
అప్పట్లో పత్రికలే ప్రచార సాధనాలు.. ఢిల్లీలో బాపూజీ పిలుపునిస్తే.. ఆ పిలుపు మారుమూల ప్రాంతాల్లోకి చేరేసరికి సుమారు రెండురోజులు పట్టేది. ఉద్యమకారులపై ఎక్కడైనా ఆంగ్లేయులు దాడికి దిగితే.. ఇక అది ఏ వారానికో ప్రజలకు చేరేది. దీంతో ఉద్యమ స్ఫూర్తి జనాలకు మరింత చేరువ కావాలంటే రేడియో ఒక్కటే మార్గం అనుకున్నారు కాంగ్రెస్ నాయకులు. అలా పుట్టిన ఆలోచనకు ప్రాణం పోసిందే.. ఉషా మెహతా..
‘దిస్ ఈజ్ కాంగ్రెస్ రేడియో కాలింగ్ ఫ్రమ్.. 42.34 మీటర్స్ ఫ్రమ్ సమ్‌వేర్ ఇన్ ఇండియా’.. అంటూ రేడియో ప్రసారాలను అందించింది.
ఆమె మాటలు.. బ్రిటిష్ కోటలను బద్దలు కొట్టేలా.. తెల్లదొరల గుండెల్లో తూటాలు పేల్చేలా ప్రతిధ్వనించాయి. స్వరాజ్య సమరంలో ‘వందేమాతరం’ అని నినదించాయి. అటువంటి ఉద్యమనాయకురాలి జయంతి నేడు(మార్చి 25). కావున ఈ సందర్భంగా ఆమె జీవిత విశేషాలను ఈరోజు మనం తెలుసుకుందాం:
నేపథ్యం..
1920 మార్చి 25న గుజరాత్‌లోని సూరత్ సమీపంలోని సరస్ అనే గ్రామంలో జన్మించారు ఉషా మెహతా. ఆమె తండ్రి బ్రిటిష్ పాలనలో న్యాయమూర్తిగా పనిచేశారు. పదవీ విరమణ తరువాత ఆయన కుటుంబంతో కలిసి బొంబాయికి మకాం మార్చారు. గాంధీజీ పుట్టిన రాష్ట్రం అది. స్వతంత్ర ఉద్యమ గీతాలు వింటూ, నిరసనకారుల ప్రదర్శనలు చూస్తూ పెరిగింది. చిన్నవయసులోనే దేశభక్తిని పెంపొందించుకుంది. జాతిపిత మహాత్మాగాంధీ అహింసా మార్గానికి ఆమె ఎంతగానో ప్రభావితమై బాపు చూపిన మార్గంలో పయనిస్తూ స్వాతంత్య్ర ఉద్యమంలో చేరాలనుకునేది. అలా అని చదువును నిర్లక్ష్యం చేయలేదు. మెట్రిక్యులేషన్‌లో మంచి మార్కులు సాధించింది. సైకాలజీలో డిగ్రీ పట్టా అందుకుంది. తరచూ కాంగ్రెస్ సదస్సులకు హాజరయ్యేది. ఏ కార్యక్రమంలోనైనా చురుగ్గా పాల్గొనేది. డిగ్రీ తర్వాత న్యాయవిద్యలో రాణించాలని భావించింది. కానీ ‘క్విట్ ఇండియా’ ఉద్యమం మొదలుకావడంతో అడుగు అటువైపు పడింది.
రేడియో స్టేషన్ మొదలు..
అప్పట్లో పత్రికలే ప్రచార సాధనాలు.. ఢిల్లీలో బాపూజీ పిలుపు ఇస్తే.. ఆ పిలుపు మారుమూల ప్రాంతాల్లోకి చేరేసరికి సుమారు రెండురోజులు పట్టేది. ఉద్యమకారులపై ఎక్కడైనా ఆంగ్లేయులు దాడికి దిగితే.. ఇక ఏ వారానికో ప్రజలకు చేరేది. దీంతో ఉద్యమ స్ఫూర్తి జనాలకు మరింత చేరువ కావాలంటే రేడియో ఒక్కటే మార్గం అనుకున్నారు కాంగ్రెస్ నాయకులు. అటువంటి వారిలో ఉషా మెహతా ఒకరు.
