CINEMATelugu Special Stories

శతాబ్దాల తెలుగు సాహితీ చరిత్రలో రారాణి, నవలారాణి.. యాద్దనపూడి సులోచనారాణి..

గత 100 సంవత్సరాలుగా తెలుగు సాహితీ రంగాన్ని సుసంపన్నం చేసిన రచయితలను, రచయిత్రులను, కవులను, పండితులను గుర్తుచేసుకోవాలంటే ఎన్నో లక్షల మంది ఉంటారు. పాఠకుల ఆలోచనల్లో, హృదయాల్లో, పాఠకుల చర్చల్లో మిగిలిపోయేలా రచనలు చేసిన రచయితలు అంటే కొంతమంది మాత్రమే ముందు వరుసలలో కనిపిస్తారు. ఒక గురజాడ, ఒక కందుకూరి, ఒక చలం, ఒక శ్రీశ్రీ, ఒక విశ్వనాథ, ఒక తిలక్, ఒక కృష్ణశాస్త్రి లాంటి వారంతా ఒక కోవకు చెందిన సాహితీ ప్రముఖులైతే ఆధునిక నవలా రంగంలో ఇలా దశాబ్దాల తరబడి వన్నెతెరగని ప్రజాదరణ పొందిన రచయితలు, రచయిత్రులు ఎవరంటే ముందుగా వినిపించే పేరు, తెలుగువారు అభిమానించి ప్రేమించి సొంతం చేసుకున్న పేరు “యద్దనపూడి సులోచనారాణి” గారు. కాల యవనిక మీద ఆమె చేసిన సంతకం దశాబ్దాలైనా చెక్కుచెదరకుండా ఉండిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 1960, 1970, 1980 ఆ దశకాలలో యద్దనపూడి సులోచనారాణి గారు వ్రాసిందే నవల, తన సీరియల్ గా వచ్చిందే పత్రిక, తన నవలలు ప్రచురించిన వారే ప్రచురణకర్తలు అనేంతగా ప్రభావాన్ని చూపించిన రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి గారు. విమర్శలకు అతీతంగా తాను నమ్మిన మగువ మనోవిశ్లేషణ అనే అంశం చుట్టూ యద్దనపూడి సులోచనారాణి గారు అల్లిన నవలలు తెలుగు నవలా సాహిత్యంలో చిరంజీవులు. పాఠకుల కోసం వ్రాసి, పాఠకులలోకి వెళ్లి, పాఠకుల హృదయాలలో నిలిచే రచయితలు, రచయిత్రులు కొంతమంది అయితే, మామూలు వ్యక్తులను కూడా పాఠకులుగా మార్చగల, తమ పాఠకులను తామే తయారుచేసుకోగల సత్తా, మహత్తు, ఆకర్షణ ఉన్న రచయితలు చాలా కొద్దిమంది ఉంటారు. ఒక చలం, ఒక కొవ్వలి. అదే కోవలో అరవై ఏళ్ల అవిశ్రాంత కథ, నవల, రచన చేసిన యద్దనపూడి సులోచనారాణి గారు కనిపిస్తారు.

“నేను ఈ లోకం విడిచి వెళ్లిపోయాక నా గురించి బాధపడకండి, సంతాప సభలు పెట్టకండి. ఈ భూమి మీద నుండి నిష్క్రమించడం అనేది అతి పురాతనమైన, అతి సాధారణమైన, అతి సహజమైన ప్రక్రియ అని గుర్తుంచుకొని నా మరణ వార్త విన్నప్పుడు నా సెక్రెటరీ నవల చదువుకోండి చాలు” అని గత కొన్ని సంవత్సరాలుగా అనేక ఇంటర్వ్యూలలో చెప్పారు. ఎక్కడో ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో కాజా అనే ఊరిలో జీవితపు తొలి అడుగులు ప్రారంభించి, ఎక్కడో వేల మైళ్ళ దూరంలో ఉన్న కాలిఫోర్నియాలో తన జీవన ప్రస్థానానికి తుదివాక్యం వ్రాసుకున్న రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి గారు. పెద్దగా చదువుకోకపోయినా ఒక సాధారణ యువతి, ఒక అసాధారణ రచయిత్రిగా పేరు తెచ్చుకోవచ్చు అని నిరూపించిన వ్యక్తి యద్దనపూడి సులోచనారాణి గారు.

