Telugu Opinion SpecialsTelugu Politics

ఇలా చేస్తే.. సూపర్‌ సిక్స్‌ తప్పక వర్కౌట్ అవుతుంది..!‌

ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ లీగ్‌లో సూపర్ సిక్స్‌తో విజయం సాధించింది తెలుగుదేశం, జనసేన బీజేపీ కూటమి. సూపర్‌ సిక్స్‌.. ఇప్పుడు ప్రతిఒక్కరి నోట ఇదే మాట. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం చేసేలా చంద్రబాబునాయుడు ఆరు ప్రత్యేక హామీలను ప్రకటించారు. వాటిని అమలు ఎలా చేస్తారు? వాటికి ఎంత దాదాపుగా ఎంత ఖర్చు అవుతుంది? వీటి అమలుకు నిధుల సమీకరణ ఎలా చేస్తారు? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

* సూపర్‌ సిక్స్‌ పథకాలు

1. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు (3 వేల నిరుద్యోగ భృతి) 

2. స్కూల్‌కు వెళ్ళే ప్రతి విద్యార్థికి రూ.15వేలు

3. ప్రతి రైతుకు ఏటా రూ.20వేలు

4. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు

5. ప్రతి మహిళకి ప్రతి నెల రూ.1500

6. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

* గ్యారంటీ పథకాలు

1. మహాశక్తి

2. పూర్ టు రిచ్

3. యువగళం

4. అన్నదాత

5. ఇంటింటికీ మంచి నీరు

6. బీసీలకు రక్షణ

* ప్రతి విద్యార్థికి రూ.15,000 ప్రస్తుతం స్కూల్ విద్యార్థులు: 71 లక్షలు, సంవత్సరానికి ఖర్చు: రూ. 1.650 లక్షల కోట్లు

* ప్రతి రైతుకి రూ. 20,000 :- రాష్ట్రంలో ఉన్న రైతులు : 7.4 లక్షలు సంవత్సరానికి ఖర్చు : రూ. 14,800 కోట్లు

* నిరుద్యోగ భృతి: రాష్ట్రంలో అధికారిక లెక్కలు ప్రకారం నిరుద్యోగులు 15 లక్షమంది ఉన్నారు. వారికి నెలకు : రూ. 4000 కోట్లు, సంవత్సరానికి : రూ. 48,000 కోట్లు

* ప్రతి ఇంటికి 3 సిలిండర్లు: ఏపీలో మొత్తం ఇళ్ళు : 2.21 కోట్లు ఖర్చు : 6,650 కోట్లు (రీఫీల్ చేస్తే) ఒక వేళ కొత్త సిలిండర్లు కొని ఇస్తే మొదటి సంవత్సరం ఖర్చు : 19,980 + 6,650 కోట్లు.

* 18 సంవత్సరాలు నిండిన మహిళకి నెలకు రూ. 1,500 :- రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన మహిళలు : 2.1 కోట్లు, నెలకి ఖర్చు: రూ. 3,150 కోట్లు సంవత్సరానికి: రూ. 37,800 కోట్లు.

* పెన్షన్ రూ. 4,000 :- ఇప్పుడున్న పెన్షన్ దారులు: 64 లక్షలు, నెల ఖర్చు : రూ. 2,560 కోట్లు, సంవత్సరానికి : రూ. 30,720 కోట్లు.

* ఉచిత బస్సు:- సంవత్సరానికి ఖర్చు: రూ. 4,500 కోట్లు

మొత్తం ఖర్చు:- 3,27,450 కోట్లు. 

ఇవే కాకుండా క్యాపిటల్ నిర్వహణ ఖర్చు: రూ.74,000 కోట్లు (జీతాలు+కార్యాలయాల నిర్వహణ +ప్రభుత్వం రోజు వారీ ఖర్చులు లాంటివి) రెండూ కలిపితే.. మొత్తం ఖర్చు: రూ. 4,01,450 కోట్లు.. 2024-2025 మన రాష్ట్ర బడ్జెట్: రూ. 2.86 లక్షల కోట్లు అనుకుంటే ( 4,01,450 కోట్లు-2,86,000 కోట్లు= రూ. 1,15,450 కోట్లు). దీనిప్రకారం సూపర్ సిక్స్ అమలు చేయాలంటే ఏడాదికి రూ. 1.15 లక్షల కోట్లు అవసరం అవుతుంది. 

సూపర్‌ సిక్స్‌‌తో పాటు షణ్ముఖ వ్యూహం

ఇంటింటికీ రక్షిత తాగునీరు, పూర్‌ టు రిచ్‌, యాభై ఏళ్లకే బీసీలకు పెన్షన్‌, బ్రాహ్మణుల సంక్షేమం, మైనార్టీలు, న్యాయవాదులు, క్రైస్తవులు, ఇలా అన్నివర్గాల ప్రజలకోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. పరిశ్రమల ఏర్పాటు.. స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించడం. మహిళా సంఘాలకు వడ్డీ లేకుండా రూ.10లక్షల వరకు రుణాలు.. ఉద్యోగస్తులు, పెన్షనర్స్‌కు కూడా పలు ప్రయోజనాలు కల్పించేలా మేనిఫెస్టోలో పొందుపరిచారు. నేతకార్మికులు, మత్స్యకారులు, యాదవులు ఇలా.. ఇతరత్రా వర్గాలకు వేర్వేరుగా అమలుచేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి.

