Telugu Special Stories

అభినవ సాహిత్య బ్రహ్మ.. వేటూరి సుందర రామ్మూర్తి..

వేటూరి సుందరరామ మూర్తి (29 జనవరి 1936 – 22 మే 2010)

తెలుగు పాటకి సరికొత్త నడకలు నేర్పిన మహానుభావులు వేటూరి గారూ. పాటల్ని అత్యంత వేగంగా వ్రాయడంలో అందెవేసిన చేయి.

హాస్య గీతాలు కోసరాజు గారూ, యుగళ గీతాలు సి. నారాయణ రెడ్డి గారూ, వీణ పాటలు దాశరథి గారూ, గిమ్మిక్కులు ఉండే పాటలు వ్రాయాలంటే ఆరుద్ర గారూ, అతి తేలిక పదాలతో లోతైన భావాలు పొదిగే పాటలు వ్రాయాలంటే ఆత్రేయ గారూ, గ్రాంథిక పదాల పోహలింపు ఉన్న పాటలు వ్రాయాలంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారూ, విప్లవ గీతాలు వ్రాయాలంటే శ్రీశ్రీ గారూ.

ఇలా ఒక్కో కవికి ఒక్కో విభాగం ఉన్నవారిలా పాటలు వ్రాసేవారు. ఎటువంటి పాటయినా వేటూరి గారి కలం అలవోకగా జాలువారేది. శృంగారం, భక్తి, ముక్తి, రక్తి, విషాద గీతాలు, ప్రభోద గీతాలు, అచ్చ తెలుగు పదాలు అన్ని రకాల పాటలతో స్వర నాట్యం చేయించిన మహానుభావులు వేటూరి.

“ప్రతి భారత సతి మానం చంద్రమతీ మాంగల్యం” అంటూ మనసు పునాదులను కుదిపేసినా..

“పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు అల్లనమ్రోనికి తాకితే గేయాలు” అంటూ జలదరింప చేసినా..

“గుజ్జు రూపమున కుమిలిన కుబ్జను బుజ్జగించి లాలించి సొగసిడి, మజ్జగాలకు ముద్దబంతి”లా అంటూ జకార ప్రాసలతో పరవశింప చేసినా..

“మా జనని ప్రేమ ధమని” అంటూ కళ్ళను చెమరింపజేసినా..

“జగతికి సుగతిని సాధించిన తల దిగంతాల కవతల వెలిగే తల” అంటూ విన్యాసాలు చేసినా..

“నిన్నటి రైకల మబ్బుల్లో చిక్కిన చంద్రుళ్ళు” అంటూ శృంగారం రంగరించినా..

“అచ్చెరువున అచ్చెరువున” అంటూ ముక్కున వేలేయించినా..

“నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ” అంటూ సవ్యంగా వర్ణించినా అది వేటూరి గారికే చెల్లుతుంది.

జననం..

వేటూరి సుందర రామ్మూర్తి గారూ 29 జనవరి 1936 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా, దివితాలూకా లోని పెద్ద కళ్లేపల్లి గ్రామంలో జన్మించారు. ఈ పెద్ద కళ్లేపల్లిని పౌరాణిక కాలంలో కథళీపురం అని కూడా పిలిచేవారు. ఈ గ్రామంలో కృష్ణా నది ఉత్తర దిశగా ప్రవహిస్తూ ఉంటుంది. నాగేశ్వర స్వామి ఆలయం కూడా ఈ గ్రామంలో ఉంది. ఇలా ఉన్న దేవాలయంకు కాశీ క్షేత్రానికి ఉన్నంత ప్రభావం ఉంటుందట. అందుకే ఈ గ్రామాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. త్యాగరాజు గారి ముగ్గురు శిష్యులలో ఒకరైన ఆకుమళ్ళ వెంకట సుబ్బయ్య గారూ కూడా ఈ గ్రామానికి చెందినవారే. ఈ ఆకుమళ్ళ వెంకట సుబ్బయ్య గారూ సుసర్ల దక్షిణా మూర్తి శాస్త్రి గారికి సంగీతం నేర్పించారు.