తెలుగు నవలా సామ్రాజ్యానికి మకుటం ఉన్న మహారాణి “శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి” గారు. యద్దనపూడి సులోచనారాణి గారు తన అమ్మ మరణం కలిగించిన విషాదం నుండి కోలుకోవడానికి కలం పట్టినప్పుడు ఆమె అతి సాధారణమైన కరణం గారి అమ్మాయి, పల్లెటూరి యువతి. కథలు వ్రాయడం ప్రారంభించిన తొలి రోజులలో సంవత్సరానికి కేవలం ఒకటి రెండు కథలు మాత్రమే వ్రాసినప్పుడు ఆమె కొత్తగా కాపురానికి వెళ్లిన పెళ్లికూతురు. అప్పటినుండి ఇప్పటిదాకా వందలాది పుస్తకాలతో, వేలాది పాత్రలతో, సంఘటనలతో లక్షలాది ప్రతులతో, కోట్లాదిమంది ఆంధ్రుల హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న నవలా సామ్రాజ్ఞి. ఆమె సృష్టించిన నవలా ప్రభంజనం నుండి తేరుకోవడం ఇప్పటికే కాదు, మరికొన్ని దశాబ్దాలు అయినా సాధ్యం కాదు.

జీవిత విశేషాలు…

జన్మ నామం : యద్దనపూడి సులోచనారాణి

ఇతర పేర్లు : నవలారాణి 

జననం : 2 ఏప్రిల్ 1940

స్వస్థలం : కాజ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్

తండ్రి : నెమలికంటి చలపతి రావు 

తల్లి : మహాలక్ష్మి 

జీవిత భాగస్వామి : లక్ష్మి నరసింహా రావు 

పిల్లలు : లక్ష్మి శైలజ 

వృత్తి : నవలా రచయిత్రి

మరణం : 21 మే 2018, కుపర్టినో , కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్

నేపథ్యం…

యద్దనపూడి సులోచనారాణి 02 ఏప్రిల్ 1939 నాడు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మొవ్వ మండలములోని కాజ గ్రామములో జన్మించారు. ఆమె తండ్రి నెమలికంటి చలపతిరావు, తల్లి మహాలక్ష్మి. తండ్రి నెమలికంటి చలపతిరావు గారు కాజ అనే గ్రామంలో కరణంగా పనిచేస్తున్నారు. అతనికి ఆరుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు. అందరిలోకెల్లా చిన్నదయిన యద్దనపూడి సులోచనారాణి గారికి ఐదుగురు అక్కలు, ముగ్గురు అన్నయ్యలు. ఆమె అక్కలకు, అన్నయ్యలకు, యద్దనపూడి సులోచనారాణి గారికి వయస్సులో చాలా వ్యత్యాసం ఉండడం వలన ఆమె అక్కయ్యల పిల్లలలకు, అన్నయ్యల పిల్లలకు యద్దనపూడి సులోచనారాణి గారు కొద్ది సంవత్సరాల తేడాతోనే ఉండేవారు. వారిది చాలా పెద్ద కుటుంబం. యద్దనపూడి సులోచనారాణి గారి నాన్నగారు కరణం గారు కావడం, ఆమె మేనమామలు, పిన్నిలు వారి పిల్లలు, అక్కలు అందరు కలిసి ఉండడం వలన వీరి బాల్యమంతా ఒక సంస్థానం లాంటి కుటుంబ వ్యవస్థలో సాగిపోయింది.

అందమైన బాల్యం…

యద్దనపూడి సులోచనారాణి గారి నాన్నగారు కరణం గారు అవ్వడంతో చాలామంది ఇంటికి వస్తూపోతూ ఉండేవారు. ఇంత పెద్ద కుటుంబం ఉండి కూడా ఇద్దరు అనాధ పిల్లలను వీరితోబాటే ఉంచి వారికి కూడా భోజనం పెడుతూ ఉండేవారు. యద్దనపూడి సులోచనారాణి గారి అమ్మమ్మ గారు చాలా వృద్ధురాలు. ఆమె యద్దనపూడి సులోచనారాణి గారిని తన ప్రక్కలో పడుకోబెట్టుకొని రామాయణం, మహాభారతం లాంటి కథలన్నీ చెబుతూ ఉండేవారు. యద్దనపూడి సులోచనారాణి గారు ఆమె అమ్మమ్మతో గారితో రుక్మిణీ కళ్యాణం కథను మళ్ళీ మళ్ళీ చెప్పించుకునేవారు. 

