CINEMATelugu CinemaTelugu Special Stories

తెలుగువారి కీర్తి పతాకను దేశవ్యాప్తంగా రెపరెపలాడించిన తెలుగు ఆత్మగౌరవ చిహ్నం.. ఎన్టీఆర్..

తెలుగు కళామతల్లి చూసిన ఎందరో మహానటులలో దశాబ్దాలు అనితర సాధ్యం కాని తమ నటనతో, ఆహార్యంతో,  మనలను అలరించింది కొద్దిమందే అని చెప్పవచ్చు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, యస్వీ రంగారావు, కృష్ణ మొదలగు నటులు. అలాగే సావిత్రి, జమున, అంజలి, కృష్ణకుమారి, సూర్యకాంతం, వాణిశ్రీ మొదలగు నటీమణులు. ఇందరి మహాకళాకారుల నడుమ తనదైన విలక్షణమైన నటనతో, చాతుర్యంతో, సంభాషణా నడవడికతో, తన కళపై అకుంఠిత శ్రమతో, పాఠాలు నేర్చుకొంటూ ఎవరస్టు శిఖరాలను అందుకున్న నటుడు, నిర్మాత, దర్శకుడు, నాయకుడు, ప్రతినాయకుడు, ప్రతిపక్షనాయకుడు, మహానాయకుడు, చిత్రకారుడు నందమూరి తారకరామారావు.

చిత్ర జీవితంలోనే కాదు, నిజ జీవితంలోనూ ఇన్ని పాత్రలు పోషించి, శాసించి, భాసించిన ప్రభంజనుడు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు. ఇన్ని కోట్ల ఆంధ్రుల మదిలో అజరామర ముద్రవేసి రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణుడు, యముడు, శ్రీకృష్ణదేవరాయలు, పుండరీకుడు, జానపద వీరులు  ఇలానే ఉండేవారమో అనే భావనను కలిగించి ఒక మరుపురాని కళాకారుడుగా, మహోన్నత జగదేక సుందర రూపంతో కోట్లాది అభిమానుల గుండెల్లో నేటికీ నిలిచిపోయిన మాహానటుడు మన నందమూరి తారక రామారావు మాత్రమే.

నందమూరి తారకరాముడిని ప్రధానంగా పౌరాణిక చిత్రాలు తెలుగువారి ఆరాధ్య దైవంగా మార్చాయి. ఆయనే కృష్ణుడు, ఆయనే సుయోధనుడు, ఆయనే రాముడు, ఆయనే రావణాసురుడు, ఆయనే అర్జునుడు, ఆయనే కర్ణుడు, ఆయనే భీముడు, ఆయనే బృహన్నల అన్నీ ఆయనే. సామాన్యుడిగా మొదలై, అసామాన్యునిగా ఎదిగి నిలిచిన శకపురుషుడు నందమూరి తారక రామారావు. నవ నవోన్మేష చైతన్య రూపం, జగదేక సుందర స్వరూపం తారకరామ నామధేయం. అటు సినీ జగత్తులోనూ, ఇటు రాజకీయ రణరంగంలోనూ రాణకెక్కిన ప్రతిభా భాస్వంతం.

వెండితెర నాటక రంగంలో ఎన్నో పాత్రలు పోషించి అన్నింటా అగ్రగామిగా నిలిస్తూనే, నిజ జీవితంలో కొడుకుగా, భర్తగా, తండ్రిగా, తాతగా, నాయకుడిగా, మహానాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఇన్ని రకాల పాత్రలు గొప్పగా పోషించి అనితరసాధ్యుడు అనిపించుకున్న మహామనిషి నందమూరి తారకరామారావు. 1949 నుండి చివరిగా 1993 వరకు 304 సినిమాలలో నటించాడు. 194 నిర్మాతలతో, 90 దర్శకులతో, 58 సంగీత దర్శకులతో, 137 కధా రచయితలతో, 73 మాటల రచయితలతో, 67 మంది పాటల రచయితలతో, 72 మంది గాయకులతో, ఆయన చిత్రజీవితం ముడిపడి ఉందని ఒక విశ్లేషణ.

