నైతిక విలువలకు కట్టుబడి విశ్రమించని నారాయణుడు.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి..
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోஉస్త్వకర్మణి”…
“నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగానీ, ఆ కర్మఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు, అలాగని కర్మలు చేయడం మానకు”.
పై శ్లోకం, దానియొక్క అర్థం భగవద్గీతలో నారాయణుడి ఉవాచ. మనిషి సంపాదించే సంపద అనేది తామరాకు మీద నీటి బొట్టు మాత్రమే. అది భౌతికమైన సంపద కావచ్చు, మేథోపరమైన సంపద కావచ్చు. మనం సృష్టించినదంతా మనది కాదు. దానికి మనం తాత్కాలికమైన సంరక్షకులం మాత్రమే. నలుగురితో పంచుకోవడం ద్వారానే దాని విలువ పెరుగుతుంది అంటారు ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులలో ఒకరైన నారాయణ మూర్తి.
ప్రస్తుత సమాజంలో తన వంతు బాధ్యత నిర్వర్తించడానికి నారాయణ మూర్తి ఎంచుకున్న మార్గం “మానవీయ పెట్టుబడి దారీ వ్యవస్థ”. ఇది పెట్టుబడి దారి, సామ్యవాద వ్యవస్థలలోని మేలు లక్షణాల కలయిక. ఎవరికి వారు ధర్మబద్ధమైన మార్గములో సంపదను పెంచుకుంటూనే ఏదో ఒక రూపంలో నలుగురితో పంచుకునే విధానం. ఆ నలుగురు ఉద్యోగులు కావచ్చు, వాటాదారులు కావచ్చు, ఖాతాదారులు కావచ్చు, ప్రజలు కూడా కావచ్చు అంటారు నారాయణ మూర్తి.
నాగవర రామారావు నారాయణ మూర్తి (ఇన్ఫోసిస్ నారాయణమూర్తి) ఒక వ్యక్తి, ఒక సంస్థ, సమాచార సాంకేతికత (ఐటీ) రంగంలో ఒక అద్భుతం. ఆ గొప్పదనం ఆ వ్యక్తిదా? లేక సంస్థదా? అనే ప్రస్తావన వస్తే తప్పకుండా సంస్థ లాంటి వ్యక్తి “ఇన్ఫోసిస్ నారాయణమూర్తి” దే అని చెప్పాలి. నిజానికీ ఆయన “ఇన్ఫోసిస్” ను ఆయన ఒక మామూలు సాఫ్ట్ వేర్ కంపెనీ గానో లేక అవుట్ సోర్సింగ్ కేంద్రం గానో రూపొందించలేదు, దానిని ఒక వ్యవస్థగా తీర్చిదిద్దారు. దానికోసం తాను ఎంచుకున్న మార్గాలు గణిత సిద్ధాంతాలలా, సామాన్య సూత్రాలలా, తిరుగులేని విలువలున్న సూత్రాలు. ఇవి ఒక దేశానికి రాజ్యాంగంలో పనికొస్తాయి. ఒక వ్యక్తికి వికాస పాఠాలులా ఉపయోగపడతాయి. వీటిని వ్యాపార సంస్థలు గనుక అమలుచేస్తే కలకాలం నిలుస్తుంది.
విద్యాసంస్థలలో అమలు చేస్తే రేపటి పౌరులు ప్రయోజకులవుతారు. స్వచ్ఛంద సంస్థలలో అమలు చేస్తే లక్ష్యసాధన సులువైపోతుంది. నాలుగు దశాబ్దాల జీవితంలో ఇన్ఫోసిస్ ఎన్నో విలువైన పాఠాలను నేర్పింది. ఎంతో సంపదనిచ్చింది. ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చి పెట్టింది. గొప్ప పుస్తకాలు, స్ఫూర్తి ప్రదాతలు, వైఫల్యాలు, విజయాలు, సృజన, సమాజ పరిశీలన, నిరంతర అధ్యయనం, మిత్రబృందం ఇన్ఫోసిస్ అధినేతకు అక్షౌహిణుల సైన్యంలా సంస్థకు అండగా నిలిచిన అంశాలు, వ్యక్తులు ఎందరో. వారెవ్వరినీ నారాయణమూర్తి మర్చిపోలేదు. ఏ అనుభవాన్ని కూడా ఆయన మనసు పొరల్లోంచి చెరిపేసుకోలేదు.
