Telugu Politics

జగన్ 2.O పాదయాత్ర. ఈసారి కూడా ఫలిస్తుందా.?

ఏపీలో 2024లో జరగిన ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆ పార్టీని ప్రజలు కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది.  ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ వై నాట్ 175 అన్నారు. కానీ ఈ రిజల్ట్ చూసి ఖంగుతిన్నారు.అయితే జగన్ మళ్లీ పార్టీకి పూర్వ వైభవం తేవడానికి, వచ్చే ఎన్నికల్లో మళ్లీ భారీ మెజార్టీతో గెలవాలడానికి  మరోసారి తల్లి విజయమ్మతో కలిసి పాదయాత్ర చేయబోతున్నారు. ఈ విషయాన్ని జగన్ తాజాగా ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. అంటే మరోసారి అధికారం కోసం జగన్ పాదయాత్రనే నమ్ముకోబోతున్నారన్న మాట. పాదయాత్రతో ఈసారి జగన్ ఆశలు ఫలిస్తాయా లేదో తెలుసుకుందాం. 

రెండోసారి.. అదే దారి

జగన్ రెండోసారి ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పాత్రయాత్ర చేయడానికి సన్నాలు చేస్తున్నారు. జగన్ గతంలో ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2017లో ఒకసారి పాదయాత్ర చేశారు. ప్రజా సంకల్ప యాత్ర పేరిట 341 రోజులు. 2019 జనవరి 9 వరకు 3,648 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర సాగింది. ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు వరకు ఆయన పాదయాత్ర చేశారు. ఈ ప్రభావం 2019 ఎన్నికలపై పడింది. ఆ ఏడు జరిగిన ఎన్నికల్లో జగన్ అఖండ మెజారిటీతో 151 సీట్లతో గెలిచారు. అదే నమ్మకంతో ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ రెండోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. గతంలో  ప్రజలతో మమేకం కావడానికి పాదయాత్రకు శ్రీకారం చుట్టింది ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఈ పాదయాత్రతో ఆయన అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత కూడా చంద్రబాబు, జగన్ పాతయాత్ర చేసి  అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అది సెంటిమెంట్ గా మారింది. అయితే పాదయాత్ర చేసినంత మాత్రన ప్రతిసారి అధికారంలోకి వస్తామనుకోవడం పిచ్చి పొరపాటే అవుతుంది. ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే.. జగన్ కేవలం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర చేస్తున్నాను అని ప్రకటించారు.  కానీ అధికారం పోయిన ప్రతిసారి పాతయాత్ర చేస్తా అంటే ప్రజలు కూడా నమ్మరు. అయినా గత ఐదేళ్లు జగన్ నే పరిపాలించాడు. మరి అప్పుడు ప్రజల సమస్యలు గుర్తుకు రాలేదా అని విమర్శలు వస్తున్నాయి. 

ఎందుకోసం.. ఏం చెబుతారు..?

పాదయాత్ర అంటే ప్రజలకు దగ్గరవుతూ వారి సమస్యలు తెలుసుకోవడం.. వాటి పరిష్కార మార్గాలు చూపడం. ప్రజల్లో తనపై నమ్మకం కలిగించడం. భరోసా ఇవ్వడం. ఇది 2019లో జగన్ చేశారు. అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. అందువల్ల పాదయాత్ర సందర్భంగా అప్పటి టిడిపి ప్రభుత్వాన్ని విమర్శించేందుకు అవకాశం దొరికింది. ప్రజల నుంచి మంచి ఆదరణ దొరికింది. అంతేకాదు.. పాదయాత్ర సందర్భంగా ప్రజలు ఎక్కడ.. ఏం కోరితే.. అది నెరవేరుస్తానని హామీ ఇచ్చుకుంటూ వెళ్లారు. ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ అడిగారు. ఇది నమ్మి ప్రజలు 2019లో జగన్కు పట్టం కట్టారు.

గత పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల్లో చాలా వాటిని అధికారంలో ఉన్నప్పుడు నెరవేర్చలేదనే విమర్శ ఉంది. సీపీఎస్ రద్దు, విద్యుత్ చార్జీలు తగ్గింపు, 45 ఏళ్లకే పెన్షన్ వంటివి చాలానే ఉన్నాయి. వాటి గురించి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ మాట్లాడలేదు. ఇక.. ఇప్పుడు కొత్త హామీలిస్తే నమ్ముతారా..? టీడీపీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తారు సరే.. మరి.. తాను ఐదేళ్లు అధికారంలో ఉండగా చేయలేని పనుల గురించి జగన్ ఏం చెబుతారు..? మళ్లీ అదే జాబ్ క్యాలెండర్ గురించి చెబుతారా.. విద్యుత్ చార్జీల గురించి హామీ ఇస్తారా.. తాను వేయలేని రోడ్ల గురించి ప్రస్తావిస్తారా..? 3 రాజధానుల గురించి ప్రస్తావిస్తారా…? లేదా నేను అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా సంక్షేమ పథకాలకు డబ్బు పెట్టాను.. వెనక ముందు చూసుకోకుండా బటన్లు నొక్కాను అని చెప్తారా.  

