Telugu Special Stories

స్మశానం నుండి ‘పద్మశ్రీ’ వరకు వెళ్లిన.. సింధూతాయి జీవితం అందరికి ఆదర్శం

రైల్వే స్టేషన్ లో బిక్షాటన చేసుకునే స్థితి నుంచి పద్మశ్రీ అందుకునే స్థాయి వరకు, చలికి గజగజా వణుకుతూ ఏం చేయాలో అర్ధం కాకపోతే స్మశానంలో శవాల దగ్గర పడున్న వస్త్రాలను తీసుకొని కప్పుకునే దుస్థితి నుంచి 750 కి పైగా సత్కారాలు, సన్మానాలు, పురస్కారాలు, అవార్డులు, శాలువాలు అందుకునే స్థాయివరుకు, తన పాపకు పాలిచ్చే శక్తి లేక ఒంట్లో ఓపిక లేక ఏం చేయాలో అర్ధం కాక తినడానికి తిండి లేకపోతే స్మశానంలో ఉన్న పిండితో రొట్టెలు చేసుకొని కాలుతున్న చితి మంటలపైన రొట్టె వేడి చేసుకొని దాన్ని తిని శక్తి పుంజుకొని తన పాపకు పాలిచ్చే దుస్థితి నుంచి 2000 మంది అనాధల్ని దగ్గర తీసుకొని వారికి భోజనం పెట్టి చదివించి, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా,  లాయర్లు గా చార్టర్డ్ అకౌంటెంట్ గా చేసి వాళ్ళను ఉన్నత స్థాయివరకు తీసుకెళ్లిన మదర్ ఆఫ్ ఆర్ఫన్స్ సింధుతాయి సక్పాల్ గురించి నేటి కథనంలో  తెలుసుకుందాం.

ధర్మం, సంస్కారం, ఓర్పు, దానగుణం, ఆత్మస్తైర్యం, గంభీరత, ఆప్యాయత మన భారత దేశం స్వంతం. ఎంతో మంత్రి పాతివ్రత్య స్త్రీలు ఈ పుణ్యభూమిని వారి త్యాగాలతో పావనం చేసి.. నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. మన దేశం నిండా మణులు మాణిక్యాల్లాంటి మగువలు ఎందరో. సమాజం తనను ఒంటరి దాన్ని చేసి.. అనుక్షణం క్షణక్షణం నరక ప్రాయాన్ని కలిగించేలా జీవితం మారినా చెక్కుచెదరకుండా, ధైర్యం వదలకుండా బాధలను, నొప్పిని దిగమింగుకొని అడుగుతీసి అడుగేస్తూ.. సమాజం తనను హీనంగా చూస్తున్నా,  నాలాంటి అభాగ్యురాళ్లు దేశంలో ఎందరో ఉన్నారని..

నాలాంటి కష్టం వారికి రావద్దని వాళ్ళను ఆదుకునే బాధ్యత తనదేనని మొక్కవోని దీక్ష చేపట్టిన భారతజాతి మణిమాణిక్యం, త్యాగశీలి, ఎందరికో అమ్మ..  సింధుతాయి సక్పాల్. కష్టాలకు మారుపేరు ఆనాటి సీతమ్మ. అయితే సీతను మించిన కష్టాలు, సీతను మించిన అవమానాలు ఎదుర్కొంది ఈనాటి సింధూ తాయి. ఆ నాడు రాముడు సీతమ్మ కోసం అడవిపాలు చేస్తే.. ఓ దుర్మార్గుడు చెప్పిన మాటలు విన్న భర్త కారణంగా దశాబ్దాలపాటు అజ్ఞాత జీవితాన్ని అనుభవించింది సీతమ్మ. వందలాది మందికి అమ్మ అయింది. పెంచింది పెద్ద చేసింది. గొప్ప ప్రయోజకులను చేసింది. ఏళ్ళ తర్వాత ఆకలితో వచ్చిన భర్తకు కూడా అమ్మగా మారి కడుపునింపింది. ఆ అమ్మ పూర్తి కథ సవివరంగా అవగతం చేసుకుందాం.  

