
తెలుగు రాష్ట్రాల్లో బాగా సెలబ్రేట్ చేసుకునే పండుగుల్లో అసలు దసరా ఒకటి. అలాంటి దసరా ఎలా వచ్చింది? దీనిని ఏ విధంగా జరుపుకుంటారు? వంటి విషయాలు తెలుసుకుందాం. మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి వధించిన దుర్గాదేవి విజయానికి గుర్తుగా ప్రజలు ఈ దసరా చేసుకుంటారని చెబుతుంటారు. దేశంలో ఏటా జరిగే దేవీ నవరాత్రి ఉత్సవాలు చాలా ప్రత్యేకమైనవి. నవరాత్రుల్లో వీధులన్నీ దుర్గాదేవి మండపాలతో కళకళలాడుతాయి. ప్రజలంతా కలిసి ఈ సంబరాల్లో పాల్గొంటారు. పదోరోజు రావణ దహనంతో ఈ వేడుకలు మిన్నంటుతాయి. ఇలా ఏటా ఘనంగా ఈ వేడుకలను జరుపుకొనే ఆచారం మన భారత్లో ఎప్పుడు మొదలైందో తెలుసా?.. 14వ శతాబ్దంలో మొదలైంది. దేశంలోని ఇప్పటి దసరా సంబరాలకు మూలం విజయనగర రాజులు. ఆ తర్వాత ముస్లిం రాజుల పాలనలో కొంతకాలం వేడుకలు జరగలేదు. మళ్లీ 1610లో అప్పటి మైసూర్ రాజ్యానికి రాజు రాజా వొడయార్ ఈ వేడుకలను శ్రీరంగపట్నంలో ప్రారంభించారు. అదే క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించింది. మైసూరు దసరా వేడుకలకు ప్రత్యేక స్థానం ఉంది. నృత్యాలు, వివిధ వేషధారణలతో కళాకారులు చేసే కోలాహలం, ఏనుగు అంబారీ ఇలా పదిరోజుల పాటు అక్కడ జరిగే వేడుకలు అంబరాన్ని అంటుతాయి. ఈ ఏడాదితో ఈ వేడుకలు మొదలై 412 ఏళ్లు పూర్తవుతాయి.
మనం ఇప్పుడు దసరా అని పిలుచుకుంటున్న దసరా అప్పట్లో ‘మహానవమి’గా చేసుకునేవారట. దీని అసలు పేరు బన్ని ఉత్సవం.
దసరా రోజు రాళ్లతో యుద్ధం
కర్నూలు జిల్లాలోని వీపనగండ్లలో రాళ్ల యుద్ధం జరుగుతుంది. దసరా రోజున సాయంత్రం వేళలో ప్రజలు కాలువ ఒడ్డున అటూ ఇటూ చేరి కంకర రాళ్లను గుట్టలుగా పోసుకుని ఒకవైపు రామసేన, మరోవైపు రావణ సేనగా మారి రాళ్లు విసురుకుంటారు. ఇది అధర్మంపై ధర్మం యుద్ధం చేసి విజయం సాధించినట్లు భావిస్తారు.
18 గ్రామాల కొట్లాట
కర్నూలు జిల్లాలోని దేవరగట్టు గ్రామంలో దసరా ఉత్సవం భిన్నంగా జరుగుతుంది. మాలమల్లేశ్వరస్వామి విగ్రహం తమతమ గ్రామాలకు తీసుకువెళ్లేందుకు సుమారు 18 గ్రామాల ప్రజలు కొట్లాడతారు.
స్వామి విగ్రహాన్ని దక్కించుకునేందుకు వెదురుకర్రలతో కొట్టుకుంటారు. ఎంతోమంది గాయాలపాలవుతారు.
సీతారాముల కల్యాణం
తూర్పుగోదావరి జిల్లా పేరూరు గ్రామంలోని భీమభక్తునిపాలెంలో భిన్నంగా దసరా జరుపుకొంటారు. ఆ రోజు సీతారాముల కల్యాణం జరిపిస్తారు. ఉదయం కల్యాణం జరిపిస్తారు.