ఈ సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారి మనుమడు సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి గారూ. సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారి శిష్యుడు పేరు పారుపల్లి రంగయ్య గారూ. ఈ పారుపల్లి రంగయ్య గారి శిష్యుడు పేరు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారూ. భావ కవిత్వానికి పునాది వేసిన కొడాలి సుబ్బారావు గారిది కూడా పెద్ద కళ్లేపల్లి గ్రామమే. ఘంటసాల వెంకటేశ్వరరావు గారూ మొట్టమొదట సంగీత పాఠాలు నేర్చుకొన్నది కూడా పెద్దకల్లేపల్లి గ్రామమే. యల్.యం.పి కోర్సు చేసిన వేటూరి గారి నాన్న గారూ చంద్రశేఖర శాస్త్రి గారూ నేత్ర వైద్యులుగా పనిచేస్తుండేవారు. సంస్కృతాంధ్రంలో ప్రావీణ్యం కలిగిన వేటూరి గారి అమ్మ కమలాంబ గారికి సంగీతంలో కొంత ప్రవేశం ఉండేది.

బాల్యం మరియు విద్యాభ్యాసం..

వేటూరి గారి తాతగారు వేటూరి సుందర శాస్త్రి గారూ. వీరి పేరునే వేటూరి గారికి పెట్టేశారు వాళ్ళ తల్లిదండ్రులు. వేటూరి గారి తాత గారికి కూడా సంగీతం, సాహిత్యం, వైద్యం, జ్యోతిష్యం, శిల్పకళా లాంటి కళలలో ప్రసిద్ధి చెందిన వారు. వీరి పెద్దబ్బాయి వేటూరి ప్రభాకర శాస్త్రి గారూ (వేటూరి గారి పెద్దనాన్న గారూ) తెలుగు సాహిత్యంలో తనదైన విశిష్టత నిలుపుకున్న చారిత్రక పరిశోధకులు. ఇలాంటి కుటుంబంలో జన్మించారు. కాబట్టి సాహిత్యం పట్ల వేటూరి గారికి యాధృచ్చికంగానే ఆసక్తి ఏర్పడింది. వేటూరి గారి నాన్న గారి వైద్య వృత్తి రీత్యా వారు విజయవాడ రావడం వలన, వేటూరి గారి ప్రాథమిక విద్య విజయవాడ లోని బీసెంటు రోడ్డులో గల ప్రాథమిక పాఠశాలలోనే కొనసాగింది. 

వేటూరి గారి తాత గారూ సుందర శాస్త్రి గారి సహాయంతో జగ్గయ్యపేటలో ఆయుర్వేదం నిపుణులుగా పనిచేసే ముక్త్యాల రాజా గారూ అక్కడి ప్రజలకు ఉచితంగా వైద్యం చేసేవారు. వారు వేటూరి గారి నాన్న గారిని జగ్గయ్యపేటకు పిలిపించారు. 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు జగ్గయ్యపేటలోనే చదువుకున్నారు వేటూరి గారూ. వేటూరి గారి అమ్మ గారి ఊరు గుంటూరు జిల్లాలోని కొల్లూరులో యస్.యస్.యల్.సి పూర్తిచేశారు. వేటూరి గారికి వాళ్ళ నాన్న గారూ సంస్కృతంలో రఘువంశం, కుమార సంభవం, మేఘధూతం లాంటివి నేర్పించారు. వాళ్ళ నాన్న గారికి  సాహిత్యం పట్ల ఉండే ఆసక్తి, వాళ్ళ అమ్మ గారికి సంగీతం అంటే విపరీతమైన అభిమానం వలన వేటూరి గారికి ఈ రెండింటిమీదా ఆసక్తితో బాటు, ఆకాశవాణిలో పాటలు వింటూ ఉండడంతో సంగీతం పట్ల ఎనలేని మక్కువ కలిగింది. కొల్లూరులో యస్.యస్.యల్.సి పూర్తిచేసిన వేటూరి గారిని ఇంటర్మీడియట్ చదువుకోసం మద్రాసు పంపించారు వాళ్ళ నాన్న గారూ. మద్రాసులో తెలిసిన వాళ్ళ ఇంట్లోనే వేటూరి గారిని ఉంచి కళాశాల చదివించారు వాళ్ళ నాన్న గారూ.

విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యరికంలో..

ఇంటర్మీడియట్ మద్రాసులో పూర్తిచేసిన వేటూరి గారూ డిగ్రీ చదువు కోసం తిరిగి విజయవాడకు వచ్చి యస్.ఆర్&సి.వి.ఆర్ ప్రభుత్వ కళాశాలలో బి.ఏ.ఎకనామిక్స్ పూర్తి చేశారు. వేటూరి గారికి గురువుగారు విశ్వనాథ సత్యనారాయణ గారూ. వీరు వేటూరి గారి పెద్దనాన్న వేటూరి ప్రభాకర శాస్త్రి గారికి సహాధ్యాయులు, మిత్రులు కూడానూ. అప్పుడప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారి ఇంటికి వెళ్తూ ఉండేవారు వేటూరి గారూ. విశ్వనాథ సత్యనారాయణ గారి వద్ధ పేరాల భద్రశర్మ గారూ ఉండేవారు. ఈ విశ్వనాథ సత్యనారాయణ గారూ తన కావ్యాలు, గ్రంథ రచనలు చెబుతూ వుంటే పేరాల భద్రశర్మ గారూ వ్రాస్తూ వుండేవారట. అదంతా గమనిస్తూ ఉన్న వేటూరి గారూ తాను కూడా ఇలా రచనలు చేసి మంచి పేరు గడించాలని అనుకునేవారట. 

విశ్వనాథ సత్యనారాయణ గారూ తన క్లాసుకే కాకుండా ఏ క్లాసుకు వెళ్లి పాఠాలు చెబితే, ఆ క్లాసులో కూర్చుని పాఠాలు వినేవారట వేటూరి గారూ. జొన్నలగడ్డ సూర్యనారాయణ మూర్తి గారూ అనే ఇంకో తెలుగు మాస్టారు చెప్పే పాఠాలు కూడా శ్రద్ధగా వినేవారు. వీరిద్దరూ చెప్పే పాఠాలు వినడం వలన వేటూరిలో కవితా పిపాసను పెంచడమే కాకుండా, కలం పట్టి చందోబద్ధమైన పద్యాలు, పాటలు, కవితలు వ్రాయడానికి దోహదం చేశాయి. డిగ్రీ చదువుతున్న రోజులలో ఒకసారి వేటూరి గారూ వాళ్ళ అమ్మమ్మ ఊరు కొల్లూరు వెళ్లారు. ఎన్టీఆర్ గారిని గుమ్మడి వెంకటేశ్వర రావు గారూ కొల్లూరు ఆహ్వానించి రచయిత చెరువు ఆంజనేయ శాస్త్రి గారి ఇంటివద్ధ భోజనాలు ఏర్పాటు చేశారు. గుమ్మడి గారి సహకారంతో వేటూరి గారూ ఎన్టీఆర్ గారిని కలిశారు. ఎన్టీఆర్ గారూ చదువుకున్న కళాశాలలోనే వేటూరి గారూ చదువుకుంటున్న విషయాలు చెప్పారు. ఎన్టీఆర్ గారికి గురువయిన విశ్వనాథ సత్యనారాయణ గారూ వేటూరి గారికి కూడా గురువు అవ్వడం వలన సంభాషణ చాలా సేపు సాగింది.

పాత్రికేయునిగా ఆంధ్ర ప్రభ పత్రికలో..