గెలిచిన తరువాత ప్రజలు గుర్తుకురారా..?

జగన్ 2019లో పాతయాత్ర చేసి సీఎం అయ్యారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు బయటకు వచ్చి ప్రజలకు ఎలాంటి పాలన అందుతుంది.. వారు సంతృప్తిగా ఉన్నారా లేదా అని తెలుసుకునే ప్రయత్నం మాత్రం ఎప్పుడు చేయలేదు. ఎంత సేపు సంక్షేమ పథకాల అమలు గురించే ఆలోచించారు తప్ప.. రాష్ట్ర అభివృద్ధి గురించి ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు. ఆయన అధికారం చేపట్టిన తరువాత కొత్గగా వాలంటీర్ వ్యవస్థను తీసుకవచ్చారు. దీంతో గ్రౌండ్ లెవల్ లో అంతా వారే పార్టీ నాయకులుగా పని చేశారు అనే విమర్శ ఉంది. ఎలా అంటే ఏదైన సమస్య వస్తే స్థానిక ఎమ్మెల్యేకి చెప్పుకోవాలన్నా ముందు వారిని కలవాలన్న అపవాదు ఉంది. ఈ వ్యవస్థను నమ్ముకుని జగన్ అండ్ కో ఎప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకోవాలని అనుకోలేదు. కనీసం స్థానికంగా ఉన్న ఎమ్మెల్మేలు కూడా ప్రజలతో మమేకం కాలేకపోయారు. వారి గోడు వినలేకపోయారు. అందుకే ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసి గట్టి షాక్ ఇచ్చారు. మళీ తేరుకుని ప్రజల సమస్యలు పాతయాత్ర అంటూ జగన్ కొత్త రాగం ఎత్తుకున్నారు.  కానీ అధికారం కోసం రెండోసారి పాదయాత్ర అంటే రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపదు. తెలంగాణలో 

షర్మిల, బీజేపీ నేతలు పాదయాత్ర చేసినా ప్రభావం అంతంత మాత్రమే. గతంలో లాగా పాదయాత్ర ద్వారా జనాలకు దగ్గరయ్యే అవకాశం ఉంటుందా..? నేతలు ఎన్నికలొచ్చినప్పుడల్లా పాదయాత్రలు చేయడం మామూలే అని తేలిగ్గా తీసుకుంటారా అనే దానికి కాలమే సమాధానం చెప్తుంది.

అప్పుడు జనాన్ని ఎందుకు కలవలేదు?

జగన్ అధికారంలోకి వచ్చాక తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమయ్యారనే అపవాదు ఉంది. పాదయాత్ర సందర్భంగా జనం మధ్యలోకి వెళ్లిన జగన్.. అధికారంలోకి వచ్చాక ప్రజలకి కాదు తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదనే విమర్శ ఉంది. ఎప్పుడు జనంలోకి వెళ్లినా పరదాలు కట్టడం… హెలికాప్టర్లలోనే ప్రయాణించారు. చివరకు పంట నష్టాన్ని చూడ్డానికి కూడా టెంట్ వేసుకుని.. రైతులకు దూరంగా వెళ్లారు. ఐదేళ్లలో నేరుగా ప్రజలను కలిసింది తక్కువే. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల మధ్యలో.. అధికారంలో ఉంటే ప్యాలస్లో.. ఇదేనా ఒక నాయకుడి వైఖరి అనే విమర్శలు జగన్పై ఉన్నాయి. 

ఓడిపోయన తరువాత జగన్ చేసింది ఇదే

జగన్ అధికారం కోల్పోయిన ఏడాది అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్ గట్టిగా ఏం అంశం మీద పోరాటం చేయలేదు. ప్రజల్లోకి రాలేదు. చేసిన కేవలం ఆయన కోసమే చేసుకున్నవే కనిపిస్తున్నాయి. తనకు ప్రతిపక్షహోదా, స్పెషల్ సెక్యూరిటీ కావాలని కోర్టుకు ఎక్కారు అంతే. ఇది  ప్రజల కోసం  కోసం కాదు.. ఆయన కోసం పార్టీ కోసమే అని అందరికి జగమెరిగిన సత్యమే. ఆ తరువాత గుంటూరు మిర్చి యార్డుకు వచ్చి రైతుల సమస్యలు తెలుసుకొని మాట్లాడారు. మొన్న పొగాకు రైతుల పక్షాన మాట్లాడారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఆయనకు పొగాకు కేజీ ఎంత ధర ఉంది అనే కనీస అవగాహన లేకుండా వచ్చి మాట్లాడారు. దీని ప్రతిక్షనాకులు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇంతవరకు బాగనే ఉంది రైతుల కోసం చేశారు. రీసెంటుగా ఆయన చేసిన రెండు పరామర్శలు తీవ్ర విమర్శకు దారి తీశాయి.

