ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని భారతదేశవ్యాప్తంగా ఓ వేడుకలా జరుపుకుంటున్నాం. స్వాతంత్ర్యం తరువాత భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజునే బాలల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి అయిన జవహర్‌లాల్ నెహ్రూ… అత్యధిక కాలం ప్రధానిగా సేవలు అందించారు. బ్రిటిష్ వలసవాదుల దోపిడీకి గురైన భారతావని నేడు ఆర్థికంగా పరిపుష్టి సాధించిందంటే అందులో నెహ్రూ దార్శనికత, ముందుచూపు కారణం. ప్రధానిగా ఆయన అనుసరించిన విధానాలు దేశం ఆర్థికంగా బలపడటానికి బలమైన పునాదులు వేశాయి.
ఆయన జన్మదినాన్ని ‘చిల్డ్రన్స్ డే’గా నిర్వహించుకోవడానికి బలమైన కారణం ఉంది. ప్రపంచ దేశాలన్నీ నవంబర్ 20న బాలల దినోత్సవం జరుపుకుంటాయి.. కానీ, ఒక్క భారత్‌లో మాత్రమే వారం ముందుగానే దీన్ని నిర్వహించుకుంటోంది.
నేపథ్యం..
1889 నవంబర్ 14న అలహాబాద్‌లో జన్మించారు జవహర్ లాల్ నెహ్రూ. వీరి కుటుంబీకులు కాశ్మీరు పండిత బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. తండ్రి
మోతీలాల్ నెహ్రూ. తల్లి స్వరూపరాణి. తండ్రి మోతీలాల్ అప్పట్లో ప్లీడరు పట్టా పొందారు. సొంతూరు కాశ్మీరు వదిలి పెట్టి, అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా చేరారు. అక్కడే “ఆనందభవన్” అనే పేరుతో చక్కని గృహాన్ని నిర్మించుకున్నారు. తర్వాతి రోజుల్లో భారత స్వాతంత్ర్యోద్యమంలో జాతీయ కాంగ్రెసు నాయకులు ఈ ఆనంద భవనాన్నే విడిది గృహంగా, కార్యవేదికగానూ మల్చుకున్నారు. పేరుమోసిన లాయర్ గా, అప్పటి సంపన్నుల్లో ఒకరిగా నిలిచారాయన.
నెహ్రూ ప్రాథమిక విద్య ఇంటి దగ్గర ప్రైవేటు ఉపాధ్యాయుల వద్దే నడిచింది. 15ఏళ్ల వయసులో ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్ కు వెళ్లారు. అప్పటి ఇంగ్లాండు రాజకుటుంబీకుల కుమారులతో సమానంగా, జవహర్ లాల్ కాలేజీ విద్యను పూర్తి చేశారు. గుర్రపుస్వారీ, ఈత అంటే ఎంతో ఇష్టం. జవహర్ అంటే, గులాబీ పుష్పం అని అర్ధం. తన పేరుకు తగినట్లుగానే జవహర్ ఎల్లప్పుడూ తన కోటుకు గులాబీ పుష్పాన్ని ధరిస్తూ ఉంటాడనీ ప్రతీతి. యుక్తవయసుకు రాగానే కమలతో వివాహం జరిగింది. అనంతరం లండన్ లో బారిస్టర్ పట్టా పొందారు. తిరిగి 1912లో భారత్ కి చేరుకున్నారు.
ఆనాడు అలహాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ గృహం.. ఆనందభవనం.. గాంధీజీ, తిలక్, అజాద్, పటేల్ వంటి జాతీయ నాయకులతో కిటకిటలాడుతూ ఉండేది. జాతీయోద్యమ కార్యక్రమాలు, చర్చలలో చురుగ్గా పాల్గొనేవారు నెహ్రూ. అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి కావటంతో.. పురాతన, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపట్ల అంతగా ఆసక్తి కనబరిచేవారు కాదు. మూఢాచారాలను వ్యతిరేకించేవారు. కారణం పాశ్చాత్య దేశాలలో ఎక్కువ కాలం ఉండటమే. అయితేనేం దేశదేశాల చరిత్రలను, సంస్కృతిని ఆకళింపు చేసుకున్నారు. ఈ కారణంగానే జాతీయ పోరాటంలో యువకులకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సమయంలో పలుసార్లు జైలుకు వెళ్లిన నెహ్రూ.. అక్కడ ఉన్నప్పుడే ‘గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ, ది డిస్కవరీ అఫ్ ఇండియా’ గ్రంథాలను రచించారు.
తొలిసారి 1929లో భారత జాతీయ కాంగ్రెస్‌కు నాయకత్వం వహించారు. 1936, 1937 తర్వాత 1946లలో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను నిర్వహించారు. జాతీయోద్యమంలో గాంధీజీ తర్వాత రెండో ప్రముఖ నాయకుడిగా అవతరించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాంగ విధానంలో సోషలిజంవైపు మొగ్గు చూపి, రష్యాతో మైత్రికి ప్రాధాన్యత ఇచ్చారు. చైనాతో పంచశీల ఒప్పందం.. అలీనవిధానం ప్రతిపాదించిన త్రిమూర్తుల్లో ఒకరిగా ప్రసిద్ధి చెందారు. పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించి దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు.