నాగవర రామారావు నారాయణ మూర్తి భారతదేశానికి చెందిన పారిశ్రామిక వేత్త, సాఫ్ట్ వేర్ ఇంజనీరు, ఇన్ఫోసిస్ వ్యస్థాపకులు. ప్రస్తుతం ఆయన ఇన్ఫోసిస్ అధ్యక్ష పదవినుండి వైదొలిగారు. ఇన్ఫోసిస్ స్థాపించిన 1981 నుండి 2002 వరకు దాదాపు 21 సంవత్సరాలు ఆ సంస్థకు ఆయన ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా ఉన్నారు. 2002లో ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా (సీఈఓ) గా పదవీవిరమణ చేసిన తరువాత సంఘ సేవలకు, భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధం చేయటానికి తన కార్యకలాపాలను విస్తృతం చేసారు. ప్రస్తుతం ఆ కంపెనీకి ఆయన అధికారంలో లేని ముఖ్య గురువు.
తనది ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే ఎన్.ఎస్.రాఘవన్, క్రిష్ గోపాలకృష్ణన్, నందన్ నీలేకని లాంటి సహచరులే లేకపోతే నేనులేను. ఉన్నా కూడా సున్నానే. ఇంత గొప్ప విజయం, ఓ వ్యవస్థ నిర్మాణం సాధ్యమయ్యేది కానే కాదు అని ఆయన వినమ్రంగా చెబుతారు. నిజానికి ఆ స్థాయికి వెళ్లేసరికి ఏ మనిషికైనా అహం నెత్తికెక్కి కూర్చుంటుంది. కానీ నారాయణ మూర్తి ఇందుకు భిన్నమనే చెప్పాలి. ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ఆయన 2000 వ సంవత్సరంలో భారతదేశములోని నాలుగవ అతిపెద్ద పౌర పురస్కారమైన పద్మశ్రీ, 2008 సంవత్సరంలో భారతదేశములోని రెండవ అతిపెద్ద పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా చేసిన ప్రసంగాలన్నీ 2009లో “ఎ బెటర్ ఇండియా”, “ఎ బెటర్ వరల్డ్” పుస్తకంగా ప్రచురితమయ్యాయి.
జీవిత విశేషాలు…
- జన్మనామం : నాగవర రామారావు నారాయణ మూర్తి
- ఇతర పేర్లు : ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
- జన్మదినం : 20 ఆగస్టు 1946
- స్వస్థలం : సిడ్లఘట్ట , మైసూర్ రాజ్యం , బ్రిటిష్ ఇండియా (ప్రస్తుత కర్ణాటక , భారతదేశం)
- జీవిత భాగస్వామి : సుధా మూర్తి
- పిల్లలు : రోహన్ , అక్షతా
- బంధువులు : రిషి సునాక్ (అల్లుడు)
- వృత్తి : ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ ఎమెరిటస్
- పురస్కారాలు : పద్మశ్రీ (2000),
- ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (2007), గౌరవ కమాండర్ లెజియన్ ఆఫ్ హానర్ (2008),
- పద్మవిభూషణ్ (2008)..
నేపథ్యం…
నాగవర రామారావు నారాయణ మూర్తి 20 ఆగస్టు 1946 నాడు కర్ణాటకలోని రాష్ట్రములోని మైసూరు దగ్గరలో గల సిడ్లఘట్టలో ఒక కన్నడ మధ్యతరగతి హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తన విద్యాభ్యాసం ప్రభుత్వ పాఠశాలలోనే కొనసాగించిన ఆయన ప్రాథమిక విద్య, ఉన్నత పాఠశాల విద్య ప్రభుత్వ పాఠశాలలోనే చదివారు. ఆ తరువాత 1967 వ సంవత్సరంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, మైసూరు విశ్వవిద్యాలయం నుంచి “ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్” లో పట్టా పుచ్చుకున్నారు. 1969 వ సంవత్సరంలో ఐఐటీ కాన్పూర్ నుంచి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. నారాయణ మూర్తి ఐఐఎం అహ్మదాబాదులో చీఫ్ సిస్టమ్స్ ప్రోగ్రామర్ గా తాను మొదటిసారి ఉద్యోగంలో చేరారు. అక్కడ ఆయన ఒక టైమ్ షేరింగ్ సిస్టమ్ మీద ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఇ.సి.ఐ.యల్ ) కోసం BASIC కంప్యూటర్ భాషకై ఇంటర్‌ప్రెన్యూర్ తయారు చేశారు. ఆ తరువాత ఆయన పూణె చేరి, అక్కడ పాట్ని అనే కంపనీలో చేరారు. అక్కడినుండి ముంబై వెళ్లబోయే ముందు, మూర్తి పుణేలోని టాటా ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ లిమిటెడ్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్న సుధా మూర్తిని కలుసుకున్నారు. ఆ తరువాత వీరి పరిచయం కాస్త పరిణయానికి దారి తీసింది.
