Press Release
తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగ.. సంక్రాంతి.. ఈ పండుగ నేపథ్యంలో నగరాల నుంచి చాలావరకు తమ సొంతిళ్ళకు చేరుకుంటారు. ఈ సమయంలో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోవడం ఏటా చూస్తున్నాం. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే తాజాగా ఆరు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
కాచిగూడ- కాకినాడ టౌన్ స్టేషన్ మధ్య 4, హైదరాబాద్- కాకినాడ స్టేషన్ ల మధ్య 2 చొప్పున ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
కాచిగూడ నుంచి కాకినాడ టౌన్:
ఈ నెల 9న సాయంత్రం 8.30 గంటలకు కాచిగూడ ట్రైన్ (07653) నుంచి బయల్దేరి మరుసటి రోజు(10న) ఉదయం 8 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది.
అలాగే కాకినాడ టౌన్- కాచిగూడ రైలు (07654) ఈ నెల 10, 12 తేదీల్లో కాకినాడలో సాయంత్రం 5.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయాన్నే 4.30 గంటలకు కాచిగూడకు చేరుకోనుంది. ఈ రైళ్లు మల్కాజిగిరి, చెర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్ల మీదుగా కాకినాడకు చేరుకుంటాయి.
ఈ రైళ్లను 9 నుంచి 12వ తేదీ వరకు కాచిగూడ నుంచి కాకినాడకు, కాకినాడ నుంచి కాచిగూడకు మొత్తం నాలుగు ట్రిప్పులుగా నడపనున్నారు.
హైదరాబాద్- కాకినాడ స్టేషన్:
హైదరాబాద్- కాకినాడ పట్టణం రైలు నంబర్ (07023) తో 10వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్ (నాంపల్లి) నుంచి అందుబాటులో ఉండనున్న ఈ ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి బయల్దేరి సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట స్టేషన్‌ల మీదుగా బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది.
తిరుగు పయనంలో ఈ రైలు (07024) జనవరి 11వ తేదీన రాత్రి 8 గంటలకు కాకినాడలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
*జనవరి 9 నుంచి 12వ తేదీ మధ్య కాచిగూడ నుంచి వెళ్లే ప్రత్యేక రైళ్లకు బుకింగ్ సదుపాయం జనవరి 2న ఉదయం 8 గంటల నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.