
వృత్తాకారంలో ఉన్న చక్రం కనుగొన్న తరువాత మానవ పురోగతిలో మార్పులు చాలా వేగంగా చేసుకున్నాయి. ఐతే ఈ వృత్తానికి సంబంధించిన ఒక విలువను ఇప్పటికీ కనుగొన లేకపోతున్నాం. అదే ‘ పై ‘ అనే సంఖ్య. వృత్తం చుట్టకొలతను వృత్త పరిధి అంటారు. వృత్త పరిధి, వ్యాసాల నిష్పత్తిని ‘ పై ‘ అని పిలుస్తారు. ఈ విలువ స్థిరంగా ఉంటూ అంతమూ కాదు, అలాగని ఆవర్తనం కాదు. గణితంలో ఇటువంటి సంఖ్యలను ‘ కరణీయ సంఖ్యలు ‘ అని అంటారు. కంప్యూటర్ల సహాయంతో దీని విలువను ట్రిలియన్ దశాంశ స్థానాలకు లెక్కించారు. కానీ ఇది అంతమూ లేదా ఆవర్తనం కాలేదు.
గణితంలో సౌలభ్యం కోసం ‘ పై ‘ విలువను సుమారుగా 3.14 గా తీసుకుంటారు. అందుకే ‘ మార్చ్ పద్నాలుగు ‘ ను ‘ పై ‘ దినంగా తీసుకుంటారు. ప్రతి సంవత్సరం మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడే ఒక అంతర్జాతీయ కార్యక్రమం. ‘ పై ‘ అనేది గణిత ఔత్సాహికుల అనంతమైన అంకెలను పఠించడానికి ఒక వార్షిక అవకాశం. ఇది వినోదం, విద్యను మిళితం చేసే రోజు. 3,1,4 ‘ పై ‘ మొదటి మూడు ముఖ్యమైన అంకెలు కాబట్టి మార్చి 14 ను ‘ పై ‘ దినంగా తీసుకుంటారు. ఈ సంఖ్య గణిత సూత్రాలలో, జ్యామితి, భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, ఇంజనీరింగ్లో దాదాపు ప్రతి గణనలో పై ప్రాథమిక పాత్రను పోషిస్తూ వివిధ అనువర్తనాలను కలిగి ఉంది.
‘ పై ‘ దినం చరిత్ర:
అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త లారీ షా 1988లో శాన్ ఫ్రాన్సిస్కో ఎక్స్‌ప్లోరేటోరియంలో మొదటి దినోత్సవాన్ని నిర్వహించారు. 2009లో యుఎస్ ప్రతినిధుల సభ మార్చి 14ని నేషనల్ పై డేగా గుర్తించడానికి తీర్మానాన్ని ఆమోదించింది. ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) 2019 నవంబర్‌లో జరిగిన 40వ సర్వసభ్య సమావేశంలో పై దినోత్సవాన్ని (మార్చి 14) అంతర్జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది.
ప్రసిద్ధ శాస్త్రవేత్త జన్మదినం:
కాకతాళీయంగా ఈ రోజు ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త జన్మ దినం. ‘ తెలివితేటలకు నిజమైన సంకేతం జ్ఞానం కాదు! ఊహ! నిన్నటి నుంచి నేర్చుకో, ఈరోజు జీవించు, రేపటిని ఆశించు. అంతే తప్ప ప్రశ్నించడం మాత్రం ఆపకండి. జీవితం సైకిల్ తొక్కడం లాంటిది, బ్యాలెన్సుగా ఉండడానికి కదులుతూ ఉండాలి.’ అని ఆయన తెలిపారు. ఈయన చిన్నప్పుడు మాట్లాడటం నేర్చుకోవడంలో కూడా చాలా ఇబ్బందిపడి తల్లిదండ్రులుకి ఆందోళన కలిగించి, యువకునిగా ఉన్నప్పుడు భౌతికశాస్త్రంలో శతాబ్దాల నాటి నుండి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సాధించి, అప్పటి శాస్త్రవేత్తలకు కూడా తన సిద్ధాంతాలతో ఆశ్చర్యపరిచిన ఓ ప్రపంచ మేధావి, భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఆయనే ‘ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ‘ ఇంత వరకూ అంతటి తెలివైన వ్యక్తి పుట్టలేదు.
ఐన్‌స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలోని ఉల్మ్‌లో జన్మించారు. 1895లో స్విట్జర్లాండ్‌కు వెళ్లారు. పదిహేడు ఏళ్ల వయస్సులో స్విస్ ఫెడరల్ పాలిటెక్నిక్ స్కూల్‌లో గణితం, భౌతిక శాస్త్రంలో డిప్లమాలో చేరి 1901లో పూర్తి చేసి స్విస్ పౌరసత్వం పొందారు. అక్కడ చాలా నెలలగా నిరుద్యోగిగా ఉన్నారు. చాలా కష్టమైన ఆర్థిక పరిస్థితిని అనుభవించారు. 1902లో బెర్న్ పేటెంట్ కార్యాలయంలో ఉద్యోగం పొందాడరు. అక్కడ చదవడానికి తగినంత ఖాళీ సమయం దొరికింది. ఆయన జీవితంలో 1905 సంవత్సరం ముఖ్యమైనది. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే అతను భౌతిక శాస్త్రంలో నాలుగు విప్లవాత్మక పత్రాలను సమర్పించారు. అవి ‘ఫోటోఎలెక్ట్రిక్ ప్రభావం, బ్రౌనియన్ చలనం, ద్రవ్యరాశి శక్తి సమానత్వం, ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతాలు.’ జ్యూరిచ్ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డిని పొందారు. 1916 నుండి 1918 వరకు జర్మన్ ఫిజికల్ సొసైటీకి అధ్యక్షుడిగా పనిచేశారు.
