Telugu News

వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం ప్రాముఖ్యత ఏంటి..?!

లోకపాలకుడు.. వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువును వైకుంఠ ఏకాదశి పర్వదినాన దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా తరలి వస్తారు. ఈరోజున స్వామి గరుడగమనుడై భువికి దిగి వచ్చి తన భక్తులకు దర్శనమిస్తారనీ ప్రతీతి.

అసలు ఉత్తరద్వార దర్శనం అంటే ఏంటంటే..

శ్రీ మహావిష్ణువు శాశ్వత నివాసమైన వైకుంఠానికి చేరుకోవాలని యుగయుగాల నుంచి కోట్లాదిమంది భక్తులు ఆశిస్తున్నారు. అయితే అక్కడికి వెళ్లి దర్శనం చేసుకోవాలా లేదా స్తోత్రం చేయాలా లేదా సేవలు అందించాలా అన్న సందేహాలు వస్తుంటాయి.  ఉత్తరద్వారం తప్ప మిగిలిన ద్వారాల నుంచి వైకుంఠానికి వెళితే కొంతకాలం మాత్రమే అక్కడ ఉండవచ్చు. కానీ ఉత్తరద్వారం నుంచి వెళ్తే స్వామివారి కైంకర్యాల కోసం అక్కడే ఉండవచ్చు. ఏ భక్తుడికైనా అంతకంటే కావాల్సింది ఏముంది. అందుకనే కైంకర్యాలు అంటే సేవల నిమిత్తం ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉండి ఆ పద్మనాభుడి సేవల్లో నిత్యం పాల్గొనవచ్చు. 

అందువల్లే ఈ ఉత్తర ద్వారానికి అంతటి ప్రత్యేకత సంతరించుకుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన అంటే ఈ నెల 10న, ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం పుణ్యప్రదంగా భావిస్తారు. తెల్లవారుజామున చేసుకునే ఉత్తర ద్వార దర్శనంతో అన్ని పాపాలు హరిస్తాయని పెద్దలు చెబుతుంటారు.

ఈ పవిత్రమైన రోజున బ్రాహ్మి ముహూర్తంలో నిద్ర లేచి, స్నానమాచరించి వైష్ణవాలయాలను సందర్శిస్తుంటారు భక్తులు. అయితే, ఉత్తరద్వార దర్శనం కోసం తిరుమల వెళ్లలేనివారు రాష్ట్రంలోని మరికొన్ని ఆలయాలకు వెళ్లవచ్చు. అవేంటంటే..

రంగనాథ స్వామి ఆలయం:

ఇది హైదరాబాద్ సమీపంలోని జియాగూడలో ఉంది. ఇక్కడ తిరుమల తరహాలోనే అంతే వైభవంగా ఐదు రోజులపాటు వైకుంఠ ఏకాదశి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఏకంగా 400 ఏళ్లుగా ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం అందుబాటులో ఉంది. 

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం: వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ఈ ప్రముఖ దేవాలయంలో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమివ్వనున్నారు. స్వర్ణగిరిగా పేరుగాంచిన కొత్తగా కట్టిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి ఎటువంటి చారిత్రక ప్రాశస్త్యం లేకపోయినా.. యాదాద్రిని దర్శించుకునే భక్తులు ఇక్కడ కొలువైన స్వామిని సైతం దర్శించుకుంటూ ఉంటారు.

భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలోనూ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారిని ఉత్తరద్వారం ద్వారా దర్శనం చేసుకోవచ్చు.

చిలుకూరు బాలాజీ టెంపుల్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ఈ ఆలయంలో కూడా వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనం చేసుకోవచ్చు. భాగ్యనగర శివారులో కొలువైన చిలుకూరి బాలాజీ స్వయంభూ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. వీసా వేంకటేశ్వర స్వామిగా పేరొందిన ఈ ఆలయానికి వెళ్లినా విష్ణుమూర్తిని వైకుంఠ ద్వారం నుంచి దర్శనం దర్శించుకోవచ్చు.

అటు బడంగ్ పేటలో కొలువైన కాశీబుగ్గ దేవాలయంలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి కూడా స్వయంభూవుగా చెబుతుంటారు.

బిర్లా టెంపుల్​: హైదరాబాద్​లోని అసెంబ్లీ సమీపంలో ఉన్న ఈ ఆలయంలో కూడా ఉత్తర ద్వారం ద్వారా వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. 

ధర్మపురి: ధర్మపురిలో కొలువైన శ్రీ లక్ష్మినరసింహాస్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. ఉత్తర ద్వార దర్శనంతో తమ జన్మ ధన్యంగా భావిస్తుంటారు.

చిక్కడపల్లిలో కొలువైన చారిత్రక ప్రాశస్త్యం ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి గుడిలో కూడా వైకుంఠద్వార దర్శనం ఉంటుంది. వీటితోపాటు తెలంగాణంలోని మరికొన్ని ప్రాచీన వైష్ణవ ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు, ఉత్తరద్వార దర్శనం వంటివి చేసుకోవచ్చు.

Show More
Back to top button