Telugu News

మిడ్ మానేరు నిర్వాసితుల కథ.. ఎన్నటికీ తీరని వ్యధ..

మహాభారత కాలంలో శ్రీకృష్ణుడి ద్వారకానగరం సముద్ర గర్భంలో మునిగిపోయినట్టు… నేటి కలియుగంలో జననివాసాలు మిడ్ మానేరులో మునిగిపోయాయి. మిడ్ మానేరు నిర్వాసితుల కథ.. ఎన్నటికీ తీరని వ్యధలాగా మారింది. నీటిలో మునిగిపోయిన  తమ గ్రామాలను, జ్ఞాపకాలను తలుచుకుంటూ రోదిస్తున్నారు ఆ గ్రామస్తులు. 

ఉన్న ఊరు కన్నతల్లి లాంటిదని పెద్దలు చెబుతుంటారు. ఏ కష్టం వచ్చినా అయినవారు లేకపోయినా ఉన్న ఊరు  అంతో ఇంతో సాయం చేస్తారని అందుకే ఉన్న ఊరు కన్నతల్లి లాంటిదని అంటారని పెద్దల మాట. చాలామంది పుట్టి పెరిగిన ఊరు నుండి ఏదో ఒక పని నిమిత్తం బయటకు వెళితేనే ఇంటికి వచ్చేవరకు మనశ్శాంతి అనిపించదు. అలాంటిది గ్రామాలు మొత్తం శాశ్వతంగా నీటిలో మునిగిపోయి తాము నివసించిన నివాసాలు కళ్ళముందే శిథిలాలు అవుతుంటే అవి చూసి గుండెలవిసేలా రోదించడం ఆ గ్రామస్తులకు  అలవాటుగా మారింది. పుట్టి పెరిగిన ఊరు శిధిలాల మాదిరిగా స్మశానం మాదిరిగా మారితే ఆ శిధిలాలను చూస్తూ తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆ గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

పచ్చదనంతో చుట్టూ పంట పొలాలతో, వందల కొద్ది కుటుంబాలతో గుడి, బడి చేను, చెలకా అహ్లాదపరిచే వాతావరణంతో ఒకప్పుడు సుందరంగా ఉండేవి ఆ గ్రామాలు. మిడ్ మానేరు ముంపుతో ఇప్పుడు ఆ గ్రామాలు స్మశానాన్ని తలపిస్తున్నాయి. ప్రాజెక్టు నీటితో మునిగిపోయిన గ్రామాల ప్రజలు రెక్కలు తెగిన పక్షుల్లా తలో దిక్కుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ శిథిలమైన ప్రాంతాలను చూస్తే గుండె బరువెక్కుతూ.. కన్నీటి పర్యంతం అవడం ఆ గ్రామస్తుల కన్నీటి వ్యధను గుర్తుచేస్తుంది.

మిడ్ మానేరు ముంపు గ్రామాల కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో మిడ్ మానేరు ప్రాజెక్టును 27.55 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. 2019లో ఈ ప్రాజెక్టులోకి పూర్తిస్థాయిలో 25 టీఎంసీల నీరు చేరడంతో నిర్వాసితులను పునరావాస కాలనీలకు ప్రభుత్వం తరలించింది. మిడ్ మానేరు ప్రాజెక్టు కారణంగా తంగేళ్లపల్లి, వేములవాడ, బోయినపల్లికి చెందిన 15 గ్రామాలు ముంపుకు గురయ్యాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం మాన్వాడ గ్రామం వద్ద మానేరు నది మీదుగా 25 రేడియల్ గేటులతో 25.87 టీఎంసీల సామర్థ్యాన్ని ప్రాజెక్టు కలిగి ఉంది. ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టులో మిడ్ మానేరు కూడా భాగమే. రెండు లక్షల ఎకరాలకు నీరు అందించే సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును 2018 ఏప్రిల్ లో తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. 1991లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మొట్టమొదటిసారిగా శ్రీరామ్ సాగర్  ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సాగర్ ద్వారా నీరు దిగువ మానేరు డ్యామ్ లోకి నీటిని విడుదల చేసేవారు. ఆ తర్వాత జల యజ్ఞంలో భాగంగా 2004- 2005 సంవత్సరం మధ్యలో మిడ్ మానేరు నదిపై ఆనకట్ట నిర్మాణాన్ని ప్రారంభించారు.

