HISTORY CULTURE AND LITERATURETelugu Special Stories

అపూర్వమైన సోదర బంధానికి ప్రతీక.. రాఖీ పూర్ణిమ..

రాఖీ అంటే రక్షాబంధనం. అన్నాచెల్లెళ్ల ప్రేమ బంధానికి సంకేతం. ఏటా శ్రావణ పౌర్ణమి నాడు అంతటా విశేషంగా జరుపుకునే రాఖీ పండుగ.. ఈ నెల 19న, సోమవారం రోజున వస్తుంది. అసలు రాఖీ సంప్రదాయం ఈనాటిది కాదు.. మన పురాణాల్లో ఈ పండుగ ప్రత్యేకత వేరు.. అసలు ఈ పండుగ ఎలా వచ్చిందో, ఎప్పుడు కడితే మంచిదో వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం…


పూర్వం దేవతలు, రాక్షసులకు మధ్య పుష్కరకాలం పాటు యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు అయిన దేవేంద్రుడు, తన పరివారం అంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడట, భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి చిన్న ఉపాయం ఆలోచించి రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని, భర్త దేవేంద్రుడికి తనపై యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించి ముందుకు పంపుతుంది. అయితే సరిగ్గా అదే రోజు శ్రావణపౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి, రక్షను దేవేంద్రుడు చేతికి కడుతుంది. ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి, యుద్ధానికి పంపిస్తారు. అలా వెళ్లిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి, తిరిగి త్రిలోకాధిపత్యాన్ని పొందుతాడు. ఆ విధంగా రక్షాబంధన్ ప్రారంభమైంది అంటారు.


ఇంకో కథనంలో…

శ్రీకృష్ణుడు శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ సమయంలో కృష్ణుడి చూపుడువేలుకు గాయం అవుతుంది. అది గమనించిన ద్రౌపది తన చీర కొంగు చింపి, కృష్ణుడి చేతికి కట్టు కట్టిందట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా నీకు అండగా ఉంటానని ద్రౌపదికి హామీ ఇచ్చాడట. అందుకు ప్రతిగా దుశ్శాసనుడు దురాగతం నుంచి ఆమెను శ్రీకృష్ణుడు కాపాడాడని పురాణాలు చెబుతున్నాయి.


*అంతేకాదు రాఖీ పౌర్ణమిని ”బలేవా” అని కూడా పిలుస్తారు. బలేవా అంటే బలిరాజు భక్తి. దీని వెనుక ఉన్న కథేంతంటే.. బలి చక్రవర్తి, విష్ణు భక్తుడు. తన అపరిమిత భక్తితో విష్ణుమూర్తిని తన వద్దే ఉంచేసుకున్నాడు. దాంతో వైకుంఠం వెలవెలపోయింది. దీంతో లక్ష్మీదేవి బాగా ఆలోచించి, రాఖీబంధన్ రోజున బలి చక్రవర్తికి రాఖీ కట్టింది. బలి, ”ఏం కావాలమ్మా” అని అభిమానంగా అడిగాడు. లక్ష్మి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరిందిట. బలి మనసు ఆర్ద్రమైంది. సర్వం త్యాగం చేసి, లక్ష్మీదేవితో విష్ణుమూర్తిని వెంట తీసికెళ్ళమన్నాడు. అలా లక్ష్మీదేవి తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది.


ఇంతటి శక్తివంతమైన బంధనం కాబట్టి రక్షాబంధనానికి ఇంతటి గొప్ప చరిత్ర ఉంది. ఆనాటి నుంచి నేటి వరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగగా మారింది. ఆచారంగా కొనసాగుతుంది.


హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో జరుపుకునే ఈ పండుగను మన దేశవ్యాప్తంగా సోదరులు, సోదరీమణులు తమ మధ్య ఉన్న ప్రేమానురాగాలకు, అనుబంధానికి ప్రతీకగా జరుపుకుంటారు.


సమాజంలో మానవతా విలువలు నిస్సారమవుతున్న రోజుల్లో రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మానవ సంబంధాల మెరుగుదలకు, విచక్షణకు ఈ పండుగ దోహదం చేస్తుంది. రాఖీ పండుగను రక్తం పంచుకుని పుట్టిన సోదర, సోదరీమణుల మధ్య జరుపుకోవాలని ఏంలేదు, ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు, సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షాబంధనాన్ని కట్టి వారి క్షేమాన్ని కోరుకోవచ్చు. ఆత్మీయుల మధ్య అనుబంధాలకు, ఐకమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా నిలుస్తుంది.


భద్రకాలంలో రాఖీ జరుపుకోకూడదు ఎందుకంటే..


మన శాస్త్రాల ప్రకారం, ఈ పండుగను భద్రకాలంలో చేసుకోరాదు. అసలు ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు జరుపుకోకూడదు. అలాంటిది రక్షా బంధన్ రోజున భద్రకాలం ఉంటే గమనించి, చేసుకోవాలి. ఈ నేపథ్యంలో చూస్తే.. భద్రకాలం ఆగస్టు 19, సోమవారం మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఉంటుంది. అందుకే ఈ సమయం పూర్తయ్యాకే రాఖీ పండుగను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.


పురాణాల ప్రకారం, సూర్యదేవుని కుమార్తె భద్ర.. ఆమె రాక్షసులను నాశనం చేయడానికి జన్మించింది. పుట్టిన సమయంలోనే విశ్వం మొత్తాన్ని తన స్వరూపం మార్చుకోవడంతోనే ప్రారంభించింది. ఈ సమయంలో శుభకార్యాలు, యాగాలు, క్రతువులు ఎక్కడ జరిగినా అక్కడ ఇబ్బందులు తలెత్తుతాయట. ఈ కారణంగా భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు. వైదిక పంచాంగం ప్రకారం, భద్ర మూడు లోకాలలో అంటే స్వర్గం, పాతాళం, భూమిలో ఉంటుంది. అందుకే ఈ కాలంలో ఎలాంటి పనులు చేపట్టినా, విజయవంతంగా పూర్తి కావని చాలా మంది విశ్వాసం.


*మొదట్లో రాఖీని హిందువులు, సిక్కులు మాత్రమే జరుపుకునేవారు. అలాగే అమ్మాయిలు తమ సొంత అన్నదమ్ములకు మాత్రమే రాఖీ కట్టేవారు. కానీ ఈ సంప్రదాయం ఇప్పుడు దేశంలో అన్ని మతాలకూ పాకింది.


*అలాగే, సొంతవారికే కాకుండా, తమ ఇష్టాన్ని బట్టి అన్నదమ్ముల వరసయ్యే వారికీ కడుతున్నారు. చుట్టరికంలోనే, పక్కింటివారు, స్నేహితులు ఇలా ఎవరికైనా రాఖీ కడుతున్నారు.


*కాలేజీల్లో తమ వెంటబడి పోకిరీ వేషాలు వేసే అబ్బాయిల్ని రాఖీతో వదిలించుకునే అమ్మాయిలకీ లోటు లేదు.


*సోదరునికి రాఖీ కట్టి, నుదుట బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరిని ఆశీర్వదించి కానుకలివ్వడం ఆనవాయితీ. ఈ రోజునే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు తమ పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం. అందుచేతనే ఈ రోజును జంధ్యాల పూర్ణిమగా పిలుస్తారు.

Show More
Back to top button