యద్దనపూడి సులోచనారాణి గారి నాన్నగారికి సాహిత్యం అంటే చాలా ఇష్టం. అందువలన తపాలాశాఖ ద్వారా పుస్తకాలను తెప్పించుకొని తాను చదివడమే కాకుండా తన పిల్లలతో కూడా చదివిస్తుండేవారు. యద్దనపూడి సులోచనారాణి గారి నాన్నగారు వారిని చాలా క్రమశిక్షణతో పెంచారు. యద్దనపూడి సులోచనారాణి గారు అందరికంటే చిన్న పిల్ల కావడంతో వారి కుటుంబ సభ్యులు ఆమెను ఎంతో గారాభంగా చూస్తుండేవారు. యద్దనపూడి సులోచనారాణి గారు వాళ్ల ఊర్లో ఉండే శివాలయానికి వెళ్లడం, సంక్రాంతికి బొమ్మల కొలువు, కార్తీకమాసంలో చెరువు కెళ్ళి కార్తీకదీపాలను వదలడం, చక్కని ఆ చెరువు గట్టుమీద కూర్చొని తామరపూలు చూడడం లాంటి అందమైన బాల్యాన్ని ఆమె ఆస్వాదించారు.

14 వ యేటనే వివాహం…

యద్దనపూడి సులోచనారాణి గారి పెద్దక్కయ్య రంగమ్మ చూపు మందగించడంతో యద్దనపూడి సులోచనారాణి గారితోనే పుస్తకాలు చదివించుకునేవారు. వారికి దగ్గరలో ఉన్న ఊరు బందరు. అందువలన పడవలో బందరు వెళ్లి సినిమాలు చూసి వస్తుండేవారు. యద్దనపూడి సులోచనారాణి గారికి తన 14వ సంవత్సరంలోనే యద్దనపూడి లక్ష్మీనరసింహారావు గారితో వివాహం చేశారు. కానీ కాపురానికి మాత్రం పంపలేదు. యద్దనపూడి సులోచనారాణి గారి నాన్నగారు ఆమె ఎస్.ఎస్.ఎల్.సి, పి.యు.సి అయిపోయినాక మాత్రమే కాపురానికి పంపిస్తానని చెప్పారు. యద్దనపూడి సులోచనారాణి గారి పెద్దన్నయ్య గారు “ములుకోలా” అనే పత్రికకు కథలు వ్రాస్తుండేవారు. వాళ్ళ మూడో అన్నయ్య నెమలికంటి రాధాకృష్ణమూర్తి గారు కూడా కథలు వ్రాసేవారు, కానీ అందులో అచ్చుతప్పులు ఉండడం వలన తిరిగి వెనక్కి వస్తుండేవి. వాటిని సరిచేసి పంపించినా కూడా అవి వెనక్కి వస్తుండేవి. దాంతో ఆయన కథలను వ్రాయడం మానేసి బీ.హెచ్.ఈ.ఎల్ లో ఉద్యోగం చేస్తూ అప్పుడప్పుడు నాటకాలు కూడా వేస్తుండేవారు.

చిన్నతనంలో తల్లిని కోల్పోయిన యద్దనపూడి సులోచనారాణి..

ఈ విధంగా యద్దనపూడి సులోచనారాణి గారి పాఠశాల జీవితం, కుటుంబ జీవితం జరుగుతుండగా వాళ్ళ పాఠశాలలో ఒక వ్యాసరచన పోటీలు పెట్టారు. కుద్దూస్ మాస్టారు ఇచ్చిన ఒక వ్యాసం (ఆవు గురించిన వ్యాసం) యద్దనపూడి సులోచనారాణి గారు చాలా చక్కగా వ్రాశారు. ఆమె చక్కగా వ్రాసినందుకు తరగతి పిల్లలతో చప్పట్లు కొట్టించి అభినందించారు. ఆ తరువాత కుద్దూస్ మాష్టారు నడుపుతున్న వ్రాత పత్రికకు యద్దనపూడి సులోచనారాణి గారితో “మనోఛాయలు” అనే కథను వ్రాయించారు. తన 14 ఏళ్ల వయస్సులో ఎనిమిదవ తరగతిలో ఉన్న ఆమె మొదటి కథను వ్రాశారు. ఎస్.ఎస్.ఎల్.సి అయిపోయాక యద్దనపూడి సులోచనారాణి గారి అమ్మగారు మరణించారు. దాంతో ఆమెకు విపరీతమైన శూన్యం ఏర్పడింది.

