Telugu News

ప్రారంభమైన సరస్వతి నది పుష్కరాలు.. విశేషాలు ఇవే

తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి నది పుష్కరాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ నెల 26వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం  ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక వెబ్ సైట్ తో పాటు మొబైల్ యాప్ ను కూడా ప్రారంభించింది.

సరస్వతీ నది పుష్కరాలు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరగనున్నాయి. ఇందుకోసం పుష్కర ఘాట్లు ఏర్పాట్లు చేశారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. 

దేశంలో ప్రాశస్త్యం ఉన్న 12 నదులకు పుష్కరాలు జరగడం సంప్రదాయం.  ఏటా ఒక నదికి పుష్కరాలు జరుగుతుంటాయి. ఈ 12 నదుల్లో సరస్వతి నది కూడా ఒకటి. 12 ఏళ్లకోసారి పుష్కరాలు జరుగుతాయి.

ప్రాణహిత, గోదావరి నదుల సంగమం అయిన కాళేశ్వరంలో అంతర్వాహినిగా సరస్వతి నది కలుస్తుంది. ఈ ప్రాంతాన్ని పవిత్రమైన సంగమంగా భావిస్తారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నేటి నుంచి 26 వరకు సరస్వతీ నది పుష్కరాలు జరగనున్నాయి.

కాళేశ్వరం మీదుగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో మహారాష్ట్ర మీదుగా ప్రవహించే ప్రాణహిత నది కలుస్తుంది. రెండు నదులు సంగమించిన చోట సరస్వతి అంతర్వాహిని నది ఉద్బవిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. నేడు గురుమదనానంద సరస్వతి పీఠానికి చెందిన మాధవానంద సరస్వతిస్వామి పుష్కరాలను ప్రారంభించారు.

మే 17వ తేదీన తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి, మే 18వ తేదీన పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి పుష్కర స్నానం చేస్తారు.

మే 19వ తేదీన నాసిక్‌ త్రయంబకేశ్వర్‌లోని మహామండలేశ్వర్‌ ఆచార్య సంవిదానంద సరస్వతి మహారాజ్, 23న హంపి విరుపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతిస్వామి పుష్కరస్నానం ఆచరిస్తారు.

సరస్వతి పుష్కరాల్లో కాశీ నుంచి వచ్చే పురోహితులు ప్రత్యేక హారతి, హోమాలు చేస్తారు. ఇలా చేయటం తొలిసారి అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

భక్తుల సౌకర్యార్థం కోసం అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. గదుల వసతితో పాట డార్మిటరీ భవనాలను ఏర్పాటు చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు టోల్‌ ఫ్రీ నంబర్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

 సరస్వతి నది సమాచారం 

భారతదేశ చరిత్ర , పురాణాలలో సరస్వతి నదికి ఎంతో ప్రాధాన్యత ఉంది. త్రివేణి సంగమంలో సరస్వతి నది కూడా ఓ భాగం. పురాణాలు, చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన సరస్వతి నది ప్రస్తుతం కనిపించదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇక ఈ నది పుష్కరాలు నేడు ప్రారంభం అయ్యాయి.

భారతదేశం ఎన్నో పవిత్ర నదులకు పుట్టిల్లు. పంచభూతాల్లో ఒకటైన నీటిని మన దేశంలో పరమ పవిత్రంగా భావిస్తాం. అందుకే ఆ నీరు ప్రవహించే నదులను కూడా పూజిస్తాం.. వాటిల్లో స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని.. సమస్యలు తీరుతాయని నమ్ముతాం. మన దేశంలో చాలా నదులకు పురాణాల్లో అత్యంత ప్రాముఖ్యత ఉంది. వాటిల్లో ఒకటి సరస్వతి నది. రుగ్వేదంలో దీని గురించి ప్రస్తావన ఉంది. సరస్వతి నది గురించి రుగ్వేదంలో “అంబితమే, నదీతమే, దేవీతమే” (ఉత్తమ తల్లి, ఉత్తమ నది, ఉత్తమ దేవత)గా కీర్తించారు. సరస్వతి నది ఒకప్పుడు భారతదేశంలోని వాయవ్య ప్రాంతంలో ప్రవహించిందని చెబుతారు.