1922లో సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ సిధ్ధాంతాన్ని కనుగొన్నందుకు గానూ 1921లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. అంతకంటే ఆయనకు ప్రపంచంలోనే ఒక ప్రసిద్ధ వ్యక్తిగా నిలబెట్టింది ‘ సాపేక్ష సిద్ధాంతం ‘. ప్రత్యేక సాపేక్షత, సాధారణ సాపేక్షత సిద్ధాంతాలతో ఐన్‌స్టీన్ మునుపటి భౌతిక సిద్ధాంతాలకు అంతర్లీనంగా ఉన్న అనేక ఊహలను పొందుపరిచారు. ఇంకా క్వాంటం మెకానిక్స్‌తో పాటు ఆధునిక భౌతిక శాస్త్రంలో దీని ఉపయోగాలు ఉన్నాయి. ప్రత్యేకించి సాపేక్షత విశ్వ ప్రక్రియలను, విశ్వ జ్యామితిని అర్థం చేసుకోవడానికి ఆధారాన్ని అందించింది. ఇప్పటికీ దీనిని అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే ఇది ప్రత్యేకమైనదో ! 1933లో హిట్లర్ జర్మనీలో అధికారంలోకి వచ్చాక అమెరికా వెళ్ళారు.
అతను జ్యూయిష్ జాతికి చెందినందున తిరిగి జర్మనీ వెళ్ళలేదు. అమెరికాలో బెర్లిన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో ఆచార్యునిగా పనిచేశారు. 1940లో అమెరికన్ పౌరసత్వం లభించడంతో అక్కడే స్థిరపడిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా అత్యంత శక్తివంతమైన బాంబులపై పరిశోధన జరుగుతోందనీ, ఇది అణుబాంబు తయారీకి దారితీస్తుందని వివరిస్తూ అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూసెవెల్ట్ కు ఉత్తరం రాశారు. కొత్తగా కనుగొన్న అణుబాంబు ప్రయోగానికి తాను పూర్తి వ్యతిరేకమని స్పష్టంచేశారు. అణు ఆయుధాలను ఉపయోగించకూడదంటూ బ్రిటన్ కు చెందిన తత్త్వవేత్త బెర్ట్రాండ్ రుసెల్ తో కలసి రుసెల్- ఐన్‌స్టీన్ మానిఫెస్టోపై సంతకం చేశారు.
ఇతర సిద్ధాంతాలు:
అవగాడ్రో సంఖ్యపై ఐన్‌స్టీన్ చేసిన పని ఆవర్తన పట్టికలోని ప్రతి మూలకానికి పరమాణు, మోలార్ ద్రవ్యరాశిని నిర్ణయించడానికి పునాది వేసింది. బ్రౌనియన్ చలనం ఐన్‌స్టీన్ యొక్క మరో ముఖ్యమైన సిద్ధాంతం. ఇది ద్రవం లేదా వాయువులోని కణాల యాదృచ్ఛిక కదలికను వివరిస్తుంది. ఈ సిద్ధాంతం అణువులు, పరమాణువుల ఉనికిని నిరూపించడంలో కీలకపాత్ర పోషించింది. 1905లో ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన ఫోటోఎలెక్ట్రిక్ ప్రభావం అనేది విద్యుదయస్కాంత వికిరణాలను గ్రహించినప్పుడు పదార్థం విద్యుత్ చార్జ్ చేయబడిన కణాలను విడుదల చేసే ఒక దృగ్విషయం. లోహపు పలకపై కాంతి పడినప్పుడు వాటి నుండి వెలువడే ఎలక్ట్రాన్‌లను ఫోటోఎలక్ట్రాన్‌లు అంటారు.
ఐన్‌స్టీన్ 300కు పైగా శాస్త్రీయ పత్రికలు, 150 శాస్త్రీయేతర పత్రికలు ప్రచురించారు. డిసెంబరు 2014న విశ్వవిద్యాలయాల్లోని ఐన్‌స్టీన్ కు చెందిన 30,000 శాస్త్రీయ పత్రాలను విడుదల చేశారు. చాలా రంగాల్లో అతను చేసిన కృషికి తెలివితేటలకు అతను పేరు మారుపేరుగా మారింది.1955 ఏప్రిల్ 17 న ఐన్‌స్టీన్ ఉదర బృహద్ధమని సంబంధ చీలిక వలన అంతర్గత రక్తస్రావం సంభవించింది. ఆయన ఐన్‌స్టీన్ శస్త్రచికిత్సను తిరస్కరించారు, ” నేను కోరుకున్నప్పుడు నేను వెళ్లాలనుకుంటున్నాను. జీవితాన్ని కృత్రిమంగా పొడిగించడం నాకు ఇష్టం లేదు. నేను నా వాటాను చేసాను, వెళ్ళడానికి సమయం ఆసన్నమైంది.” అని చెప్పిన మరుసటి రోజు ఉదయం 76 సంవత్సరాల వయస్సులో ప్రిన్స్టన్ ఆసుపత్రిలో మరణించారు. చనిపోయేంతవరకు న్యూజెర్సీలోని ప్రిన్స్ టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్సెడ్ స్టడీ సంస్థలో పని చేశారు.