
ప్రస్తుత రోజుల్లో సినిమాల వలన నాటకానికి ఆదరణ లేకపోవచ్చు. సినిమాలకు మూల కారణం నాటకమే ! ఎంతో మంది రంగస్థల కళాకారులు చిత్రరంగంలో ప్రవేశించి పేరుపొందారు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు పూర్వాశ్రమంలో రంగస్థల నటులే ! నాటి కాలంలో ఎంతో మందికి జీవనాన్ని కల్పించింది ఈ ” రంగస్థలమే ” ! నాటకరంగాన్ని ఆంగ్లంలో థియేటర్ అని అంటారు. తెలుగు వారి ప్రకారం థియేటర్ అనే పదాన్ని రంగస్థలానికి, సినిమా హాల్ కి రెండింటికి ఉపయోగించినా, ‘రంగస్థలం’ అంటే నాటకాలు వేసే స్థలం అని, సినిమా హాల్ అంటే సినిమాలు ప్రదర్శించబడే ప్రదేశం అని అర్థం. థియేటర్ అనే పదం వాస్తవానికి గ్రీకు థియేట్రాన్ నుండి వచ్చింది. థియేట్రాన్ అనగా ‘వీక్షించే ఒక ప్రదేశం’ అని అర్థం.
ఒక ప్రదర్శనా కళారూపం:
నాటకరంగం ఒక ప్రదర్శనా కళారూపం. రంగస్థలంపై ప్రదర్శించబడే దృశ్యరూపకం. ఒక నిర్దిష్ట ప్రదేశంలోనూ, ఒక వేదికపై ప్రత్యక్ష ప్రేక్షకుల ముందు నిజమైన లేదా ఊహించిన సంఘటనల అనుభవాన్ని ప్రదర్శించడాన్ని నాటక ప్రదర్శన అంటారు. ప్రదర్శకులు సంజ్ఞ, ప్రసంగం, పాట, సంగీతం, నృత్యం కలయికల ద్వారా ప్రేక్షకులకు రంజింపజేస్తారు. నాటకం అనేది ఒక ప్రత్యేకమైన కల్పన విధానం ద్వారా ప్రదర్శించి వ్యక్తీకరించబడుతుంది.
“నాటకాంతం హి సాహిత్యం” అన్నారు మహాకవి కాళిదాసు. అంటే అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకమని అర్ధం. కవిత్వం, వ్యాసం, కథ ఇలా అన్ని సాహిత్య ప్రక్రియలను స్పృశించిన తరువాత మాత్రమే నాటకాన్ని రచించాలని ఆయన తెలిపారు. అప్పుడు మాత్రమే నాటక రచనకు నిండుదనం చేకూరుతుందని ఆయన భావన.
భారతీయ నాటకరంగం:
భారతీయ నాటకరంగం మొదటి రూపం సంస్కృత నాటకరంగం. ఈ నాటక రంగం క్రీ.పూ. 2వ శతాబ్దం నాటిది. ఇది ఆచార శిక్షణలో ప్రారంభమై సంస్కృత నాటకం ద్వారా అధికారిక రూపాన్ని సంతరించుకుంది. ఋగ్వేదం నుండి ప్రారంభమై, భరతముని నాట్యశాస్త్రం ద్వారా మరింత అభివృద్ధి చెందింది. సంస్కృత నాటక రంగానికి స్వర్ణయుగం క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో ప్రారంభమై 10వ శతాబ్దంలో ముగిసింది. అనేక విదేశీ దండయాత్రలు, పాలకులు ఈ కళారూపాన్ని నిషేధించడం వల్ల సంస్కృత నాటక రంగ పతనం సంభవించింది. భారతీయ నాటకరంగం నృత్యం, సంగీతం, నాటకం కలగలసి ఉంటుంది. ఇది సాంప్రదాయం, ఆధునికత రెండింటినీ కలిగి ఉంది.
నాటకాల రకాలు:
తెలుగు నాటకంలో అనేక రకాలు ఉన్నాయి. పౌరాణిక నాటకాలు, చారిత్రక నాటకాలు, సాంఘిక నాటకాలు, ప్రహసనాలు మొదలైనవి. రామాయణ, మహాభారత, భాగవతం వంటి పురాణ కథలను ఆధారంగా చేసుకుని పౌరాణిక నాటకాలు; చారిత్రక వ్యక్తులు, సంఘటనలను ఆధారంగా చేసుకుని చారిత్రక నాటకాలు ; సామాజిక సమస్యలు, మానవ సంబంధాలను ఇతివృత్తంగా చేసుకుని సాంఘిక నాటకాలు ; హాస్యాన్ని ప్రధానంగా చేసుకుని ప్రహసనాలు రూపొందుతాయి.
