HEALTH & LIFESTYLETelugu Special Stories

ఆరోగ్య యోగా చేద్దామా..!

యోగా రోజు సాధన చేస్తే శారీరక శక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతనతో, ఆరోగ్యంగా పరిపక్వత చెంది ఉంటారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏటా ఒక ప్రత్యేక థీమ్‌ను ఎంపిక చేస్తుంటారు. అలానే ఈ యేడు 2025 సంవత్సరానికి ‘యోగా ఫర్‌ వన్‌ ఎర్త్‌ వన్‌ హెల్త్‌’ అన్న నినాదాన్ని ముందుకు తెచ్చారు. ఇది భూమిని కాపాడుకుంటూ ఆరోగ్యాన్నీ కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తుంది.

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం(జూన్ 21న) సందర్భంగా యోగా విశేషాలను తెలుసుకుందాం:

యోగా అంటే.. జీవనయోగమని అర్ధం.

యోగా.. అనేది భారతీయ వైద్యవిధానాలలో ప్రథమంగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి వైద్యం, ఆయుర్వేద వైద్యంతో పాటు యోగా కూడా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయగలదని రుజువు చేసింది. మారుతున్న కాలంతో పాటు మానవ జీవనశైలి ఎన్నో మార్పులకు లోనవుతుంది కదా.. ఆ మార్పు ఎంతలా అంటే మనిషి తన శరీరం, మనసు మీద నియంత్రణ కోల్పోయే దశకు చేరుకునేంతలా.. దీనివల్ల మనిషికి కలిగే దుష్ప్రభావాలు అనేకం ఉంటున్నాయి. అధిక రక్తపోటు, ఊబకాయం, హృద్రోగం, ఒత్తిడి, మతిమరుపు లాంటి రకరకాల శారీరక, మానసిక సమస్యల సుడిగుండంలో నిత్యం చిక్కుకుంటున్నాడు. వాటినుంచి బయటపడేందుకు కొన్ని మార్గాలున్నాయి. యోగాకి సాధారణంగా ఎనిమిది సోపానాలున్నాయి. 

అవేంటంటే..

1.యమ: సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పుతుంది. 

2. నియమం: వ్యక్తిత్వ వికాస పాఠం.. పరిశుభ్రత, అంతరదృష్టి, కర్తవ్య నిష్ఠ మొదలైన సూత్రాలు ఇందులో ఇమిడి ఉంటాయి. 

3. ఆసనం: యోగాసనాల ప్రాధాన్యాన్ని ఇది వివరిస్తుంది. 

4. ప్రాణాయామం: ప్రాణశక్తిని పెంచుకోగల విద్య ఇది. 

5. ప్రత్యాహార: మనసును ప్రాపంచిక విషయాలకు దూరంగా తీసుకెళ్లే మార్గం ఇది. 

6. ధారణ: మనసుకు ఏకాగ్రతనిస్తుంది. 

7. ధ్యానం: మనసు మీద నియంత్రణను అందిస్తుంది.

8. సమాధి: ఇదే అత్యున్నతమైన యోగ సోపానం! 

ఇదే అద్వైత సిద్ధికి అసలైన పరమార్థం. మానవుడు అనుభవించే సుఖదుఃఖాలు, జయాపజయాలు.. సమానంగా స్వీకరించగలిగే మహోన్నత స్థాయి.

ఇక్కడికి చేరుకోగానే మనిషి పరిపూర్ణుడవుతాడు. జీవితం తేజోవంతంగా ప్రకాశిస్తుంది. అనారోగ్యం దరిచేరదు. 

ఎన్నో లాభాలు..

రోజూ క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల లెక్కకు మిక్కిలి లాభాలున్నాయి. ప్రాణశక్తిని ఉద్దీపింపజేసి ఎముకలు, కండరాలను బలోపేతం చేస్తుంది. ఒంటిని వింటిలా వంచే సామర్థ్యం వస్తుంది. దీనివల్ల శరీరం ఎంతో చురుగ్గా ఉంటుంది. నిరంతరం ఎనర్జిటిక్ గా ఉంటారు.

*సానుకూల దృక్పథం అలవడుతుంది.

*ఒత్తిడి తగ్గుతుంది.

*యంగ్ గా కనబడతారు.

*తల, నడుము నొప్పులు, మైగ్రెయిన్‌ లాంటివి ఉపశమిస్తాయి.

*మంచి నిద్ర మీ సొంతమవుతుంది.

*చక్కటి ఆలోచనలు వస్తాయి, సృజనాత్మక శక్తి పెరుగుతుంది.

నేటి జీవనశైలి సమస్యలెన్నిటికో యోగా ఓ చక్కని పరిష్కార మార్గం. అందువల్లే ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా భారత్ లో యోగాకు ఇంత ప్రాధాన్యత కలిగి ఉంది. ప్రాముఖ్యత సంతరించుకుంది.