పుట్టిన బిడ్డలందరి యోగక్షేమాలు దేవుడు ఒక్కడే చూడలేడు. కాబట్టి.. తన ప్రతినిధిగా అమ్మను సృష్టించాడని ఎంతో అపురూపంగా చెప్పుకుంటుంది ఈ ప్రపంచం. అయితే తమ కన్నబిడ్డలకే అమ్మలు అవుతున్నారు కానీ ప్రపంచానికే అమ్మలు అయ్యేంత ఔన్నత్యం, ఔదార్యం ఎంత మంది తల్లులకు ఉంటుంది. వేళ్ళమీద లెక్కపెట్టడం కూడా వీలు కాదు. అలా మాటలకూ అందని మమతానురాగాలు పంచి అమ్మతనపు మాధుర్యాన్ని అందించిన దేవతే ఈ సింధు తాయి సప్కాల్. జన్మనిచ్చిన అమ్మానాన్నలకు కాక, జీవితాన్ని ఇచ్చిన భర్తకు సైతం అమ్మగా మారి ఎవరూ కొలువలేనన్ని అనుభూతులు మిగిల్చి నిరాడంబరంగా నిష్క్రమించింది ఈ అమృత మూర్తి. అంతేనా ఈ అమ్మ జీవితకాలంలో దాదాపు 1100 మంది సంతానానికి తల్లి అయింది. 207 మంది అల్లుళ్ళు ,36 మంది మనువరాళ్లను కలిగిన ఆదర్శ మూర్తి, శ్రీమంతురాలిగా ఎంతో మంది జీవితాలను ఆదుకున్న అమ్మోరుగా ఖ్యాతి గడించింది. ఆమె గురించి తెలుసుకున్నా కొద్దీ ఒళ్ళు రోమాంచితం అవుతుంది.

అనేకమంది పిల్లలకు తల్లిగా మారిన సింధూతాయి సక్పాల్.. 1948 నవంబర్ 14న మహారాష్ట్రలోని వార్ధా జిల్లా పింప్రి మెఘే అనే గ్రామంలో పుట్టింది. తండ్రి అభిమాన్ జీ సాథే. ఆయన ఓ గోవుల గోపన్న. గోవులను కాస్తూ కుటుంబాన్ని పోషించుకునే అతి సాధారణ వ్యక్తి. అలాంటి పేద కుటుంబంలో పుట్టింది సింధూతాయి. ఇంట్లో అప్పటికే అధిక సంతానం ఉండటం, ఆ తర్వాత కూడా అమ్మాయి పుట్టడంతో సహజంగానే ఆమె కూడా చిన్నచూపుకు గురైంది. అందుకే ఈమెను చింది అనే నిక్ నేమ్ తో పిలిచేవారు.

చింది అంటే చిరిగిపోయిన గుడ్డ ముక్క. అలంటి సమయంలో సింధుకు పుట్టింట్లో ఎంతటిదుఃఖ పూరిత ఘటనలు జరిగాయో ఎవరైనా ఊహించచ్చు. తల్లి ఎప్పుడు ఈ సింధు ను చూసి కోపగించుకునేది. సరిగ్గా తిండిపెట్టేది కాదు. ఎప్పడూ తాహత్తుకు మించి అప్పగించేది. కన్నతల్లి అయి ఉండి సవతి కన్నా దారుణంగా చూసేది. అయితే తండ్రి మాత్రం అందుకు భిన్నం. సింధు మీద ప్రేమ చూపించేవాడు. అందరిని ఎంతో కొంత చదివించినట్లే సింధును కూడా కొంతమేర చదివించాలనుకొని బడికి పంపించాడు. ఎందుకంటే సింధుకు ఉండే గ్రాహ్య శక్తి తండ్రిని ఆకర్షించేది. అందుకని పశువుల్ని మేపడం కోసం అనే పేరుతో రహస్యంగా బడికి పంపించాడు. మొత్తానికి 4వ గ్రేడ్ పూర్తి చేసింది సింధు. 

