Telugu News

మొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవం నేడు. ఇక ధ్యానానికీ ఒకరోజు.!

ప్రతి ఏటా డిసెంబరు 21వ తేదీని ‘ప్రపంచ ధ్యాన దినోత్సవం’గా జరపాలని భారత్‌ సహా పలు దేశాలు ప్రతిపాదించిన తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) ఏకగ్రీవంగా ఆమోదించింది. ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడమంటే ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే సామర్థ్యం ధ్యానానికి ఉందని గుర్తించడమే. జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి, హింస, సమాజంలో క్షీణిస్తున్న విశ్వాసం, పరస్పర సంబంధాలు ఇవన్నీ అధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు. వీటికి ధ్యానం  సమగ్రమైన పరిష్కారాన్ని చూపగలదు. 

సమగ్ర శ్రేయస్సు, అంతర్గత పరివర్తన కోసం ఒక రోజు! డిసెంబరు 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరపాలని భారత్‌ సహా పలు ఇతర దేశాలు తీసుకొచ్చిన తీర్మానాన్ని ఐరాస జనరల్‌ అసెంబ్లీ ఈ నెల 8న (శుక్రవారం) ఆమోదించింది. 

వసుదైక కుటుంబం (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే సూత్రాన్ని బలంగా విశ్వసించే భారత్‌..  డిసెంబరు 21వ తేదీకి ఒక ప్రత్యేకత ఉందని, భారత సంప్రదాయం ప్రకారం శీతాకాలం అయనం అంటే ఉత్తరాయనంలోకి అడుగుపెట్టే రోజని, ఇది చాలా పవిత్రమైన రోజని తెలిపారు. ఇది సరిగ్గా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించే జూన్‌ 21వ తేదీ (వేసవి అయనం) కి ఆరు నెలల తర్వాత వస్తుందని అన్నారు. 2014లోనూ ప్రతి ఏటా జూన్‌ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించే విషయంలో భారత్‌ నాయకత్వం తీసుకుంది. ఆ ప్రకారమే ఈ దశాబ్ద కాలంలో యోగా విశ్వవ్యాప్తం అయింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యోగాను పాటిస్తూ, తమ జీవితంలో భాగంగా చేసుకున్నారు. 

ప్రపంచ ధ్యాన దినోత్సవంపై లిచ్‌టెన్‌స్టీన్‌ అనే దేశం యూఎన్‌జీఏలో తీర్మానం తీసుకొచ్చింది. 193 దేశాలు గల యూఎన్‌జీఏలో ఇది ఏకగ్రీవంగా ఆమోదం పొందేందుకు కృషి చేసిన దేశాల గ్రూపులో భారత్‌ సహా శ్రీలంక, నేపాల్‌, మెక్సికో, అండోర్రా ఉన్నాయి. ఇంకా తీర్మానానికి బంగ్లాదేశ్‌, బల్గేరియా, బురుండి, ది డొమినికన్‌ రిపబ్లిక్‌, ఐస్‌లాండ్‌, లక్సెంబర్గ్‌, మారిషష్‌, మొనాకో, మంగోలియా, పోర్చుగల్‌, స్లొవేనియా కో-స్పాన్సర్‌ చేశాయి. కాగా, అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంపై ఐరాసలోని భారత శాశ్వత మిషన్‌ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. తీర్మానాన్ని ఆమోదింపజేయడంలో భారత్ కీలక పాత్ర పోషించింది.

ధ్యానం అనేది పురాతన పద్ధతుల నుంచే ఉందని, ఇది అంతర్గత పరివర్తన, నేటి ఆధునిక కాలంలో శాంతి స్థాపనకు సమర్థవంతంగా పనిచేస్తుందని అభిప్రాయపడింది. ధ్యానం మానసిక, భావోద్వేగ, శారీరక, ఆధ్యాత్మిక అంశాలతో సహా ప్రపంచ మానవాళి శ్రేయస్సుకు ఉద్దేశించిందని పేర్కొంది. 