తెలుగువారి కీర్తి పతాకను దేశవ్యాప్తంగా రెపరెపలాడించిన తెలుగు ఆత్మగౌరవ చిహ్నం నందమూరి తారకరామారావు. ఆకర్షణకూ, సమ్మోహనత్వానికీ మరోపేరుగా భాసించిన తారకరాముడు నందమూరి తారకరామారావు. తెరపై కనిపించేది రామారావు కాదు ఆయా పాత్రలే. సుయోధనుడి వాచకం రాజరాజసం, శ్రీకృష్ణుడి వాచకం రసరంజితం. ఈ రెండు పాత్రలను ఒక్కడే పోషించి పండించడం కేవలం ఎన్టీఆర్ ఒక్కరికే చెల్లింది. “మాయాబజార్” సినిమాతో శ్రీకృష్ణుడిగా నీరాజనాలు అందుకున్నారు.

ఆ తరువాత “లవకుశ” చిత్రంలో చేసిన అపూర్వాభినయంతో తెలుగువారి గుండెల్లో అవతారపురుషుడు శ్రీరాముడు తానే అయిపోయారు. శ్రీరామ, శ్రీకృష్ణ వేషాల్లో ఉన్న ఎన్టీఆర్ నిలువెత్తు పటాలు, క్యాలెండర్లు అనేక తెలుగిళ్లలోని గోడలపై అలంకారాలయ్యాయి. ఆయనే రామునిగా, ఆయనే కృష్ణునిగా భావించి పూజలు చేసిన వాళ్లెందరో. నటన విలువ, నర్తనం విలువ, సినిమా జీవితం విలువ, అభిమానుల విలువ తెలిసి మసలుకున్న నటయోగి ఎన్‌.టి.రామారావు. ఆయన జీవన పయనంలో ఎదురైనా అద్భుతాలన్నీ, అనితర సాధ్యమైన విజయాలన్నీ భావితరాలకి స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతాయి. ఎన్టీఆర్ ఒక అధ్యయన గ్రంథం.

జీవిత విశేషాలు…

  • జన్మ నామం :    నందమూరి తారక రామారావు
  • జననం    :    28 మే 1923
  • స్వస్థలం   :    నిమ్మకూరు, కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశం
  • తండ్రి   :   లక్ష్మయ్య చౌదరి
  • తల్లి     :  వెంకట్రావమ్మ 
  • ఇతర పేర్లు  :   విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, ఎన్.టి.ఆర్, అన్నగారు
  • వృత్తి      :    సినిమా నటుడు , సినిమా దర్శకుడు, నిర్మాత , రాజకీయ నాయకుడు , రంగస్థల నటుడు
  • రాజకీయ పార్టీ    :    తెలుగుదేశం పార్టీ
  • మతం        :      హిందూ
  • భార్య        :   బసవ రామ తారకం ,లక్ష్మీపార్వతి
  • ​పిల్లలు    :     జయకృష్ణ, సాయికృష్ణ ,హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ, గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి
  • మరణం   :     18 జనవరి 1996 హైదరాబాదు, తెలంగాణ..

మీసాల నాగమ్మ…

నందమూరి తారకరామారావు ఎంత అందగాడో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అందమే ఆయనను వేదిక ఎక్కేలా చేసింది. ఒకనాటి కళాశాల వార్షికోత్సవంలో, అందులోనూ “రాచమల్లుని దౌత్యం” నాటకం ప్రదర్శించాలనుకున్నారు. కానీ అందులో స్త్రీ పాత్రకు ఎవ్వరూ అందుబాటులో లేరు. దీంతో అందరి దృష్టి అందగాడు ఎన్టీఆర్ పై పడింది. ఆ పాత్ర ధరించేందుకు ముందుగా ఎన్టీఆర్ అంగీకరించలేదు. కానీ అక్కడున్న పరిస్థితిని బట్టి తన స్నేహితులంతా నచ్చచెప్పి ఒప్పించారు. తనకు మేకప్ వేసే మేకప్ మ్యాన్ మీసం తీసేయమన్నారు. ఆయన ససేమిరా ఒప్పుకోలేదు. మీసం తీసే ప్రసక్తే లేదన్నారు. చివరికి ఆ మీసాలతోనే స్త్రీ పాత్రలో నటించారు, బహుమతి గెలుచుకున్నారు. ఆ నాటకం అయిపోయిన దగ్గరనుండి కొన్ని రోజులపాటు ఆయనను అందరూ “మీసాల నాగమ్మ” అంటూ ఆటపట్టించేవారు. తనకు ఇచ్చిన పాత్ర ఏదైనా సరే పరకాయ ప్రవేశం చేయడం ఆయన నైజం. ఆనాడు పాత్ర కోసం మీసం తీయనని తెగేసి చెప్పిన ఎన్టీఆర్ ఆ తరువాత కాలంలో అలాంటి ఎన్నో పాత్రలో అభినయించడానికి, జీవించడానికి ఎంతో శ్రమ, ఎంతో తపనపడ్డారు. తన తరువాత నటులందరికి ఆదర్శంగా నిలిచారు.

