
ఒక కవిగా, విప్లవకారుడిగా, గాయకుడిగా… కోట్లాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రజాయుద్ధనౌక.. ఆయనే గద్దర్.
తన గాత్రంతోనే ప్రజలను ఉత్తేజపరిచిన ప్రజాగాయకుడు గద్దర్…
నడుముకు తెల్లటిపంచె, ఒంటిపై నల్లటి గొంగడి, చేతికి కడియాలు, కాళ్లకు గజ్జెలు, తలకు ఎర్రటి వస్త్రంతో గద్దర్ ఎక్కడికి వెళ్లినా ప్రత్యేకంగా కనిపించేవారు. విద్యార్థి దశ నుంచే ప్రజాజీవితంలో సాగారు. తల్లి నుంచి జానపదాన్ని వారసత్వంగా అందిపుచ్చుకుని… ప్రజల ఆత్మీయ బంధువుగా మారారు.
ఈయన వల్లే జానపద పల్లెగానం కాస్త పరిణామం చెంది, విప్లవగీతంగా మారింది.
ఈ నెల 6(ఆదివారం)న తీవ్ర అనారోగ్యంతో 74 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఈ సందర్భంగా తెలుసుకుందాం…
జీవిత నేపథ్యం…
మెదక్ జిల్లాలోని గజ్వేల్ తాలూకాలోని తూఫ్రాన్ వీరి సొంతూరు. తండ్రి గుమ్మడి శేషయ్య, మేస్త్రీ. అమ్మ లచ్చుమమ్మ. తండ్రి పని నిమిత్తం కొన్ని ఊళ్లు తిరిగేవారట. ఎక్కువగా ఉత్తర్‌ప్రదేశ్‌లోనే పని చేశారు. “ఔరంగబాద్‌లో కట్టించిన మిళింద విశ్వవిద్యాలయం నిర్మాణంలో మా నాన్న మేస్త్రీగా పనిచేశారు. అప్పట్లో అంబేడ్కర్‌ని చాలా దగ్గర నుంచి చూశారు. ఆయన ప్రభావం నాన్నపై ఎక్కువగా ఉండేది. అందుకే తినడానికి తిండిలేకపోయినా పర్వాలేదు అనుకొని, మమ్మల్ని స్కూలుకే పంపాడు తప్ప కూలీకి పంపలేదు. సంతకం పెట్టడం రాకపోయినా హిందీ, మరాఠీ, ఉర్దూ… అన్ని భాషలూ చక్కగా మాట్లాడేవారు”. అంటూ తండ్రి గురుంచి ఓ సందర్భంలో చెప్పారు గద్దర్. గద్దర్ కు ఒక అన్నయ్య, ముగ్గురు అక్కాచెల్లెళ్ళు ఉన్నారు. వీరి ఇల్లు పక్కా పెంకుటిల్లు. ఆనాటి కాలంలో అంబేడ్కర్ మాటలతో స్ఫూర్తి పొందిన శేషయ్యగారు.. తన పిల్లలందరికీ సరస్వతి భాయ్, భారతి భాయ్, నరసింగరావు అని పేర్లు పెట్టుకున్నారు. అలా, గద్దర్ కు విఠల్‌రావు అని పేరు పెట్టారు. భార్య.. చైతన్యవంతురాలు. మరాఠీలో చక్కని పాటలు పాడటంతో పాటు జానపద, ఉద్యమ పాటలు కూడా పాడేవారు.
తూప్రాన్, నిజామాబాద్ జిల్లా బోధన్‌లలో ఉన్నత పాఠశాల విద్య పూర్తి అయ్యింది. గణితంలో 77% మార్కులు సాధించి, అనంతరం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ లో చేరారు. ఇదే సమయంలో గద్దర్ మొజాంజాహీ మార్కెట్ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం వరకు ప్రతిరోజూ నడుచుకుంటూ వెళ్లి చదువుకునేవారట. అంతేనా, హైదరాబాద్‌లోని డిల్లీ దర్బార్ హోటల్లో ప్రతిరోజూ రెండు గంటలపాటు సర్వర్‌గా పని చేసిన రోజులున్నాయి. దళిత్ పాంథర్, నక్సల్బరీ ఉద్యమాల ప్రభావం గద్దర్‌ను ఇంజినీరింగ్‌ను మధ్యలోనే విడిచిపెట్టేలా చేసింది. గద్దర్‌కు సతీమణి విమల, కుమారుడు సూర్యుడు, కుమార్తె వెన్నెల ఉన్నారు. రెండో కుమారుడు చంద్రుడు మరణించారు.
ఉద్యమ జీవితం….
1969 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగా పాల్గొనడమేకాక జైలుకు వెళ్లారు. మొదట కెనరా బ్యాంకులో క్లర్క్‌గా చేరిన గద్దర్.. 1984లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆరంభంలో అంబేడ్కర్‌పై, తర్వాత అల్లూరి సీతారామరాజుపై బుర్రకథలు చెప్పారు. ఆర్ట్ లవర్స్ అసోసియేషన్‌లో చేరి, తర్వాత ఉద్యమంలోకి వెళ్లారు.
తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో ప్రత్యేకంగా నిలిచారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పాటలు ఉద్యమానికి కొత్త రూపునిచ్చి ముందుకు తీసుకెళ్లాయి. ఉద్యమ సమయంలో గద్దర్ రాసిన పాటలు లేని కార్యక్రమం ఉండేది కాదంటే అతిశయోక్తికాదు.
మావోయిస్టు ఉద్యమనేత కొండపల్లి సీతారామయ్య. ఆయన పొలిటికల్ క్లాస్ విన్న తర్వాత గద్దర్ జననాట్య మండలిని స్థాపించి ఉద్యమంలోకి వెళ్లారు. ఎమర్జెన్సీ సమయంలో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో అజ్ఞాతంలో గడిపారు. ఆ సందర్భంగానే నాటి నక్సల్ నాయకుడు పరిటాల శ్రీరాములుతోనూ కలసి ఉన్నారు. ఎమర్జెన్సీ తర్వాత 45 రోజులు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఎమర్జెన్సీలో 1985 వరకు సాంస్కృతిక ఉద్యమం నడిపించి, 1990 దాకా అండర్‌గ్రౌండ్ ఉద్యమంలో పోరు సాగించారు.
1990 ఫిబ్రవరిలో ఆరేళ్ల అజ్ఞాత జీవితాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. 1996లో భువనగిరిలో ‘తెలంగాణ జనసభ’లో పాల్గొన్నారు. 1997 ఏప్రిల్ 6న ఆయనపై తూటాల వర్షం కురిసింది. తీవ్రంగా గాయపడినా కోలుకున్నారు. 2002లో నక్సల్స్‌తో ప్రభుత్వం జరిపిన చర్చలో నక్సలైట్ల ప్రతినిధులుగా వరవరరావుతో కలిసి గద్దర్ పాల్గొన్నారు. 2010 అక్టోబరు తొమ్మిదో తేదీన దాదాపు 107 ప్రజా సంఘాలతో కలిసి తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ను స్థాపించారు. రెండేళ్లు అధ్యక్షుడిగా కొనసాగారు.
*ఒగ్గుకథ, బుర్రకథ, ఎల్లమ్మ కథలను ప్రజలకు చెప్పే కళాకారుడిగా సాంస్కృతిక చైతన్యాన్ని ప్రారంభించిన గద్దర్ క్రమంగా ప్రజలు ఇతివృత్తంగా ఉండే సమస్యలు, వివక్షపై కలం ఝళిపించారు. కుటుంబ నియంత్రణ, కుల వివక్ష, అస్పృశ్యత, దోపిడీ, ప్రపంచీకరణ ప్రభావం, వెనుకబాటు తనం, పల్లెల అమాయకత్వంపై అనేక రూపాల్లో దాదాపు 600పైగా పాటలు పాడారు.
సినిమాల్లో ఉద్యమ పాటలు…
గద్దర్ సినిమాలో కూడా నటించారు. 45 ఏళ్ల క్రితం వచ్చిన మాభూమి సినిమాలో తొలిసారిగా గద్దర్ నటించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చరిత్ర సృష్టించిన ఈ చిత్రంలోని ‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి’ పాటలో యువకుడిగా గద్దర్ ఆడుతూ పాడిన పాట ఇప్పటికీ సంచలనమే.
ఓరేయ్ రిక్షా సినిమాలోని ‘మల్లెతీగకు పందిరి వోలే అనే పాట ఆల్‌టైమ్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో ఆర్. నారాయణమూర్తి ప్రధాన పాత్ర పోషించారు. ఈ పాటకుగానూ నంది అవార్డు లభిస్తే.. ఆయన దాన్ని తిరస్కరించారు.
2011లో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెరకెక్కిన ‘జై బోలో తెలంగాణ’ చిత్రంలోని ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా..’ అనే పాట ఉద్యమానికి మరింత జోష్ నింపింది.
ఈ పాటతో మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసి, మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించారని చెప్పాలి.
2019లో సుడిగాలి సుధీర్ నటించిన సాఫ్ట్వేర్ సుధీర్‌లో ‘మేలుకో రైతన్న..’ పాటను రాశారు. గద్దర్ చివరగా సత్యారెడ్డి స్వీయ దర్శకత్వంలో విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఉక్కు సత్యాగ్రహం చిత్రంలో కీలక పాత్రలో నటించారు.
ఇతారాంశాలు…
*ఊర్లో కులాలవారీగా వ్యత్యాసం ఉన్నప్పటికీ, మా కుటుంబాన్ని భిన్నంగా చూసేవారు. నిజానికి
ఊర్లో పిల్లలందర్నీ చదివించాలన్న భావన గద్దర్ నాన్నతోనే మొదలైంది కూడా.
