపులో భరించలేనంత నొప్పి కలుగుతూ, ప్రతీరోజు జ్వరం వస్తూ, నిద్రమత్తుగా ఉండేది. ఆ బాధలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి, కానీ తగ్గడం లేదు. ఆయనకు దవాఖాన వాతావరణం నచ్చక నాగపూర్ లోని ఆర్.యస్.యస్ కార్యకర్త బాబా సాహెబ్ ఘటాట్ ఇంటికి చేర్చారు. గొప్ప గొప్ప డాక్టర్ల చికిత్స, నాణ్యమైన మందులు, వేల సంఖ్యలో కార్యకర్తల ప్రార్ధనలు ఇవన్నీ కూడా హెడ్గేవార్ అనారోగ్యాన్ని తగ్గించలేకపోయాయి. ఆయనకు తాను ఎంతో కాలం జీవించలేనని అర్థమైంది.
హెడ్గేవార్ చివరి క్షణాలు…
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.యస్.యస్) సంఘంలో ప్రముఖులు గనుక మరణిస్తే, వారికి జరిపే అంత్యక్రియలు ఎంత సాధారణంగా ఉండాలో సభ్యులకు వివరించడం మొదలుపెట్టారు హెడ్గేవార్. ఎలాంటి ఆడంబరాలు తగవని వారించారు. తన ముఖ్య సేవకులందరిని ఒక చోటుకి రమ్మనిచెప్పి, పిలిచి, కూర్చోబెట్టి అందరితో కలిసి ఛాయ్ త్రాగారు. ఆ తరువాత నాలుగు రోజులకు ఆయనను కలవడానికి సుభాష్ చంద్రబోస్ వచ్చారు. కానీ మూసిన కన్ను తెరవలేని విధంగా పడుకొని ఉన్నారు హెడ్గేవార్. ఆయనకున్న జబ్బు తగ్గిన తరువాత తిరిగి కలకత్తా వెళ్లి తన పాత విప్లవ మిత్రులను కలవాలనుకున్నాడు. కానీ విచిత్రమేమిటంటే అవేమీ లేకుండానే, ఆయన జీవిత కథ ముగిసింది. చివరి ప్రయత్నంగా హెడ్గేవార్ వెన్ను క్రింది భాగంలో ఒక చిన్న రంధ్రం చేసేసి, శరీరంలో చేసిన ద్రవాన్నంతా తీయాలనుకున్నారు. ఆఖరి ప్రయత్నంగా చేసే ఆ చికిత్స సానుకూలంగా ఉంటే బ్రతకుతారు, లేకుంటే బ్రతకరు అని ఆయనకు తెలిసింది. ఆ విషయం తెలిసిన హెడ్గేవార్ “నేను మరణించినా కూడా, సంఘం బాధ్యత మీదే” అంటూ బాధ్యతలను మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్ కి అప్పగించారు. హెడ్గేవార్ చుట్టూ ఉన్న వారంతా అలాంటి మాటలు మాట్లాడవద్దని వారించారు. దానికి ఆయన “అంతా మంచి జరగాలని అనుకుంటాం, కానీ ఏది మన చేతుల్లో లేదు కదా” అని చెప్పి ఆయన చికిత్సకు సిద్దమయ్యారు.
నిష్క్రమణ…
ముంచుకొస్తున్న మృత్యువు ఒకవైపు, కన్న కలలు సాకారం కాలేదన్న బాధ మరోవైపు. అప్పటికి స్వాతంత్య్రం ఇంకా రాలేదు. తాను ఊహించినట్లుగా హిందూ సమాజం సంఘటితం కాలేదు. దేశం సుఖ సమృద్ధులతో తులతూగడం అనేది తనకు ఆమడ దూరంలో కూడా కనిపించట్లేదు. చేపట్టిన పని ముగించకుండానే వెళ్ళిపోతున్నాను అనే బాధ హెడ్గేవార్ ని విపరీతంగా బాధించింది. ఆయనకు వైద్యులు లంబార్ పంచర్ వేశారు. ఆయన శరీరం నుండి ద్రవం ధారగా ప్రవహించింది. ఆయనకు అప్పటికీ కూడా రక్తపోటు తగ్గలేదు. శారీరక బాధకు ఉపశమనం కలగలేదు.
మంచంలో అశాంతి కదలికలతో, క్రమక్రమంగా స్పృహ కోల్పోయారు. అర్ధరాత్రి నుంచి తనలో అస్సలు కదిలిక లేదు. ఆయన చేయి పట్టుకుంటే విపరీతంగా మండిపోతుంది. ఆ సమయంలో తన శరీర ఉష్ణోగ్రత 105 డిగ్రీలు దాటింది. అది ప్రమాదకరమైన సంకేతం. నాగపూర్ లో ఉన్న ప్రముఖ వైద్యులు వచ్చి చూశారు. మేము చేయగలిగిందంతా చేశాం, మిగిలినదేమైనా ఉన్నదంటే అది దైవమే. భగవంతుడి మీద భారం వేయడం తప్ప చేసేదేమి లేదు అన్నారు. కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన హెడ్గేవార్ తాను ఆ బాధను అనుభవించక తప్పదు అని తేల్చేశారు. అలా తీవ్రమైన బాధను అనుభవిస్తూనే ఆయన 21 జూన్ 1940 నాడు ఉదయం 9 గంటల 27 నిమిషాలకు ఈ లోకం నుండి నిష్క్రమించారు.