1942 ఆగస్టు 9న బొంబాయిలోని గోవాలియా ట్యాంక్ గ్రౌండ్ నుంచి క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైనప్పుడు, బాపుతో పాటు కాంగ్రెస్‌లోని పెద్ద నాయకులందరూ అరెస్టయ్యారు. ఉషా మెహతా, ఆమె వంటి కొందరు చిన్న కాంగ్రెస్ నాయకులు బయటికి వచ్చారు. వీరంతా గోవాలియా ట్యాంక్ గ్రౌండ్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, బాపు ఉద్యమ గొంతుకగా మారేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆగస్టు 9వ తేదీ సాయంత్రం కొందరు యువ కాంగ్రెస్ సభ్యులు బొంబయిలో (ప్రస్తుతం ముంబై) సమావేశం నిర్వహించారు. బాపు లేనప్పుడు క్విట్ ఇండియా ఉద్యమం బలహీనపడకూడదనే ఉద్దేశంతో ప్రజలకు సందేశాన్ని అందించాలనుకున్నారు.
ఈ సమావేశంలో వార్తాపత్రికలు ప్రచురించాలనే ఆలోచనను వదిలివేశారు. ఎందుకంటే ప్రతి ఇంటికి వార్తాపత్రికలను అందించడం బ్రిటిష్ పాలనలో కష్టంగా ఉండేది. అందుకే రేడియో స్టేషన్‌ను ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది. దీనికి ఉషా మెహతా ముందుకు వచ్చింది. ఎందుకంటే ఆమెకు మంచి అవగాహన ఉంది. ఉషామెహతా, బాబూభాయ్ ఠక్కర్, విఠల్‌దాస్ జవేరి, నారిమన్ అబ్రాబాద్ ప్రింటర్స్ వంటి యువత ఇంటెలిజెన్స్ రేడియో స్టేషన్‌ను నిర్వహించాలనుకున్నారు. దీని ద్వారా క్విట్ ఇండియా ఉద్యమ జ్వాలను మేల్కొల్పాలని నిర్ణయించుకున్నారు. చికాగో రేడియో యజమానిగా ఉన్న నాంకా మోత్వాని ఇందుకు సహాయకారిగా నిలిచారు. వారు ప్రసారానికి తాత్కాలిక పరికరాలు, సాంకేతిక నిపుణులను అందించారు.
1942 ఆగస్టు 14న కాంగ్రెస్ రేడియోను నెలకొల్పారు. ముంబయిలోని చౌపట్టి ప్రాంతంలో ఓ భవనంలో రేడియో కేంద్రాన్ని నిర్వహించారు. ఆగస్టు 27 నుంచి ఇందులో ప్రసారాలు మొదలయ్యాయి.
ప్రింటర్లు అప్పటికే ఇంగ్లండ్ నుంచి రేడియో టెక్నాలజీని నేర్చుకున్నారు. ఉషా మెహతా అనౌన్సర్ అయ్యారు. ఇలా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ రేడియో ప్రారంభించారు.
బ్రిటిష్ పోలీసులకు అనుమానం వచ్చినప్పుడల్లా రేడియోకి సంబంధించిన సామాగ్రి మొత్తం మరోచోటికి చేరవేసేవారు. ఉషాతో పాటు మరికొందరు ఉద్యమకారులు ఉదయం మొత్తం రేడియో పనిలో తలమునకలయ్యేవారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఒక అరగంటపాటు ఆనాటి విశేషాలను ప్రసారం చేసేవారు. మహాత్మా గాంధీతోపాటు ఇతర కాంగ్రెస్ నాయకుల ప్రసంగాలు కూడా ఇందులో ప్రసారమయ్యేవి. వందేమాతరం గీతంతో ఆ పూట ప్రసారాన్ని ముగించేవారు.