వేటూరి గారూ తన డిగ్రీ పూర్తయిన తరువాత లా చదవడానికి మద్రాసు వెళ్లారు. “లా” రెండవ సంవత్సరంలో వున్నప్పుడు వేటూరి కుటుంబానికి బాగా సన్నిహితులు అయిన ముక్త్యాల రాజా గారూ వేటూరి గారిని పిలిచి, సాహిత్యం రాసే అలవాటు ఉన్నందువలన జర్నలిజంకు వెళ్ళితే బావుంటుంది అని సలహా ఇచ్చారు. దాంతో వేటూరి గారూ 1956 లో పాత్రికేయునిగా తన ప్రస్థానం మొదలుపెట్టారు. ముక్త్యాల రాజా గారి సిఫారసుతో వేటూరి గారూ ఆంధ్ర ప్రభ దినపత్రికలో సంపాదకులుగా ఉన్న నార్ల వెంకటేశ్వర రావు గారి వద్ధ 1956 లో పాత్రికేయునిగా చేరారు. ఒకటిన్నర సంవత్సరాలు పనిచేశాక ఆంధ్రప్రభను విజయవాడకు మార్చేశారు. అందులో ఉద్యోగం చేసేవారు సమ్మెచేశారు. ఆ సమయంలో నార్ల వెంకటేశ్వర రావు గారూ రాజీనామా చేశారు. దాంతో వేటూరి గారూ కూడా అందులో ఉద్యోగం మానేశారు.

ఆంధ్ర సచిత్ర వార పత్రికలో…

ఆ తరువాత వేటూరి గారూ ఆంధ్ర సచిత్ర వార పత్రికలో చేరారు. వార పత్రిక కావడంతో శీర్షికలు వ్రాస్తూనే, సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు చేసేవారు. ఒక రోజు కొడవగంటి కుటుంబరావు గారూ వేటూరి గారిని ఎన్టీఆర్ గారి వద్ధకి తీసుకెళ్లారు. సీతారామ కళ్యాణం సినిమాపై “రామరావణీయం సీతారామ కళ్యాణం” అని వేటూరి గారూ వ్రాసిన సమీక్షను ఆ సందర్బంగా ఎన్టీఆర్ గారూ వేటూరి గారికి గుర్తు చేశారు. ఆ తరువాత ఒకసారి “తారకరామ నయనానందరూపం” అని ఎన్టీఆర్ పై అద్భుతమైన వ్యాసం వ్రాసారు వేటూరి గారూ. వీటిని గమనించిన ఎన్టీఆర్ గారూ వేటూరి గారిలో ఉన్న ప్రతిభను పసిగట్టేశారు. రాబిన్ హుడ్ అనే ఆంగ్ల నవలను పిల్లల కోసం సీరియల్ గా తెలుగులో వ్రాశారు వేటూరి గారూ. మధ్య మధ్యలో పాటలు కూడా జోప్పించారు. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది.  జీవనరాగం, అనురాధ డైరీ రెండు సీరియల్స్ కూడా వ్రాశారు. సచిత్ర వార పత్రికలో మానేసి తిరిగి ఆంధ్ర ప్రభ విజయవాడలో చేరి గుంటూరు వార్తలు వ్రాసేవారు.

ఎన్టీఆర్ గారి పరిచయంతో మలుపు తిరిగిన జీవితం..

ఒకసారి జవహర్ లాల్ నెహ్రూ గారూ శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించినప్పుడు వారిని వేటూరి గారూ ఇంటర్వ్యూ చేసి ఆంగ్ల ప్రసంగాన్ని తెలుగులో అద్భుతంగా అనువాదించారు.  గుంటూరు నుండి వేటూరి గారిని అసెంబ్లీ వార్తలను వ్రాయడానికి హైదరాబాదు పంపించారు. బి.వి.సుబ్బారెడ్డి గారూ అసెంబ్లీ స్పీకర్ గా వున్నప్పుడు శాసనసభ్యులను బస్సులో తీసుకొచ్చేవారు. ఆ దృశ్యం వీక్షించిన వేటూరి గారూ “అదిగో ద్వారక ఆలమందలవిగో” అనే వార్త వ్రాశారాట. అప్పట్లో అది వివాదాస్పదం అయ్యింది. ఆ తరువాత కొన్ని రోజులకు ఎన్టీఆర్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, సినిమాలో మాటలు వ్రాయడానికి మద్రాసు రావలసిందిగా వేటూరి గారిని కోరారు. దాంతో కాదనలేక మద్రాసు వెళ్లారు.