తొలి పారితోషికం 200 రూపాయలు..

ఎన్టీఆర్ తన తొలి చిత్రం “మనదేశం” లో ఎన్టీఆర్ తీసుకున్న పారితోషికం 200 రూపాయలు. “పల్లెటూరి పిల్ల” చిత్రంలో కథానాయకుడిగా నటించినందుకు గాను ఎన్టీఆర్ వెయ్యి నూటపదహార్ల పారితోషికం అందుకున్నారు. ఆ తరువాత నటుడిగా భారీగా డిమాండ్ పెరగడంతో పారితోషికం కూడా పెరిగింది. అగ్రకథానాయకుడిగా ఎదిగినా కూడా 22 ఏళ్ల పాటు ఆయన పారితోషికం వేల రూపాయలలోనే ఉండేది. నిర్మాతలకు నిర్మాణ వ్యయం తగ్గించడానికి ఎన్టీఆర్, ఏఎన్నార్ పారితోషికం పెంచేవారు కాదు. 1972 నుంచి ఎన్టీఆర్ సినిమాకు లక్ష రూపాయలు తీసుకోవడం ప్రారంభించారు. “మేజర్ చంద్రకాంత్” చిత్రంతో కోటి రూపాయలు తీసుకొని అత్యధిక పారితోషకం తీసుకున్న హీరోగా రికార్డ్ నెలకొల్పారు. 300 చిత్రాల్లో దాదాపు 700 పాత్రను పోషించారు. ఆ పాత్రలన్నీ తనని ప్రజల దగ్గరకు తీసుకెళ్లడంతో ప్రతీ పాత్ర తనకు ప్రత్యేకం అని చెప్పేవారు.

తెలుగు నాట తొలి సోసియో ఫాంటసీ చిత్రంగా “దేవాంతకుడు” (1960) చిత్రం తెరకెక్కింది. తెలుగులో ఘనవిజయం సాధించిన తొలి అపరాధ పరిశోధన చిత్రంగా లక్షాధికారి (1963) నిలిచింది. తెలుగువారి మొదటి శాస్త్రీయ సినిమాగా “దొరికితే దొంగలు” (1965) రూపొందింది. ఇక సూపర్ హీరో గా తెరకక్కిన సూపర్ మేన్ (1980) చిత్రంలోనూ ఎన్టీఆర్ నటించారు. సాంఘికాల్లోనూ పలు రకాల సినిమాలు చేసి తనకు తానే సాటి అనిపించుకున్నారు ఎన్టీఆర్. తెలుగు సినిమా ప్రస్తుతం శాస్త్రీయ కల్పన (సైంటిఫిక్ ఫిక్సన్) వైపు పరుగులు తీస్తోంది. సూపర్ హీరో కథల పైన మనసు పారేసుకుంటున్న ఈనాటి కథానాయకులకు తెలుగు తెరపై తొలి సంతకం చేసిన ఘనత ఎన్టీఆర్ ది.

జానపదాలకు ఊపుతెచ్చిన కథానాయకుడు..