రెండువందల సంవత్సరాలుగా దేశం పరాధీనంలో ఉండి, ఆర్ధికంగా అస్తవ్యస్తమైన రోజులవి…. ఈస్టిండియా కంపెనీ, తదుపరి పాలన చేసిన బ్రిటిషు ప్రభుత్వం కూడా దేశాన్ని దోచుకుపోవడం.. ఈ దుస్థితిలో దేశాన్ని ఆర్థికంగా సుస్థిరం చేయడం అవసరమని ఆయన భావించాడు. అంతేకాకుండా దేశంలోని సంపద అంతా కొద్దిమంది చేతుల్లోకి చేరడం, ఎక్కువమంది నిరుపేదలుగా జీవించే పద్ధతిని మార్చి, సోషలిస్టు దృక్పథంతో దేశ ఆర్ధిక పరిస్థితిని పూర్తి స్థాయిలో చక్కదిద్దేందుకు ఆయన పూనుకున్నాడు. ప్రపంచ దేశాలన్నిటితో స్నేహసంబంధాలను పెంచి పోషించాడు. ఫలితంగా ప్రపంచ దేశాలకు రాజకీయ సలహాదారుగా భారత్ ను తీర్చిదిద్దిన గొప్ప నేతగా ఘనత సాధించారు.
ఇకపోతే ఈరోజుకు గల ప్రాధాన్యతకు కారణం.. నెహ్రూకు పిల్లలన్నా, గులాబీలన్నా అమితమైన ప్రేమ. అలా నెహ్రు ఎక్కడికెళ్లినా.. పిల్లలను వెతికి మరీ ఆప్యాయంగా పలకరించేవారు. వారికి కానుకలను ఇచ్చి ఉత్సాహపరిచేవారట. స్వాతంత్ర పోరాటంలో భాగంగా జైల్లో ఉన్నప్పుడు తన కుమార్తె చిన్నారి ఇందిరకు అనేక ఉత్తరాలు రాసేవారు. స్వతహాగా రచయిత అయిన నెహ్రు తన కుమార్తెకు రాసిన ఉత్తరాల్లో బోలెడు మంచి విషయాలను చెప్పేవారు. పిల్లలు ఎలా ఉండాలి? ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి? సమాజంలో మంచి, చెడులను ఎలా గ్రహించాలి? సమస్యలను ఎలా అధిగమించాలి వంటివి స్పష్టంగా చెప్పేవారు.
ఇలా నెహ్రూ నింపిన స్ఫూర్తి, ధైర్యంతో ఇందిర ‘ఉక్కు మహిళ’గా తయారవ్వటం వేరే విషయం. ప్రధానిగా పలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని దేశాన్ని ముందుకు నడిపారు. తన కుమార్తె ఇందిరకు నెహ్రు రాసిన ఉత్తరాలు నేటి తరానికి స్ఫూర్తి పాఠాలయ్యాయి.
పిల్లలకు కూడా పండిట్ నెహ్రూ అంటే ఎనలేని ప్రేమ. ఆయణ్ని ముద్దుగా ‘చాచా నెహ్రూ’, ‘చాచాజీ’ అని పిలుచుకుంటారు. ఇష్టమైన మేనమామ/ బాబాయి అని అర్థం. 1964లో నెహ్రూ మరణించిన తర్వాత ఆయన పుట్టినరోజును ‘బాలల దినోత్సవం’గా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. నాటి నుంచి నవంబర్ 14ను ‘చిల్డ్రన్స్ డే’గా మనం జరుపుకొంటున్నాం.
నిజానికి స్వాతంత్య్రానికి ముందు బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న అన్ని దేశాలతోపాటు నిర్వహించుకునేవాళ్లం. నవంబరు 20న చిల్డ్రన్స్ డే నిర్వహించాలని ఐక్యరాజ్య సమితిలోని సభ్యదేశాలు తీర్మానించాయి. 1964 వరకు భారత్ కూడా దీనినే అనుసరించినా నెహ్రు మరణం తర్వాత నుంచి నవంబర్ 14న చిల్డ్రన్స్ డే జరుపుకోవడం పరిపాటి అయ్యింది.
భారతదేశ రాజకీయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొని, దేశ పురోగతిని సాధించడంలో ముఖ్యభూమిక పోషించిన నేత. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సుదీర్ఘకాలంపాటు ప్రధానిగా కొనసాగారు.. భారతదేశ తొలి ప్రధాని, మేధావి, ప్రపంచ రాజనీతిజ్ఞుడు, రచయిత, చరిత్రకారుడు, భారతీయ రాజకీయ దురంధరుడుగా పేరుగాంచాడు.