పెళ్లిపిలుపు అనే చిత్రానికి మాటలు వ్రాసే అవకాశం ఇచ్చారు. ఆ చిత్రానికి అప్పటికే ఆత్రేయ గారూ, ఆరుద్ర గారూ, సముద్రాల జూనియర్ గారూ ముగ్గురు కలిసి మాటలు వ్రాస్తున్నారు. ఆ చిత్రానికి ఎక్కువగా మాటలు వ్రాయడం కుదరలేదు. దాంతో ఎన్టీఆర్ గారూ ముగ్గురు నిర్మాతల వద్దకు పాటలు వ్రాయడానికి పంపించారు. వాళ్లకు అప్పటికే వ్రాసేవారు ఉండడంతో చేసేదిలేక ఎన్టీఆర్ గారికి చెప్పకుండా వచ్చేసి “ఆంధ్ర జనతా” పత్రికకు సంపాదకుడిగా చేరారు. ఆ పత్రిక వారు ఎన్టీఆర్ గారూ పాల్గొన్న సభకు వార్తలు వ్రాయడానికి వెళ్ళినప్పుడు, ముందు వరుసలో కూర్చున్న వేటూరి గారిని పిలిచి ఎన్టీఆర్ గారూ మందలించి మళ్ళీ మద్రాసు పిలిపించి తన సినిమాలో పాటలు వ్రాయాల్సిందిగా కోరారు. 

ఓ సీత కథతో ప్రారంభమైన సినీ ప్రస్థానం..

కోగంటి కుటుంబరావు గారి నిర్మాణంలో, ప్రత్యగాత్మ గారి దర్శకత్వంలో దీక్ష అనే చిత్రాన్ని తీశారు. ఆ చిత్రంలో ఒక యుగళ గీతం వ్రాయడానికి 1971 జనవరిలో సంక్రాంతి పండుగ ముందు రోజు 501 రూపాయలు అడ్వాన్సు ఇప్పించారు. ఆ చిత్రంలో “నిన్న రాతిరి కలలో సన్న చేసి సరసకు రమ్మని నిన్ను పిలిచినదెవరే చెలియా, వేయి పేరుల వాడే వాడు వేల వేల తీరుల వాడే పదారువేలున్న నారుల రేడే”   యుగళ గీతం వ్రాశారు. కానీ ఆ పాట రికార్డింగ్ కాకుండానే ఆగిపోయింది. ఆ తరువాత ఎన్టీఆర్ గారూ వేటూరి గారిని కె. విశ్వనాథ్ గారికి పరిచయం చేశారు. వేటూరి గారూ వ్రాసిన “శ్రీకాకొలను చిన్నది” నాటికను చూసి, వేటూరి గారి ప్రతిభను గుర్తించి “ఓ సీత కథ” లో హారికథ పాట వ్రాసే అవకాశం ఇచ్చారు. “భారత నారీ చరితము, మధుర కథా భరితము” అనే పాట వ్రాశారు. ఆ విధంగా తన సినీ ప్రస్థానంలో తొలి చిత్రం “ఓ సీత కథ” అని చెప్పుకోవచ్చు.

ఆ తరువాత “అమ్మ మాట”  అనే చిత్రంలో ఒక పాట వ్రాశారు. “సిరి సిరి మువ్వ”, “భక్త కన్నప్ప” లో అన్ని పాటలు వ్రాశారు. 1977 వ సంవత్సరంలో కె. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో ఎన్టీఆర్ గారూ నటించిన “అడవిరాముడు” కు పాటలన్నీ వేటూరి గారే వ్రాశారు. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. 1974 సంవత్సరం నుండి 2010 వరకు సుమారు 36 సంవత్సరాల పైబడి 5000 పైగా పాటలకు  రచన చేశారు.