తెనాలిలో గంజాయి కేసు విషయంలో పోలీసులు వారిని నడిరోడ్డు మీద కొట్టారు. అలా చేయడం పోలీసుల తప్పే కానీ.. జగన్ పోలీసుల తీరును, ప్రభుత్వాన్ని విమర్శించాల్సింది పోయి.. ఏకంగా కేసులో నిందితులుగా ఉన్న వారిని పరామర్శించి తీవ్ర విమర్శలపాలు అయ్యారు. ఇటు ఆయన సొంత పార్టీ నాయకుల నుంచి కూడా ఒకింత అసంతృప్తి వ్యక్తం అయ్యింది. ఇంకా పల్నాడులో జగన్ వీరాభిమాని వైసీపీ హయాంలోనే  బెట్టింగ్ పెట్టి  డబ్బులు పోగొట్టుకుని చనిపోయాడు. అది ఇప్పడు జగన్ కి గుర్తుకు వచ్చి పరామర్శించడానికి వెళ్లాడు. అంతటితో ఆగకుండా ఏకంగా ఆయన విగ్రహాన్నే ఆవిష్కరించాడు. ఈక్రమంలో ఆయన  కాన్వాయ్ కింద పడి ఒకరు చనిపోయారు.  ఈ పరిణామాల వల్ల జగన్ తీవ్ర విమర్శల పాలు కావడంతో పాటు పార్టీలో ఆయనపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. 

జగన్ తీరు ఇప్పటికైన మార్చుకోవాలి..

జగన్ అధికారంలో ఉన్నప్పుడు సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా తన సన్నిహితులు ఏం చెప్తే అది ఎలా చెప్తే అలా విన్నారు అని విమర్శ ఉంది. ఇందులో నిజం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆయన పరిపాలించిన విధానం చూస్తే ఇట్టే అర్ధం అవుతుంది. ప్రజలకు ఏం కావాలో తెలుసుకోలేక పోయారు. ఎంత సేపు తాము చేస్తుంటే రైటు అనుకున్నారు. ప్రజలు కూడా సంతృప్తిగానే ఉన్నారు అనే ఒక భ్రమలో పరిపాలన కొనసాగించారు. ఇంకా ప్రశాంత్ కిశోర్ అండ్ టీం కూడా ఆయనపై రకరకాల ప్రయోగాలు చేశారు. జగన్ ఎంత సేపు వేరే వాళ్లు చెప్పిందే విన్నారు తప్ప..

అది ఎంత వరకు సాధ్యం అవుతుంది కాదా అనే వాటి గురించి ఆలోచించలేదు. అందుకే ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. సరే పోని ప్రతిపక్షంలో ఉన్పప్పుడు అయినా తను హుందాగా వ్యవహరించాల్సింది పోయిన అనవసర పరామర్శలు చేసి ఇటు జనాల్లో అటు పార్టీలో పలుచన అవుతున్నారు. ఇప్పటికైనా జగన్ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలి. వాళ్లు ఇచ్చిన హామీలు అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేయాలి. వాటి అమలు కోసం నిరంతరం పోరాడాలి. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాలి. ధర్నాలకు, రాస్తారోకోలకు పిలునివ్వాలి. తాను కూడా రోడ్ల మీదకు వచ్చి ప్రజలు, పార్టీ నాయకులో మమేకం అయ్యి ప్రతిపక్షనేతగా తన స్వరం వినిపించాలి. అప్పుడు జగన్ అనుకున్నలక్ష్యం నేరవేరుతుంది.  

అంతిమ లక్ష్యం అధికారమే..!

నేతలు ఏం చేసినా అంతిమ లక్ష్యం అధికారమే. జగన్ లక్ష్యం కూడా 2029లో అధికారం దక్కించుకోవడమే. అందుకే పాదయాత్ర అంటున్నారు. జగన్కు జనంలో ఆదరణ ఉంది. ఎక్కడికెళ్లినా అభిమాన సందోహం కనిపిస్తోంది. కార్యకర్తలు అండగా ఉంటున్నారు. మళ్లీ పాదయాత్ర చేసినా ప్రజల నుంచి స్పందన ఉండొచ్చు. కానీ, గతంలోలాగా జగన ను మళ్లీ జనం సీఎంగా చూడాలని కోరుకుంటారా..? ఇదంతా కూటమి ప్రభుత్వ పాలన మీద ఆధారపడి ఉంటుంది. కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటే మాత్రం జగన్ మరోసారి సంచలనం సృష్టిస్తారు. హామీలు కూటమి నెరవేరిస్తే జగన్ పాదయాత్రకు ఫలితం శూన్యం.

Show More
Back to top button