
తెలుగుమాసాల్లో నాలుగో మాసం ఆషాఢం. పూర్ణిమనాడు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలకు దగ్గరగా చంద్రుడు సంచరించే కాలాన్నే ఆషాఢంగా భావిస్తాం. హిందూ సంప్రదాయం ప్రకారం, ఈ మాసంలో వివాహ శుభకార్యాలేవీ తలపెట్టరు.. పుణ్యకార్యాలకు అనుకూలం కాకపోవడంతో నిషిద్ధ మాసంగా, శూన్యమాసంగా పిలుస్తారు. కానీ ఆధ్యాత్మికంగా మంచి మాసమనే అంటారు.
జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు..
తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత క్షేత్రం.. చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పూరీ జగన్నాథుని ఆలయం.. ఈ ఆలయంలో ఏటా ఆషాఢ మాసంలోనే జగన్నాథ రథయాత్రను నిర్వహిస్తారు. ఈ క్రతువులో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా లక్షలకొద్దీ భక్తులు రావడం గమనార్హం. ఈ ఏడాది, జూన్ 20న జరగనున్న రథయాత్ర, ఆషాఢ మాస ఇతర విశిష్టతల్ని ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం:
ఆషాఢం నెలంతా పండుగలే…
ఆషాఢ శుద్ధ షష్ఠిని స్కంద వ్రతంగా,
శుద్ధ సప్తమిని భానుసప్తమిగా భావిస్తాం.
ఆషాఢం శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశిగా చేసుకుంటాం. శ్రీమహావిష్ణువు శయనించే రోజు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. మఠాధిపతులు, పీఠాధిపతులు, సాధువులంతా కూడా చాతుర్మాస్య దీక్ష చేపట్టి కార్తీక శుద్ధ ఏకాదశి, అంటే నాలుగు నెలలపాటు దీక్షను పాటిస్తారు. ఆఖరిరోజున ఆలయాలకు వెళ్లి, దైవదర్శనం చేసుకోవడంతో ఈ దీక్ష పూర్తవుతుంది.
ఆషాఢం చతుర్దశి.. ఈరోజున భూలక్ష్మి అంశతో గోదాదేవి ఆవిర్భవించింది.
కావున శ్రీ వైష్ణవులందరూ గోదామాతను ఆండాళ్గా పూజించి, ఆ జగన్మాత రచించిన పాశురాలను పారాయణ చేసి, విశిష్టంగా ఆరాధిస్తారు.
ఆషాఢం పూర్ణిమనే వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమగా పిలుస్తాం. ఈరోజున శ్రీమన్నారాయణుడి అవతారమైన వ్యాసమహర్షిని విశేషంగా అర్చిస్తారు. విద్యార్థులు గురుపూజ చేసి, చదువులో రాణించాలని కోరుకుంటారు. విద్యతో పాటు.. గురుస్థానంలో నిలిచే దత్తాత్రేయ స్వామి, రాఘవేంద్రస్వామి, సాయి భగవానుడు, ఆదిశంకరులు, బృహస్పతిలను విశేషంగా పూజించి, జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటారు.
ఆషాఢ బహుళ సప్తమియే.. భోగ సప్తమి. చెట్టుచేమలకు పూజలు చేయడం, పంట పొలాల వద్ద జాతరలు నిర్వహించడం విశేషం.
బహుళ ఏకాదశి కామదా ఏకాదశి. కోరికలను తీర్చి, మోక్షాన్ని కలిగిస్తుందని విశ్వసిస్తూ జరిపే ఈ పర్వదినాన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు.
ఈ మాసంలో నెలంతా తెలంగాణ వ్యాప్తంగా బోనాలు చేయడం చూస్తుంటాం. ఆది పరాశక్తికి బోనాలు సమర్పించి, ప్రతి ఇంటి ఆడపిల్ల ఆశీస్సులు పొందడం విశేషం.
ఆషాడం.. గోరింటాకు!
గోరింటాకు ఇష్టపడని అమ్మాయిలుంటారా.. మానవ మాత్రులకే కాదు.. తల్లి గౌరీదేవికి కూడా గోరింటాకు అంటే ప్రీతి. ఈ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందనేది విశ్వాసం.
శాస్త్రీయంగా చూస్తే ఆషాఢంలో వచ్చే వర్షాల వల్ల జలుబు, జ్వరాలు, అంటువ్యాధులు సోకే అవకాశము ఎక్కువ కాబట్టి.. గోరింటాకు వాటిని నివారించి, సహజసిద్ధంగా రోగనిరోధకశక్తిని పెంచుతుందని అంటారు.
ఇకపోతే, చర్మరోగాలు, గాయాలు సైతం తగ్గుతాయి. పారాణిగా పెట్టుకోవడం వల్ల పాదాలు పగలవు. ఇలా అనేక ప్రయోజనాలున్నందువల్లే ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీ అయ్యింది.
