Telugu NewsTelugu Special Stories

ఉత్సవ విగ్రహాలే.. ఊరేగింపుగా..పూరీ జగన్నాథుని రథయాత్ర..!

యావత్ భారత్ లో జరిగే అతిపెద్ద రథయాత్రల్లో ఒకటి.. మేటి.. పూరీలోని జగన్నాథస్వామి రథయాత్ర. ఈ యాత్ర చూడటానికి మన దేశం నుంచే కాక లక్షలాది మంది ప్రజలు ఇతర దేశాల నుంచి తరలి వస్తారు. ఈ ఆదివారం(జులై 7న) జగన్నాథుని రథయాత్ర సందర్భంగా ఆ యాత్రలో ప్రధానమైన రథం నిర్మాణం ప్రత్యేకతలు, మూల విరాట్ ఊరేగింపు విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం…

సకల లోకాలనూ పాలించే జగన్నాథుడు కొలువైన పుణ్యస్థలి పూరీ దివ్యక్షేత్రం. శ్రీమహావిష్ణువు జగన్నాథునిగా, ఆదిశేషుడు బలభద్రునిగా, పరాశక్తి సుభద్రగా, చక్రదేవత సుదర్శనమూర్తిగా కొలువై ఉన్న అద్భుత తీర్థం పూరీ జగన్నాథ ఆలయం. 

ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ పూరీ క్షేత్రం కొలువైంది. హిందూవులు అతి పవిత్రంగా భావించే ‘చార్ ధామ్​’ పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ ఆలయం ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటిల్లోకెల్లా ముఖ్యమైనది ఈ జగన్నాథ రథయాత్ర. ఆషాడ శుద్ధ విదియ, ఈ జులై 7న ప్రారంభమై, 12 రోజులపాటు కొనసాగుతుంది. ఆషాఢశుద్ధ విదియ రోజున ఆ దివ్యమూర్తులను రథంపై ఊరేగించడమే ఈ జగన్నాథయాత్ర. 

ఈ పూరీ దేవస్థానంవారు దాదాపు రెండు నెలల ముందు నుంచే ఈ యాత్రకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు.

సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా ఊరేగింపుకు ఉత్సవ విగ్రహాలను తీసుకువస్తారు. కానీ పూరీ ఆలయం రథయాత్రలో మాత్రం జగన్నాథ స్వామి బలభద్ర, సుభద్రలతో సహా ఏడాదికొకసారి గుడి నుంచి బయటకు వచ్చి రథయాత్రలో భక్తులకు దర్శనమిస్తారు. మూలవిరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొనడం వల్ల ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా, అమూల్యమైనదిగా భావిస్తారు భక్తులు.

