Telugu Special Stories

దివ్యాంగుల్లో దైవత్వాన్నిదర్శించలేమా !

ఒక వ్యక్తి దీర్ఘ-కాలం పాటు శారీరక, మానసిక, మేధో లేదా స్పర్శ బలహీనతలు కలిగి సమాజంలో తమ సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోవడంలో విఫలం కావడాన్ని “దివ్యాంగులు, అంగవైకల్యం కల వారు లేదా వికలాంగుల” వర్గంగా చూస్తారు. ప్రపంచవ్యాప్తంగా 16 శాతం జనాభా వికలాంగులుగా జీవితాలను భారంగా గడుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 80 శాతం దివ్యాంగులు అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఉన్నారని, వీరిలో 46 శాతం వయోవృద్ధులు ఉన్నట్లు తెలుస్తున్నది.

ప్రతి ఐదుగురితో ఒక్క మహిళ, ప్రతి 10 మందిలో ఒక పిల్లాడు అంగవైకల్య వలయంలో చిక్కుకుంటున్నారు. దివ్యాంగుల్లో సగం మందికి వైద్య సదుపాయాలు అందడం లేదని, 70 శాతం మందికి వీల్‌చైర్‌ అవసరం ఉందని, 90 శాతం మందికి వినికిడి పరికరాలు అందవలసి ఉందని తేలింది.  పౌర సమాజంలో దివ్యాంగులు నిరాదరణ, వివక్ష, చిన్న చూపు, చీదరింపు, అగౌరవం లాంటివని ఎదుర్కొంటున్నారు. వీరికి అందవలసిన గుర్తింపు, గౌరవం, మానవ హక్కులు, ఉద్యోగ ఉపాధులు , నాయకత్వ అవకాశాలు అందడం లేదు. 

సమ్మిళిత సుస్థిర భవితకు దివ్యాంగులకు నాయకత్వ బాధ్యతలు:

దివ్యాంగుల సమస్యలను అధ్యయనం చేసిన ఐరాస-డబ్ల్యూహెచ్‌ఓ ప్రతి ఏట 03 డిసెంబర్‌న ప్రపంచ దేశాలు “అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం” జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. అంతర్జాత దినం – 2024 థీమ్‌గా “సమ్మిళిత సుస్థిర భవితకు దివ్యాంగులకు నాయకత్వ బాధ్యతలు అప్పగిద్దాం” అనబడే అంశాన్ని తీసుకున్నారు. సామాన్య జనానికి సమానంగా దివ్యాంగులకు వైద్య ఆరోగ్య సంరక్షణ చర్యలు వేగం పుంజుకోవాలని, ఈ దిశగా ఐరాస పలు సూచనలు, సలహా సహాయాలను అందించడానికి ముందుకు రావడం హర్షదాయకం. వికలాంగులను గౌరవించడం, విద్య అందించడం, సాధికారతను శక్తివంతం చేయడం, మానవ హక్కులను పరిరక్షించడం, దివ్యాంగ విజేతలను సన్మానించడం లాంటివి ఈ వేదికపై చర్చించడం కొనసాగుతున్నది. ప్రపంచ దివ్యాంగుల్లో 56 శాతం మహిళలు, 44 శాతం పురుషులు ఉన్నారు. దివ్యాంగుల్లో 69 శాతం వరకు గ్రామీణ జనాభా మాత్రమే ఉండడం గమనించారు. 

దివ్యాంగుల్లో విజేతలు :

భారత్‌లో దాదాపు 8 శాతం జనాభా వికాంగులుగా నమోదు అయ్యారు. దివ్యాంగుల్లో 21 రకాల వైకల్యాలు కనిపిస్తాయి. వీటిలో ముఖ్యమైనవిగా దృష్టి దోషం (అంధత్వం, మంద దృష్టి), వినికిడి లోపం (చెవుడు, వినికిడి మందగించడం), మాట్లాడలేక పోవడం (మూగతనం, మాట్లల్లో స్పష్టత కొరవడడం), నడక లోపం(లిప్రసీ చికిత్స పొందిన వారు, సెరిబ్రల్‌ పాల్సీ, మరగుజ్జు లోపం, కండరాల లోపం, ఆసిడ్ దాడి బాధితులు), మానసిక వైకల్యం, బహు అంగవైకల్యం, రక్త రుగ్మతలు(హిమోఫిలియా, తలసేమియా, సికిల్‌ సెల్‌ రుగ్మత), నరాల బలహీనత (మల్టిపుల్‌ స్లిరోసిస్‌, పార్కిన్‌సన్‌ వ్యాధి), ఇతర వైకల్యాలు వస్తాయి.

దివ్యాంగుల్లో 20 శాతం నడక లోపం, 18.9 శాతం వినికిడి లోపం, 18.8 శాతం దృష్టి దోషం, 5.6 శాతం మానసిక వైకల్యం  కలిగిన వారు ఉన్నారు. వైకల్యాన్ని జయించి విజేతలుగా నిలిచిన భారతీయ ప్రముఖుల్లో శాస్త్రీయ నాట్యకారిణి సుధా చంద్రన్‌ (నడక లోపం), సంగీత దర్శకుడు రవీంద్ర జైన్‌ (దృష్టి దోషం), టివీ నిర్వాహకులు రామకృష్ణన్‌ (నడక లోపం), బ్యాడ్మింటన్‌ ఆటగాడు గిరీష్‌ శర్మ (నడక లోపం), క్రికెటర్‌ ప్రీతి శ్రీనివాసన్‌ (నడక లోపం), డాక్టర్‌ సత్యేంద్ర జైన్‌ (నడక లోపం), టెన్నీస్‌ క్రీడాకారుడు ప్రభు (నడక లోపం), స్కైడైవర్‌ విశ్వనాథన్‌ (నడక లోపం) పర్వతారోహకురాలు అరుణ సిన్హా (నడక లోపం)లాంటి పెద్దలు ఉన్నారు. 

వికలాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయాలు, ఉత్తమ జీవనశైలి అందించడం, అన్ని రంగాల్లో ప్రాధాన్యం ఇవ్వడం, ఉచిత విద్య, సామాజిక భద్రత, డిజిటల్‌ వనరుల అందుబాటు, సమాచార కల్పన, ఉచిత వైద్యం, దివ్యాంగుల హక్కుల సంరక్షణ, ఉచిత న్యాయ సేవలు, ఉద్యోగాల్లో తగిన రిజర్వేషన్లు లాంటి చేయూతను ఇవ్వడం ప్రభుత్వ పౌర సమాజ సనీస బాధ్యత అని తెలుసు కోవాలి.

దివ్యాంగుల్లో ఆనందాల వెలుగులు చూడాలి. వికలాంగుల సేవలు దేశాభివృద్ధికి తోడ్పడాలి. దివ్యాంగుల్లో దైవత్వాన్ని దర్శించాలి. మేం ఉన్నామనే భరోసాను ఇవ్వాలి. వికలాంగుల ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేయాలి. వారి వారి సామర్థ్యాలను బట్టి తగు అవకాశాలను కల్పించాలి. దివ్యాంగుల ముఖాలపై నవ్వుల పువ్వులు వికసించా విధం మానవ సమాజం స్పందంచాలి. 

Show More
Back to top button