పారిస్ సంఘటన…
కమ్యూనిస్టు సిద్ధాంతాలు, నారాయణ మూర్తి లోని భావాలు చాలా దగ్గరగా ఉండేవి. అందువలన తాను ఏదో ఒక రోజున రాజకీయాలోకి వస్తానని చెబుతుండేవారు. ఈలోగా అవకాశాలను వెతుక్కుంటూ పారిస్ వెళ్లిపోయారు. “తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది” అన్నట్లు పారిస్ పర్యటనలో జరిగిన ఒక సంఘటన నారాయణ మూర్తి నిర్ణయాన్నే కాదు, పూర్తిగా జీవితాన్నే మార్చేసింది. పారిస్ నుంచి మైసూరుకు తిరుగు ప్రయాణంలో “సెర్బియా, బల్గేరియాల మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతంలో రైలు ప్రయాణం ఓ మజిలీ. ఆ సరిహద్దు ప్రాంతంలో రైలులో ప్రయాణిస్తుండగా తనకు ఒక జంట పరిచయమైంది. ఆ జంటతో నారాయణ మూర్తికి మాటలు కలిశాయి. తన భావాలని, ఆలోచనలని ఆవేశంగా వారితో పంచుకుంటున్నారు.
వారు మాట్లాడుకుంటున్న మాటలను అటుగా వెళుతున్న ఓ గార్డు నక్కినక్కి విన్నారు. నారాయణమూర్తి బల్గేరియా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారేమో అనే అనుమానం ఆ గార్డుకు వచ్చింది. దాంతో నారాయణ మూర్తిని లాక్కెళ్ళి ఇరుకిరుకుగా ఉన్న గదిలో బంధించారు. ఆ గదంతా చిమ్మ చీకటి. చిన్న రంధ్ర మాత్రమే ఉంది. అది కూడా కాలకృత్యాలు తీర్చుకోవడానికి మాత్రమే. ఆయనకు తిండి లేదు, నిద్ర లేదు, సాయం చేసే నాధుడు లేనే లేడు. ఆ గదిలో రక్తం గడ్డ కట్టుకుపోయేంత చలి. అదో నరకం. 24 గంటల తరువాత ఆ గార్డు వచ్చి మా మిత్ర దేశం అయిన భారతదేశం నుండి వచ్చావు కాబట్టి బ్రతికిపోయావు. పాపమని వదిలేస్తున్నామంటూ బారబరా బయటికి ఈడ్చుకొచ్చి పడేసాడు. దాంతో నారాయణ మూర్తికి కమ్యూనిస్టుల మీద ఉన్న బ్రమలన్నీ తొలగిపోయాయి.
మూర్తి ఇంట్లోనే “ఇన్ఫోసిస్” ప్రారంభం…
మూడు పుస్తకాలు నారాయణ మూర్తి ఆలోచనల్ని ప్రగాఢంగా ప్రభావితం చేశాయి. వాటిలో మొదటిది “మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్” (మహాత్మా గాంధీ). ఇందులో గాంధీజీ విలువల గురించి చెప్పారు. రెండవది “ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం” (మాక్స్ వెబర్). దీనిలో “సమున్నతమైన ఆలోచనలు, కష్టించే స్వభావం వున్న యువత దేశ ప్రగతికి పునాదులు అనే ఆలోచనకు మాక్స్ వెబర్ మద్దతు పలికారు. మూడవది “బ్లాక్ స్కిన్, వైట్ మాస్క్స్” (ప్రంజి పానన్). ప్రంజి పానన్ భావాలు, పాలకులు అసలు రంగును బట్టబయలు చేశాయి. వారంతా కూడా నల్లతోలు కప్పుకున్న తెల్ల దొరలేనని తేల్చి చెప్పాయి. కానీ నారాయణ మూర్తి “నిజమైన నాయకుడు ఎలా ఉంటాడు” అని తనను తాను ప్రశ్నించుకున్నప్పుడు బోసినవ్వుల బాపు కళ్ళ ముందు కనిపించారు. దాంతో భారతదేశానికి వచ్చీరాగానే దేశీయ అవసరాల కోసం ఐ.టి సంస్థను స్థాపించారు.