రచయిత్రిగా తన తొలికథ “చిత్రనళినీయం”…

యద్దనపూడి సులోచనారాణి గారు వాళ్ళ అమ్మ చనిపోయిన నిరాశలో ఉండగా వాళ్ళింటికి కుద్దుస్ మాస్టరు గారు వచ్చారు. శూన్యంలో ఉన్న ఆమెతో కథలు వ్రాయించమని యద్దనపూడి సులోచనారాణి గారి నాన్న గారికి చెప్పారు. ఆ సలహాతోనే ఆమె కలం పట్టి నిజంగా రచయిత్రిగా, పాఠక లోకానికి పరిచయం చేసేలా చేసింది. యద్దనపూడి సులోచనారాణి గారు వాళ్ళ మూడో అన్నయ్య కథలు వ్రాసినప్పుడు అందులో తప్పులను చక్కగా సరిచేసేవారు. యద్దనపూడి సులోచనారాణి గారు చదివిన సాహిత్యం, వాళ్ళ నాన్నగారు చదివించిన పుస్తకాలు, శరత్ గారి సాహిత్యం, వాళ్ళ పాఠశాలలో చదువుకున్న పుస్తకాలు అన్నీ కలిపి ఆమెతో మొదట కథ వ్రాయించేలా చేశాయి. ఆ కథ పేరు “చిత్రనళినీయం”. చాలా పేజీలుగా వ్రాసిన ఆ కథను ఎక్కడికి పంపించాలి అన్న ఆలోచన వచ్చింది. దాంతో యద్దనపూడి సులోచనారాణి గారి అక్కయ్య పిల్లలు కుద్దూస్ మాస్టారు గారిని సంప్రదించగా తాను “ఆంధ్ర పత్రిక” చిరునామా ఇచ్చి అక్కడికి పంపించమని సలహా ఇచ్చారు.

“ఆంధ్ర పత్రిక”లో ప్రచురించిన తన తొలికథ…

యద్దనపూడి సులోచనారాణి గారు వ్రాసిన “చిత్రనళినీయం” కథను పంపించడానికి తపాలా ద్వారా అర్ధ రూపాయి అవుతుందని తపాలా అధికారి చెప్పారు. ఆ సమయానికి ఆమె దగ్గర డబ్బులు లేవు. ఆమె రెండవ అక్కయ్యను అర్ధరూపాయి అడిగారు. ఆమె ఇచ్చిన అర్ధ రూపాయితో తపాల రుసుము చెల్లించి “ఆంధ్రపత్రిక” కు ఆ కథను పంపించారు. ఆ అర్ధ రూపాయి తీసుకున్నందుకు గాను వాళ్ళ అక్కయ్యకు రోజు రాత్రి 10 గంటలకు పుస్తకం చదివి వినిపిస్తుండేవారు యద్దనపూడి సులోచనారాణి గారు. ఇలా ఉండగా ఒకరోజు యద్దనపూడి సులోచనారాణి గారి అక్కయ్య పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి “ఆంధ్ర పత్రిక” లో తాను వ్రాసిన కథను ప్రచురించడం చూపించారు. అలా ఆమె వ్రాసిన కథ 01 మే 1957 నాడు “ఆంధ్రపత్రిక” లో ప్రచురించారు. 01 మే 1957 నాడు “ఆంధ్ర సచిత్ర వార పత్రిక” ఆరవ పేజీలో “చిత్రనళినీయం” అనే యద్దనపూడి సులోచనారాణి కథ గారి కథ వచ్చింది. ఆ కథ ద్వారానే “ఒక నవలా రచయిత్రి, మహారాణి లాగా వెలిగిపోయిన యద్దనపూడి సులోచనారాణి గారి తొలి అడుగు 01 మే 1957 నాడు మొదలైంది.

