
హోమ్లోన్ ఇన్ స్టాల్ మెంట్ డబ్బులు కట్టలేని పరిస్థితి చాలామందికి ఎదురవుతుంది. దీంతో ఆర్థిక కష్టాలు పెరగడమే కాకుండా.. కుటుంబ ఆర్థిక స్థితి కూడా దారి తప్పుతుంది. సాధారణంగా ఈ హోమ్లానికి సంబంధించి EMI చెల్లించడానికి 15 నుంచి 20 ఏళ్ల వరకు సమయం ఉంటుంది. ఈ టెన్యూర్‌పై ప్రతినెలా వాయిదాల రూపంలో డబ్బు చెల్లించేందుకు బ్యాంకులు అనుమతిస్తుంటాయి. ఇదంతా వినడానికి సులువుగానే ఉన్నా, సంవత్సరాల తరబడి వడ్డీ కట్టాలంటే.. ఎవరికైనా కష్టమే. ఈ మధ్యకాలంలో అనేక ఇబ్బందులు కూడా ఉంటాయి.
ఎందుకంటే.. పరిస్థితులు ఎప్పుడు, ఒకేలా ఉండవు కదా! అలాంటప్పుడు లోన్ చెల్లింపులు చేయడం కష్టమవుతుంది. ఇండియన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నివేదిక ప్రకారం.. రూ.10 లక్షల కన్నా తక్కువ రుణం తీసుకున్న వారిలో దాదాపు 4.59% నుంది రుణాన్ని ఎగవేస్తున్నారట. రూ.75 లక్షల లోపు లోన్ తీసుకున్న వారిలో దాదాపు 39% మంది ఇలా చేస్తున్నారట. రుణాలను ఎగ్గొట్టేవారిలో పాతికేళ్ల నుంచి 35 ఏళ్ల వారే ఎక్కువగా ఉన్నారని నివేదికలో తేలింది.
ఒక నెల చెల్లించకపోతే?
ఒక నెల హోమ్లోన్ EMI కట్టడం ఆపితే పెద్ద సమస్య ఉండదు. ఆ తర్వాత నెల నుంచి సాధారణంగానే మిగతా ఇన్స్టాల్మెంట్లు కట్టొచ్చు. కాకపోతే, బ్యాంకులు మీకు SMS, ఈ-మెయిల్, మొబైల్ కాల్స్ ద్వారా రిమైండర్స్ పంపుతాయి. అదనపు ఛార్జీలను కూడా వసూలు చేస్తాయి. చెక్ బౌన్స్ ఛార్జీలు విధించే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ ఛార్జీలను EMI వాయిదాతో పాటు చెల్లించాల్సి ఉంటుంది.
రెండో నెల చెల్లించకపోతే?
వరుసగా రెండో నెల కూడా మీరు ఈఎంలి కట్టకపోతే.. బ్యాంకు నుంచి వార్నింగ్ మెసేజ్ వస్తుంది. కొన్ని సార్లు నోటీసులు కూడా రావొద్దు. చార్జీలను వెంటనే చెల్లించనని ఆ మెసేజ్ లో అడుగుతాయి.
మరి మూడో నెల?
వరుసగా మూడో నెల కూడా మీరు ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతే అసలు సమస్య మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకు మిమల్ని రుణం ఎగవేసిన వారిగా గుర్తిస్తుంది. దీనికి తగ్గట్టుగానే బ్యాంకు తరచూ నోటీసులు పంపిస్తుంటుంది. సిబిల్ స్కోర్ సైతం తగ్గిపోతుంది. ఫలితంగా భవిష్యత్తులో రుణాలు దొరకడం కష్టమవుతుంది. రికవరీ ఏజెంట్లు తమ పద్ధతుల్లో లోన్ రికవరీ చేయడానికి ప్రయత్నిస్తారు.
మూడు నెలలు గడిచాక..
మూడు నెలలు గడిచినా EMI కట్టలేకపోతే.. బ్యాంకులు మీ నుంచి డబ్బులు వసూలు చేయడం కుదరదని భావిస్తాయి. SARFAESI (సర్సేస్) Act- 2002 ప్రకారం చర్యలు ప్రారంభిస్తాయి. ఈ చట్టం కింద మీకు 2 నెలల పాటు నోటీసులు పంపుతూనే ఉంటాయి. లేకపోతే.. తనఖా పెట్టిన వస్తువులను నియంత్రణలోకి తీసుకుంటారు. కొన్ని సమయాల్లో మీ రుణానికి పూచీకత్తు ఇచ్చిన వారి నుంచి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తారు. వారిపై ఒత్తిడి తెస్తారు. ఇలా మీరు EMI చెల్లించకుండా.. డిఫాల్టర్ మారితే మీ క్రెడిట్ స్కోర్ గణనీయంగా పడిపోతుంది.
మరేం చేయాలి?
మీరు లోన్ ఇన్‌స్టాల్‌మెంట్లు అనుకున్న సమయానికి కట్టలేకపోతే.. బ్యాంక్ అధికారులను కలిసి, వారితో మాట్లాడాలి. మీ పరిస్థితిని వారికి అర్థమయ్యేలా వివరించి… వడ్డీ తగ్గించమని అడగాలి. లేకపోతే టెన్యూర్ పెంచమనాలి. వేరే మార్గం లేదనుకుంటే.. బ్యాంకు అధికారుల సాయంతోనే ఆ ఇంటిని అమ్మేయడం ఉత్తమం అని చెబుతున్నారు నిపుణులు.