నారాయణ మూర్తి ఆ సంస్థను స్థాపించే నాటికి భారత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకునేటంత స్థాయికి ఎదగలేదు. అందువలన తమ వ్యాపారం మూతబడింది. దాంతో చేసేది లేక పూణే లోని “ప్యాట్ని కంప్యూటర్స్” లో చేరారు. అది కూడా మంచి సంస్థే, మంచి జీతం కూడనూ. అన్నిటికి మించి తనకు ఆరుగురు సహోద్యోగులు. ఏదో ఒకనాడు అత్యద్భుత విజయాలు సాధించాలన్న ఉత్సాహం ఆ ఆరుగురిలో కనిపించేది. వారందరిలోనూ సమాజం అంటే బాధ్యత ఉంది, విలువలు అంటే గౌరవం కూడా ఉంది. అలాంటి సహచరులు తోడుంటే జీవితంలో వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాదనిపించింది నారాయణ మూర్తికి. ఆరుగురికి కూడా నారాయణమూర్తి మీద అలాంటి మంచి అభిప్రాయమే ఉంది. వారంతా మంచి స్నేహితులు అయ్యారు. అందరూ కలిసి ఉమ్మడి లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. దాంతో నారాయణమూర్తి ఇంట్లోనే ఓ చిన్న గదిలో “ఇన్ఫోసిస్” ప్రాణం పోసుకుంది.
విలువలకు కట్టుబడి…
విలువల పునాదులు లేని సంస్థలు చాలా కనుమరుగయ్యాయి. విలువల పునాదులు లేని వ్యక్తులు జైలు పాలయిన వారు కూడా ఉన్నారు. విలువల పునాదులు లేని సత్యం సంస్థ కనుమరుగవ్వడం మనం చూశాము. విలువల పునాదులు లేని వ్యక్తి కేంద్ర మాజీ మంత్రి రాజా జైలు పాలు అయ్యారు. విలువల్లేని దేశాలు పాకిస్తాన్ నిత్యం నెత్తురోడడం మనం చూస్తున్నాము. నమ్మిన విలువలకు కట్టుబడి, నైతిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటే ఎన్ని కోట్ల రూపాయల ప్రాజెక్టు నైనా తిరస్కరించేటంత ధైర్యం వాళ్లలో ఉంది. డబ్బు, ప్రతిష్ట, బ్రాండ్ ఇవేవీ లేని రోజులలో కూడా నారాయణ మూర్తి తాను నమ్మిన విలువలకే కట్టుబడి ఉన్నారు. ఇన్ఫోసిస్ సంస్థ అప్పట్లో విదేశాల నుంచి ఒక కంప్యూటర్లు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. సంబంధిత అధికారికి లంచం ఇస్తే లక్ష రూపాయల డబ్బుతో బయటపడవచ్చు. మిగిలిన పనులు చకచకా పూర్తి అయిపోతాయి. కానీ నారాయణ మూర్తికి లంచం ఇవ్వడం నచ్చలేదు. దాంతో ఆయన లంచం ఇవ్వడానికి నిరాకరించారు. అప్పుడు నిబంధనల ప్రకారం పది లక్షల రూపాయలు చెల్లించారు. అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న ఇన్ఫోసిస్ లాంటి సంస్థకు అది పెద్ద మొత్తం సొమ్ము. వాటిని తిరిగి పూడ్చుకోవడానికి ఆరు సంవత్సరాలు పట్టింది.