ఇది నేటి ఉరుకుల పరుగుల, ఒత్తిడితో కూడిన జీవితంలో ఉపశమనం కలిగిస్తుందని తెలిపింది. దీనితో చాలా లాభాలు ఉన్నాయని, మన జీవితాలపై ప్రభావం చూపుతుందనే దాన్ని ఆధునిక శాస్త్రం కూడా ధ్రువీకరిస్తోందని పేర్కొంది. ప్రతి రోజూ ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గుతుందని, మానసిక, శారీరక సంబంధిత కార్యకలాపాలను మెరుగుపరుస్తుందని శాస్త్రీయంగా నిరూపితమైందని భారత మిషన్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 21న మొట్టమొదటి ధ్యాన దినోత్సవం జరగనుంది.  ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్  ఈరోజున ఐరాస నుంచి ధ్యాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. మనిషి శారీరక, మానసిక ఆరోగ్యంలో గుణాత్మకమైన మార్పును తెచ్చి.. తద్వారా ప్రపంచ శాంతి, సామరస్యాలను నెలకొల్పేందుకు ధ్యానం ఎంత అవసరమో ప్రపంచం గుర్తించినట్లయిందన్నారు. 

మరోవైపు, న్యూయార్క్ లోని ఐరాసలో ఉన్న భారత శాశ్వత మిషన్ ప్రథమ ధ్యాన దినోత్సవాన్ని సమితి ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమంలోగురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ కీలకోపన్యాసం అనంతరం ప్రపంచ శాంతి, సామరస్యం కోసం ధ్యానం చేయించనున్నారు. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఐరాస ద్వారా ధ్యానానికి గుర్తింపు రావడం ఓ ప్రధాన ఘట్టమని గురుదేవ్ ఈ సందర్భంగా అన్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో, సంఘర్షణలకు పరిష్కారం చూపడంలో చేస్తున్న కృషిపై గురుదేవ్ ఐరాసలోని ఉన్నతస్థాయి వ్యక్తులు, దౌత్యవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు, ప్రపంచ ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రపంచ శాంతి, సమగ్రత, సమైక్యతలను పెంపొందించడంలో ధ్యానం పోషించగలిగే కీలక పాత్రను ఆయన వివరిస్తారు.

ధ్యానం అత్మను పరిపోషిస్తుంది. మనసుకు ప్రశాంతతను చేకూర్చి.. నేటి ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారం అందిస్తుంది. ఇదే రోజు ఉత్తరాయణం మొదలయ్యేచోటు. మన జీవిత గమనాన్ని గుర్తు చేసుకొని మన ఉత్సాహాన్ని పునరుజ్జీవింపజేసుకొనేందుకు అత్యంత అనువైన రోజది. అదే సమయంలోనే జరిగే ఈ ధ్యాన కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు పాల్గొనబోతున్నారు. 

ప్రతి వ్యక్తి మూల స్వభావంలో మంచితనం, పరోపకారం ఉన్నాయి. ఈ గుణాలు అందరిలోఅనునిత్యం ఉంటాయి. ప్రతి నేరస్థుడిలో ఒక బాధితుడు ఉంటాడు. ఆ బాధితుడు సాయం కోసం ఎదురు చూస్తుంటాడు. మీరు బాధితుడికి నయం చేస్తే ఆ వ్యక్తిలో ఉన్న నేరస్థుడు కూడా నయమైపోతాడు. మనం చేయాల్సింది ఇదే. ధ్యానం, ప్రాణాయామం, సుదర్శన క్రియ బాధితుల్ని నయం చేయడానికి చాలా సాయపడతాయి. 

ధ్యానానికి ముందు, తరవాత ప్రాణాయామం చేయాలి. ముందు చేస్తే, ధ్యానంలోకి మరింత లోతుగా వెళ్లడానికి ఆదిమీకు సాయపడుతుంది. మీరు ధ్యానం తరవాత ప్రాణాయామం చేస్తే, అది మీ ఒంట్లోని టాక్సిన్లను బయటకు పంపి, శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఫలితంగా, రోజువారీ పనులు చేస్తున్నప్పుడు మనకు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా తాజాగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి కాస్త ధ్యానం చేయండి!

Show More
Back to top button