ఆరంభంలోనే తెలుగు చిత్రసీమ  పౌరాణిక, జానపద చిత్రాలను చూసింది. ఎన్టీఆర్ సినిమా రంగంలో ప్రవేశించే నాటికి తెలుగు సినిమా సాంఘికల వైపు ప్రయాణిస్తుంది. అప్పటికే సుమంగళి, రైతుబిడ్డ, స్వర్గసీమ, దేవత, ద్రోహి, మన దేశం లాంటి చిత్రాలు రూపొందాయి. ఎన్టీఆర్ తొలి చిత్రం “మనదేశం” కూడా సాంఘిక చిత్రమే. ఆయన హీరోగా నటించిన మొదటి సినిమా “షావుకారు” కూడా సాంఘిక చిత్రమే. అందువలన ఎన్టీఆర్ సాంఘికాలకు సరిగ్గా సరిపోతారని భావించారు. అయితే కె.వి.రెడ్డి “పాతాళభైరవి” లో ఎన్టీఆర్ ని తోటరాముడిగా నటింపజేశాక జానపద కథానాయకుడు అంటే ఇలా ఉండాలి అన్న భావన తెలుగు ప్రేక్షకుల్లో నెలకొన్నది. అప్పటివరకు జానపద కథానాయకుడిగా సాగిన అక్కినేని జానపద చిత్రాలకు దూరంగా జరగడం, ఆ తరువాత జానపదాల తిరుగులేని వీరుడిగా ఎన్టీఆర్ ముందుకు సాగడం జరిగిపోయాయి. ప్రపంచం సినీచరిత్రలో అత్యధిక జానపదాల్లో కథనాయకుడిగా నటించిన ఘనత ఎన్టీఆర్ సొంతం. ఆయన తరువాత ఆ తరహా ఖ్యాతి కాంతారావు దక్కించుకున్నారు.

పౌరాణికాలతో చెదరని రికార్డు..

తెలుగు సినిమా తొలినాళ్లలో పౌరాణీకాలతో శోభిల్లింది. రానురాను పౌరాణికాలకు కాలం చెల్లిందనుకుంటున్న సమయంలో ఎఫ్. నాగుర్ తెరకెక్కించిన “ఇద్దరు పెళ్ళాలు” సినిమాలో శ్రీకృష్ణుడిగా, టి. ప్రకాశరావు తెరకెక్కించిన “చరణదాసి” సినిమాలో శ్రీరాముడిగా ఎన్టీఆర్ కనిపించారు. ఈ రెండు చిత్రాలు సాంఘికాలే అయినా కూడా వాటిలో ఆయన పౌరాణిక తరహా పాత్రలో నటించి అలరించారు. ఆ తరువాత కె.వి.రెడ్డి “మాయాబజార్” తో తారకరాముడిని అపర శ్రీకృష్ణుడిగా నిలిపారు. ఆ తరువాత నుండి ఎన్టీఆర్ పౌరాణికాలకు తెలుగునాట విశేష ఖ్యాతి లభించింది. అత్యధిక పౌరాణిక చిత్రాలలో నటించిన నటుడిగా ఆయన రికార్డు సృష్టించారు. ఓ పురాణ పాత్రను ఒకే నటుడు పదిసార్లకు పైగా నటించిన సందర్భాలు భూలోకమంతటా భూతద్దం వేసి చూసినా కనిపించవు. అలాంటిది ఎన్టీఆర్ శ్రీకృష్ణుని పాత్రను దాదాపు పాతిక సార్లు తెరపై ప్రదర్శించడం విశేషం. పౌరాణికాల్లో శ్రీకృష్ణ పాత్రలో దాదాపు 17 సార్లు ధరించిన ఎన్టీఆర్ తరువాత జానపద, సాంఘికలోనూ శ్రీకృష్ణుడిగా కనిపించి మురిపించారు. అంతకు ముందు ఆ తరువాత కూడా ఏ నటుడు తెరపై ఓ పౌరాణిక పాత్రను ఇన్నిసార్లు తెరపై ఆవిష్కరించింది లేదు. అందుకే శ్రీకృష్ణుడు అనగానే మన దక్షిణాది వారికే కాదు, ఉత్తరాది వారికి సైతం ఎన్టీఆర్ గుర్తొస్తారు.