  • మనం పూరీ అని పిలుచుకునే ఈ పుణ్యతీర్థాన్ని పురాణాలు ‘పురి’గా ప్రస్తావించాయి. సముద్ర తీరాన వెలసిన పూరీ ఆలయం, శ్రీకృష్ణ భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేసిన చైతన్య మహాప్రభువుకు దివ్యధామం ఇది. ఈ క్షేత్రానికి పరమశివుడే క్షేత్ర పాలకుడు. ఎనిమిది లింగమూర్తులుగా వివిధ దిశల్లో ఆయన కొలువై ఉన్నాడు. 
  • సాధారణంగా ప్రతి ఆలయంలో ఊరేగింపు సేవలో భాగంగా ఒకే రథాన్ని వినియోగించడం ఆనవాయితీ. కానీ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతి ఏటా కొత్త రథాన్ని తయారు చేయడం విశేషం.
  • ఇందుకోసం పూరీ రాజు వైశాఖ బహుళ విదియ నాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు. ఆయన ఆదేశం మేరకు ఆలయ ప్రధాన పూజారి అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు. 1072 వృక్ష భాగాలనూ నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా చేస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుని రథం తయారీకీ, 763 కాండాలను బలరాముడి రథ నిర్మాణానికీ, 593 భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తాడు.
  • తొమ్మిది మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు మొత్తం కలిపి 125 మంది కలిసి అక్షయ తృతీయనాడు రథ నిర్మాణం మొదలుపెడతారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణం పూర్తయి, యాత్రకు ముస్తాబు అవుతాయి. 
  • జగన్నాథుడి రథాన్ని ‘నందిఘోష’ అని, బలభద్రుడి రథాన్ని ‘తాళధ్వజం’ అని, సుభద్రాదేవి రథం ‘పద్మధ్వజం’ అని పిలుస్తారు.
  • చివరగా జగన్నాథుడి విగ్రహాన్ని భక్తుల జయధ్వానాల మధ్య ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకు వచ్చి నందిఘోష రథం మీద ఉంచుతారు. ఇలా మూడు విగ్రహాలనూ రథాలపై కూర్చోబెట్టే వేడుకను ‘పహాండీ’ అంటారు.
  • జగన్నాథుని నీలమాధవుడి రూపంలో అర్చించిన విశ్వావసు వారసులు మాత్రమే  మూల విరాట్టులను అంతరాలయం నుంచి బయటికి తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపజేస్తారు. విగ్రహాలను తరలించే సమయంలో కుల మత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు.
  • సుభద్ర, జగన్నాథ, బలభద్రులు యాత్రకు సిద్ధంగా ఉండగా పూరీ సంస్థానాధీశులు జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. ఈ వేడుకను ‘చెరా పహారా’ అంటారు.
  • లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుని రథం చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ‘ఘోష యాత్ర’ అంటారు. ఈ క్రమంలో రథ చక్రాల కింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణమో అడ్డువచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన వాటిని కూలగొట్టైనా సరే రథం ముందుకే వెళ్తుంది తప్ప ఎక్కడా ఆగదు.
  • జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ళ దూరంలో ఉండే గుండీచా మందిరానికి చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళతారు. 
  • వారం రోజుల పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమినాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని ‘బహుదాయాత్ర’ అని అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలూ జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడిబయటే ఉండిపోతాయి.
  • మరో విశేషం ఏంటంటే, శిల, లోహ విగ్రహాలకు భిన్నంగా పూరీ దేవాలయంలో దేవతామూర్తులు కర్రతో రూపుదిద్దుకోవటం విశేషం. దారువుతో (కొయ్య) తయారైనందువల్ల ఇక్కడి మూలమూర్తిని ‘దారుబ్రహ్మం’ అంటారు. ఈ విగ్రహాల శిల్పరీతి నిజంగా అమోఘం, అపురూపం.
  • ఇక్కడి దేవతలు వదన ప్రధాన దేవతలు. అంటే భావ ప్రకటనకు స్థానమైన ముఖాలే ప్రధానంగా ఉన్న విగ్రహాలు. ఈ ప్రతిమల్లో జ్ఞానేంద్రియాలే ప్రముఖంగా కనిపించటం విశేషం. వీటిని తొలుత చతుర్ముఖ బ్రహ్మ ప్రతిష్ఠించాడన్నది పురాణ వచనం. ఆయన విధించిన నియమాల ప్రకారం ప్రతి పన్నెండేళ్లకోసారి వచ్చే ప్రతి అధిక ఆషాఢంలో పూజారులకు కలలో కనిపించే విశేష దారువులను సేకరించి కొత్త విగ్రహాలను మలుస్తారు. పాత ప్రతిమల స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించటం ఆనవాయితీ. 

శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు బృందావనం నుంచి రాధ, గోపికలు వచ్చారు. అప్పుడు రుక్మిణీ సత్యభామలు శ్రీకృష్ణుడి బాల్యలీలలు చెప్పమని రాధాదేవిని అడగినప్పుడు… అప్పుడే అటుగా వస్తున్న బలరామకృష్ణులు, వారి సోదరి సుభద్ర ద్వారం వద్దనే నిలబడి రాధ మాటలు వింటూ చిత్తరువుల్లా నిలబడిపోయారు. అంతలో వచ్చిన నారద మహర్షి వారికి నమస్కరించి.. ‘ఈ దివ్యమైన ఆకృతులతో కలకాలం ఆరాధనలు అందుకోవాలని కోరుకుంటున్నాను’ అన్నాడు. ‘అటులనే!’ అని మునీశ్వరుడికి వరమిచ్చాడట కృష్ణుడు. ఆ వరానికి అనుగుణంగా.. ఆ రూపాల్లోనే వాసుదేవుడు తన సోదరుడు, సోదరితో పూరీ క్షేత్రంలో పూజలందుకుంటున్నాడనేది పురాణ కథనం. 

గర్భగుడిలో నిత్యం ఆరాధించే జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలను ఏటా రథోత్సవంలో ఊరిగేస్తూ భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తారు. ఆ సమయంలో పరమాత్ముడు స్వయంగా జనావళి మధ్య సంచరించి, ఈ రథయాత్రను చూసేందుకు దివి నుంచి దేవతలు దిగివస్తారని భక్తుల విశ్వాసం. 

Show More
Back to top button