ఆ తర్వాత పేదరికం కుటుంబ అవసరాలు పెరగటం వంటి అనేక కారణాలతో సింధు విద్య ఆగిపోయింది. ఆమె 12వ ఏడు వచ్చే సరికి అదే జిల్లాలోనే నవర్గావ్ అనే ఊరికి చెందిన శ్రీహరి సక్పాల్ కి ఇచ్చి వివాహం జరిపించారు. సింధుకు 20 ఏళ్ళు వచ్చే సరికి ముగ్గురు కొడుకులకు తల్లి అయింది. నాలుగో సంతానాన్ని గర్భంలో మోస్తుండగానే సింధు తాయి జీవితం అనుకోని భారీ కుదుపుకు లోనైంది. జీవితంలో ఎవరూ చూడనన్ని పాతాళాలు చూసింది. సింధుకి పెళ్లయ్యే నాటికి భర్త శ్రీహరి వయస్సు దాదాపు ఆమెకు మూడింతలు. ఆరోజుల్లో కడుపునింపుకోవడానికి చేతికి దొరికిన పని చేసేవారు.

అప్పట్లో అన్ని ఇండ్లలో ఆవులు ఉండేవి. ఊరూరికి రెండు మూడు ఆవుల మందలు ఉండేవి. వాటి పిడుకలనే వంట చేరుకుగా వాడుకునేవారు. అందరికి అవసరం అయిన పిడకల కోసం డిమాండ్ ఉండేది. దీంతో కడుపునింపుకోవడానికి పిడికలు ఏరి అమ్ముకునేవారు. అలా పిడకలు సేకరించే పనికి సింధూ కూడా వెల్తూ ఉండేది. ఏరిన పిడకల్ని బదులు 5 పైసాలో లేదా 10 పైసాలో ఇచ్చేవారు. అయితే కాంట్రాక్టర్లు, అటవీ అధికారులతో కుమ్మక్కై.. పిడకలు ఏరిన వారికి ముట్టాల్సిన డబ్బులు కొంత నొక్కేసేవారు. ఊరి ప్రధాన్ అంటే సర్పంచ్ ఆశీస్సులతో ఈ ఘనకార్యం జరుగుతుండేది. 

సర్పంచ్ ను ఎదిరించే సాహసం ఎవరూ చేసేవారు కాదు. అమాయకులైన వారు పిడికలు ఏరుతున్నా కూడా ఇలా వెట్టి చారికి తప్పేది కాదు. అయితే దీన్ని సింధూ తాయి జీర్ణించుకోలేకపోయింది. అన్యాయాన్ని ఎదురించింది. ఊరినుంచి పిడకలు బయటికి వెళ్లాలంటే

తమకు రావాల్సినంత సొమ్ము రావాల్సిందేనని.. అంతవరకు ఒక్క పిడక కూడా బయటికి వెళ్ళదని మిగితావారిని కలుపుకొని చిన్నపాటి ఉద్యమమే మొదలు పెట్టింది సింధు. ఆమె పంతానికి వార్ధా జిల్లా కలెక్టర్ వచ్చి పరిశిలన చేయక తప్పలేదు. సింధు విన్నవించుకున్నదానికి పూర్తిగా కన్విన్స్ అయిన కలెక్టర్.. పిడకలు ఏరే వారికి న్యాయం చేశారు. దీంతో సింధూ పేరు ఒక్కదారిగా ఊరందరికీ బాగా తెలిసిపోయింది. అదే సమయంలో ఆ ఊరి ప్రధాని ఎంత పాపిష్టివాడో బయటపడింది. అయితే పిడకలు ఏరుకునే అభాగ్యులకు న్యాయం చేసిన సింధు జీవితం మాత్రం అన్యాయం అయిపోయింది. కలెక్టర్ ముందు పరువు పోయిందని భావించిన  ప్రధాన్.. సింధు మీద పగబట్టాడు.