“ఇన్ఫోసిస్ లీడర్ షిప్ ఇన్స్టిట్యూట్” స్థాపన…
“ఇన్ఫోసిస్” లో “నేను”, “నాది”, “నా విజయం” అన్నమాట ఎక్కడ కూడా వినిపించదు. చీఫ్ మెంటార్ నుండి సామాన్య ఉద్యోగి దాకా ఎవ్వరూ ఉపయోగించరు. వాళ్లకు తెలిసిందల్లా “బృంద గానమే”. ఆ సమిష్టితత్వమే లేకపోతే ఇన్ఫోసిస్ సంస్థనే లేదు. అక్కడ అనుచరులు, సహచరులు ఉండరు, అంతా నాయకులే. 30 ఏళ్ల క్రితం ఇన్ఫోసిస్ విత్తనం నాటుతున్నప్పుడే ఆ లక్షణాలన్నీ కంపెనీ జన్యువుల్లోకి ఎక్కించారు నారాయణ మూర్తి. సంస్థ సిబ్బందిలో నాయకత్వ లక్షణాలని పెంపొదించడం కోసం ప్రత్యేకమైన శిక్షణ సంస్థను ఆయన స్థాపించారు. దాని పేరు “ఇన్ఫోసిస్ లీడర్ షిప్ ఇన్స్టిట్యూట్”. “యాక్సిలరేటెడ్ లీడర్ షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్” ద్వారా నవతరం ఆలోచనలకు సానబడతారు. అక్కడ ప్రతీ యువ నాయకుడికి ఒక సీనియర్ నాయకుడు మార్గదర్శకం చేస్తాడు.
ఇన్ఫోసిస్ ప్రారంభించిన తొలినాళ్ళలో ఏ కొత్త ఆలోచనైనా వ్యవస్థాపక సభ్యుల నుంచే వచ్చేది. సాధారణల ఉద్యోగులు ముఖ్యంగా యువతరం పెద్దగా చొరవ చూపేవారు కాదు. నారాయణ మూర్తికి యువత సంశయం అర్థమైంది. వ్యవస్థలోని లోపము తెలిసి వచ్చింది. వ్యూహరచన, సంక్షోభ నివారణ, మార్పును గమనించే నైపుణ్యం, నాయకత్వ ప్రతిభ తదితర లక్షణాలని ఇన్ఫోసిస్ సంస్థలో పెంపొందించడం తక్షణ కర్తవ్యం అని భావించారు నారాయణ మూర్తి. ఆ నిర్ణయం వల్ల ఒక్క ఇన్ఫోసిస్ మాత్రమే లాభపడలేదు. ఆ పరిజ్ఞానంతో ఎంటర్ప్రైన్యూర్స్ గా అవతరించిన వారు ఎంతోమంది తమ స్పష్టమైన ఆలోచనతో నలుగురికి ఉపాధి చూపించాలనే లక్ష్యంతో సంస్థ నుంచి బయటికి వెళ్లే వారిని నారాయణ మూర్తి మనసారా ఆశీర్వదించేవారు. ఇన్ఫోసిస్ అంటూ కొమ్మలు నలుదిశలా విస్తరించాయి.
2010 నాటికి ఇన్ఫోసిస్ విలువ 50 వేల కోట్లు…
కొన్నేళ్ల క్రిందట ఒక పేరుమోసిన విదేశీ సంస్థ బిలియన్ డాలర్లు, అంతకంటే కాస్త ఎక్కువ చెల్లించి “ఇన్ఫోసిస్” ను సొంతం చేసుకోవడానికి ముందుకొచ్చింది. దాంతో మిగతా భాగస్వాములు ఆనందంగా ఆ ప్రతిపాదనను అంగీకరించారు. ఇక మిగిలింది నారాయణ మూర్తి వంతు. కానీ ఆయనకు మనసొప్పలేదు. ఏ పరిస్థితులలో, ఏ లక్ష్యాలతో “ఇన్ఫోసిస్” ను ప్రారంభించింది అందరికీ గుర్తుచేశారు. “ఇన్ఫోసిస్” అనేది మనందరి కల, మనందరి జీవితం. ఒక దశాబ్దం పాటు కంటికి రెప్పలా చూసుకున్నాం. గ్లోబలైజేషన్ నేపథ్యంలో ఎన్నో అవకాశాలు తలుపు తట్టబోతున్నాయి. భవిష్యత్తు అంతా మనదే. అయినా కూడా అమ్మాలనుకుంటే ఎవరి చేతుల్లోనే పెట్టడం ఎందుకు ఈ వాటాలు నేనే కొంటాను అన్నారు. నారాయణ మూర్తి మాట్లాడాక ఎవ్వరూ మాట్లాడలేదు. చాలాసేపు నిశ్శబ్దం.
