ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలకు వేదిక సిద్ధమైంది. జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ఈ మహాసభలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని సంఘటితపరచి, తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, సాంప్రదాయ విలువలను, తెలుగు జాతి వారసత్వ సంపదను నేటితరం నుంచి భావితరాలకు అందించేందుకు తగిన సమావేశాలు, చర్చలు, సమాలోచనలు, కళా ప్రదర్శనలు నిర్వహించనుంది.
వీటికి అడుగు పడింది 90లలోనే..
ప్రపంచ తెలుగు సమాఖ్యకు 1993లో శ్రీకారం చుట్టారు. తొలి మహాసభలు 1996లో హైదరాబాద్ లో జరిగాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు రెండోసారి హైదరాబాద్ నగరంలో జరగనున్నాయి. రెండేళ్లకోసారి తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించారు. హైదరాబాద్ తో పాటు విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, సింగపూర్, దుబాయ్, మలేసియాలలో ఈ మహాసభలు జరిగాయి.
ప్రస్తుతం ప్రపంచ తెలుగు సమాఖ్య ‘పన్నెండవ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభలను ‘2025 జనవరి 3, 4, 5 తేదీలలో హైదరాబాదులో హైటెక్ సిటీలోని నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్ & హెచ్ఐసిసి కాంప్లెక్స్లో నిర్వహించడానికి భారీ ఎత్తున సన్నాహాలు జరిగాయి. ఇందులో భాగంగా ప్రముఖ తెలుగు పారిశ్రామికవేత్తలను, ఇతర రంగాలకు చెందిన కొందరు తెలుగు ప్రముఖులను కూడా ఆహ్వానించి సత్కరించనున్నారు. ఈ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభల్లో ప్రపంచ తెలుగు సమాఖ్య అనుబంధ సంస్థల ప్రతినిధుల సమావేశం, వాణిజ్య, పారిశ్రామికవేత్తల సదస్సులను సైతం ఏర్పాటు చేశారు. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జానపద కళారూపాల ప్రదర్శన, కూచిపూడి నృత్య రూపకాలు, సాహితీ రూపకాలు, భాషా, సంస్కృతులపై ప్రముఖుల ప్రసంగాలు, సినీ కళాకారుల ప్రదర్శనలు, సినీసంగీత విభావరి, తెలుగువారి చేనేత వస్త్ర అందాల ప్రదర్శనలతో పాటు మరికొన్ని ఆసక్తికర కార్యక్రమాలు ఉంటా యని నిర్వాహకులు పేర్కొన్నారు.
అంతేకాక యునికార్న్ కంపెనీలు స్టార్టప్ కంపెనీలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. విదేశాల్లో ఉన్న తెలుగు సంఘాల నాయకులు కూడా ఈ మహాసభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ విచ్చేయడం విశేషం.
ఈ సభలకు అధ్యక్షురాలిగా ఇందిరాదత్ ఉండగా, ఈమె ఆధ్వర్యంలో జనవరి 3న జరిగే ప్రారంభ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకానుండగా.. జనవరి 5వ తేదీన జరిగే ముగింపు వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారని తెలిపారు.
కాగా ఈ మహాసభల కోసం హైదరాబాద్ అంతటా ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.
జనవరి 3న…
ఉదయం ప్రారంభ కార్యక్రమం,
మధ్యాహ్నం 1 గంటకు రిజిస్ట్రేషన్ కార్యక్రమం, మధ్యాహ్నం 3.30కు బిజినెస్ లీడర్ షిప్ సమ్మిట్‌లో భాగంగా సెమినార్,
సాయంత్రం 5 గంటలకు ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవ్వడం,
5.45కి తెలుగు ఏంజెల్స్ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు.
సాయంత్రం 6 గంటలకు బిజినెస్ సెమినార్ 2,
రాత్రి 7.30కు సంగీత విభావరి,
8.30కి నెట్ వర్కింగ్, డిన్నర్ కార్యక్రమం ఉంటాయి.
జనవరి 4న:
ఈరోజు కల్చరల్, లిటరరీ కార్యక్రమాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి.
11.30కి అవార్డుల వేడుక,
మధ్యాహ్నం 2.30కు డెలిగేట్స్ సెషన్,
సాయంత్రం 4 గంటలకు ఫ్యాషన్ షో, చేనేత వస్త్రాల ప్రదర్శన,
సా. 5.15 గంటలకు తెలుగు ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ప్యానెల్ డిస్కషన్,
సా. 6.30కు మలేషియా తెలుగు విద్యార్థుల కార్యక్రమం,
రాత్రి 7.15కు రామ్ మిర్యాల సంగీత విభావరి,
రాత్రి 8 గంటలకు డిన్నర్‌తో కార్యక్రమాలు ముగుస్తాయి.
జనవరి 5న:
ఉదయం 10 గంటలకు కల్చరల్ కార్యక్రమాలు, మధ్యాహ్నం 2.30కు తెలుగు క్రియేటర్స్, ఇంపాక్ట్ కార్యక్రమం,
3.10కి కల్చరల్ కార్యక్రమాలు తిరిగి ప్రారంభం, సాయంత్రం 5 గంటలకు ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈరోజున ముఖ్య అతిధిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు.
సా. 6 గంటలకు సినీ ప్రముఖుల సత్కారం,
రాత్రి 7 గంటలకు ముగింపు కార్యక్రమాలు జరుగుతాయి.
తెలుగువారిలో సృజనాత్మకత, పరస్పర సహకారభావం పెంపొందేలా ఒక విశ్వవేదికను కల్పిస్తూ విశ్వవ్యాప్తంగా తెలుగుజాతి వ్యాపారాభివృద్ధికి తద్వారా సామాజిక, ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్న విశ్వవ్యాప్త తెలుగుజాతి సమైక్య వేదిక ‘ప్రపంచ తెలుగు సమాఖ్య’గా నిలుస్తోంది.