అయితే అనేక రాజకీయ కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైంది. అంతకుముందు 50 శాతం పనిని మాత్రమే పూర్తి చేయగలిగారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టిన కేవలం పది నెలల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. రూ. 2050 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేశారు. మిడ్ మానేరు నిర్మాణం పూర్తయిన వెంటనే 12 గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. మిడ్ మానేరు ప్రాజెక్టు వలన బోయినపల్లి మండలంలోని కొదురుపాక, మన్వడా, నీలోజిపల్లి, వరదవెల్లి, సుభాష్ పల్లి, వేములవాడ మండలంలోని అనుపురం, రుద్రవరం, సంకెపెళ్లి, ఆరెపల్లి కొడుముంజ, తంగేళ్లపల్లి మండలంలోని చీరలవంచ, చింతలటాన, ఇల్లంతకుంట మండలంలోని గుర్రంవానిపల్లి, కందికట్కూర్, ఓబులాపురం  గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అయితే ప్రాజెక్టు పూర్తయ్యాక నిర్వాసితులకు ప్రభుత్వ ప్రకారంగా వచ్చే ప్యాకేజీలు అందాయని అధికారులు చెబుతున్నారు. అయితే తమకు పరిహారం అందలేదని చాలామంది నిర్వాసితులు వాపోతున్నారు.

శిధిలాలను చూసి గుండెలవిసే రోదన…

ఇటీవల వేసవి తీవ్రత అధికమవడంతో ఉమ్మడి  కరీంనగర్ జిల్లాలోని జలాశయాల్లో నీరు అడుగంటి పోయింది. శ్రీరాంసాగర్ దిగువ మానేరులకు నీటి ప్రవాహం తగ్గడంతో ముంపుకు గురైన 15 గ్రామాల శిధిలాలు బయటపడ్డాయి. ప్రాజెక్టు పూర్తయిన పదేళ్ల కాలంలో పూర్తిస్థాయిలో శిధిలాలు బయటపడడంతో తాము తిరిగినటువంటి ఊరు ప్రదేశాలను చూడడానికి ఆ గ్రామాల నిర్వాసితులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. తాము అక్కడ గడిపిన జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఒకప్పుడు ఎందరో ఉపాధి కోసం తమ గ్రామాలకు వచ్చేవారని, ఇప్పుడు తామే వేరే గ్రామాలకు ఉపాధి వెతుక్కుంటూ వెళ్తున్నామని రోదించారు. రైతులుగా ఎకరాల భూములను పంట పండించి వ్యవసాయం చేసుకొని కూలీలకు ఉపాధి కల్పించే తాము..

వేరే రైతుల వద్దకు కూలీలుగా వెళ్లాల్సి వస్తుందని తమ బాధను చెప్పుకుంటూ రోదించారు. తాము చదువుకున్న పాఠశాలలు, సరదాగా ముచ్చట్లాడిన ప్రదేశాలు, సమావేశాలు ఏర్పాటు చేసుకునే రచ్చబండలను చూసి ఒక్కొక్క జ్ఞాపకాన్ని తలుచుకుంటూ కుమిలిపోయారు. కుదురుపాక గ్రామంలో ఉన్నటువంటి ప్రాచీన శివాలయం నీరు అడుగంటడంతో బయటపడడంతో నిత్య పూజలు అందుకునే భగవంతుడికి కూడా ఈ కష్టం వచ్చిందంటూ  ఏడ్చిన తీరు గుండెలను బరువెక్కిస్తుంది. నిత్యం ఒకరినొకరు పలకరించుకుంటూ.. పెరిగిన ఊరు ప్రజలంతా తలో దిక్కుకు వెళ్ళిపోయారని, తాము ఒంటరి వారమైపోయామనే బాధ తమను తీవ్ర ఆవేదనకు గురి చేస్తుందంటూ నిర్వాసితులు తమ బాధను దిగమింగుకున్నారు.

ప్రతి వేసవి కాలంలో నీరు అడుగంటిన తర్వాత తమ జ్ఞాపకాలను చూడడం కోసం ప్రతి సంవత్సరం ఈ ప్రాంతానికి తరలివస్తామని వారు చెప్పుకొచ్చారు. అయితే.. ఇన్ని సంవత్సరాలలో  నీరు పూర్తిగా అడుగంటి శిధిలాలు పూర్తిగా బయటపడడం ఇదే తొలిసారి అని వారు అన్నారు. ఈ శిధిలాలే తమకు జ్ఞాపకాలు అంటూ తాము మరణించే వరకు ఈ జ్ఞాపకాలను మరిచిపోమంటూ ఆ  నిర్వాసితులు భావోద్వేగానికి గురైన తీరు ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. ఇప్పటికీ కొందరికి ప్రభుత్వం నుండి ఎటువంటి పరిహారం అందలేదని, తాము ఇంటి నివాసంతో పాటు ఎన్నో ఎకరాల భూమిని కోల్పోయామంటూ గుండెలు బాదుకుంటూ రోదించారు. ఏది ఏమైనప్పటికీ మిడ్ మానేరు నిర్వాసితుల వ్యధ ఎవరు తీర్చలేనిది.

Show More
Back to top button