నిజానికి ఇన్ఫోసిస్ ను కొనడానికి ఆయన జేబులో చిల్లిగవ్వ కూడా లేదు. తామంతా కలిసి కట్టుకున్న విలువల మేడ ఇంకెవరి చేతుల్లోకి వెళ్ళకూడదు అన్న తపననే ఆయనతో అలా మాట్లాడించింది. మిగతా భాగస్వాములు అర్థం చేసుకున్నారు. ఆ తరువాత ఎప్పుడూ, మరెవ్వరూ కూడా అలాంటి ప్రతిపాదన ఆయన ముందుకు తీసుకురాలేదు. పదేళ్లలో ఆ సంస్థ మార్కెట్ విలువ “బిలియన్ డాలర్ల” కంటే ఇరవై ఎనిమిది వేల రేట్లు ఎక్కువైంది. మార్చి 2010 నాటికి ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ “ఇన్ఫోసిస్” లో వాటాలున్నాయి. అప్పటికి ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ 50 వేల కోట్ల రూపాయలు. ప్రస్తుతం వేల మందికి పైగా “ఇన్ఫోసిస్” సంస్థ నీడలో బ్రతుకుతున్నారు. ప్రజల విశ్వాసాన్ని పొందినవాడు నాయకుడు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకున్న వాడు మహానాయకుడు. ఆయనే ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి.
ఒడిదుడుకులను తట్టుకుని…
ఇన్ఫోసిస్ ప్రారంభించిన తొలి రోజులలో పేరుప్రతిష్టలు లేవు, డబ్బులు లేవు, బ్రాండ్ విలువలేదు. ఒక పెద్ద కంపెనీ కంప్యూటర్ల మీద రాత్రిళ్ళు మాత్రమే పనిచేయడానికి ఒప్పందం చేసుకున్నారు. కొంతమంది ఉద్యోగులను మాత్రమే నియమించుకున్నారు. అయినా జీతాలకు కటకటే. ఆ ఇబ్బందులు చూడలేక ఒక భాగస్వామి తన దారి తాను చూసుకున్నాడు. వీటన్నిటికీ తోడు సర్కారీ కార్యాలయంలో అవినీతి. ఒక్క కంప్యూటర్ దిగుమతి చేసుకోవడానికి (150 శాతం దిగుమతి సంఘం చెల్లించి మరీ) పాతిక సార్లు ఢిల్లీ వెళ్లాల్సి వచ్చేది. టెలిఫోన్ పెట్టించుకోవడానికి సుమారు ఒక ఏడాది పట్టింది. ఐటి మార్కెట్ కూడా గొప్పగా లేదు. ఎంతో కొంత రాబడి వస్తుందన్న ఉద్దేశంతో “ఇన్ఫోసిస్” హార్డ్వేర్ రంగంలోకి వచ్చింది.
పరిమిత వనరులతో పోటీని తట్టుకోవడం కష్టమని అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. దాంతో దుకాణం కట్టేశారు. ఎక్కడో భారత దేశంలో ఉన్న “ఇన్ఫోసిస్” అనే కంపెనీని నమ్మి ముఖ్యమైన బాధ్యతలు అప్పగించడం ఇబ్బందితో కూడిన వ్యవహారమే అనే అనుమానాన్ని తొలగించడానికి నారాయణమూర్తి బృందం “గ్లోబల్ డెలివరీ మోడల్” ను అభివృద్ధి చేసింది. దీని ప్రకారం 70% పనులు భారత్ లో ఉన్న డెవలప్ మెంట్ సెంటర్ లో జరిగితే, మిగతా 30% కీలకమైన పనులు క్లెయింటు ఉన్నచోటే జరుగుతాయి. ఈ నిర్ణయం భారత ఐటీ పరిశ్రమనే మలుపు తిప్పింది. ఇన్ఫోసిస్ సున్నా నుండి అయిదు మిలియన్ డాలర్లకు చేరుకోవడానికి పది సంవత్సరాలు పడితే, అంతకంటే కాస్త తక్కువ సమయంలోనే ఐదు మిలియన్ డాలర్ల నుంచి 700 మిలియన్ డాలర్లకు చేరుకుంది.