ఇకపోతే రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛన్ దారులకు నగదు పెంపుతో నెలకు రూ.2,758 కోట్లు, ఏడాదికి రూ.33,099 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూలై ఆర్థిక అవసరాలను తీర్చేందుకు కొత్త టీడీపీ ప్రభుత్వం రూ.10,000 కోట్లకు పైగా నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. జీతాలు, పింఛన్లు, రుణ చెల్లింపులు, వడ్డీల అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపు రూ.1.30 లక్షల కోట్ల నిబద్ధతతో ఖర్చు చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ సమాచారం  ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 11న వేలం ద్వారా రూ.2,000 కోట్ల విలువైన సెక్యూరిటీలను విక్రయించడానికి నిర్ణయించింది. సామాజిక పింఛన్‌ కోసమే రాష్ట్రానికి ప్రతి నెలా రూ.2,600 కోట్లు అవసరం.

మనసుంటే మార్గం ఉంటుందంటారు.. అది ఇదేనేమో? 

సూపర్ సిక్స్ పథకాలకు ఎక్కడ నుంచి డబ్బు తెస్తారు? కొన్ని పథకాలను కేంద్ర పథకాలతో అనుసంధానం చేయడం ద్వారా ఆర్థిక భారం తగ్గించుకుంటారు. గత ప్రభుత్వం ఇంతకాలం రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే వనరులన్నింటినీ దుర్వినియోగం చేసింది. సరైన అజమాయిషీ, జవాబు దారీతనం లేక  పారిశ్రామిక, వ్యవసాయ, పర్యాటక రంగాలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఆదాయం లేకుండా పోయింది. సంక్షేమ పథకాలకు అప్పులు చేయటం ఒక్కటే మార్గం కాదు. ప్రభుత్వం ఈ మూడు రంగాలతో సహా అన్ని రంగాలను అభివృద్ధి చేసి ఆదాయం సమకూర్చుకోవాలి.

రాష్ట్రంలో సహజవనరులు, అద్భుతమైన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు, అనేక పర్యాటక ప్రాంతాలు, అత్యంత సారవంతమైన భూములు, సువిశాలమైన సముద్ర తీరం వంటి అనేకం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి దేవుడిచ్చిన వరం. కాబట్టి వాటి నుంచి ఆదాయం సృష్టించుకోవాలనే ఆలోచన చేయాలి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో కూడా ప్రభుత్వం తనదైన శైలిలో ఆలోచించి, వ్యవసాయ మోటర్లన్నింటికీ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయించడం ద్వారా ఆ విద్యుత్ భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా తిరిగి మిగులు విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం చేయాలి. తద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరేలా చర్యలు తీసుకోవాలి.

ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అంశాలు..!

ప్రాముఖ్యత, ప్రాధాన్యత క్రమంలో పథకాలు అమలు చేస్తామని చెప్పాలి. లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలి. నగదు రహితంగా పథకాలు లబ్ది దారులకు చేరాలి. ముఖ్యంగా నిరుద్యోగ భృతిపై విధివిధానాలు, విద్యార్హత, పర్యవేక్షణ, లబ్దిదారుల ఎంపికపై పారదర్శకతతో పాటు నియంత్రణ అవసరం. అమరావతి, పోలవరం నిర్మాణ పనులు వేగవంతమైతే ఉపాధి అవకాశాలు మెరుగుపడి నిరుద్యోగ భృతి ఇవ్వటంపై భారం తగ్గుతుంది. నైపుణ్యం మెరుగు పరిచే కేంద్రాలు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు త్వరితగతిన చేయటం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు వాస్తవికతను తెలియజేయాలి. విభజన హామీల అమలు, ఆస్తుల పంపకాలపై దృష్టి సారించాలి.  రాష్ట్రానికి రావాల్సిన నిధులు, తదితర అంశాలు, కార్యక్రమాలను కేంద్రంతో అనుసంధానించేందుకు ప్రత్యేక పాలనా ఆర్థిక  కార్యదర్శులను నియమించాలి. దుబారా ఖర్చు తగ్గించటం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించటం భారీ, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటుకు  కృషి చేయడంతో పాటు విధివిధానాలను రూపొందించి అవసరమైన మేరకే ఆయా పరిశ్రమల వల్ల ప్రయోజనాన్ని ఉపాధి అవకాశాలను బట్టి రాయితీ ఇవ్వాలి. అనుమతులు సులభతరం చేయాలి. సంక్షేమమే పరమావధిగా కాకుండా అభివృద్ధిపై, ఆదాయ వనరులపై దృష్టి  సారిస్తే  సూపర్ సిక్స్ అమలు సక్సెస్ అవుతుంది.

Show More
Back to top button