ఈ సంప్రదాయ యోగాను ఎనిమిదేళ్ల పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా సాధన చేయవచ్చు. అయితే, గురువు సమక్షంలో నేర్చుకోవడమనేది ఉత్తమం. ఆ తరువాత స్వయంగా సాధన చేసుకోవచ్చు. అంతేకానీ సోషల్ మీడియాను అయితే ఫాలో కావొద్దు. యూట్యూబ్‌, వాట్సప్‌ లలో వచ్చే సందేశాలను, వీడియోలను అనుసరిస్తూ ఆసనాలు వేయడం ప్రమాదకరం. కొన్నిసార్లు అవి ప్రాణాంతకమూ కావొచ్చు.

ఎన్నో వ్యాధులకు అడ్డుకట్ట..

*వంశపారంపర్యంగా, జీవన విధానం కారణంగా వచ్చే క్యాన్సర్‌, హృద్రోగాలు, అధిక రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్‌ వంటి సమస్యలనూ యోగ చికిత్స ద్వారా నియంత్రించవచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి. 

*యోగా థెరపీ ద్వారా 70 శాతం వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

*ముద్రలు, బంధాలు, ప్రాణాయామం, షట్‌ క్రియలు(గజకర్ణి, శంఖు ప్రక్షాళన, జలనేతి, కపాలభాతి, నౌళి, త్రాటక వంటి క్రియలు.. శరీరంలోని మలినాలను తొలగిస్తాయి) జన్యుపరమైన వ్యాధులను సైతం అడ్డుకుంటాయని నిర్ధారణ అయ్యింది. 

*సాధారణ వ్యక్తులతో పోలిస్తే యోగ సాధకుల్లో డీఎన్‌ఏ చాలా చైతన్యవంతంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది.

మన ప్రాచీన యోగా పద్ధతులు:

*జ్ఞాన యోగ: జ్ఞానం ద్వారా గమ్యాన్ని చేరటాన్ని జ్ఞానయోగగా పిలుస్తారు. విజ్ఞానంతో నిన్ను నీవు తెలుసుకోవటం. ఆపై సృష్టి రహస్యాన్ని తెలుసుకొని దాని మూలకేంద్రాన్ని చేరుకోవటమే ఈ జ్ఞాన యోగ సారం.

*భక్తి యోగ: భక్తి ద్వారా గమ్యాన్ని చేరటం. అందులో భాగంగా తమని తాము అర్పించుకోవటం వల్ల ముక్తి లభించడమే భక్తి యోగ సారం.

*కర్మయోగ: ప్రతిఫలాన్ని ఆశించకుండా తమ పని తాను చేసుకుపోవడమే కర్మయోగ సారం.

*మంత్రయోగ: మీకు ఇష్టమైన మంత్రం(రామ) లేదా శబ్దం(ఓం) ద్వారా చేరవలసిన గమ్యాన్ని చేరటమే మంత్ర యోగ సారం.

*యంత్ర యోగ: ఇష్టమైన దేవుని ప్రతిరూపాన్ని ప్రతిష్టించుకోవడం, ఆపై ఇష్టారాధన చేస్తూ, అందులోనే లీనమైపోవడం యంత్రయోగ సారం.

*లయ యోగ: ఇష్టమైన దానిలో ఇమిడిపోవడం, కలిసిపోవడం. అదే లోకంగా జీవించడం లయ యోగ సారం.

*తంత్ర యోగ: మంత్రతంత్రముల ద్వారా అనుకున్నది సాధించడం.

*కుండలిని యోగ: శరీరంలో దాగివున్న శక్తిని బయటకు తీసి, దాని ద్వారా గమ్యాన్ని చేరడం.

మొత్తానికి ప్రపంచం సైతం ఆరోగ్యాన్ని ప్రసాదించే ‘యోగా’ చుట్టూనే తిరుగుతోంది. అమెరికాలాంటి దేశాలు సైతం యోగాలోని వైద్య గుణాలకు జై కొడుతున్నాయి. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, ముద్ర.. వీటినే ప్రత్యామ్నాయ చికిత్సలో భాగంగా చేరుస్తున్నాయి. యోగా థెరపీని పూర్తి విశ్వాసంతో అమలు చేస్తున్నాయి. ఆధునిక జీవనశైలిలో ఎదురయ్యే ప్రతి రుగ్మతకూ యోగాలో పరిష్కారం ఉన్నట్లు బల్లగుద్ది చెబుతున్నాయి. మరి మీరు యోగ సాధనతో ఆరోగ్యంగా ఉండండి.

Show More
Back to top button