నికార్సయిన నాయకుడు
ఇదిలా ఉంటే ఎంతోకాలంగా వ్యాపార సేవలు పొందుతున్న జి.ఇ (జనరల్ ఎలక్ట్రికల్స్) చేజారిపోవడం ఎంత పెద్ద దెబ్బో అంత గొప్ప పాఠం కూడా. అప్పటిదవరకు దాదాపు 25% వ్యాపారాన్ని ఇస్తున్న సంస్థ ధరల విషయంలో చిన్న తేడా రావడంతో వెనక్కి తగ్గింది. మరో ఐ.టీ కంపెనీ అయితే దివాళా తీసేది. మరో నాయకుడు అయితే వాటాదారులకు మొహం చూపించలేక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయేవాడు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఆ పని చేయలేదు, వెనుకడుగు వేయలేదు.
48 గంటలలో తమ భవిష్యత్తు ప్రణాళికను ప్రకటించారు. రాబడి లోటు ఎలా పూడ్చుకునేది వివరించారు. ఆ పారదర్శకత ప్రజల్లో మరింత నమ్మకం పెంచింది. అప్పటినుండి ఒక క్లైంట్ మీద కానీ, ఒక దేశం మీద కానీ, ఒక టెక్నాలజీ మీద కానీ పూర్తిగా ఆధారపడకూడదని నిర్ణయానికి వచ్చారు. అదే పద్దతిని సంస్థ నాయకత్వ బాధ్యతల విషయంలోనూ అవలంభించారు. సంస్థ నాయకత్వ బాధ్యతల విషయంలోనూ ఆయనకు అంతే ముందు చూపు ఉంది.
నారాయణ మూర్తి 52 ఏళ్లకే మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి స్వచ్చందంగా తప్పుకున్నారు. అరవై అయిదు యేండ్లకే చైర్మన్ బాధ్యతలనుండి స్వచ్ఛందంగా వైదొలిగిపోయారు. తనకు ఎక్కడా మోహం లేదు, పదవీ వ్యామోహం అస్సలే లేదు. వ్యాపార సంస్థ నిర్వాహణ అనేది రిలే పరుగు పందెం లాంటిది. ఒకరు పరుగు ఆపగానే మరొకరు అందుకుంటారు, మరెవరో గమ్యం చేరుకుంటారు, ఇంకెవరో పతకం స్వీకరిస్తారు. ఆ బృందంలో నేను ఒక ఆటగాడిని. నేనేం సర్వస్వం కాదు అంటారు నారాయణ మూర్తి. ఎంత గొప్ప మాట. ఇలాంటి మాట కేవలం నారాయణ మూర్తి లాంటి నికార్సయిన నాయకుడు మాత్రమే అనగల మాట.
సుధా మూర్తితో ప్రేమ వివాహం…
నారాయణ మూర్తి ఆయన విజయాల చరిత్రలో సుధా మూర్తి భాగస్వామ్యం వెలకట్టలేనిది. సుధా మూర్తి ప్రస్తావన లేకపోతే, ఆమె త్యాగాలని గుర్తు చేసుకోలేకపోతే, ఆమె ప్రోత్సాహాన్ని కొనియాడకపోతే నారాయణ మూర్తి విజయాల చరిత్ర అసంపూర్ణం, అసమగ్రం. నారాయణ మూర్తి మొదటిసారిగా సుధా మూర్తిని పూణేలో కలుసుకున్నారు. ఇద్దరూ కూడా కన్నడకు చెందినవారే. అప్పటిదాకా ఆయనకు స్థిరమైన ఉద్యోగం లేదు. సుధా మూర్తి మాత్రం అప్పటికే టెల్కో టాటా సంస్థలో ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. నారాయణ మూర్తి పుస్తక ప్రియులు. ఆమెకు కూడా పుస్తకాలు అంటే ఇష్టం. ఓ మిత్రుడు అతని దగ్గర పుస్తకాలు తీసుకొని ఆమెకి ఇచ్చేవాడు. మొదటి పేజీలో పేరు వ్రాసుకోవడం నారాయణమూర్తి కి అలవాటు. అలా నారాయణ మూర్తి కంటే, ఆయన పేరు సుధా మూర్తికి బాగా పరిచయం. ఆ తరువాత ఏదో విందులో ఇద్దరు కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు.