ఓ సీత కథ, అడవి రాముడు, పంతులమ్మ, సిరి సిరి మువ్వ, గోరింటాకు, శంకరాభరణం, సప్తపది, మంచు పల్లకి, శుభలేఖ, ఖైదీ, మంత్రి గారి వియ్యంకుడు, మేఘసందేశం, ముందడుగు, సితార, రుస్తుం, అగ్ని పర్వతం, అన్వేషణ, చంటబ్బాయి, పడమటి సంధ్యా రాగం, ప్రతిఘటన, ఆఖరి పోరాటం, మరణ మృదంగం, గీతాంజలి, జగదేక వీరుడు అతిలోక సుందరి, చంటి, గ్యాంగ్ లీడర్, నిర్ణయం, ధర్మ క్షేత్రం, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, సుందరకాండ, గోవిందా గోవిందా, మాతృ దేవో భవ, మెకానిక్ అల్లుడు, సూపర్ పోలీస్, రాముడొచ్చాడు, ఇద్దరు, అన్నమయ్య, రావోయి చందమామ, చూడాలని ఉంది, బద్రి, అన్నయ్య, సఖి, బావ నచ్చాడు, మృగరాజు, ఠాగూర్, సింహాద్రి, ఆనంద్, అర్జున్, ఆర్య, యువ, ప్రేమిస్తే, చత్రపతి, గజిని, గోదావరి, సైనికుడు, మధుమాసం, హ్యాపీ డేస్, దశావతారం, కంత్రి, సుందరకాండ, బెండు అప్పారావు RMP, వరుడు, లీడర్, సింహా, విలన్, బద్రీనాథ్, సూర్య S/o కృష్ణన్, అభి, బస్ స్టాప్ లాంటి అనేక చిత్రాలకు రచనలు చేశారు వేటూరి గారూ.

పురస్కారములు..

“పంతులమ్మ” చిత్రంలోని “మానస వీణా మధుగీతం” అనే పాటకు గానూ 1977 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ సాహిత్యంకు నంది పురస్కారమును అందుకున్నారు.

1979 లో శంకరాభరణం చిత్రం నుండి శంకరా నాదశరీరాపర   అనే గేయానికి సాహిత్యం అందించినందుకు గానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉత్తమ సాహిత్య నంది పురస్కారమును బాహూకరించింది.

“కాంచన గంగ” చిత్రంలో “బృందావని ఉంది” అనే గీతానికి చక్కటి సాహిత్యం అందించినందుకు గానూ 1984 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ నంది పురస్కారాన్ని స్వీకరించారు.

1985 సంవత్సరానికి గానూ “ప్రతిఘటన”           చిత్రంలోని “ఈ దుర్యోధన దుశ్శాసన” పాటకు గానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఉత్తమ సాహిత్యం నంది పురస్కారాన్ని దక్కించుకున్నారు.

“చంటి” చిత్రంలోని “పావురానికి పంజరానికి” అనే గీతానికి గానూ 1991 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ సాహిత్య నంది అందుకున్నారు.

“రాజేశ్వరి కల్యాణం” చిత్రంలోని పాటలకు  సాహిత్యం అందించినందుకు గానూ 1992 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ సాహిత్యం నంది పురస్కారాన్ని  చేజిక్కించుకున్నారు.

మనస్విని అవార్డులు

“మాతృదేవోభవ” చిత్రంలోని “వేణువై వచ్చాను భువనానికి” అనే గీతానికి అద్భుతమైన సాహిత్యం అందించినందులకు గానూ 1993 వ సంవత్సరంలో మనస్విని పురస్కారం లభించింది.

1992 వ సంవత్సరానికి గానూ సుందరకాండ అనే చిత్రంలోని ఆకాశాన సూర్యుడుండడు సంధ్యవేళకి అనే పాటకు సాహిత్యన్ని అందించినందుకు మనస్విని పురస్కారం వరించింది.

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు..

“గోదావరి” చిత్రంలో ఉప్పొంగెలే గోదావరి అనే పాటకు సాహిత్యాన్ని అందించినందుకు గానూ 2006 వ సంవత్సరంలో  ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు.

వేటూరి గారికి 2008 వ సంవత్సరానికి గానూ, ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును స్వీకరించారు.

వేటూరి గారూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సాహిత్యం మరియు సినిమాలకు చేసిన కృషికి గానూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 23వ స్నాతకోత్సవంలో వారిని గౌరవ డాక్టరేట్ బిరుదునిచ్చి సత్కరించారు.