నిర్మాతల శ్రేయస్సు కోరి..

తొలి తెలుగు రంగుల చిత్రం “లవకుశ” (1963) లో శ్రీరాముడి పాత్రలో ఎన్టీఆర్ జీవించారు. ఆ సినిమా ఘనవిజయం సాధించిన తరువాత ఎన్టీఆర్ తో ఎందరో దర్శక నిర్మాతలు రంగుల చిత్రాలు తీయాలని పరుగులు తీశారు. అప్పట్లో కలర్ ముడి ఫిలిమ్ సంపాదించడం కష్టంగా ఉండేది. పైగా ఖర్చు కూడా విపరీతంగా పెరుగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని రామారావు నలుపు – తెలుపు రంగుల చిత్రాలకు మాత్రమే నటించసాగారు. ఇతర కథనాయకులు కలర్ చిత్రాల వైపు పరుగులు తీసి రంగుల సినిమా కోసం పారితోషకాలు తగ్గించుకొని మరీ నటించారు. అయినా రామారావు తన నిర్మాతల  శ్రేయస్సు కోరి పదేళ్లపాటు నలుపు తెలుపు చిత్రాలలోనే నటిస్తూ ముందుకు సాగారు. కానీ ఒకానొక దశలో రంగుల చిత్రం తీయాలనే కోరికతో “శ్రీకృష్ణసత్య” తీశారు. అది ఆయన సొంత చిత్రం. అంతే తప్ప ఇతరుల సొమ్ముతో తాను ప్రయోగాలు చేయదలుచుకోలేదు. 

ఆ తరువాత ఎన్టీఆర్ తొలి రంగుల సాంఘిక చిత్రంగా “దేశోద్ధారకులు” 1973 లో వచ్చింది. ఇక నటుడిగా ఆయన ఎప్పుడు ప్రయోగాలు చేయాలనుకున్నా కూడా తన సొంత చిత్రాలలోనే చేసేవారు. అంతేకానీ ఇతరులు ఎంత కోరినా ప్రయోగం వికటిస్తే చిత్ర నిర్మాత నష్టపోతారని భావించేవారు. అందుకే ఆయన త్రిపాత్రాభినయ చిత్రాలు “కుల గౌరవం”, “దానవీరశూరకర్ణ”, పంచ పాత్రాభినయ చిత్రం “శ్రీమద్విరాట పర్వము” సొంతంగా నిర్మించారు. అంతకుముందు ఎందరో బ్రహ్మంగారి చరిత్ర తెరకెక్కించాలని ప్రయత్నించారు. అందులో ఎలాంటి వాణిజ్యాంశాలు ఉండవని ప్రక్కకు తప్పుకున్నారు. కానీ రామారావు నిష్ఠతో “బ్రహ్మంగారి చరిత్ర” తన సొంతంగా నిర్మించి, నటించారు. ఆ సినిమా ఎంత అద్భుతమైన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ చారిత్రక చిత్రాలలో “బ్రహ్మంగారి చరిత్ర” దరిదాపులో నిలిచే సినిమా మరొకటి రాలేదు. తన సొంత చిత్రాలలో ప్రయోగాలు చేసిన ఎన్టీఆర్ ట్రెండ్ సెట్టర్ గా చిరస్మరణీయ చిత్రాలుగా నిలిచి ఘనవిజయాలను సొంతం చేసుకోవడం విశేషం.

రామలక్ష్మణులులా ఎన్టీఆర్ సోదరులు..

ఆ రామలక్ష్మణులు ఎలా ఉండేవారో జనం ఎరుగరు. కానీ ఎంతో అన్యోన్యంగా మెలిగిన నందమూరి సోదరులు రామారావు, త్రివిక్రమరావు లను చూసి అందరూ మురిసిపోయేవారు. ఆ రామలక్ష్మణులు వీరేనని నమ్మేవారు. త్రివిక్రమరావు రామారావు కంటే మూడేళ్లు చిన్నవాడు. తమ్ముడు అంటే ఎన్టీఆర్ కు ప్రాణం. అలాగే అన్నయ్య అన్నా కూడా త్రివిక్రమరావుకు అంతులేని అభిమానం. ఆలోచన ఒకరిదైతే ఆచరణ మరొకరిది అన్నట్టు మెలిగేవారు. ఎన్టీఆర్ బి.ఏ చదివారు. కానీ త్రివిక్రమరావు చదువుకోలేదు. తనకు చదువు అబ్బలేదు. చదువుని అశ్రద్ధ చేయవద్దు, బాగా చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని తమ్ముడు త్రివిక్రమరావుతో రామారావు తరచూ చెబుతుండేవారు. అయినా సరే చదువు తప్ప మిగిలిన అన్ని విషయాలలో త్రివిక్రమరావు ముందుండేవారు.