బ్రిటీష్ వారిని నివారించడానికి దాని స్థానాన్ని దాదాపు ప్రతిరోజూ మార్చడం దీని ప్రత్యేకత. రహస్య రేడియోగా పేరుగాంచిన కాంగ్రెస్ రేడియో.. క్విట్ ఇండియా ఉద్యమానికి ఇచ్చిన స్ఫూర్తి అంతా ఇంతా కాదు! రేడియో ప్రారంభమైన వారం నుంచే బ్రిటిష్ అధికారుల్లో కలకలం మొదలైంది. ‘ఇన్నాళ్లూ ఉద్యమం సాగింది.. ఈ రేడియో ఇలాగే కొనసాగితే విప్లవం బయల్దేరుతుందన్న భయం వారిలో పెరిగింది. ఉషా బృందానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక బలగాలు బరిలోకి దిగాయి. బొంబాయి నగరమంతా గాలించాయి. బ్రిటీష్ ఇంటెలిజెన్స్ రహస్య రేడియో స్టేషన్ ఎలా నిర్వహిస్తున్నారో ఆరు నెలల పాటు పరిశోధించింది.
1942 నవంబర్ 12.. సాయంత్రం యథావిధిగా కాంగ్రెస్ రేడియోలో ప్రసారాలు మొదలయ్యాయి. పోలీసులు తమపై దాడికి వస్తున్నారని ఉషాకు సమాచారం అందింది. వాళ్లు రాకముందే కొన్ని డాక్యుమెంట్లు మాయం చేసింది. కాసేపటికి పోలీసులు వచ్చారు. ఉషాను పట్టుకున్నారు. ప్రసార సామగ్రిని ధ్వంసం చేశారు. ఆమెను ఈడ్చుకెళ్లారు. మర్నాటి నుంచి విచారణ జరిపారు. అప్పుడు హైకోర్టులో విచారణ జరిగింది. మహిళ అని కూడా చూడకుండా నానా చిత్రహింసలు పెట్టారు. ఉద్యమ రహస్యాలు చెప్పాల్సిందిగా చిత్రవధ చేశారు. పై చదువులకు విదేశాలకు పంపుతామని ఆశ చూపారు. రేడియోలో కంగుమనే ఆమె కంఠం పోలీసుల ఎదుట మూగబోయింది. ఉద్యమ లక్ష్యం కోసం ఒక్క మాట కూడా బయటికి చెప్పలేదు. కోర్టులో విచారణ తర్వాత ఉషకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. పుణేలోని ఎరవాడ జైలుకు ఆమెను తరలించారు.
స్వాతంత్య్రం తర్వాత..
స్వాతంత్ర్యం తర్వాత ఉషా మెహతా గడిపిన రోజులు తన జీవితంలో అత్యుత్తమ రోజులని చెప్పారు. 1946లో ఉష జైలు నుంచి విడుదలయ్యారు. ఆ మరుసటి ఏడాది దేశానికి స్వతంత్రం వచ్చింది. ఉషా మెహతా కల నెరవేరింది. పై చదవులు చదివారు. గాంధీజీ సిద్ధాంతాలను గురించి పరిశోధన చేసి, డాక్టరేట్‌ను పొందారు. 1980 వరకు బొంబాయి విశ్వవిద్యాలయంలో 30 ఏళ్లపాటు ప్రొఫెసర్‌గా పనిచేసి, రిటైర్ అయ్యారు.
ఒక టెక్నీషియన్ మోసం చేయడం వల్ల కాంగ్రెస్ రేడియో స్టేషన్ కేవలం మూడు నెలలు మాత్రమే నడపగలిగింది.. అయినా కూడా భారతదేశ రేడియో మహిళగా ఉషా మెహతా నిలిచింది.
1998లో ఆమెను ప్రభుత్వం ‘పద్మవిభూషణ్’తో సత్కరించింది. తర్వాత రెండేళ్లకు, 2000 ఆగస్టు 11న 80 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.
గాంధీ స్మారక నిధి ట్రస్టు అధ్యక్షురాలిగా, గాంధీ పీస్ ఫౌండేషన్, న్యూఢిల్లీకి అధ్యక్షురాలిగానూ పనిచేశారు. భారతీయ విద్యాభవన్ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. గాంధీగారికి ప్రమాణం చేసినట్లు జీవితాంతం ఖద్దరునే ధరించారామె.