పూరీ జగన్నాథుడి రథయాత్ర…
ఆషాఢశుద్ధ విదియనాడు జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమవుతుంది. జ్యేష్టమాసంలో వచ్చే పౌర్ణమి నాడు స్నానయాత్ర పేరుతో ఈ ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
అయితే ఈరోజున 108బిందెల నీటి ద్వారా దేవతామూర్తుల్ని విశేషంగా అభిషేకించడం జరుగుతుంది.
ఆ తరువాత స్వామికి జ్వరం వచ్చిందని చెప్పి, విశ్రాంతి పేరుతో రహస్య మందిరానికి తరలిస్తారు. అలా తరలించిన స్వామి
రహస్యమందిరం నుంచి బయటకు వచ్చిన రోజునే ఈ రథయాత్ర మొదలవుతుంది. జగన్నాథుడి రథయాత్రలో సాక్షాత్తు పూరి జగన్నాథుడే
గర్భగుడి దాటి బయటకు వచ్చి భక్తులను అనుగ్రహిస్తాడని ప్రతీతి. అలా వచ్చే స్వామితోపాటు సుభద్ర, బలభద్రులైన.. ఈ ముగ్గురి కోసం మూడు రథాలను తయారుచేయడం విశేషం. జగన్నాథుడి రథాన్ని ‘నందిఘోష’ అని పిలుస్తారు.
ఈ రథానికి మొత్తం 16 చక్రాలుంటాయి. రథయాత్రకు సరిగ్గా రెండు నెలల(అరవైరోజులు) ముందు అంటే, వైశాఖ బహుళ విదియనాడు.. సాగుతుంది.. అప్పటికే గుర్తించిన కొన్ని వృక్షాల దగ్గరకు బ్రాహ్మణులు చేరుకుని తగిన శాంతులు నిర్వహించిన పిమ్మట వాటిని 1072 ముక్కలుగా చేసి పూరీకి తరలిస్తారు. ఒక ప్రధాన పూజారీ, ఆయనతోపాటు తొమ్మిదిమంది ముఖ్య శిల్పులూ, వారి ఆధ్వర్యంలో పనిచేసే 125మంది పనివారు మూడు బృందాలుగా విడిపోతారు.
తిరిగి అక్షయతృతీయనాడు ఈ రథాల నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. అలా తయారయ్యే రథాల మీదే దేవతామూర్తులను అధిరోహిస్తారు.
ఆపై మూడుకిలోమీటర్ల దూరంలో ఉండే గుండీచా ఆలయం వరకూ ఊరేగిస్తారు. ఈ ఆలయం పేరు సైతం ఆనాటి మహారాజు భార్య అయిన గుండీచా పేరు మీదనే పెట్టడం జరిగింది.
ఈమె అప్పట్లో జగన్నాథుడూ, సుభద్ర, బలభద్రుడికోసం ప్రధాన ఆలయానికి దగ్గరగా ఒక మందిరాన్ని నిర్మించింది. అందువల్లే స్వామి అక్కడ ఆతిథ్యం స్వీకరించేందుకు వెళ్తాడని అంటుంటారు.
మళ్లీ దశమినాడు తిరుగు ప్రయాణం కావడంతో ఈ యాత్ర ముగుస్తుంది.
ఆలయ ప్రాశస్త్యం…
పూరీ జగన్నాథ క్షేత్రంలోని ప్రధాన ఆలయ గోపురం ఎత్తు దాదాపు నలభైఐదు అంతస్తుల భవనం అంత ఉంటుంది. దానిపైన జెండాను ప్రతినిత్యం మార్చడం ఇక్కడ కొన్ని వందల సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం.
మరో విశేషమేంటంటే, ప్రతి రోజూ కూడా ఓ పూజారి ఏ సాయం లేకుండానే అంత ఎత్తున ఉండే గోపురంపైకి ఎక్కి ఆ జెండాను మారుస్తాడట. ఆలయం నిర్మించినప్పటి నుంచే ఈ సంప్రదాయం మొదలైంది. ఒకవేళ ఎప్పుడైనా జెండాను మార్చకపోయినా, మార్చడం వీలు కాకపోయినా ఆలయాన్ని సుమారు 18 సంవత్సరాలపాటు మూసేయాలనేది ఓ నియమమట. ఆ జెండా కూడా వీచే గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంటుంది.
దీంతో పాటు మనకు ఆలయం నీడ అనేది అస్సలు కనిపించదు. అలాగే ఇక్కడి ప్రధాన గోపురం పైన, చుట్టుపక్కల కానీ పక్షులు తిరిగిన దాఖలాలు లేవు. అంతేకాదు.. ఇక్కడి ప్రధాన ఆలయ గోపురంపైన ఉండే ఓ సుదర్శన చక్రం.. పూరీ పట్టణమంతా కనిపిస్తుందనీ, అది ఎక్కడి నుంచి చూసినా.. భక్తులకు అభిముఖంగానే కనిపిస్తుందని పూరీ వాసులు చెబుతుంటారు.