ముందుగా నారాయణ మూర్తే ప్రేమ ప్రతిపాదన తీసుకొచ్చారు, నన్ను పెళ్లి చేసుకుంటారా అని ఆమెను అడిగారు. దానికి ఆమె కాస్త సమయం కోరారు. దానికి సుధా మూర్తి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. నారాయణ మూర్తి ప్యాట్ని కంప్యూటర్స్ లో చేరినాక సుధా మూర్తి పెళ్ళికి ఆమె తల్లిదండ్రులకు ఒప్పుకున్నారు. చేతిలో డబ్బులు లేకపోయినా నారాయణమూర్తి తన మిత్రులతో కలిసి ఇన్ఫోసిస్ ప్రారంభించాలని అనుకున్నప్పుడు సుధా మూర్తి మనసారా ప్రోత్సహించారు. ఆమె పొదుపు చేసుకున్న పదివేల రూపాయలను ఆయన చేతిలో పెట్టారు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో తన నగలు కుదువబెట్టి వారి జీతాల్ని సకాలంలో చెల్లించేవారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే నారాయణ మూర్తిని ఎప్పుడూ నిరాశ పరచలేదు. “కుటుంబం గురించి నేను ఆలోచిస్తాను, లక్ష్యం గురించి మీరు ఆలోచించండి” అని సుధా మూర్తి భరోసా ఇచ్చారు. ఆ దంపతులకు ఒక కుమారుడు రోహన్, కుమార్తె అక్షత. వారిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి.
ఇన్ఫోసిస్ లో నారాయణ మూర్తి ప్రస్థానం…
★ నాగవర రామారావు నారాయణ మూర్తి ఆధ్వర్యంలో 1981 వ సంవత్సరంలో “పూణే” కేంద్రంగా ఇన్ఫోసిస్ సంస్థను ప్రారంభించారు.
★ 1983 వ సంవత్సరంలో ఇన్ఫోసిస్ ప్రధాన కేంద్రం బెంగళూరుకు మారింది.
★ ఇన్ఫోసిస్ సంస్థ 1987 వ సంవత్సరంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని మస్సాచుసెట్స్ రాష్ట్ర రాజధాని “బోస్టన్” లో తొలి అంతర్జాతీయ విక్రయ కేంద్రం ఏర్పాటు చేసింది.
★ 1990 వ సంవత్సరంలో ఇన్ఫోసిస్ పనిచేసే ఉద్యోగుల సంఖ్య 100కు చేరింది. తద్వారా ఇన్ఫోసిస్ సంస్థ అదే సంవత్సరం యూరప్ లో అడుగుపెట్టింది.
★ ఇన్ఫోసిస్ సంస్థలో పబ్లిక్ ఇష్యూ రావడం వలన 1993 లో సంస్థలో ఉద్యోగులకు వాటాలు ఇచ్చారు.
★ 1996 వ సంవత్సరంలో కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ను ప్రారంభించారు.
★ 1999 వ సంవత్సరంలో ఇన్ఫోసిస్ సంస్థ 100 మిలియన్ డాలర్ కంపెనీ స్థాయిని అందుకుంది. దాంతో ఈ కంపెనీని నాస్ డాక్ లో నమోదుచేయబడింది.
★ 2001 సంవత్సరానికి గానూ టైం విజేతల జాబితాలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి స్థానం దక్కింది.
★ ఇన్ఫోసిస్ సంస్థ 2004 వ సంవత్సరంలో బిలియన్ డాలర్ మైలు రాయిని అధిగమించింది.
★ ఇన్ఫోసిస్ సంస్థ 2006 వ సంవత్సరంలో 25 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. అప్పటికి సంస్థ ఆదాయం రెండు బిలియన్ డాలర్లకు చేరుకుంది.
★ ఇన్ఫోసిస్ సంస్థ ఆదాయం 2007 వ సంవత్సరంలో మూడు బిలియన్ డాలర్లతో మరో అడుగు ముందకు వేసింది.
★ 2008 వ సంవత్సరంలో ఇన్ఫోసిస్ సంస్థ నాలుగు బిలియన్ డాలర్ల మైలురాయిని దాటేసింది.
★ 2009 వ సంవత్సరంలో బ్రెజిల్ లో ఇన్ఫోసిస్ సంస్థ తొలి డెవలప్ మెంట్ సెంటర్ ప్రారంభం. దానితో పాటు మెక్సికోలో కూడా కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు.
★ 2011 వ సంవత్సరంలో నారాయణమూర్తి తన ఇన్ఫోసిస్ సంస్థ చైర్మన్ పదవి నుండి వైదొలిగిపోయారు.