నాటక లక్షణాలు:
అరిస్టాటిల్ ఒక నాటకానికి ఆరు అంశాలను రూపొందించారు కథాంశం, పాత్రలు, ఆలోచన, వాక్చాతుర్యం, సంగీతం, దృశ్యం . ఇవన్నీ నాటక ప్రదర్శనలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ప్రతి అంశం నాటకానికి ప్రత్యేకమైనది. ఎందుకంటే ప్రతి నాటకం మరొక దాని నుండి భిన్నంగా ఉంటుంది. వీటితో పాటుగా అదనంగా మరికొన్ని అంశాలు కూడా నాటకాన్ని ప్రభావితం చేస్తాయి. నాటకానికి ఒక కథాంశం ఉంటుంది. ఇది నాటకానికి ఒక నిర్దిష్టమైన అర్థాన్ని ఇస్తుంది.
నటుల నటన నాటకానికి ప్రాణం పోస్తుంది. వారి నటన ద్వారా పాత్రలు, భావాలు మరింత స్పష్టంగా వ్యక్తం అవుతాయి. నాటకంలో పాత్రలు ఒక కథను నడిపిస్తాయి. వారి ద్వారా భావాలు, భావోద్వేగాలు, సంఘర్షణలు వ్యక్తమవుతాయి. పాత్రల మధ్య జరిగే సంభాషణలు ఒక ప్రత్యేకమైన శైలిని ఇస్తాయి. పాత్రల స్వభావాలను వెల్లడిస్తాయి. సంఘటనలు కథను ముందుకు నడిపిస్తాయి. పాత్రల మధ్య సంబంధాలను ఏర్పరుస్తాయి. దృశ్యాలు నాటకానికి ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని ఇస్తాయి. పాత్రల భావాలను మరింతగా తెలియజేస్తాయి. కొన్నిసార్లు సంగీతం కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఇది ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని ఇస్తుంది. నాటకం ప్రదర్శన ద్వారా వ్యక్తీకరించబడుతుంది. కాబట్టి అది ఒక కళా ప్రక్రియ. నాటకాలు సాధారణంగా చర్యలు, సన్నివేశాలుగా విభజించబడతాయి. ఉదాహరణకు విషాదం, హాస్యం, దేశీయ నాటకం మొదలైనవి.
తెలుగు నాటక రంగం:
తెలుగు నాటకం ఒక గొప్ప సాంస్కృతిక వారసత్వం. మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. ఇది మన భాష, సంప్రదాయాలు, విలువలను కాపాడుతుంది. తెలుగు సాహిత్యంలో ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఇది ప్రజలకు వినోదం, విజ్ఞానం, సందేశం అందిస్తుంది. దీని చరిత్ర చాలా పురాతనమైనది. నాటక రంగ మూలాలు జానపద కళల్లో ఉన్నాయి. భాగవతం, వీధి నాటకాలు, బుర్రకథలు మొదలైనవి తెలుగు నాటకానికి పూర్వ రూపాలు. 19వ శతాబ్దం చివరలో తెలుగు నాటకం ఆధునిక రూపం సంతరించుకుంది. గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం వంటి రచయితలు ఆధునిక తెలుగు నాటకానికి పునాదులు వేశారు. వీరి రచనలు సామాజిక సమస్యలు, మానవ సంబంధాలను ఇతివృత్తంగా చేసుకుని రూపొందాయి. తెలుగు నాటకరంగానికి ఎంతో మంది రచయితలు, దర్శకులు, నటీనటులు తమ వంతు కృషి చేశారు. గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, ధర్మవరం కృష్ణమాచార్యులు, బళ్ళారి రాఘవ, స్థానం నరసింహారావు, పీసపాటి నరసింహమూర్తి, యడవల్లి సూర్యనారాయణ వంటి వారు తెలుగు నాటకరంగాన్ని సుసంపన్నం చేశారు.
మంజరీ మధుకరీయం:
తెలుగులో మొట్టమొదటి నాటకం ‘ మంజరీ మధుకరీయం ‘. దీనిని కోరాడ రామచంద్రశాస్త్రి 1860 ప్రాంతాల్లో రచించారు. గురజాడ అప్పారావు రచించిన “కన్యాశుల్కం” తెలుగు నాటక రంగంలో ఒక మైలురాయి. 1960 వరకు దాదాపు రెండువేల నాటకాలు, నాలుగువేల ఏకాంకికలు, నాటికలు వచ్చాయి.
