
08 అక్టోబర్ “భారత వైమానిక దళ దినోత్సవం” సందర్భంగా అనుక్షణం దేశ సరిహద్దు రక్షణలో అసాధారణ సేవలను అందిస్తున్న భారత వాయు సేన లేదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) వ్యవస్థాపక దినోత్సవాన్ని 08 అక్టోబర్ 1932 నుంచి ప్రతి ఏట 08 అక్టోబర్న ఘనంగా పాటించడం ఆనవాయితీగా మారింది. దేశ సరిహద్దుల్లో భూతల సేనగా ఆర్మీ, గగన సేనగా వాయు సేన, సముద్ర జలాలపై నావికా సేన అనితరసాధ్యమైన దేశ భద్రతా విధుల్లో నిమగ్నమై, ప్రపంచ దేశాల రక్షణ దళాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ప్రతి ఏట 15 జనవరిన “ఇండియన్ ఆర్మీ డే”, 04 డిసెంబర్న “ఇండియన్ నావీ డే”, 07 డిసెంబర్న “ఇండియన్ ఆర్ముడ్ ఫోర్సెస్ డే”లను పాటించడం అనాదిగా జరుగుతున్నది. ప్రపంచ దేశాల్లో అతి శక్తివంతమైన రక్షణ వ్యవస్థలు కలలిగిన అతి కొద్ది దేశాల్లో భారత్ ఒకటిగా తన సత్తాను పలుమార్లు రుజువు చేసుకుంది. భారత ద్వీపకల్పంలో మూడు వైపుల సముద్ర జలాలు, ఉత్తరాన హిమాలయ పర్వతాలు సహజ రక్షణ గోడలుగా ఉండడం మన భౌగోళిక సహజ అనుకూలతలుగా చెప్పవచ్చు. 1950లో వాయు సేనలో ఉన్న “రాయల్ ఏయిర్ ఫోర్స్” పేరును తొలగించి “ఇండియన్ ఏయిర్ ఫోర్స్”గా నామకరణం చేశారు.
వైమానిక దళ సాఫల్యతలు:
1933లో మన వాయు సేనలో తొలి ఐఏఎఫ్ యుద్ధ విమానం చేరింది. మన వాయుసేన తొలిసారిగా వజిరిస్థాన్ పోరులో పాల్గొనడం, 2వ ప్రపంచ యుద్ధంలో (1939-45) సహితం తన సత్తాను చాటడం జరిగింది. దేశ లరిహద్దు గగన సీమల్లో గస్తీలు, ప్రకృతి వైపరీత్యాల సందర్భాల్లో పౌర రక్షణ సేవలు నిరంతరం నిర్వహిస్తున్న వాయు సేన తన నిబద్దతను పలు మార్లు నిరూపణ చేసింది. భారత త్రివిధ దళాల్లో ఒకటైన వాయు సేన, వాయు వేగంతో దేశ భద్రత వలయంలో నిమగ్నమై, అత్యాధునిక ఆయుధ సంపత్తితో ఇరుగు పొరుగు దేశాల చెడు చూపులను పసిగడుతూ, అపార శక్తివంతమైనదిగా తనదైన సమాధానాలను ఇస్తున్నది. మన వాయు సేన పాల్గొన్న ముఖ్య యుద్ధాల్లో 1962లో ఇండో-చైనా యుద్ధం, 1988లో ఆపరేషన్ కాక్టస్, 1961/1999లో ఆపరేషన్ విజయ్, 1999లో కార్గిల్ వార్, 1947/1965/1971/1999లో ఇండో-పాక్ యుద్ధం, 1960-65లో కాంగో క్రయసిస్, 1987లో ఆపరేషన్ పూమలై, 1987లో ఆపరేషన్ పవన్, 1984లో ఆపరేషన్ మేఘధూత్, 1961లో గోవా దండయాత్ర లాంటి ప్రముఖమైనవి మన వాయు సేన శక్తిని ఏకరువుపెడుతున్నాయి.
4వ అత్యంత శక్తివంతమైన భారత వాయు సేన:
అమెరికా, రష్యా, చైనా తరువాత అత్యంత శక్తివంతమైన వాయు సేనగా భారత్‌కు గుర్తింపు ఉంది. ఇండియన్ ఏయిర్‌ఫోర్స్ చొరవతో 1948లో ఏర్పడిన అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థగా హిందుస్థానీ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కు పేరుంది. భగవద్గీత నుంచి తీసుకున్న “టచింగ్ ది స్కై విత్ గ్లోరీ (కీర్తితో గగనాన్ని తాకండి)” అనే నినాదంతో సేవలందిస్తున్న భారత వాయు సేనలో 7 కమాండ్స్ ఉన్నాయి. మన వాయు సేనలో 1,70,576 అత్యాధునిక శిక్షణ పొందిన సైనిక/సహాయ సిబ్బంది, 1,40,000 రిజర్వ్ బలగాలు, 1,500 ఏయిర్ క్రాఫ్టులతో పటిష్ట సంస్థగా తనదైన ముద్రను కలిగి ఉంది.
