Telugu Special Stories

బహుముఖ ప్రజ్ఞాశాలి… పి. ఆదినారాయణ రావు..

పెనుపాత్రుని ఆదినారాయణరావు (ఆగష్టు 21, 1914 – జనవరి 25, 1991)

తెలుగు సినిమా సంగీత దర్శకులు, నిర్మాత. అంజలీ పిక్చర్స్ అధినేత.

తెలుగు సినిమాకి స్వర్ణయుగం అనదగ్గ మూడు దశాబ్దాలు ఉండేవి. 1950, 1960, 1970 దశాబ్దాలు. తెలుగు సినిమాలో సంఖ్యా పరంగా వీరు సంగీతం వహించిన చిత్రాలు తక్కువే అయినా కూడా, ఆణిముత్యాలు లాంటి పాటలను అందించారు. ఆ స్వర్ణయుగంలో యస్ రాజేశ్వరరావు గారూ, పెండ్యాల గారూ, కె. వి. మహదేవన్ గారూ, చలపతి రావు గారూ, మాస్టర్ వేణు గారూ, అశ్వథ్థామ గారూ ఇలా ఎవరికి వారే తమ ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ వచ్చారు. ఒక సంగీత దర్శకుడి పేరు చెప్పగానే ఒక రకమైన పాటలు శ్రోతల మదిలో మెదులుతాయి. ఆ కోవకు చెందిన సంగీత దర్శకులు ఆదినారాయణ రావు గారూ.

ఆదినారాయణ రావు గారూ సంగీత దర్శకులు మాత్రమే కాదు, చిత్ర నిర్మాత కూడా. వీరు నిర్మించినటువంటి చిత్రాలు మరే ఇతర సంగీత దర్శకులు కూడా నిర్మించలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆదినారాయణ రావు గారూ తాను నిర్మించిన చిత్రాలకే ఎక్కువగా సంగీత దర్శకత్వం వహించారు. అంత పరిమితంగా చేసినప్పటికీ ఆయన స్వరపరిచిన గీతాలు, ఇప్పటికీ శ్రోతల మనసులలో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి.

ఆదినారాయణ రావు గారూ సంగీత దర్శకులే కాదు. చిత్ర నిర్మాత కూడా. అంజలీ పిక్చర్స్ స్థాపించిన వీరు తెలుగు, తమిళం, హిందీ భాషలలో కూడా చిత్రాలను నిర్మించారు. ఎన్టీఆర్ గారూ కథనాయకుడిగా నటించిన మొదటి చిత్రం పల్లెటూరి పిల్ల. ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించింది ఆదినారాయణ రావు గారూ. ఆదినారాయణ రావు గారూ హిందీలో నిర్మించిన ఒక చిత్రానికి వారే సంగీత దర్శకత్వం వహించారు. ఆ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారం దక్కింది. దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడికి, ఉత్తర భారతదేశానికి చెందిన హిందీ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు రావడం అదే తొలిసారి, అదే ఆఖరి సారి కూడా.

పెనుపాత్రుని ఆదినారాయణరావు గారూ 21 ఆగష్టు, 1914 నాడు విజయవాడ లో జన్మించారు. వీరి తల్లి గారూ అన్నపూర్ణమ్మ, తండ్రి కృష్ణయ్య గారూ. వ్యాపారం దృష్ట్యా ఆదినారాయణ రావు గారికి ఆరు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు వారి తండ్రి గారూ విశాఖపట్నంకు వలస వెళ్లారు. ఆదినారాయణ రావు గారి తండ్రి గారూ మంచి సంగీత ప్రియులు. వ్యాపారంలో గడించిన లాభాలను ఎక్కువగా సంగీతానికి, నాటకాల కోసమే ఖర్చు చేసేవారు. 1923 – 24 ప్రాంతంలోనే వారికి ఇంట్లో గ్రామ్ ఫోన్ ఉండేది. నారాయణ వ్యాస్, కరీం ఖాన్, బాలగంధర్వ దీనానాథ్ వీళ్ళ పాటలకు సంబంధించిన రికార్డులు ఉండేవి. ఇవి వింటూ పెరిగిన ఆదినారాయణ రావు గారికి స్వాతహాగానే సంగీతం అంటే విపరీతమైన ఆసక్తి పెరిగింది.

