Telugu Politics

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిదే!

ఆయన తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనం. ప్రత్యర్థి పార్టీ నేతలకు కౌంటర్ ఇస్తూ తన వాక్చాతుర్యంతో చెమటలు పట్టించే నాయకుడు. ఒక ఫైర్ బ్రాండ్. ఆయన పేరు చెబితే యువతలో ఉత్సాహం ఉప్పొంగుతుంది. తన ప్రసంగం వస్తుందంటే చాలు ప్రజలు టీవీలకు అతుక్కుపోతారు. ఒక చిన్నస్థాయి లీడర్ గా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం అంచలంచెలుగా ఎదిగి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఎవరో కాదు. రాజకీయాల్లో అతికొద్ది కాలంలోనే మాస్ లీడర్ గా ఎదిగిన తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి. ఒక మండల స్థాయినుంచి సీఎంగా ఎదిగిన రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి ఎలా వచ్చారనేది ఈ కథనంలో తెలుసుకుందాం. 

మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో 1969 నవంబర్ 8 న జన్మించారు. తల్లిదండ్రులు అనుముల నర్సింహా రెడ్డి -రామచంద్రమ్మ. వీరు వ్యవసాయం చేసేవారు. రేవంత్ కు ఏడుగురు అన్నదమ్ములు ఒక చెల్లెలు ఉన్నారు. రేవంత్ రెడ్డి చిన్నప్పటినుంచి చురుకైన వ్యక్తి ఇక తన విద్య ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. ఇంటర్ మీడియట్ ఒక ప్రైవేట్ కాలేజీలో జరిగింది. ఇక ఉన్నత చదువుకోసం హైదరాబాద్ వచ్చిన రేవంత్ ఉస్మానియా పరిధిలోని ఓ కాలేజీలో బీఏ పూర్తి చేశారు. ఇక కాలేజీలో ఉన్నప్పుడే ఏబీవీపీలో చేరాడు. దీంతో కాలేజీలో ఉన్న సమయంలో విద్యార్థుల సమస్యలు కాలేజీలకు తెలియజేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్న రేవంత్ రెడ్డి.. 1992లో కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మేనకోడలు గీతా రెడ్డిని వివాహమాడారు. వీరి కూతురు నైమిషా రెడ్డి పెళ్లి ఇటీవలే రేవంత్ రెడ్డి దంపతులు ఘనంగా జరిపించారు.    

అయితే 1992 సంవత్సరంలో విద్యార్థిగా ఉన్న స‌మ‌యంలోనే అఖిల భార‌త విద్యార్థి ప‌రిష‌త్‌ నాయకుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. అప్పటి నుంచే రాజకీయాలపై అనుక్షణం మాట్లాడేవారు. సమస్యలన్నింటికి ప్రజల ముందుకు తెచ్చేవారు. రేవంత్ రెడ్డి టాకింగ్ పవర్ ను అందరూ కొనియాడేవారు. అలా స్థానిక లీడర్ గా ఎదిగి మొదటిగా టీడీపీ పార్టీలో చేరారు. అయితే ఆ తర్వాత టీడీపీ నుంచి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి.. 2001-02 మధ్యలో టీఆర్ఎస్‌(ప్రస్తుతం బీఆర్ఎస్)లో పని చేశారు. రేవంత్ తన రాజకీయ ప్రస్థానం మొదట్లోనే అనేక ఆటుపోట్లను ఎదురుకొన్నారు. 2004లో కల్వకుర్తి టికెట్ వస్తుందని రేవంత్ ఆశించినా.. చివరికి ఆయనకు నిరాశ తప్ప ఇంకా ఏం మిగలలేదు. అటు 2006 జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ తనకు టికెట్ వస్తుందని ఆశించినా రాకపోయింది.

 ఇక 2008లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన సత్తా నిరూపించుకోవడానికి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి.. అద్భుత విజయాన్ని అందుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పేరు విపరీతంగా మారుమ్రోగింది. 2008లో మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి చేరిన రేవంత్ రెడ్డి.. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు రావులపల్లి గుర్నాథరెడ్డిపై అత్యధిక మెజారిటీతో భారీ విజయం సాధించారు. వరుసగా మరోసారి ఆయన 2014లో కూడా గుర్నాథరెడ్డిని ఓడించి రెండోసారి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. రేవంత్ రెడ్డి రాజకీయ చతురతను మెచ్చిన అధిష్టానం 2014–17 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్‌ లీడర్‌గా అవకాశం ఇచ్చింది. 

జూన్ 2, 2014న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. దీంతో రెండు రాష్ట్రాలు వేరయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై పోరాటం చేసి.. చంద్రబాబును ఆంధ్రకు పంపాడు. దీంతో తెలంగాణలో టీడీపీ బలహీలపడింది. ఈ క్రమంలోనే ఓటుకునోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ కావడం సంచలనం రేపింది. అయితే ఈ సమయంలోనే ఆయన కూతురు వివాహం జరిగింది. కూతురు వివాహానికి 4 గంటల బెయిల్ తో హాజరవడం, రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అనేక ఆటుపోట్లను ఎదురుదెబ్బలను తట్టుకొని రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితాన్ని ముందుకు సాగనిచ్చాడు. అయితే తెలంగాణలో తెలుగు దేశం పార్టీ బలహీనం అవడంతో రేవంత్ రెడ్డి 2017 అక్టోబర్‌లో టిడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంతరం 2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. అయితే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన సేవలందించిన విధానం రాజకీయ నేతల అందరిని ఆకట్టుకుంది. 

అనంతరం 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. మల్లి 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. రేవంత్‌ రెడ్డి వాక్ పటిమ, రాజకీయ ఎత్తుగడలు, విపక్షాలకు దీటైన సమాధానం చెప్పే విధానం గమనించిన జాతీయ కాంగ్రెస్ అధిష్టానం.. తెలంగాణ పీసీసీ అధ్యక్ష్యుడిగా 26 జూన్ 2021లో నియమించింది. 2021 జులై 7న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ సమక్షంలో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు.

ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి ఎంతో ఉత్కంఠగా సాగిన 2023- అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. సుమారు 32 వేల ఓట్ల మెజార్టీతో భారీ విజయాన్ని అందుకున్నారు. తెలంగాణను శ్రీమతి సోనియా గాంధీ ఇచ్చింది. ఆమె ఇవ్వడం వలనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిందని ఎన్నికలకు ముందు రేవంత్ ప్రజల్లోకి తీసుకెళ్లారు. అలాగే అన్నీ తానై కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పూర్వవైభవాన్ని తీసుకొచ్చారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 69 సీట్లలో గెలిచి మ్యాజిక్ ఫిగర్ దాటడమే కాకుండా రాష్ట్రం ఏర్పడి దశాబ్డం తర్వాత కాంగ్రెస్ అధికారంలోని వచ్చేందుకు రేవంత్ కృషి ప్రశంసనీయం. అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కాంగ్రెస్.. రేవంత్ రెడ్డిని ముఖ్యమంతిగా ప్రకటించింది. భట్టి విక్రమార్కని డిప్యూటి సీఎంగా ప్రకటించింది.

Show More
Back to top button