తొలి పారితోషికం 15 రూపాయలు…

యద్దనపూడి సులోచనారాణి గారు కథ వ్రాయడం, ఆ కథ ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ప్రచురింపబడిన విషయం వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. మొదట్లో వాళ్ళు నమ్మలేదు. కథ యద్దనపూడి సులోచనారాణి గారు వ్రాశారా? లేక వాళ్ళ అన్నయ్య వ్రాశాడా? అని తేల్చుకోవడానికి. దాంతో వాళ్ల పెద్దన్నయ్య ఊరునుండి వచ్చిన తరువాత అతను వ్రాయలేదని చెప్పిన తరువాత యద్దనపూడి సులోచనారాణి గారి నాన్నగారు సంతోషించారు. ఆమె వ్రాసిన కథ ఆంధ్రపత్రికలో రెండో వారం కూడా ప్రచురితమైంది.

కొన్ని రోజుల తరువాత “ఆంధ్ర పత్రిక” వారు 15 రూపాయలు పారితోషికం పంపించారు. దాంతో యద్దనపూడి సులోచనారాణి గారికి మిక్కిలి సంతోషం కలిగింది. కథలు వ్రాస్తే డబ్బులు వస్తాయనే విషయం ఆమెకు తెలియదు. అర్ధరూపాయి స్టాంపులు వేసి పంపిస్తే పదిహేను రూపాయలు డబ్బులు రావడం ఆమె కుటుంబానికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. యద్దనపూడి సులోచనారాణి గారు ఆ డబ్బులతో వాళ్ల నాన్నగారికి జరీ అంచు పంచె, ఉత్తరీయం కొనిపెట్టారు. వాళ్ళ నాన్నగారు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ విషయం ఊళ్లోని వారందరికీ చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు యద్దనపూడి సులోచనారాణి గారి నాన్నగారు కూడా మూడు, నాలుగు సంవత్సరాలకే మరణించారు.

“చదువుకున్న అమ్మాయిలు” సినిమాకు తొలి కథ…

నాన్న మరణం తరువాత యద్దనపూడి సులోచనారాణి గారు తన భర్త లక్ష్మీనరసింహారావు గారితో కలిసి కాపురానికి వెళ్లారు. 1962 సంవత్సరం వచ్చేసరికి ఆమె ఏడు నుండి ఎనిమిది కథలు వ్రాశారు. ఆమె గురించి తెలుసుకున్న రచయిత గోపీచంద్ గారు ఆమెను ప్రోత్సహిస్తూ 1962 లో ఒక సినిమా కథ వ్రాయాలనే ప్రతిపాదన తీసుకువచ్చారు. అతను సంభాషణలు వ్రాస్తున్న “చదువుకున్న అమ్మాయిలు” సినిమాకు యద్దనపూడి సులోచనారాణి గారితో కథను వ్రాయించాలనుకున్నారు. డా.శ్రీదేవి గారు రచించిన నవల “కాలాతీత వ్యక్తులు” అనే కథతో దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారు “చదువుకున్న అమ్మాయిలు” సినిమా తీస్తున్నారు. కానీ కథా చర్చలు జరుగుతుండగా డాక్టరు శ్రీదేవి గారు మధ్యలోనే మరణించారు. దాంతో యద్దనపూడి సులోచనారాణి గారితో మిగతా కథను పూర్తిచేయించారు. ఆ విధంగా తొలిసారి వెండితెరపై “చదువుకున్న అమ్మాయిలు” సినిమాలో కథానువాదం అని మిగతా వారి పేర్లతో కలిపి యద్దనపూడి సులోచనారాణి గారి పేరు పడిపోయింది. 

“సెక్రటరీ” సీరియల్…

బి.వి.రాఘవయ్య గారు వ్యవస్థాపకులుగా 1963 లో ప్రారంభమైన “జ్యోతి” అనే మాసపత్రికలో బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, నండూరి రామ్మోహన్ రావు గారు, రావి కొండలరావు గారు సంపాదకీయ వర్గంలో ఉన్నారు. ఈ పత్రిక ప్రారంభమైన సంవత్సరం తరువాత వీరు యద్దనపూడి సులోచనారాణి గారిని కలిసి ఒక సీరియల్ వ్రాయమన్నారు. తనకు సీరియల్ వ్రాసిన అనుభవం లేదు. కానీ వాళ్ళ ఒత్తిడితో కాదనలేక “సెక్రెటరీ” అనే సీరియల్ వ్రాయడానికి ఒప్పుకున్నారు. 01 ఏప్రిల్ 1964 నాడు జ్యోతి అనే మాసపత్రికలో “వచ్చే నెల నుండి సెక్రటరీ అనే సీరియల్ ప్రారంభమవుతుంది, తప్పక చదవండి. అది వ్రాసిన వారు యద్దనపూడి సులోచనారాణి గారు” అని ఇలా ప్రకటన వచ్చింది.