మాములుగానే సంగీతం, గ్రామ్ ఫోన్ లో పాటలు వినటం అలవాటుగా ఉన్న ఆదినారాయణ రావు గారూ విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఒకరోజు ఇంట్లో పాటలు పాడుతూ ఉండగా రాజరాజేశ్వరి నాట్య మండలి కి సెక్రటరీ అయిన కె.వి.సుబ్బారావు గారూ దారిలో వెళుతూ ఆ పాట విని ఆగి, ఇంత శ్రావ్యంగా పాడుతున్న బాలుడెవరో కనుక్కుందామని ఇంట్లోకి వెళ్లి ఆరాతీసి, ఆ అబ్బాయిని నాతో పాటు పంపిస్తారా నేను నాటకాలలో చేర్చుకుంటాను అని అడిగారట. నారదుని పాత్రకు మీ అబ్బాయి సరిగ్గా సరిపోతాడు. నాతో పంపించండి అని అడిగారట. 1925 లో తనకు ఎనిమిది సంవత్సరాల వయసున్న ఆదినారాయణ రావు గారిని కే.వీ. సుబ్బారావు గారి వెంట పంపించారు.

సావిత్రి చెలికత్తె పాత్ర వేయించారు నర్సీపట్నంలో. ఆ నాటకాన్ని వీక్షించిన రూథర్ ఫర్డ్ గారూ ఆదినారాయణ రావు గారిని మెచ్చుకుని బంగారు పథకం బహుకరించారు. కృష్ణ లీలలు, సిరియాళ, బహ్రు వాహన, రసపుత్ర విజయం లాంటి నాటకాలలో నటిస్తూ హార్మోనియం వాయిస్తూవుండేవాడు. పాటలు కూడా బాగా పాడుతున్నాడు. ఇవన్నీ గమనించిన ఆదినారాయణ రావు గారి నాన్నగారు, పట్రాయని శాస్త్రి గారి వద్ద సంగీతం నేర్చుకోవడానికి సాలూరు పంపించారు. అయిదు సంవత్సరాలు అక్కడ శిక్షణ తీసుకున్నారు. అప్పుడు తన వయస్సు 13 సంవత్సరాలు. ఆ సమయంలో విశాఖపట్నం నుండి వాళ్ళమ్మ ఊరైన కాకినాడకు వచ్చేశారు.

నాటకరంగం..

కాకినాడకు మకాం మార్చడంతో అక్కడ ఉన్న “జగన్మోహిని విలాస సభ” లో బాలనటుడిగా చేరి, వారు ప్రదర్శించే “చిత్ర నళినీయం”,  “హరిశ్చంద్ర”, “బొబ్బిలి యుద్ధం” లాంటి నాటకాలలో నటించేవారు ఆదినారాయణ రావు గారూ. ఒకసారి “చిత్ర నళినీయం” అనే ఒక నాటక ప్రదర్శన జరుగుతుంటే ఆ సమయానికి రావలసిన హార్మోనిస్టు రాకపోవడంతో ఆ స్థానంలో ఆదినారాయణ రావు గారూ అద్భుతంగా హార్మోనియం వాయిస్తూ మంచి సంగీతాన్ని అందించారు. అలాగే పాఠశాలలో చదువుతూండగా సాహిత్యం మీద ఆసక్తితో చందోబద్ధంగా పద్యాలు వ్రాయడం మొదలుపెట్టారు. అది గమనించిన తెలుగు మాస్టారు వింజమూరు లక్ష్మీనరసింహ రావు గారూ ఆదినారాయణ రావు గారిని ప్రోత్సాహించారు. వింజమూరు లక్ష్మీనరసింహ రావు గారూ కవి పరాజయం అనే నాటకం వ్రాస్తే, అందులో కూడా వేషం వేశారు ఆదినారాయణ రావు గారూ.

Versatile... P. Adinarayana Rao..