సింధు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు.  అందుకే ఆమె మీద తీవ్రమైన అబాండం మోపాడు. భర్త శ్రీహరి సక్పాల్ కు సింధు కడుపులో పెరుగుతున్న బిడ్డ తానేనని.. అక్రమ సంబంధం అంటగట్టాడు. బుర్రలో తీరని అనుమానం మసలుకున్న శ్రీహరి కనీసం ఏది నిజమో తెలుసుకోకుండా సింధూ తాయి పొట్టమీద గట్టిగ తన్నాడు. ఇష్టం వచ్చినట్లు ప్రతాపం చూపాడు. అతిదారుణంగా హింసించి తిండి పెట్టకుండా పశువుల కొట్టంలో పడేశాడు. దీంతో తీవ్ర ఆవేదనతో పురిటి నొప్పులతో ఆ ఆవుల మధ్య తీవ్రంగా ఏడుతోంది. ఈ క్రమంలో ఓ గోవు అన్ని గోవులను ఆమె దగ్గరికి రానివ్వకుండా కాపు కాసింది. తీవ్రమైన వేదనతో సింధు ఆ గోవుల మధ్య పండంటి ఆడపిల్లకు జన్మనించ్చింది. బొడ్డు పేగును అతికష్టం మీద పదునైన రాయితో ఆ పేగును కొట్టి తెంచింది. విపరీతమైన నొప్పిని పంటికింద బిగబట్టి తన బిడ్డను కాపాడింది. అనంతరం గోవును దగ్గరకు తీసుకొని ముద్దుపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. 

కట్టుకున్న భర్తే తనకు దూరం అవడంతో కన్నవారైనా తనను ఆదుకుంటారని గ్రహించి పుట్టింటికి చేరుకుంది. కానీ అక్కడ కూడా ఆమెకు ఆదరణ దొరకలేదు. సింధు తల్లి మొహం మీదనే తలుపులు వేసేసింది. కంటికి కనిపించకూడదని చెప్పింది. అటు కన్నబిడ్డ ఆకలితో ఏడుస్తుంది. బిడ్డకు కనీసం పాలు పట్టాలన్న తన కడుపులో ఏదైనా పడాలి. తాను బ్రతికితే తప్ప బిడ్డ ఆకలి తీరదు. అందుకని తాను బతకాలి అనుకుంది. ఏం చేయాలో అర్ధం కాక.. ఊరిబయట స్మశానం కనిపించింది. అక్కడ శవాలు కాలుతున్న మంటలే ఆమెకు దిక్సూచిగా తోచాయి. చుటూ చూస్తే ఎవరో ఆపకర్మలు చేసిన పిండాలు ఉన్నాయి. ఆ పక్కనే మిగిలిపోయిన బియ్యంపిండి, గోధుమ పిండి కనిపించాయి. ఆ పిండిని రొట్టెలుగా చేసి.. ఆ చితిమంటల్లోనే కాల్చుకొని కడుపునింపుకుంది. అలా స్మశానంలోనే ఓ కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది సింధూ. 

సిందూ కు పాటలు పాడటం వచ్చు. దేవుడు ఆమెకు మంచి గాత్రం ఇచ్చారు. అందువల్ల ఆ పాటల్నే నమ్ముకుంది. దేవాలయాల ముందు పాటలు పాడేది ఆమె పాడే పాటలకు భక్తులంతా  మైమరిచి పోయేవారు. కబీర్ దోహాలు, తులసి రామాయణంలోని ఘట్టాలు ఆమె పాటల్లో ఉండేవి. స్థిరనివాసంలోని సింధు.. ఒకచోటినుంచి మరో చోటికి వెళ్తూ ప్రజలకు తన పాటలతో దగ్గరయ్యేది. రైళ్లలో కూడా పాటలు పాడి బిక్షం ఎత్తింది. పాటలు పాడుతూ అడుక్కుంటూ ఒక స్తానం నుంచి మరో స్థానానికి వెళ్లడం ఆమెకు కొత్త అనుభూతిని ఇచ్చేది.

మరెంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రపంచం అంటే అత్తవారైల్లో తండ్రిగారిల్లు మాత్రమే కాదని.. అంతకన్నా ఎంతో విశాలమైన భావన కలిగి ఉంది. అలా తన భావ ప్రపంచాన్ని మరింత సువిశాలం చేసుకుంది. ఇప్పటికేవరకు తనకు ఎవ్వరు లేరు.. తాను కూడా తనకు ఎవ్వరు దగ్గర కాదని బతికింది. కానీ భిక్షం ఎత్తుకుంటూ తిరుగుతుంటే.. తనలాంటి భిక్షగాళ్లు ఎందరో ఉన్నారు. అలాంటిది వారికోసం తానెందుకు అమ్మ కాకూడదు అన్న అభిప్రాయం ఏర్పడింది. అప్పటికోసం ఆమె ప్రపంచం కోసం బ్రతకడం ప్రారంభించింది.

సింధు ప్రపంచం కోసం బ్రతకాలని అనుకున్నపుడు.. తన స్వంత కూతురు అందుకు ఆటంకంగా మారుతున్నట్లు గ్రహించింది. అందుకే తన కూతురిని ఓ ట్రస్ట్ కి అప్పగించింది. ఇక పాటలు పడటం అడుక్కోవటం కంటిన్యూ చేసింది. పాటలకు ప్రశంసలు కురిశాయి. పెద్దవాళ్ల దగ్గర నుంచి కూడా భారీగా డొనేషన్లు వచ్చాయి. ఆమె ప్రసంగాలకు చదువుకున్న వారు సైతం ఫిదా అయిపోయారు. అలా పైసా పైసా కూడబెట్టింది. పూణే లోని మంజేరిలో స్వంతంగా భూమి కొనుగోలు చేసి అనాధల కోసం సువిశాల మైన భవనాన్ని కట్టించింది. కేవలం తిండి పెట్టడమే కాదు తన దగ్గరున్న పిల్లలకు అన్ని వసతులు సమకూర్చే అసలైన అమ్మ అనిపించుకుంది. సకల వసతులతో కంప్యూటర్ రూమ్, సాంస్కృతిక కార్యక్రమాల కోసం పెద్ద హాల్, వంట అవసరాల కోసం భారీ సోలార్ సిస్టం. విజ్ఞానం పెంచుకోవడానికి లైబ్రరీ.

స్టడీ రూమ్ ఇలా ఎన్నో అధునాతల వసతులు సమకూర్చింది. వారిని ప్రయోజకులను చేసింది. ఆమె సంతానంలో ఎంతో మంది లాయర్లు, లెక్చరర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, IPS లను చేసి తీర్చిదిద్దింది. వారందరికీ సింధు తాయి దేవుడిచ్చిన అమ్మ. వాళ్ళెవరూ ఆనాధలు కాదు.. అమ్మ నీడన ఎదిగి ప్రయోజకులు అయ్యారు. ఒకటి కాదు ఎన్నో అనాధాశ్రమాలు నిర్మించారు సింధు తాయి. ఎంతో పవిత్రంగా తలపెట్టిన ఈ ఉద్యమాన్ని ఆమె సంతానంలోని 1100 మందిసంతానంలోనే చాలా మంది వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. 

సింధు తాయి అంటే ఒక వ్యక్తి కాదు. 200 పైగా అల్లుళ్లను తన ఇంటికి తెచ్చుకున్న మహా ఇల్లాలు. దాదాపు 40 మంది మానవరాళ్లతో జీవితానికి సరిపడిన ఆనందం స్వంతం చేసుకున్న అదృష్టవంతురాలు. ఆమె కృషి ఖండాంతరాలు దాటింది. దాదాపు 800 అవార్డులు (నారీశక్తి పురస్కారం, మదర్ థెరిసా అవార్డు, అహల్యాబాయి హోల్కర్ అవార్డు, సహ్యాద్రి హిర్కాని అవార్డు,రాజై అవార్డు, శివలీలా మహిళా గౌరవ్ అవార్డు) ఆమెను వరించాయి. ప్రధానిగా నరేంద్ర మోదీ హయాంలో ఆమె’ను పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసి దేశ ప్రజలకు ఆమె గురించి మరింత తెలిసేలా చేశారు. ఆమె జీవిత చరిత్ర గురించి మరాఠీలు మీ సింధు తాయి సక్పాల్’ అనే సినిమాను తీశారు. 2010లో వచ్చిన ఆ సినిమా 54వ లండల్ సినీ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. 