నిజాం పాలనలో నాటకాలు:
నిజాం పాలనలో తెలంగాణలో నాటకాలు ప్రజల చైతన్యం కోసం, నిరంకుశ పాలన, జమీందారీ వ్యవస్థ, రైతాంగ పోరాటాల వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఉపయోగపడ్డాయి. వీధి నాటకాలు, యక్షగానాలు, చిందు భాగవతాలు వంటి ప్రజా కళారూపాలు తెలంగాణలో ఎక్కువగా ఉండేవి. నిజాం పాలనలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి నాటకాలు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడ్డాయి. నిజాం పాలన, జమీందారీ వ్యవస్థ, అక్రమ వసూళ్ల వంటి అంశాల పట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంచడానికి నాటకాలు దోహదపడ్డాయి. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఉత్తేజితం చేయడంలో నాటకాలు కీలక పాత్ర పోషించాయి. నిజాం రాజ్యంలో అంతర్భాగంగాను, పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నాటక సమాజాల ప్రభావం తెలంగాణ నాటకాలపై ఉంది.
ప్రసిద్ధ నాటకాలు:
వాసిరెడ్డి భాస్కరరావు, సుంకర సత్యనారాయణలు కలిసి రాసిన “మా భూమి” నాటకం నిజాం పాలన, జమీందారీ వ్యవస్థపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచింది. వెట్టిచాకిరీ, అక్రమ వసూళ్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల గురించి “వెట్టిచాకిరీ” నాటకం ప్రజలకు అవగాహన కల్పించింది. బోయి భీమన్న రాసిన “పాలేరు” నాటకం తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఉత్తేజితం చేసింది. వేదాంతకవి 1948 లో రాసిన “ఛలో హైదరాబాద్” నాటకం నిజాం పాలన, హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడానికి ముందు జరిగిన సంఘటనల గురించి వివరిస్తుంది. బ్రిటిష్ ఆజ్ఞలతో హైదరాబాద్‌ను పాలిస్తున్న నిజాం పాలకులను ఎదిరించి పోరాడాలని “ముందడుగు” నాటకం ప్రజలకు తెలియజేసింది.
జాతీయోద్యమ కాలంలో నాటకాలు:
ముత్తరాజు సుబ్బారావు “చంద్రగుప్త’ ( 1932), శేషుబాబు అశోకరాజ్యము’ (1945), ప్రభులింగాచార్యుల పల్నాటి వీరచరిత్రము’ (1928), ఉన్నవ లక్ష్మీనారాయణ ‘నాయకురాలు’ ( 1926), నండూరి బంగారయ్య ‘, ‘ఆంధ్రతేజము’ (1938), వేదం వేంకటరాయశాస్త్రి ‘ ‘ప్రతాపరుద్రీయము’ ( 1897), పోతుకూచి సుబ్బయ్య ‘ఆంధ్రవాణీ సామ్రాజ్యము’ (1944), కోలాచలం శ్రీనివాసరావు “సుల్తాన్ చాంద్ బీ’ ( 1900), కాళ్ళకూరి సాంబశివరావు ‘రంగరాయ కదన సమవాకారం’ ( 1899), శ్రీపాద కృష్ణమూర్తి ‘బొబ్బిలి యుద్దం’ ( 1908), కొప్పరపు సుబ్బారావు ‘రోషనార’ (1921), పడాల రామారావు ’అల్లూరి సీతారామరాజు’ ( 1950) మొదలైన నాటకాల్లో దేశవ్యాప్తంగానూ, ఆంధ్రదేశంలోనూ ప్రజారంజకంగా పాలన అందించిన పాలకుల స్ఫూర్తినీ, వారి పోరాట పటిమనీ, విదేశీయులతో పోరాడిన చారిత్రక సంఘటనలను కళ్ళకు కట్టినట్లు చూపాయి.
ప్రస్తుత పరిస్థితి:
తెలుగు నాటకం ప్రస్తుతం ప్రజాదారణ తగ్గింది. దీనికి కారణం సినిమాలు. సినిమాలో కంటే రంగస్థలంపై నాటకాలు ప్రదర్శించడం చాలా కష్టం. నటులు ఎంతో నైపుణ్యంతో ప్రత్యక్షంగా ప్రేక్షులముందర ప్రదర్శించబడాలి. సినిమాలకు ఇస్తున్న పోత్సాహకాలు నాటక రంగానికి కూడా ఇచ్చి ప్రభుత్వాలు నాటకాన్ని బతికించాలి.