ఒకసారి “ఓన్లీ డాటర్” అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా, దానికి సంగీతం దర్శకత్వం వహించే వాళ్లెవరూ లేకపోతే, ఆ బాధ్యతలు కూడా ఆదినారాయణ రావు గారికే అప్పగించేశారు. వీటితో పాటు “క్లాసుమేట్స్”, “భాగ్యరేఖ” వంటి నాటకాలకు కూడా ఆదినారాయణ రావు గారే సంగీతం దర్శకత్వం వహించేశారు. నాటకాలలో నటించడం, దర్శకత్వం చేయడం, హార్మోనియం వాయించడం, సంగీతం దర్శకత్వం చేయడం, పద్యాలు వ్రాయడం ఇలా బహుముఖ ప్రజ్ఞత్వం చేసేవారు. బర్మాషెల్స్ ఆమెచ్యూర్స్ అనే నాటక సంస్థ సూచన మేరకు స్ట్రీట్ సింగర్స్ అనే నాటకం వ్రాశారు. తరువాత అదే సంస్థకు “సక్కుబాయి”, “వసంత సేన”, “పీష్వా నారాయణరావు” మున్నగు నాటకాలు రచించారు.

వివాహం..

అప్పట్లో కాకినాడలో యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ఉండేది. ఆ క్లబ్ లో ఆదినారాయణ రావు గారు కీలక వ్యక్తి. అందులో నటి అంజలీదేవి గారిని వాళ్ళ నాన్న గారూ చేర్పించారు. ఆ క్లబ్ లో పిల్లలకు నటన, నాట్యంతో పాటు చదువు సంధ్యలు కూడా చెప్పించేవారు. పెద్దయ్యాక కూడా చాలా కాలం పాటు ఆ క్లబ్ లో అంజలీదేవి గారూ శాశ్వత కళాకారిణిగా కొనసాగారు. ఆదినారాయణ రావు గారూ అంజలీదేవి గారి నాన్నగారికి ఆప్తమిత్రుడు కావడంతో అంజలీదేవి గారిని నటిగా తీర్చిదిద్దమని అంజలీదేవి గారి నాన్నగారూ ఆదినారాయణ రావు గారికి అప్పగించారు. చివరికి ఆదినారాయణ రావు గారూ అంజలీదేవి గారి జీవిత భాగస్వామి అయ్యారు. అలా నాటకా అనుభవమే గాక అంజలీదేవి గారి జీవితానికి పునాది ఏర్పడింది.

సినీ ప్రస్థానం..

ఆదినారాయణ రావు గారి భార్య అంజలీదేవి గారూ “స్ట్రీట్ సింగర్స్” నాటకాన్ని కాకినాడలో ప్రదర్శిస్తున్నప్పుడు ఆ నాటకాన్ని చిత్తజల్లు పుల్లయ్య గారూ చూశారు. అంజలీదేవి గారిని గొల్లభామ సినిమాలో కథానాయికగా తీసుకుందామని అనుకున్నారు సి. పుల్లయ్య గారూ. కానీ అంజలీదేవి గర్భవతిగా ఉండడం వలన ఆదినారాయణ రావు గారూ ఒప్పుకోలేదు. కొన్ని రోజుల తరువాత యస్వియార్ గారి బంధువు రామనాథం “వరూధిని” సినిమా తీస్తున్నారు. ఆ చిత్రానికి సంగీతం దర్శకత్వం వహించడానికి రావలసిందిగా కోరారు. దానికి ఒప్పుకున్న ఆదినారాయణ రావు గారూ అంజలీదేవి గారిని కూడా సేలం తీసుకెళ్లారు. వరూధిని సినిమాకు సంగీతం దర్శకత్వంకు అగ్రిమెంటు వ్రాసుకున్నారు.

అంతలోనే పుల్లయ్య గారూ తీసే గొల్లభామ చిత్రానికి కథానాయికగా అంజలీదేవి గారూ ఎంపికవ్వడంతో ఆదినారాయణ రావు గారూ అంజలీదేవితో కలిసి మద్రాసు వెళ్లారు. వరూధిని సినిమా విషయంలో జరిగిన గొడవతో ఆ కాంట్రాక్టు అగ్రిమెంటును రద్దు చేసుకున్నారు ఆదినారాయణ రావు గారూ. అంజలీదేవి గారూ గొల్లభామలో కథానాయికగా చేశారు. ఆ చిత్రం అద్భుతంగా ఆడింది. ఆ చిత్రంలో ఆదినారాయణ రావుతో పుల్లయ్య గారూ ఒక పాట వ్రాయించారు. ఆ చిత్రంలో నటిస్తుండగానే నాలుగు సినిమాలలో అంజలీదేవి గారికి అవకాశం వచ్చింది. ఆదినారాయణ రావు పాత మిత్రుడు బి.ఏ.సుబ్బారావు గారూ దర్శక, నిర్మాణంలో ఎన్టీఆర్ కథనాయకుడిగా, అంజలీదేవి గారూ కథానాయికగా, ఆదినారాయణ రావు గారూ సంగీతం దర్శకుడిగా తీసిన “పల్లెటూరి పిల్ల” అద్భుతంగా ఆడింది.

