
తెలుగు వెలుగే.. మహాసభల లక్ష్యం..
తెలుగు భాషకు వెలుగులు అద్దడమే లక్ష్యంగా ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలను నిర్వహించనున్నట్టు మాజీ ఉపసభాపతి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు.
ఏ మాతృభాష అయినా మృతభాష కాకుండా ఉండాలంటే అది నేటి తరంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే యువతకు ఈ సభల్లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణ కూడా చాలా కీలకమనే అంశాన్ని సభల ద్వారా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయనున్నారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేబీఎన్ కళాశాల కేంద్రంగా ఈ నెల 28, 29 తేదీల్లో 2 రోజుల పాటు 3 వేదికలపై 25కు పైగా సదస్సులు.. కవిత్వం, సాహితీ సమ్మేళనాలు జరగబోతున్నాయి.
కాగా ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణా జిల్లా రచయితల సంఘం, కె.బి.ఎన్.కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మహాసభలకు రెండు రాష్ట్రాల్లోని తెలుగువారితోపాటు దేశవిదేశాల నుంచి భాషాభిమానులు, రచయితలు, కవులు, విద్యార్థులు దాదాపు 1500 మందికి పైగా తరలి రానున్నారు. మరో 100 మంది ప్రముఖులు అతిథులుగా పాల్గొంటారని సమాచారం.
ఈ నేపథ్యంలో…
‘రేపటి తరం కోసం.. మనం ఏ మార్పు కోరుతున్నాం?’ అనే అంశంపై సదస్సులు, చర్చాగోష్ఠి, సాహిత్య కార్యక్రమాలు జరగనున్నాయి. తెలుగుభాషను రేపటి తరానికి మరింత ప్రభావవంతంగా చేరవేసేందుకు ఎలాంటి మార్పులు తీసుకురావాలనే కార్యాచరణను సంయుక్తంగా రూపొందించనున్నారు.
ఇకపోతే మహాసభల్లో మొదటిరోజు డిసెంబరు 28 అంటే నేడు (శనివారం), పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణంలోని ఉదయం 9.30 గంటలకు ప్రారంభోత్సవ సభ జరగగా.. సాయంత్రం వరకు ప్రధాన వేదికపై తెలుగు వెలుగు, శాస్త్ర సాంకేతిక రంగం, పత్రికలు, ప్రచురణలు, ప్రసారరంగాలు తదితర అంశాలపై సదస్సులు ఉంటాయి. అలాగే మహిళా ప్రతినిధులు, సాంస్కృతికరంగ ప్రతినిధుల సదస్సులు సైతం జరుగుతాయి. మరో రెండు వేదికలపై కవిత్వం, సాహిత్యం, విద్యారంగ ప్రతినిధుల సదస్సులు, కవులు, యువ కలాల, కవుల సమ్మేళనాలను నిర్వహిస్తారు.
రెండోరోజు డిసెంబరు 29 (ఆదివారం) నాడు ఉదయం 9 గంటల నుంచి సదస్సులు ప్రారంభమవుతాయి. ఇతర రాష్ట్రాల ప్రతినిధులు, రాజకీయ ప్రతినిధులు, సాహితీ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. సాయంత్రం 5.30కు జరిగే ముగింపు సభలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొంటారు. మరో రెండు వేదికలపైనా ఉదయం నుంచి వరుసగా.. కవులు, యువ కలాల, కవుల సమ్మేళనం, పరిశోధనరంగం, భాషోద్యమం, బాలసాహిత్యంపై సదస్సులు జరుగుతాయి.