![Taraka Ratna loses battle for life after 23 days](/wp-content/uploads/2023/02/c4a8655b627b6dddb00bf7f3c3f3c16c.jpg)
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు మనమడిగా, నందమూరి మోహనకృష్ణ పెద్ద కుమారుడు.. తారకరత్న..
బాబాయ్ నందమూరి బాలకృష్ణ, సోదరులు నందమూరి కళ్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్ లతో పాటు నందమూరి కుటుంబం నుంచి హీరోగా పరిచయమయ్యారు.
ఒకటి కాదు.. రెండు కాదు… ఏకంగా తొమ్మిది చిత్రాలతో.. ఒకే రోజున పరిచయం కావడంతో అరుదైన రికార్డు పొందారాయన.
అందులో విడుదలైన తొలి చిత్రమే.. ‘ఒకటో నెంబర్ కుర్రాడు’..
ఆ తర్వాత 23 సినిమాలు చేసినప్పటికీ, చెప్పుకోదగ్గ విజయాలు అందుకోలేకపోయారు.. కానీ నటుడిగా మాత్రం తనని తాను నిరూపించుకున్నారని చెప్పుకోవాలి. తాజాగా రాజకీయాల్లోకి రావాలనుకున్న ఆయన.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలోనూ పాల్గొన్నారు. అదే రోజున గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే.. 23 రోజులపాటు బెంగళూర్ లోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న ఆయన నిన్న(శనివారం) రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఈ సందర్భంగా ఆయన సినీ జీవిత విశేషాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం:
ప్రస్థానం…
1983 ఫిబ్రవరి 22న, హైదరాబాద్ లో జన్మించారు తారకరత్న. తారకరత్న తండ్రి నందమూరి మోహన కృష్ణ. కాలేజీ రోజుల్లోనే నటనపై ఆసక్తి పెంచుకున్నారు. అగ్రనటుడు ఎన్టీఆర్ మనవడిగా బాబాయ్ బాలకృష్ణను తెరపై చూస్తూ పెరిగిన తారకరత్నకు చిన్ననాటి నుంచి సినిమాలపై ప్యాషన్ పెంచుకున్నారు. ఆయనతో మొదట్నుంచీ చనువు ఉండడంతో హీరో కావాలనే కోరికను ముందుగా బాలయ్య ముందుంచారట తారకరత్న. దీంతో ఆయన సపోర్ట్ నిస్తూ, ఇంట్లో వాళ్ళందర్నీ ఒప్పించడమే కాక, తారకరత్నను హీరోగా పరిచయం చేశారట. అలా కాలేజీ చదువు పూర్తయ్యాక, 20 ఏళ్లకే సినీతెరంగేట్రం చేశారు తారక్.
2001లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. 2002లో విడుదలైందీ చిత్రం. దీంతోపాటు ఒకేసారి 9 సినిమాలు మొదలు పెట్టి, ప్రపంచ రికార్డు సృష్టించారు. అయితే అందులో విడుదలైన చిత్రం మాత్రం ఇదొక్కటే.
యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు, అమరావతి, వెంకటాద్రి, నందీశ్వరుడు, మనమంతా, రాజా చెయ్యి వేస్తే.. ఇలా 23 చిత్రాల్లో ఆయన నటించారు. పలు వెబ్‌సిరీస్‌లు చేశారు. హీరోగా కన్నా ప్రతినాయుకుడిగా గుర్తుండిపోయే పాత్రలు చేసి, అందర్నీ మెప్పించారు. హీరోగా కెరీర్ ప్రారంభించిన తారకరత్నకు మొదట్లో ఆయన ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌పాత్రలు చేసేందుకు మొగ్గు చూపారు. 2006 నుంచి 2009వరకు దాదాపు మూడేళ్ళపాటు సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు.
2009 లో వచ్చిన అమరావతి చిత్రానికి గానూ తారకరత్నకు నంది అవార్డు లభించింది.
హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. ఇలా దాదాపు 23 చిత్రాల్లో నటించగా, మరో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇటీవల చేసిన చిత్రం ఎస్ 5 నో ఎగ్జిట్, 9 అవర్స్ అనే వెబ్‌సిరీస్‌లోనూ మెరిశారు. 9 అవర్స్ ప్రేక్షకుల నుంచి మంచి క్రేజ్ ను సంపాదించి పెట్టింది.
నందమూరి కుటుంబం…
తారకరత్న కల్యాణ్‌రామ్ కంటే వయసులో ఐదేళ్లు చిన్నవాడు. జూ. ఎన్టీఆర్‌కు నాలుగు నెలలు పెద్ద అంతే. నందమూరి తారకరత్నది ప్రేమ వివాహం.