అన్నగారికి సినిమాలో అవకాశం వచ్చినప్పుడు వెళ్ళాలా వద్దా అనే మీమాంసలో ఉన్నప్పుడు, వెళ్ళమని ప్రోత్సహించింది త్రివిక్రమరావే. అంతే కాదు పరిశ్రమకు వచ్చిన తొలి రోజులలో ఎన్టీఆర్ కు అవకాశాల వేటలో నిరుత్సాహం కలిగినప్పుడు  ఆయనకు నైతిక బలం ఇచ్చింది కూడా తమ్ముడే. సంపాదనలేని త్రివిక్రమరావుకు పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకు రాని తరుణంలో ఆస్తిలో తన వంతు వాటాను కూడా తమ్ముడికే వ్రాసిచ్చిన ఎన్టీఆర్ ఔన్నత్యాన్ని ఆ రోజులలో గొప్పగా చెప్పుకునేవారు. ఎన్టీఆర్ సంపాదనపరుడైన తరువాత తన కుటుంబానికి ఎంత ఖర్చు పెట్టేవారో, తమ్ముడు కుటుంబానికి కూడా అంతే ఖర్చు పెట్టేవారు. ఎన్టీఆర్ తన 73వ ఏట 1996లో కన్నుమూశారు. త్రివిక్రమ రావు కూడా తన 73వ ఏట 1998 సెప్టెంబర్ 13న మరణించారు.

ఊరిస్తున్న “భారతరత్న”…

భారతదేశంలో పౌరులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం “భారతరత్న”. 1954లో స్థాపించబడిన భారతరత్న పురస్కారం చరిత్ర చూస్తే తెలుగు రాష్ట్రాల నుంచి 2023 వరకు ఒక్కరికీ ఆ గౌరవం దక్కలేదు. ఈమధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం 2024 లో ప్రకటించిన పురస్కారాలలో మన తెలుగుతేజం పీ.వీ.నరసింహరావుకు భారతరత్న పురస్కారాన్ని 09 ఫిబ్రవరి 2024  ప్రకటించింది. భారతరత్న అవార్డులను ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరం తమిళనాడుకు మూడు పురస్కారాలు వచ్చాయి. కాకపోతే తెలుగు మూలాలు ఉన్న ముగ్గురికి భారతరత్న లభించాయని అనుకోవాల్సిందే తప్ప తెలుగు రాష్ట్రాల నుంచి 2023 వరకు ఒక్కరికి భారతరత్న లభించలేదు. తెలుగువారిలో భారతరత్న అవార్డు ఇవ్వాల్సి వస్తే ఎన్టీఆర్, పీ.వీ.నరసింహారావు లతో తొలి స్థానం తెలుగు నటసింహం నందమూరి తారక రామారావుదే. 

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగు జాతి కీర్తి కిరీటాలు దశదిశలా వ్యాపింపజేసిన ఘనుల్లో ఎన్టీఆర్ ఒకరు. తెలుగు ఖ్యాతిని ఆయనలా ప్రపంచానికి చాటిన మరో ముఖ్యమంత్రి లేదంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి విశ్వవిఖ్యాత నటసార్వభౌముడికి భారతరత్న అవార్డు ఇవ్వాలని డిమాండు ఎప్పటినుంచో ఉంది. ఎందుకు అవార్డు రావడం లేదనే విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. ప్రభుత్వమే కాదు నందమూరి కుటుంబ సభ్యులు, నందమూరి వారి అభిమానులు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కోరారు  అయినా కేంద్రం పట్టించుకోవడం లేదనే పలు విమర్శలు ఉన్నాయి.