2007 సంవత్సరానికి గానూ జంధ్యాల స్మారక పురస్కారాన్ని వేటూరి గారూ అందుకున్నారు.

జాతీయ పురస్కారములు..

మాతృదేవోభవ చిత్రంలోని “రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే” పాటకు గానూ ఉత్తమ సాహిత్యానికి వేటూరి గారూ జాతీయ చలనచిత్ర అవార్డును దక్కుంచుకున్నారు. విప్లవ కవి శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) గారి తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ తెలుగు చలనచిత్ర గేయ రచయితగా నిలిచిపోయారు. అయితే 2006 సంవత్సరంలో, భారత ప్రభుత్వం తెలుగు భాషకు శాస్త్రీయ భాష హోదా ఇవ్వకపోతే జాతీయ అవార్డును తిరిగి ఇచ్చేస్తానని వేటూరి గారూ ప్రకటించారు.

2008 సంవత్సరంలో భారత ప్రభుత్వం తెలుగును శాస్త్రీయ భాషగా ప్రకటించింది.

మరణం..

వేటూరి గారూ ఊపిరితిత్తులలో రక్తస్రావంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. రెండు రోజులుగా వైద్యం చేస్తున్నా కూడా ఫలితం లేక వేటూరి గారి ఆరోగ్యం పూర్తిగా క్షీనిస్తూ వచ్చింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి వైద్యం చేసినా శరీరం సహకరించలేదు. దాంతో 22 మే 2010 నాడు తన 74 సంవత్సరాల వయస్సులో భారత స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు మరణించారు.

వేటూరి గారి కలం నుండి జాలువారిన కొన్ని పాటలు…

” యే కులము నీదంటే గోకులము నవ్వింది, మాధవుడు, యాదవుడు మాకులమే లెమ్మంది “

సాగర సంఘమం చిత్రం లోని ” తకిట, తదిమి తందాన, హృదయ జతుల గతుల థిల్లాన “

” రాగాలా పల్లకిలో కోయిలమ్మ, రాలేదు ఈవేళ ఎందుకమ్మ ….”,

” ఝుమ్మంది నాదం, సై అయ్యింది పాదం, తనువూగింది ఈవేళ …. “,

” నెమలికి నేర్పిన నడకలివీ, మురళికి అందని పలుకులివీ … “

” జిలిబిలి పలుకులు పలికిన మైన …. “,

” ఉప్పెంగె గొదావరి …. “

“ఎల్లువచ్చి గొదారామ్మ యెల్లా కిల్లా పడ్డాదమ్మ …. “

” నువిట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్ట …. నీకిట్టా నాకిట్టా రాసుంటే ఇంకెట్ట …. “

” యమహా నగరి కలకత్తా పురి, నమహో హుగిలీ హౌరా వారధి, చిరు త్యాగరాజు నీ కృతి పలికెను మది “

” కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నల పైటేసి

విశ్వనాధ పలుకై

అది విరుల తేన చినుకై, కూనలమ్మ కులుకై

అది కూచిపూడి నడకై “

” కృషి ఉంటే మనుషులు ౠషులౌతారు, మహా పురుషులౌతారు, తర తరాలకి తరగని వెలుగులౌతారు, ఇలవేలుపులౌతారు…”

” కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి …. “

” నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా …. “

” తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, మదిలో రేగాయి ఎన్నొనో కధలు …. ” వంటి మధుర గీతాలను అందించారు వేటూరి గారూ.

ఆత్రేయ గారు రచించిన – ” నేని దరినీ నువ్వా దరినీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ ” – వేటూరి గారికి ఇష్టమైన పాటలలో ఒకటి.

తాను వ్రాసిన పాటలలో వేటూరి గారికి ఇష్టమైన పాట – ” వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోయాను గగనానికి “.

ఇలా పాటలలో నిండు తెలుగుదనం చాటారు – ఈ సినీ పదబ్రహ్మ – వేటూరి. ఓ సందర్భంలో – ఎన్ టి ఆర్ గారూ “వేటూరి గారు ధన్యులు, ధన్యజీవి” అని శ్లాఘించారు.

Show More
Back to top button