*అసలు పేరు విఠల్ కాగా గద్దర్‌గా మార్చుకోవడానికి కారణం మాత్రం విప్లవం. విప్లవంలో పాల్గొన్న సమయంలో అసలు పేరు ఉండకూడదు.
బదులుగా వేరే పేరు ఉండాలి. పంజాబ్ నుంచి వెళ్లిన చాలామంది జాతీయవాదులు అమెరికా- కెనడాలో గద్దర్ పార్టీని పెట్టారు. భారతదేశంలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్లు అక్కడి నుంచి పోరాటం చేసేవారు. ‘గద్దర్’ అంటే పంజాబీలో విప్లవం అని అర్థం. అలా నా పేరును గద్దర్‌గా మార్చుకున్నా అని అంటారు గద్దర్… ఆ పేరుతోనే ప్రజలను చైతన్యపరిచే గొప్ప పాటలు రాశారు.
*గద్దర్ ఎక్కడికి వెళ్లినా పట్టుకెళ్లే కర్ర తన తండ్రిది. మొదట దానికి బుద్ధుడి జెండా ఉండేది.
ఇంజినీరింగ్ కాలేజీలో చేరాక ఎర్రజెండా చేరింది. అనంతరం జ్యోతిబాఫులేకు గుర్తుగా నీలం రంగును కూడా జత చేశారు.
ప్రపంచాన్ని పీడన నుంచి విముక్తి చేయడానికే కారల్‌మార్క్స్ జ్ఞాన సిద్ధాంతాన్ని తెచ్చారని, అందుకే ఎర్ర జెండా కట్టినట్లు చెప్పేవారు. ‘మార్క్స్ జ్ఞాన సిద్ధాంతం, ఫులే, అంబేడ్కర్ భావాలను కలపాలనేది’ తన వాదనగా వినిపించేవారు.
*ఆయన పాటలు అన్నిటిలో.. ప్రకృతిని ఎక్కువగా పోలుస్తూ చెబుతుంటారు. మహిళలపై ఎన్నో పాటలు రాశారు. ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై’ పాటకు నారాయణమూర్తి నటన ప్రధాన బలమైంది. అదే క్రమంలో నంది అవార్డు వచ్చినా దాన్ని తిరస్కరించారు..
విప్లవ ఉద్యమంలో ఉన్నవారు ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు, రివార్డులకు దూరంగా ఉండాలని ఆయన నియమం. దానికే కట్టుబడి ఉన్నారు.
*ప్రజాస్వామ్య తెలంగాణ రావాలనే లక్ష్యంతో ‘తెలంగాణ ప్రజా ఫ్రాంట్’ను స్థాపించారు గద్దర్. దానికి ఛైర్మన్ గానూ ఉన్నారు.
కాకపోతే అందులోని కొన్ని లుకలుకల వల్ల సరిగ్గా ముందుకు తీసుకు వెళ్లలేకపోయానని ఆవేదన చెందారు. తర్వాతి రోజుల్లో అది కొనసాగలేదు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ ఏడాది జూన్‌లో ‘గద్దర్ ప్రజా పార్టీని (జీపీపీ)’ స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. దిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు సైతం చేశారు.
*గద్దర్ తను పుట్టిన ఊరిపై ఒక పుస్తకాన్ని రచించాలని భావించారు. 2015లో నెల రోజులపాటు తూప్రాన్‌లోనే ఉండి పుస్తకం రాసేందుకు కార్యాచరణ మొదలుపెట్టారు. గ్రామంలో ప్రజల జీవన విధానంపై వీడియో చిత్రీకరిస్తూ సమాచారం సేకరించారు.
పూర్వం కులవృత్తుల వారు ప్రజలకు ఎలా సేవలు అందించేవారో ఆ తరహాలోనే పనులు చేయించి వీడియో చిత్రీకరించారు. ‘మై విలేజ్ ఆఫ్ 60 ఇయర్స్’ పుస్తకం రాయడం దాదాపుగా పూర్తయిందని, త్వరలోనే ఆవిష్కరిస్తానన్నారు. ఇంతలోనే ఆయన మృతి చెందారు.
*గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన తర్వాత… ఆయన అన్న మాటలివి… “నేను మళ్లీ వస్తా. ప్రజా సంక్షేమం కోసం సాంస్కృతిక ఉద్యమాన్ని తిరిగి ప్రారంభిస్తా అంటూ ప్రకటించారు గద్దర్.
అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో ఇటీవల గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారు. వెళ్లే ముందు కూడా పాటలు పాడి రికార్డు చేయించుకున్నారట.
అల్వాల్ లోని ఆయన ఇంటి దగ్గరలో అశేష అభిమానుల మధ్య సోమవారం రాత్రి 7 గంటలకు అత్యక్రియలు పూర్తయ్యాయి.
“గద్దర్‌ను ప్రజా యుద్ధనౌక(పీపుల్స్ వార్‌షిప్)” అని 1989లో ఒక సంపాదకుడు సంబోధించగా… అదే అనంతరం అదే బిరుదుగా మారింది.