అంజలీ పిక్చర్స్ స్థాపన..

అశ్విని పిక్చర్స్ 1949లో ఆదినారాయణ రావు గారూ, అక్కినేని నాగేశ్వరరావు గారూ, మేకప్ గోపాలరావు గారూ ముగ్గురి భాగస్వామ్యంలో ప్రారంభించారు. పూర్ణ మంగరాజు గారు ఆ సంస్థను ప్రోత్సహించి “మాయలమారి” అనే చిత్రం తీయించారు. ఆ చిత్రం మోస్తరు విజయం సాధించిన తర్వాత, అశ్విని పిక్చర్స్ మూతపడింది.

దాంతో అంజలి పిక్చర్స్ ను 1951లో స్థాపించిన పి. ఆదినారాయణ రావు గారూ మొదటి ప్రయత్నంగా పరదేశి అనే చిత్రాన్ని తెలుగు, అరవ భాషల్లో నిర్మించారు. ఈ చిత్రంతో శివాజీ గణేషన్ గారూ తెలుగు చిత్రాలకు పరిచయమయ్యారు.  ఈ చిత్రంతోనే స్లో మోషన్ ఫోటోగ్రఫీతో తెలుగు చిత్రాల్లో మొదటిగా దృశ్య నిర్మాణం జరిగింది. దీనికి కావలసిన కెమెరా కోసం బొంబాయిలో ప్రముఖ దర్శక నిర్మాత బి.శాంతారామ్ గారిని  “శుకరంభ” (హిందీ) చిత్రంలో అంజలీదేవి గారూ కథానాయకగా పనిచేస్తుండగా అభ్యర్థించారు.

శాంతారామ్ గారూ కెమెరాను అంజలీదేవి గారికి ఉచితంగా 15 రోజులు పాటు ఇచ్చారు. “పరదేశి” తర్వాత అనార్కలి, సువర్ణసుందరి, సుమతి, తుకారాం, క్షేత్రయ్య ఇలా సుమారు 25 చిత్రాలు నిర్మించారు. చిత్ర నిర్మాతగా కూడా ఆదినారాయణ రావు గారికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ముఖ్యంగా “సుమతి”లో హీరో పాత్ర కుష్ఠురోగి పాత్ర డీగ్లామర్ రోల్. అగ్రనటలు ఇద్దరు కాదన్నారు. సరే చూద్దామని కాంతారావు గారిని కలిసి బలవంతంగా ఒప్పించారు ఆదినారాయణ రావు గారూ. చిత్ర నిర్మాణానికి పూర్తిగా సహకరించి పరిపూర్ణ న్యాయం చేశారని ఆదినారాయణ రావు గారి సతీమణి నటి అంజలీదేవి గారూ చెప్పుకొచ్చారు.

అలాగే “తుకారం”లో శివాజీ పాత్ర ఎంతకు ఫైనల్ కాలేదు. ఒక అగ్రశ్రేణి నటుడే ధరిస్తాడని చెప్పుకుంటూ వచ్చారు. ఒకరోజు అంజలీదేవి గారూ, వారి భర్త ఆదినారాయణ రావు గారూ ఇరువురు శ్రీ శివాజీ గణేషన్ ని కలిశారు. విషయం చెప్పారు. శివాజీ గారూ వెంటనే ఒక షరతుతో తనే ఆ పాత్ర ధరిస్తాను అని ఒప్పుకున్నారట. నాకు పరదేశిలో మొదటిసారిగా అవకాశం ఇచ్చారు. మీకు సర్వతా కృతజ్ఞుణ్ణి కాబట్టి ఈ చిత్రానికి నాకు ఎలాంటి పారితోషికం వద్దు. అందుకని అంగీకరిస్తామంటేనే చేస్తాను అన్నారు. అందుకు అంజలీదేవి, ఆదినారాయణ రావు గారి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇలాంటి అనుభవాలు ఎన్నో.

సువర్ణసుందరి సినిమా..

