Telugu Opinion SpecialsTelugu Politics

చల్లారని ఎన్నికల వేడి.. అంతుచిక్కని ఓటరు నాడి

ఏపీలో ఈసారి జరిగిన ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 81.86 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా భారీగా ఓటింగ్ జరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం 2 శాతం పెరిగితే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మాత్రం రెట్టింపు అయింది. తాజాగా ఈసీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. అయితే, ఈ పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని పార్టీలు లెక్కల్లో మునిగాయి. ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు. ఇదే అంశంపై ఇప్పుడు రకరకాల చర్చలు సాగుతున్నాయి.

పోలింగ్ శాతం బాగు.. వ్యతిరేకత వల్లనా..?

పోలింగ్ సందర్భంగా రాష్ట్రమంతటా పెద్ద సంఖ్యలో ఓటర్లు కదిలారు. ఇది తమకే అనుకూలమని పార్టీ నేతలు ఎవరికి వారు లెక్కలు వేస్తున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్ వేసిన తీరుని అధికార వైఎస్సార్సీపీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. అంతేకాకుండా జగన్ 150కి పైగా సీట్లు వస్తాయని అంటున్నారు. అదే సమయంలో, ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందని విపక్షం అంచనా వేస్తోంది. ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలోనూ మహిళలు అత్యధికంగా ఉన్నారు. మహిళల్లో ఓటింగ్ శాతం 82 వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో తామే అధికారంలోకి వస్తామని టీడీపీ నేతలు అంటున్నారు.

వైసీపీ గ్రామాల్లో బలంగా ఉంది..!

ఈ ఎన్నికల్లో ఈ సారి 81.86 శాతం పోలింగ్ నమోదు అయితే.. ఇది పట్టణాల్లో 62.62శాతంగా.. గ్రామాల్లో అయితే ఏకంగా 82.32శాతంగా ఉంది. మరోవైపు వైసీపీ గ్రామాల్లో బలంగా ఉంది. రూరల్ ప్రాంతాలనే వైసీపీ బలంగా టార్గెట్ చేసింది. అక్కడే పార్టీకి ఫేవర్‌గా ఉండటంతో గెలుపు దిశగా పరుగులు తీస్తామని బలంగా నమ్ముతోంది. రాష్ట్రంలో మొత్తం 175 సీట్లు ఉంటే అందులో రూరల్ పరిధిలో ఉన్నవి 117 స్థానాలు. అర్బన్ లో 58 ఉన్నాయని ప్రాథమిక అంచనా. రూరల్‌లో భారీగా పోలింగ్ సాగడం, మహిళలు, వృద్ధులు ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొనడం వంటివి మా పార్టీకే కలిసి వస్తాయి అని వైసీపీ తెగ సంబరపడుతోంది.

* మహిళల ఓట్లే కీలకం కానున్నాయా..?

2014 ఎన్నిక‌ల్లో మొత్తం ఓట‌ర్లు 3,67,16,839 మంది ఉండగా, వారిలో 2,89,51,390 మంది అంటే 78.9 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుత ఈ ఎన్నికల్లో గ‌త ఎన్నిక‌ల కంటే సుమారుగా రెండు ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు పెరిగారు. పురుషుల క‌న్నా మ‌హిళా ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉండ‌డం విశేషం. మొత్తం ఓట‌ర్ల‌లో పురుషులు 1,83,24,588 మంది, మహిళా ఓటర్లు 1,86,04,742 మంది ఉన్నారు. అలాగే, థర్డ్ జెండర్స్‌ 3,761 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో వర్గాల వారీగా. మొత్తం 8.5శాతం రెడ్లు ఉంటే అందులో వైసీపీకి 6.0శాతం, మిగిలిన అగ్రవర్ణాల్లో 15 శాతం ఉంటే అందులో మూడు శాతం మాత్రమే వైసీపీకి పోలయ్యాయి అని అంచనా వేస్తున్నారు. 

ఇందులో ఓసీ కాపులు పది శాతం ఉంటే వైసీపీకి రెండు శాతం, బీసీలు 38 శాతం ఉంటే… వైసీపీకి 20 శాతం, ఎస్సీ, ఎస్టీ 20 శాతం ఉంటే వైసీపీకి 16 శాతం, ముస్లింలు 9 శాతం ఉంటే వైసీపీకి 7శాతం టోటల్‌గా 54 శాతం వరకు వైసీపీకే ఓట్లు పోలయ్యాయి అని భావిస్తున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి 130 స్థానాలకు తగ్గకుండా అసెంబ్లీ సీట్లు వస్తాయని కూటమి వర్గాల అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగులందరూ టీడీపీ వారికి ఓట్లు వేశారని టీడీపీ భావిస్తుంది.

* న్యూట్రల్‌ ఓటర్లు ఎవరి వైపు..?

న్యూట్రల్‌గా ఉన్న ప్రజలను తమ వైపు తిప్పుకోవడంలో టీడీపీ సక్సెస్ అయిందని ఆ ఓట్లు కూడా తమకే పడి ఉంటాయని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. సంక్షేమ పథకాలు కోసం వైసీపీకి ఓటు చేయాలనుకున్నవారు టీడీపీ మేనిఫెస్టో చూశాక ఆ నిర్ణయం మార్చుకున్నారని చంద్రబాబు టీడీపీ నేతలతో అన్నారట. రెండు కోట్ల మంది సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని వారిలో ఒక కోటి 50 లక్షల మంది తమ మేనిఫెస్టో చూశాక ఆ సంక్షేమ పథకాల కోసం తమకే ఓట్లు వేసి ఉంటారని  లెక్క వేస్తున్నారు. మొత్తం లెక్క చేసి చూస్తే ఒక కోటి 80 లక్షల నుంచి రెండు కోట్ల వరకు ఓట్లు టీడీపీకే కచ్చితంగా పడి ఉంటాయని చంద్రబాబు ఒక అంచనాకి వచ్చారు.  

* తలపండిన విశ్లేషకులుసైతం చెప్పలేని పరిస్థితి

వెల్లి విరిసిన ఓటర్ చైతన్యం అధికార పక్షం హామీ ఇచ్చిన నవరత్నాలు ప్రభుత్వ సానుకూలత అధికార పక్షానికి కలిసివచ్చేఅంశాలుకాగా ప్రభుత్వ వ్యతిరేకత, ఉద్యోగులు, వ్యాపారులు, యువత అండ, సంక్షేమం అభివృద్ది తో కూడిన హామీలు రాజధానిపై స్పష్టత బి.జె.పి తో దోస్తీ కూటమికి వరాలుగామారాయి. కుదుపులతో మెదలైన కూటమి అనూహ్యంగా పుంజుకుని కుదుటపడి అధికార పార్టీతో హోరాహోరిగానే తలపడింది. ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత పరిణామాలను రాష్ట్ర రాజకీయాలను అనూహ్యంగా మలుపు తిప్పాయి. విజ్ఞతతో ఓటేసిన ఓటరు తీర్పు భద్రంగా నిక్షిప్తమై ఉంది. జూన్ 4 న ఫలితాలు వెలువడే వరకూ తలపండిన విశ్లేషకులు సైతం తమ అంచనాలను చెప్పలేని పరిస్థితి. దీనికి సమాధానం కావాలంటే జూ 4 వరకు వేచి ఉండక తప్పదు.

Show More
Back to top button