ఆ తరువాత రోజులలో వందల నవలలు వ్రాసి కోట్లాదిమంది పాఠకులను తన వైపు తిప్పుకోవడానికి కారణమైన మొట్టమొదటి నవల “సెక్రెటరీ” 01 ఏప్రిల్ 1961 నాడు జ్యోతి మాస పత్రికలో ప్రకటనతో ఆరంభమైంది. మే 1964 సంచిక నుండి “సెక్రటరీ” సీరియల్ ప్రారంభమైంది. అలా ప్రారంభమైన ఆ సీరియల్ యద్దనపూడి సులోచనారాణి గారికి విపరీతమైన పేరు తీసుకువచ్చింది. ఆ సీరియల్ వ్రాస్తుండగానే ఆమె ఒక పాపకు జన్మనిచ్చారు. ఆ అమ్మాయి పేరు “లక్ష్మీ శైలజ”. అలా “సెక్రటరీ” సీరియల్ తో మొదలైన కలం యాభై సంవత్సరాల వరకు వ్రాస్తూనే ఉంది. ఆమె రచనలు చదివిన కొంతమందిపాఠకులు “ఆమె మధ్యతరగతి స్త్రీలను ఊహాలోకంలో విహరింపజేస్తున్నారని విమర్శలు కూడా చేశారు. కానీ కోట్లాదిమంది పాఠకుల అభిమానం ముందు ఆ విమర్శలు నిలువలేకపోయాయి.

ఆత్మగౌరవం చిత్ర కథకు నంది పురస్కారం…

యద్దనపూడి సులోచనారాణి గారికి ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారు తీసిన “మనసులు – మమతలు” అనే సినిమాకి పూర్తి కథారచన చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమా సెప్టెంబరు 1965 లో విడుదలైంది. ఆ సినిమాకు కథను పూర్తిగా యద్దనపూడి సులోచనారాణి గారే వ్రాశారు. అలా యద్దనపూడి సులోచనారాణి గారు వ్రాసిన మొట్టమొదటి కథ చిత్రనళినీయం, మొట్టమొదటి నవల “సెక్రటరీ”, మొట్టమొదటి సినిమా కథ “మనుషులు – మమతలు”. కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు 1966లో దర్శకత్వం వహించిన “ఆత్మగౌరవం” సినిమాకు గొల్లపూడి మారుతీరావు గారితో కలిసి కథను అందించారు.

ఆంధ్రప్రదేశ్ లో మొదలైన నంది పురస్కారాల విభాగంలో “ఆత్మగౌరవం” సినిమాకు గొల్లపూడి మారుతీరావు గారితో కలిసి యద్దనపూడి సులోచనారాణి గారు సంయుక్తంగా కథా రచయితగా నంది పురస్కారం అందుకున్నారు. 1969 లో వచ్చిన “ఆత్మీయులు” సినిమాకు కూడా యద్దనపూడి సులోచనారాణి గారే కథను అందించారు. ఆ తరువాత వచ్చిన “విజేత”, “విచిత్ర బంధం”, “మీనా”, “బంగారు కలలు” లాంటి 17 నవలలు చిత్రాలుగా వచ్చాయి. అత్యధికంగా ఆమె నవలలను అక్కినేని నాగేశ్వరావు గారు సినిమాలుగా తీశారు. ఆ తరువాత వరుసలో శోభన్ బాబు గారు ఉన్నారు.

పాఠకులే గ్రంథాలు…

“నన్ను చూడడానికి వచ్చే నా అభిమాన పాఠకులు, నా ఇంటికి వచ్చిన మానవ గ్రంథాలయాలు. ప్రపంచమే నా దగ్గరికి వచ్చినట్లయ్యింది. పాఠకుల గుండె తలుపులు తట్టగల రచనలు చేయడం కేవలం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. నేను, నా రచనలు, నా పాఠకులు, నా నవలా ప్రచురణకర్తలు అంతా నా సమిష్టి కుటుంబం. నా బాల్యంలో నేను అమ్మానాన్నల దగ్గర పొందిన అపురూపమైన ప్రేమాభిమానాలు వీరి దగ్గర లభించాయి” అని యద్దనపూడి సులోచనారాణి గారు పలు ఇంటర్వ్యూలలో చెప్పారు.