ఆదినారాయణ రావు గారూ మిగతా సినిమాలకు సంగీతం దర్శకత్వం వహించకుండా తమ అంజలీ పిక్చర్స్ లో నిర్మించే చిత్రాలకు మాత్రమే సంగీతం దర్శకత్వం చేసేవారు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో అంజలీ పిక్చర్స్ వారు నిర్మించిన “అనార్కలి”. మంచి విజయం దక్కించుకున్న ఈ సినిమాలో “రాజశేఖరా నీపై మోజు తీరలేదురా”.. అనే పాటను ఉదాహరించకుండా తెలుగు సినిమాల్లో మంచి పాటల జాబితా పూర్తి కాదు. ఆ తరువాత వచ్చిన చిత్రం అత్యద్భుతమైన విజయం సాధించిన చిత్రం “సువర్ణ సుందరి”. మాయాబజార్ విడుదలయిన నెలరోజులకు “సువర్ణ సుందరి” వచ్చింది. మాయాబజార్ హవా నడుస్తున్న సమయంలో కూడా “సువర్ణ సుందరి” అద్భుతమైన విజయం సాధించింది. “పిలవకురా.. అలగకురా.. నలుగురిలో నన్ను ఓ రాజా”.. అనే పాట, “హాయి హాయిగా ఆమని సాగే” అనే పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇదే సినిమాను హిందీలో “స్వర్ణసుందరి” గా తీస్తే హిందీలో కూడా అద్భుతంగా ఆడింది.

పురస్కారములు..

బాంబే జర్నలిస్ట్ అసోసియేషన్ వారు “సువర్ణ సుందరి” చిత్రానికి గానూ నేషన్‌వైడ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డును ఇచ్చి సత్కరించారు.

1976 సంవత్సరంలో మహాకవి క్షేత్రయ్య అనే చిత్రానికి గానూ రెండవ ఉత్తమ చలనచిత్రం నంది అవార్డును (రజతం) గెలుచుకున్నారు.

ఆదినారాయణరావు అవార్డు

అంజలీ దేవి గారూ తన భర్త గారి జ్ఞాపకార్థం 2011లో ఆదినారాయణరావు గారి పేరుమీదుగా ఆదినారాయణరావు అవార్డును ప్రారంభించారు. సినీ రంగంలో విశేష సేవలు చేసినందులకు గుర్తుగా ఈ పురస్కారాన్ని ప్రారంభించారు. ఈ అవార్డును మొదటిసారిగా  కళాకారిణి, ప్రముఖ నేపథ్య గాయని పి. సుశీల గారు అందుకున్నారు.

మరణం..

1980 తరువాత అంజలీదేవి గారూ చిత్రాలలో నటిస్తున్నా కూడా, ఆదినారాయణ రావు గారూ సంగీత దర్శకునిగా విశ్రాంతి తీసుకున్నారు. భారతీయ సంగీతం గురించి సమీక్షించి, పాశ్చాత్య సంగీతం గురించి ఒక పుస్తకం వ్రాయాలనుకున్నారు. అమెరికా వెళ్లి పుస్తకాలు చదివి “భారతీయ సంగీత శాస్త్రము – ఆదినారాయణీయము” అనే పుస్తకాన్ని వ్రాశారు. కానీ అది ప్రచురణ అవ్వకముందే ఆదినారాయణ రావు గారు పరమపదించారు. 1991 జనవరి 25 నాడు మరణించారు. ఆదినారాయణ రావు గారు సంగీతం అందించిన చిత్రాలు 35 అయినా అద్భుతమైన సంగీతం, పాటలను అందించారు. ఆదినారాయణ రావు గారి రచన పుస్తకం “భారతీయ సంగీత శాస్త్రము – ఆదినారాయణీయము” ను అంజలీదేవి గారు 2002 జులై 10 మద్రాసులో అప్పటి తమిళనాడు గవర్నర్ రాంమోహన్ రావు గారి చేతులమీదుగా ఆవిష్కరింపజేసి అక్కినేని నాగేశ్వరావు గారికి అంకితం ఇచ్చారు. ఆ పుస్తకం ప్రత్యేకత ఏమిటంటే, తిరుపతి సంగీతం విశ్వ విద్యాలయంలో ఆ పుస్తకాన్ని వాళ్ళ పాఠ్య గ్రంథంగా కూడా నిర్ణయించారు. ఒక విధంగా ఆదినారాయణ రావు గారి కోరిక సఫలమయ్యింది.

Show More
Back to top button