ఒకసారి ఓ ముసలి వ్యక్తి సింధు తాయి ఆశ్రమాన్ని వచ్చారు. అమ్మా ఆకలి వేస్తోంది. తినడానికి ఏమైనా పెట్టండి అని ఆర్తిగా అడిగాడు. 

అతనెవరో అమ్మ గుర్తించింది. ముఖంలో ఏ భావనా లేకుండానే దగ్గరుండి అన్నం పెట్టింది. భోజనం చేశాక.. ఇంత చేస్తున్న మీకు స్ఫూర్తి ఏంటి అని అడిగారు. అప్పుడు సింధు చెప్పింది. తన భర్త తనను వెళ్లగొడితే రోడ్డుమీద పడ్డాను. ఎన్నో కష్టాలుపడి యిప్పుడు ఈ స్థాయిలో చేరుకున్నాను అని చెప్పింది. ఆ ముసలి వ్యక్తే సింధు భర్త. తనను క్షమించమని వేడుకున్నాడు. అయితే సింధు మోహంలో ఏ వ్యతిరేక భావన లేదు. అష్ట్రమంలో ఉన్న అందరిని పిలిచి ఇతని పేరు శ్రీహరి సప్కాల్.  ఇతను తన కుటుంబంలో ఉన్న అందరికన్నా పెద్ద కొడుకని పరిచయం చేసింది. సింధు చూపిన భావనకు శ్రీహరి నిలువునా నీరైపోయాడు. ఆయన ఇప్పడు సింధుకు భర్త కాదు పెద్ద కొడుకు. తల్లి సింధు నిర్వహిస్తున్న అపూర్వమైన భాద్యతను తానుకూడా రవ్వంత మోసే ఓ చిన్న శ్రామికుడు మాత్రమే. సింధు తన ఆఖరి శ్వాస వరకు తన బిడ్డల ఆకలి తీర్చే ఓ మహా యజ్ఞాన్ని నిర్వహించింది. అనాధల కోసం తాను తలపెట్టిన మహాయజ్ఞంలో సింధు తాయి ఓ సమిధలా మారింది. 

దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ దీపం జనవరి 4, 2022న  ఆరిపోయింది. గొండెపోటు రావడంతో పుణెలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరిన సింధు(73).. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. సేవాచాటిన పేరుకోసం విరాళాలుగా వచ్చిన సొమ్ముకోసం ఆశపడి దేశంలో ఎన్నో ఆశ్రమాలు నడుస్తున్నాయి. చాలామంది అనర్హులకు కూడా ఎన్నో అవార్డులు వరించాయి. చాలా మంది సమాజ సేవకులు ఏదో ఒక ఫలితం ఆశించి ఆశ్రమాలు నడిపిస్తున్నారు. కానీ సింధు దేనిని కూడా ఆశించలెదు. అందుకే ఆమె వెలిగించిన దీపం అఖండంగా వెలుగుతూనే ఉంది. ప్రపంచంలోని అమ్మలు, నాన్నలు, భర్తలు అందరూ కలసిన అందుకోలేనంత ఎత్తుకు ఎదిగింది ఈ అమ్మ. కష్టాలను సైతం జయించి తన సేవతో ఎంతో మంది కన్నీళ్ళను తుడిచిన ఈ అమ్మ గురించి అందరికి తెలిసేలా ఈ కథనాన్ని షేర్ చేయాలని కోరుకుంటుంన్నాం.

Show More
Back to top button