సరస్వతీ నది జన్మస్థలం ప్రవాహ తీరం 

సరస్వతీ నది హిమాలయాల నుంచి ప్రారంభమై  భారతదేశంలోని అనేక రాష్ట్రాల గుండా ప్రవహించి.. చివరకు అరేబియా సముద్రంలో కలుస్తుందని పురాతన గ్రంథాలు, భూగర్భ శాస్త్రవేత్తల అధ్యయనాలు సూచిస్తున్నాయి. రుగ్వేదంలో సరస్వతి నది యమునా, సట్లెజ్ నదుల మధ్య ప్రవహించినట్లు పేర్కొనబడింది. దీని ఆధారంగా.. సరస్వతీ నదిని ఆధునిక కాలంలో గగ్గర్-హక్రా నది వ్యవస్థగా గుర్తించారు. ఈ నది హిమాచల్ ప్రదేశ్‌లోని శివాలిక్ కొండల నుంచి ప్రారంభమై, పంజాబ్, హర్యానా, రాజస్తాన్ రాష్ట్రాల గుండా ప్రవహించి,.. గుజరాత్‌లోని రణ్ ఆఫ్ కచ్‌ వద్ద సముద్రంలో కలిసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ నది మనకు కనిపిస్తుందా అంటే లేదు. సుమారు 4000-5000 సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న భౌగోళిక, వాతావరణ మార్పుల వల్ల ఈ నది ఎడారిలో.. తన ఆనవాళ్లను వదిలి అదృశ్యమైందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం, సరస్వతీ నది భూగర్భంలో ప్రవహిస్తుందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉపరితలంపై కనిపిస్తుందని నమ్మకం. ఉత్తరాఖండ్‌లోని మన గ్రామం (మానా విలేజ్) సమీపంలో, బదరీనాథ్ వద్ద అలకనంద నదితో కలిసే సరస్వతీ నదిని ఒక ఉపనదిగా గుర్తిస్తారు. దీని ప్రకారం.. సరస్వతీ నది హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్తాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో చారిత్రక సంబంధం కలిగి ఉంది.

ప్రారంభం ఎక్కడంటే.. 

సరస్వతీ నది ఆరంభం గురించి ప్రధానంగా రెండు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వీటిల్లో ఒకటి పురాతనమైనది కాగా.. మరోకటి శాస్త్రీయమైనది. ఇక పురాణాల ప్రకారం చూసుకుంటే.. సరస్వతీ నది బ్రహ్మదేవుని కమండలం నుంచి ఉద్భవించి, హిమాలయాల్లోని ప్లక్ష వృక్షం వద్ద ప్రారంభమైందని చెబుతారు. అలానే శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం చూసుకుంటే.. సరస్వతి నది హిమాచల్ ప్రదేశ్‌లోని శివాలిక్ కొండల్లోని హర్-కీ-దూన్ హిమానీనదం (గ్లేసియర్) నుంచి ఉద్భవించిందని కొన్ని కొందరు చెబుతుండగా.. గర్వాల్ ప్రాంతంలోని బందర్‌పూంచ్ మాసిఫ్ వద్ద ప్రారంభమైందని మరొక అభిప్రాయం ఉంది.

ఈ నది సట్లెజ్, యమునా నదులతో సంబంధం కలిగి ఉండేదని, తర్వాత భూకంపాల వల్ల దాని మార్గం మారిపోయిందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని మన గ్రామంలో సరస్వతీ నది ఉపరితలంపై కనిపించి, అలకనందలో కలుస్తుంది. కనుక మానా గ్రామం సరస్వతి నది ఆధునిక ఆరంభ స్థానంగా పరిగణిస్తున్నారు.

చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత.. 

సరస్వతీ నది ఒకప్పుడు హరప్పా నాగరికతకు జీవనాధారంగా ఉండేదని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనాలు సూచిస్తున్నాయి. నాటి ప్రజలు ఈ నదిని జ్ఞాన దేవతగా పూజించారు. సరస్వతి నది పుష్కరాలు భక్తులకు ఆధ్యాత్మిక శుద్ధిని, మోక్షాన్ని అందిస్తాయని నమ్మకం. పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి ఈ నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు.

మిగతా నదుల మాదిరే 12 సంవత్సరాలకు ఒకసారి సరస్వతీ నది పుష్కరాలు వస్తాయి. ఇది బృహస్పతి (గురు గ్రహం) మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు జరుగుతుంది. ఈ సారి 2025, మే 15 నుంచి మే 26 వరకు సరస్వతీ నది పుష్కరాలు జరగనున్నాయి.

నదీస్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మంగళ స్నానాలు హిందువుల సాంప్రదాయం. అలాగే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడి ఉంది. నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్యప్రదమని పురాణాల ద్వారా తెలుస్తోంది. జీవరాశులకు నీటి ఆవస్యకత.. ప్రాముఖ్యతను పుష్కరాలు గుర్తు చేస్తాయి.

నేటి నుంచి 26వ తేదీ వరకు 12 రోజులపాటు సరస్వతీనది పుష్కరాలు వైభవంగ జరుగనున్నాయి . ఈ సమయంలో సరస్వతి నదితీరంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు. ఏ నదిలో పుష్కరాలు జరుగుతున్నాయో ఆ నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే పాపాల నుంచి విముక్తి కలుగుతుందని సరస్వతి నది పుష్కరాలకు సిద్ధమవుతుంది. తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతినదిలో పవిత్ర స్నానాలు చేసేందుకు భక్తులు సిద్దమవుతున్నారు.

తెలంగాణలోని కాళేశ్వరంలో గోదావరి – ప్రాణహితలతో పాటుగా సరస్వతి కూడా అంతర్వాహినిగా ప్రవహిస్తోందని నమ్మకం అందువల్ల కాళేశ్వరంలో పుష్కరాల కోసం ఏర్పాట్లు చేశారు.

Show More
Back to top button