Telugu News

నేడు ఏరువాక పౌర్ణమి..!

సాధారణంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం జరుపుకునే పండుగలు అనేకం ఉన్నాయి. ఇందులో భాగంగానే పూజలు, నోములు, వ్రతాలు వంటివి సైతం ఎన్నో చేసుకుంటూ ఉంటాం. కానీ రైతులకు మాత్రమే ప్రత్యేకమైన ఓ పండుగ రోజు ఉంది. అదే

ఏరువాక పున్నమి/ పౌర్ణమి.. 

అటువంటి జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమిగా  పిలుస్తారు. ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజును మనం ఏరువాక పౌర్ణమిగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది జూన్ 11న వచ్చిన ఈ పండుగ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం:

రోళ్ళు పగిలే ఎండలు కలిగిన రోహిణి కార్తె వెళ్లిపోయి, తొలకరి చినుకులను తెచ్చే మృగశిర కార్తె రాకను స్వాగతిస్తూ జరుపుకునేదే ఏరువాక పౌర్ణమి. వర్ష రుతువు ప్రారంభంలో వచ్చే ఏరువాక పౌర్ణమి రోజు రైతులు ప్రత్యేకించి ఎద్దులను, నాగలిని పూజించి దుక్కి దున్నడాన్ని ప్రారంభించేవారు. ఈ పండుగ గురించి రుగ్వేదంలోనూ వివరించారు.

ఏరువాక పౌర్ణమి సహజంగా కర్షకుల పండుగ. భూదేవిని నమ్ముకొని పంటలు పండించే రైతులు వర్ష రుతువు ఆరంభంలో తొలకరి చినుకు కోసం ప్రార్థిస్తూ వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఏరువాక పౌర్ణమి రోజును వేడుకగా జరుపుకుంటారు.

ఏరువాక పున్నమి రోజున రైతులు భూమి పట్ల, సమస్త ప్రకృతి పట్ల తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటూ తమకు వ్యవసాయంలో చేదోడుగా ఉండే ఎద్దులను శుభ్రంగా కడిగి, వాటి కొమ్ములకు రంగులు పూసి, రకరకాల గజ్జెలు, గంటలు, పూసల దండలతో, పూల దండలతో సర్వాంగసుందరంగా అలంకరిస్తారు. అనంతరం పొంగలి ప్రసాదాలతో, మంగళ వాయిద్యాలతో పొలాలకు ఊరేగింపుగా వెళ్లి అంగరంగ వైభవంగా పొలం దున్నడం ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం గ్రామంలో ఊరి ముంగిట గోగునారతో చేసిన తోరణాలను కడతారు.

ఈ తోరణాల మధ్యలో అక్కడక్కడా జిలేబీలు, గారెలు, కరెన్సీ కాగితాలు ఎత్తులో కడతారు. దీనినే ‘ఏరువాక తోరణం’ అని అంటారు. రైతులు తమ తమ పశువులను ఈ ఏరువాక తోరణం కిందుగా పరుగులు పెట్టిస్తారు. అప్పుడు వారు ఏరువాక తోరణం నుంచి తమకు దొరికిన వాటిని తీసుకు వెడతారు. దీనిని వారు అత్యంత పవిత్రంగా భావించి తమ పొలాల్లో, ధాన్యాగారంలో దాచి ఉంచుతారు. ఇలా చేయడం వల్ల పంటలు సమృద్ధిగా పండి కరవు ఏర్పడదని నమ్మకం.

యూరప్ వంటి విదేశాల్లో కూడా ‘మే పాన్’ అనే పేరుతో ఈ ఏరువాక పూర్ణిమను జరుపుకుంటారు.

ఏరువాక పౌర్ణమినాడు చేసే దైవ ప్రార్థనలు, పూజల వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయట. ఈరోజున జుట్టు కత్తిరింపు, గోళ్ల కత్తిరింపు చేయరాదు.

ప్రతికూల ఫలితాలనిచ్చే రంగుల వినియోగం తగదు. ఆకుపచ్చ యోగ్యదాయకం.  తులసీవనంలో, తులసికోట వద్ద ఈ పున్నమిరోజున  పూజలు చేయాలి తప్ప పత్రాలు తెంచరాదని పెద్దలు చెబుతున్నారు.

ప్రకృతి శోభిత పౌర్ణమిగా పేరొందిన ఏరువాక పౌర్ణమి నాడు పూర్ణ చంద్రుడు ఉల్లాసంగా కన్పిస్తాడని, భూమాత అనుగ్రహానికి చంద్రోత్సాహం దోహదమవుతుందని విశ్వాసం. త్రికరణశుద్ధిగా ఈ రోజున చేపట్టే పనులు తప్పక విజయవంతం అవుతాయని, పనులు వాయిదా, సోమరితనం ప్రదర్శించడం వంటివి అనర్థదాయకం.

Show More
Back to top button