భారత వాయు సేన దినోత్సవాల్లో భాగంగా వాయు సేన బల ప్రదర్శనగా ఏయిర్ షోలు, పరేడ్లు, యువతను రక్షణ రంగాల్లోకి ఆకర్షించే ప్రదర్శనలు, అమర జవాన్లకు నివాళులు అర్పించడం లాంటి పలు కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. మన వాయు సేనను శక్తివంతం చేస్తున్న మిగ్-27 విమానాలు, సుఖోయ్/హెచ్ఎఎల్/తేజాస్/జాగ్వార్/అపాచే/గజరాజ్/సి-30ఎంకెఐ/మిరాజ్-2000/మిగ్-29/మిగ్-21 యుద్ధ విమానాలు, బోయింగ్ 707, ధృవ్/చేతక్/చిరుత/ఎంఐ లాంటి పలు హెలీకాప్టర్స్, క్షిపణులు, రాఫెల్ యుద్ధ విమానాలు లాంటి అనేక అత్యాధునిక ఆయుద్ధ సంపత్తి ఉండడం గర్వకారణం. దేశ స్వాతంత్ర్యానంతరం చైనాతో ఒకటి, పాకిస్థాన్‌తో 4 యుద్ధాల్లో మన వాయు సేన తన బలాన్ని రుజువు చేసుకుంది.
ఐఏఎఫ్ అమ్ములపొదిలో..:
భారత రాష్ట్రపతి సుప్రీమ్ కామాండర్‌గా సేవలందిస్తున్న మన వాయు సేన ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉన్నది. భారతవాయు సేన ప్రధాన అధికారిగా ఛీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ నాయకత్వంలో 7 కమాండ్స్, 47 వింగ్స్, 19 ఫార్వర్డ్ బేస్ సపోర్ట్ యూనిట్స్ సేవలు అందిస్తున్నాయి. సెంట్రల్ ఎయిర్ కమాండ్-అలహాబాదు, ఈస్టర్న్ కమాండ్-షిల్లాంగ్, సదరన్ కమాండ్-తిరువనంతపురం, సౌత్ వెస్టర్న్ కమాండ్-గాంధీనరగ్, వెస్టర్న్ కమాండ్-న్యూఢిల్లీ, ట్రేయినింగ్ కమాండ్-బెంగుళూరు, మేటెనెన్స్ కమాండ్-నాగపూర్ కేంద్రాలుగా సేవలు అందిస్తున్నాయి. హైదరాబాదులో ఎయిర్‌ఫోర్స్ అకాడమీ ద్వారా ప్రాధమిక వైమానిక శిక్షణలు ఇవ్వబడుతున్నాయి. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళంగా కూడా వాయు సేన సేవలు అందించడం హర్షదాయకం.
అసాధారణ గగన సీమ ధీరత్వం:
చైనా, పాకిస్థాన్ లాంటి భారత సరిహద్దు దేశాల వక్రబుద్దుల ఎత్తుగడలను చిత్తు చేయడానికి మన త్రివిధ దళాలు నిత్యం సరిహద్దుల్లో అభేద్యమైన కంచెలుగా నిలుస్తూ,ధీటైనా సమాధానాలను ఇస్తున్నాయి. నేటి డిజిటల్ యుగంలో ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా క్షణాల్లో అత్యాధునిక వాయు సేన దాడులు మాత్రమే గెలుపోటములను నిర్ణయించే స్థాయి ఉన్నది. మన వాయు సేన పాకిస్థానీ ఉగ్ర మూకలపై నిర్వహించిన మెరుపు సర్జికల్ స్టైక్ ఆపరేషన్, వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ధైర్యసాహసాల వార్తలు మన మదిలో పదిలంగా ఉన్నాయి. అపార ధైర్యసాహసాలకు, వీరత్వ ప్రదర్శనలకు పేరొందిన మన త్రివిధ దళాలు దేశాన్ని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుతూ, మన సార్వభౌమత్వాన్ని సగర్వంగా నిలుపుతున్నాయి.
వాయు సేన దినోత్సవం సాక్షిగా మన ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నావల్ ఫోర్స్ కలిసి ఏర్పడిన త్రివిధ దళాలు సమర్థవంతమైన సమన్యయంతో దేశ భద్రత, సమగ్రత, సమైక్యత సాధనలో ప్రధాన భూమికను నిర్వహిస్తున్నాయి. మన రక్షక బలగాలకు మనో ధైర్యానిస్తూ, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ “జై జవాన్” అంటూ నిత్యం నినదిద్దాం. భారత వాయు సేన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేద్దాం.