విశేషాలు…

★ ఎన్టీఆర్ వెండితెరపై కనబడిన తొలి సినిమా 1949లో వచ్చిన “మన దేశం” (తెలుగు). ఇందులో ఆయన ఇన్స్పెక్టర్ పాత్రను పోషించారు.

★ ఎన్టీఆర్ హీరోగా నటించిన మొట్టమొదటి చిత్రం “పల్లెటూరి పిల్ల” 1950 వ సంవత్సరంలో విడుదలైంది. ఈ సినిమాకు బుగత వెంకట సుబ్బారావు (బి.ఏ. సుబ్బారావు) దర్శకుడు.

★ ఎన్టీఆర్ వందవ చిత్రం గా నటించిన చిత్రం “గుండమ్మ కథ”. ఈ సినిమాకు కమలాకర కామేశ్వరరావు దర్శకుడు. 07 జూన్ 1962 లో విడుదలై సంచలన సృష్టించిన ఈ సినిమా ఎన్టీఆర్, ఏ.యన్.ఆర్ అభిమానులకు పండగ తెచ్చింది.

★ ఎన్టీఆర్ నటించిన 200 వ చిత్రం “కోడలు దిద్దిన కాపురం”. దీనికి యోగానంద్ దర్శకులు. ఎన్టీఆర్ ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత యోగానంద్దే.

★ ఎన్టీఆర్ దర్శకుడుగా టైటిల్ కార్డుపై నడిపించిన మొట్టమొదటి చిత్రం “శ్రీకృష్ణ పాండవీయం”, “సీతారామ కళ్యాణం”, “గులేబకావళి కథ” సినిమాలకు ఎన్టీఆర్ దర్శకత్వం వహించినా కూడా టైటిల్స్ లో పేరు ఉండదు. దర్శకత్వం అనే టైటిల్ కార్డు లేకుండానే సినిమాలు ప్రారంభమయ్యాయి.

★ కేవలం కథ, స్క్రీన్ ప్లే అందించిన చిత్రాలు “ఉమ్మడి కుటుంబం”, “కోడలు దగ్గర కాపురం”.

★తమిళం నుంచి తెలుగులోకి 1970 వ సంవత్సరం నుండి “సంపూర్ణ రామాయణం” చిత్రంలో ఎన్టీఆర్ పాత్రకు చుండ్రు సత్యనారాయణ డబ్బింగ్ చెప్పడం విశేషం. 

★ ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేసిన వారిలో తండ్రి, కుమారులు ఉన్నారు. వారు వరుసగా 

తాతినేని ప్రకాశరావు – తాతినేని ప్రసాద్, కే.ఎస్.ప్రకాశ రావు – కే.బాపయ్య – కే రాఘవేంద్రరావు,  శ్రీ సి.పుల్లయ్య –  సి.ఎస్.రావు, ప్రత్య గాత్మ – కే.వాసు. 

★ ఎన్టీఆర్ యముడి పాత్రలో తొలిసారి కనిపించిన చిత్రం “ఉమ్మడి కుటుంబం”.

★ 1976లో అప్పటి కంచి కామకోటి పీఠాధిపతులు “జగద్గురు పరమాచార్య” ఎన్టీఆర్ కు “విశ్వవిఖ్యాత నటసార్వభౌమ” బిరుదును ప్రధానం చేశారు.

★  ఎన్టీఆర్ నటించిన మొత్తం సినిమా వసూళ్ళు 250 కోట్లని ఒక అంచనా. ఈనాటి లెక్కల ప్రకారం అది వేల కోట్ల పై మాటే..

★ సమాజంలోని దురాచారాలను తన సినిమాలలో చెప్పే ప్రయత్నం చేసేవారో “వరకట్నం”, “తాతమ్మ కల”…

★ స్క్రిప్టు, చక్కని కథ ఉన్న సినిమాలు రెండు ఉన్నాయి. అది “తమ్ముడు పెళ్లి”, “పుణ్య దంపతులు”…

Show More
Back to top button