సుదీర్ఘ నిద్రలోకి…

తన కుటుంబ విషయానికొస్తే యద్దనపూడి సులోచనారాణి గారికి తన పద్నాలుగు సంవత్సరాల వయస్సులోనే యద్దనపూడి లక్ష్మీనరసింహారావు గారితో వివాహం జరిగింది. లక్ష్మీనరసింహారావు గారు కొద్ది సంవత్సరాల క్రిందటే మరణించారు. ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు యద్దనపూడి సులోచనారాణి గారు ఒక రకమైన శూన్యతకు లోనయ్యారు. భర్త మరణానంతరం ఆ విషాదకరమైన సంఘటన నుండి ఆమె పాఠకులకు, అభిమానులకు దూరంగా ఉన్నారు. ఆ దంపతులకు ఒక్కరే కూతురు “లక్ష్మీ శైలజ”. వారి అల్లుడు పేరు రవి, మనమడి పేరు హర్షార్. మనిషికి బాల్యం, యవ్వనం కంటే వృద్ధాప్యంలో మానసికంగా ప్రశాంతంగా ఉండటం ముఖ్యం అనేవారు యద్దనపూడి సులోచనారాణి గారు. కూతురిని కనడం కంటే, మంచి అల్లుడు దొరకడం వలన జీవితం అదృష్టంగా మారుతుంది.

తన అల్లుడు రవి తనకు కొడుకు కంటే ఎక్కువ. సెలవులలో యద్దనపూడి సులోచనారాణి గారు అమెరికా వెళ్ళుతుంటారు. మనవడు హర్షార్ చెస్ ఛాంపియన్. యద్దనపూడి సులోచనారాణి గారు చివరి రోజులలో వై.ఎస్.ఎస్.ఆర్ అనే ఫౌండేషన్ స్థాపించారు. పదవీ విరమణ చేసిన డాక్టర్లు, లాయర్లు మరికొందరు కలిసి వృద్ధులకు, వీధి బాలలకు, పేద స్త్రీలకు, ఎయిడ్స్ క్యాన్సర్ లాంటి వ్యాధుల బారిన పడిన వారికి చేతనైన సహాయం చేస్తుండేవారు. యద్దనపూడి సులోచనారాణి గారి భర్త మరణించాక ఆమె కొంత నిర్లిప్తంగా ఉన్నారు. అయినప్పటికీ అడపాదడపా కథలు వ్రాస్తూనే ఉన్నారు. ఫిబ్రవరి 2018 లో అమెరికాకు వెళ్లారు. తిరిగి భారతదేశం వచ్చి అన్నీ సర్దుకుని వెళ్లి అమెరికాలో స్థిరపడదాం అనుకుంటున్న సమయంలో ఒకనాటి రాత్రి అంటే 21 మే 2018 నాడు అమెరికాలోని కాలిఫోర్నియాలో గుండె నొప్పితో బాధపడిన యద్దనపూడి సులోచనారాణి గారు నిద్రలో నుండి సుదీర్ఘ నిద్రలోకి జారుకున్నారు.

యద్దనపూడి సులోచనారాణి గారి నవలలు..

ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అభిజాత, అభిశాపం, అగ్నిపూలు, ఆహుతి, అమర హృదయం, అమృతధార, అనురాగ గంగ, అనురాగ తోరణం, అర్థస్థిత, ఆశల శిఖరాలు, అవ్యక్తం, ఋతువులు నవ్వాయి, కలలకౌగిలి, కీర్తికిరీటాలు, కృష్ణలోహిత, గిరిజా కళ్యాణం, చీకటిలో చిరుదీపం, జీవన సౌరభం, జాహ్నవి, దాంపత్యవనం, నిశాంత, ప్రేమ, ప్రేమదీపిక, ప్రేమపీఠం, బహుమతి, బందీ, బంగారు కలలు, మనోభిరామం, మౌనతరంగాలు, మౌన పోరాటం, మౌనభాష్యం, మోహిత, వెన్నెల్లో మల్లిక, విజేత, శ్వేత గులాబి, సెక్రటరీ, సౌగంధి, సుకుమారి, జీవన తరంగాలు, సంసారరధం, సహజీవనం.

Show More
Back to top button