ఆలయంలోకి వెళ్లిన భక్తులకు జగన్నాథుడు.. ఆయన తోబుట్టువులైన సుభద్ర, బలభద్రుడితో కలిసే దర్శనమిస్తాడు. ఈ విగ్రహాలను ప్రతి ఎనిమిది, పదకొండు, పందొమ్మిది సంవత్సరాల కాలవ్యవధిలో.. నవకళేబర ఉత్సవం పేరుతో తీసేసి.. కోయిలీ వైకుంఠం అనే చోట ఖననంచేస్తారు. మళ్లీ కొత్తవాటిని ప్రతిష్ఠిస్తారు. ఈ ప్రక్రియ కూడా రహస్యంగానే సాగుతుందట.
తిరిగి ఆషాఢ బహుళ చతుర్దశినాడు అర్థరాత్రి దాటాక ప్రధానార్చకులు కొత్త విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అంటే.. పాత విగ్రహాల లోపలి భాగంలో కొంత భాగాన్ని కొత్త విగ్రహాల్లోకి మారుస్తారు. దాన్నే బ్రహ్మపదార్థంగా పిలుస్తారు. ఈ తంతు సైతం ఒక సేవాయత్..
తన కళ్లకు గంతలు కట్టుకుని, చేతులకు పవిత్ర వస్త్రాలను చుట్టుకుని ఆ పదార్థాన్ని కొత్త విగ్రహాల్లోకి మారుస్తాడట.
ఇప్పటివరకు దాన్ని కళ్ళతో చూసిన వారు లేరంటే అతిశయోక్తికాదు. ఆఖరిసారి నవకళేబర ఉత్సవం 2015లో జరిగింది.
ప్రసాదం ప్రత్యేకం…
మనదేశంలోని ఆలయాల్లో ఉన్న అతిపెద్ద వంటిళ్లలోనే పూరీలోని రోసఘర ఒకటిగా చెప్పవచ్చు. ఇక్కడ ప్రతిరోజూ చేసే ప్రసాదాల్లో వృథాకావడం, తక్కువ అవ్వడం వంటి సంఘటనలు జరగలేదట.
32 గదులూ, 250 పొయ్యిలతో కూడిన వంటింట్లో ప్రసాదం వండేందుకు నిత్యం కొత్త కుండల్నే వినియోగిస్తారట. ఇక, ఈ ప్రసాదాల తయారీలో వెయ్యికిపైగా వంటవాళ్లు నిమగ్నమవుతారు.
ఆలయంలో రోజువారీ నైవేద్యాలే కాక అదనంగా ఛప్పన్భోగ్ అనే పేరుతో 56 రకాల ప్రసాదాలను స్వామివారికి నివేదించడం విశేషం.
అలా వండిన వాటన్నింటినీ ఆలయ సమీపంలోని ఆనందబజార్లో ఉంచుతారు. అక్కడినుంచి భక్తులు విడిగా ప్రసాదాన్ని కొనుక్కోవచ్చు.
ప్రతిరోజూ సుమారు పదివేలమంది కోసం చేసే ఈ ప్రసాదాలన్నీ సైతం ఏరోజు రుచిలో తేడా రాలేదట.
ఇతరాంశాలు…
*ప్రతి ఏటా రామకృష్ణ పరమహంస కోల్కతాలో బలరామ్ బోస్ అనే శిష్యుడి ఇంట్లో జగన్నాథ రథ యాత్రను నిర్వహించి, ప్రసాదాన్ని స్వీకరించేవారట.
*రుతువు ప్రకారం.. వర్షరుతువు ఆసన్నమయ్యే కాలమిది. వాతావరణ మార్పుల వల్ల క్రిమికీటకాలు, పురుగులు ఎక్కడికక్కడే పుట్టుకొస్తాయి.
వాటివల్ల మనుషులకి, పశుపక్ష్యాదులకీ కూడా అనారోగ్యం వాటిల్లే అవకాశముంది. ఈ మాసంలో తరచూ అభ్యంగనస్నానం చేయకూడదంటారు.
అలాగే గర్భిణులు సైతం ఆషాఢంలో మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతారు.
*ఆషాఢం సముద్ర, నదీ స్నానాలకు ప్రసిద్ధం.
*ఈ నెలలో ఇల్లు కడితే/ గృహ ప్రవేశం చేస్తే, ఆ గృహస్థుకు ధనధాన్యాలు, పశువులు, రత్నాలు ప్రాప్తిస్తాయని మత్స్యపురాణం చెబుతోంది.
*ఆషాఢంలో ఇత్తడి, కంచు, బంగారు, వెండిలాంటి లోహ వస్తువులను శుభ్రం చేయడం ఆచారం.
*గంగానది జలం, బృందావనంలోని మట్టి, జగన్నాథుడి ప్రసాదం- ఈ మూడూ పరమాత్మ స్వరూపాలు’గా భావిస్తారు.
జగన్నాథుని దర్శిస్తే జన్మరాహిత్యం కలగడమే కాక, జనన మరణాలనే చక్రభ్రమణం నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు ఎక్కువగా నమ్ముతారు.