2012లో తన స్నేహితురాలు అలేఖ్య రెడ్డిని హైదరాబాద్‌లోని సంఘీ టెంపుల్‌లో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే అలేఖ్యా రెడ్డికి పెళ్ళై, విడాకులు కూడా తీసుకుంది. అయితే అలేఖ్య విషయానికొస్తే, ఆమె ప్రస్తుత వైసీపీ నాయకుడు విజయ్‌సాయిరెడ్డి మరదలి కూతురు. కొన్ని చిత్రాలకు ఆమె కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పని చేశారు. తారకరత్న నటించిన ‘నందీశ్వరుడు’ అనే సినిమాకు సైతం పని చేసింది. అలా మొదలైన వీరి పరిచయం పెళ్లివరకు దారి తీసింది. ఇదిలా ఉంటే, అప్పటివరకూ నందమూరి కుటుంబంలో ప్రేమ వివాహాలు అనేవి లేవు. అలాంటిది తారకరత్న ప్రేమ వివాహం చేసుకోవడంతో.. ఆగ్రహించిన నందమూరి కుటుంబ సభ్యులు ఆయన్ను కొంతకాలం దూరం పెట్టారు. తదుపరి కుటుంబ సభ్యులు ఆయన్ను మళ్ళీ దగ్గరికి తీసుకున్నారు. వీరిద్దరికి ఓ కూతురు.. పేరు నిష్కా.
రాజకీయాల్లోకి…
తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో తరచుగా పాల్గొనడం.. గతంలో ఈ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలోనూ చురుగ్గా ఉన్నారు. తాజాగా రాజకీయాల్లోకి రావాలనుకున్న తారకరత్న..
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారట.
ఈ తరుణంలోనే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత నెల(జనవరి 27న) చేపట్టిన యువగళం పాదయాత్రలోనూ పాల్గొన్నారు. లోకేష్ తో కలిసి పాదయాత్ర చేస్తుండగా, ఒక్కసారిగా గుండెపోటుకు గురై, అక్కడే కుప్పకూలిపోయారు.
వెంటనే కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అక్కడ విదేశీ వైద్య డాక్టర్లు సైతం చికిత్స అందించారు. నిన్న అనగా, తారకరత్న ఆరోగ్యం విషమించిందని తెలియడంతో.. శనివారం కుటుంబసభ్యులు హుటాహుటిన బెంగళూరుకు తరలివెళ్లారు. అక్కడే ఉండి ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. 23రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందిన తారకరత్న నిన్న రాత్రి(శనివారం, ఫిబ్రవరి 18న) తుదిశ్వాస విడిచారు.
తారకరత్న మృతిపట్ల ఏపీ మాజీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి…
మేనమామ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇచ్చిన మాట కోసం తారకరత్న తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తున్నారు.
వచ్చే ఎన్నికలలో గుడివాడ నియోజకవర్గం నుంచి తారకరత్నను పోటీలో నిలపాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానవర్గం యోచిస్తోంది. ఈ క్రమంలోనే, కుప్పంలో ప్రారంభమైన ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. అలాంటిది ఈ సందర్భంలో ఆయన గుండెపోటుకు గురై మరణించడం, దురదృష్టకరం. తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబసభ్యులు, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న… చివరికి తమకు దూరమై, కుటుంబానికి విషాదం మిగిల్చాడని అన్నారు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థించారు. నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.
ఇతరాంశాలు…
‘నువు చూడూ చూడకపో నే చూస్తూనే ఉంటా…’, ‘ఒరే నువ్వు నాకు నచ్చావురా…’,
‘నెమలీ కన్నోడా…’ తదితర గీతాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.
తన బాబాయ్ బాలకృష్ణ అంటే, తారకరత్నకి ఎంతో ప్రేమ. ఎంతలా అంటే, బాలకృష్ణ సంతకం తారకరత్న చేతిపై పచ్చబొట్టుగా ఇప్పటికీ కనిపిస్తుంటుంది. తారకరత్న అనారోగ్యంతో ఆసుపత్రిపాలు కావడంతో బాలకృష్ణ ఎంతగానో తల్లడిల్లిపోయారు. కొన్ని రోజులపాటు ఆస్పత్రిలోనే ఉంటూ, మంచి వైద్యం అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇదిలా ఉంటే, బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తారకరత్న విలన్‌గా నటిస్తారని నిర్మాతలు ఇటీవల కాలంలోనే ప్రకటించారు. కానీ ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొనక ముందే తారకరత్న ఇలా కన్ను మూయడం దురదృష్టకరం.
తారకరత్న తండ్రి మోహన్‌కృష్ణ, భార్య అలేఖ్యరెడ్డి, కుమార్తెలు నారాయణ హృదయాలయలోనే ఉండగా, సోదరుడు జూ. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, తదితరులు ఇప్పటికే సందర్శించారు.
ఈరోజు(ఆదివారం) బెంగళూరు నుంచి హైదరాబాద్ మోకిళ్లలోని స్వగృహానికి ఆయన భౌతికకాయాన్ని తీసుకురానున్నారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫిల్మ్‌చాంబర్‌లో అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం, సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.