GREAT PERSONALITIESTelugu Special Stories

ప్రపంచానికే సర్జరీ నేర్పిన సనాతన వైద్యుడు.. సుశ్రుతుడు..!!

నేటి ఆధునిక యుగంలో వైద్యులు ఎంతో అవలీలగా చేస్తున్న ఎన్నో సర్జరీలకు ఆద్యులు, సృష్టికర్త ఆయన. 5000 ఏళ్ళనాడే ఆయుర్వేద విధానానికి శస్త్ర చికిత్సను జోడించి సిజేరియన్ ఆపరేషన్ చేయడం ఎలాగో అందరికి నేర్పిన ఘనుడు ఆయన. మూత్రపిండాల్లోని రాళ్లను తొలగించడం, విరిగిన ఎముకలను అతికించడం, కంటి శుక్లాలను రూపుమాపడం, మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించడం స్వయంగా చేసి చూపించిన ఘన వైద్యుడు ఆయన. నాడు ఎన్నో రకాల వైద్య విధానాలను చేపట్టి.. నేటి తరాల వారికి ఆదర్శంగా నిలిచిన ఘనుడు ఆయన. ఇతను అవలంభించిన వైద్య విధానాలే.. దేశ విదేశాల్లోని ఎందరో వైద్యులకు మార్గదర్శకంగా నిలిచినాయి. ఆయనే మన భారతీయ ఆయుర్వేద శస్త్ర చికిత్స పితామహుడు సుశ్రుతుడు. 

ప్లాస్టిక్ సర్జరీ పితామహుడి సుశ్రుతుడు: 

భారతీయ ఆయుర్వేద వైద్య విధానానికి ఆధ్యుడుగా చెప్పుకునే సుశ్రుతుడు చేపట్టిన వైద్య విధానాలే వేల సంవత్సరాల నాటివే. ఎన్నో సర్జరీలు చేసి అందర్నీ ఆశ్చర్య పరచిన సుశ్రుతుని విజయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఎవరెవరిగురించో వింటున్నారు. కానీ ప్రపంచమంతా గర్వించేలా వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఇలాంటి వారి గురించి కూడా తెలుసుకుందాం. అధునాతన టెక్నాలజీ అందుబాటులో లేని ఆకాలంలో సుశ్రుతుడు చేసిన అద్భుతాలు అన్ని ఇన్నీ కావు. వాటి గురించి, ఆయన గొప్పతనం గురించి ఇప్పటికి కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉంటున్నాం. భారతీయ ఆయుర్వేద వైద్య విధానానికి ఆయనే ఆద్యుడిగా చెప్పుకుంటారు. ప్లాస్టిక్ సర్జరీ పితామహుడిగా పిలుచుకుంటున్నాం. 

‘సుశ్రుత సంహిత’ ఆయుర్వేద వైద్య గ్రంథం: 

సుశ్రుతుడు క్రీ. పూ. 6-7 శతాబ్దాలకు చెందినవాడిగా చెప్పుకుంటారు. ఆయన బ్రహ్మర్షి విశ్వమిత్ర వంశానికి చెందిన వాడిని ఇతని గ్రంథాలను బట్టి తెలుస్తోంది. స్వయంగా ఆయనే ‘సుశ్రుత సంహిత’ అనే ఆయుర్వేద 

వైద్య శాస్త్ర గ్రంథాన్ని రచించారు. ఆయనను ఆరోజుల్లో అందరూ మేధావిగా పిలిచేవారు. వైద్యుడిగా గౌరవించేవారు. దేశవిదేశాలలోని ఎంతో మంది వైద్యులకు.. వైద్యంలో ఎన్నో మెళకువలను నేర్చుకోవడానికి మార్గ దర్శకునిగా నిలిచిన మహనీయుడు ఆయన. ముక్కుకు సర్జరీ చేసి.. సరిచేయడాన్ని ఆ రోజుల్లో రైనో ప్లాస్టిక్ అని పిలిచేవారు. ఆరోజుల్లో రైనో ప్లాస్టిక్ లో సుశ్రుతుడు ఎక్స్పర్ట్ గా పిలిచేవారు. 

సర్జరీలు చేయాలంటే.. నేటికీ కాకలు తీరిన వైద్యులు సైతం టెన్షన్ పడుతుంటారు. కానీ, హెర్నియా సర్జరీ,కేటరాబ్ సర్జీరీ, సిజేరియన్, వయసుకు సంబంధించిన సర్జరీలు వంటి వాటిని కొన్ని వేల సంవత్సరాల క్రితమే చేసి చూపిన మహనీయుడు. ఆయన ఆనాడే శాస్త్ర చికిత్స చేయడం కోసం దాదాపు 180 రకాల వైద్య పరికరాలను తయారు చేసి ఉపయోగించారంటే.. అతను ఎంతటి ఘనుడో చెప్పనక్కర లేదు. అంతే కాదు ఆరోజుల్లో పుచ్చకాయలు సమీకరించి వాటిద్వారా పరీక్షలు నిర్వహించి పరీక్షలు చేసేవాడు. అంటే ల్యాబ్ ప్రక్రియను కూడా ఆరోజుల్లో సుశ్రుతుడే ప్రారంభించారని తెలుస్తోంది. 

నాడు శస్త్ర చికిత్స కోసం ఎన్నో పరికరాలను తయారు చేసివాటి ద్వారా ఎన్నో శస్త్ర చికిత్సలను విజయవంతం చేసిన ఘనుడిగాను ఆయన పేరుపొందారు. ఆయన సృష్టించిన ఎన్నో శస్త్ర చికిత్సా పరికరాలను ఇప్పటికి వైద్యులు కొన్ని మార్పులు చేసి ఉపయోగిస్తున్నారంటే శుశ్రుతుడు ఎంతటి వైద్య విద్యలో ఆరితేరాడో అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ఇతర దేశాలలోని వైద్యులు సైతం ఒప్పుకొని తాము అవలంభించిన వైద్య విధానాలు భారతీయ వైద్య విధానాలేనని, ముఖ్యంగా సుశ్రుతుడు రాసిన గ్రంథాలే తమకు ఆదర్శవంతం అని చెప్పడం విశేషం. వీటన్నింటిని బట్టి ప్రపంచమంతా అవలంభిస్తున్న వైద్య విధానాలకు, శస్త్ర చికిత్స విధానాలకు శుస్రుతుడేనని ఏకపక్షంగా అంగీకరించి తీరాల్సిందే. 

వారణాసిలో పుట్టిన సుశ్రుతుడు: 

ఆయుర్వేదానికిచెందిన శస్త్ర చికిత్సకునిగా, అధ్యాపకునిగా, అపర ధన్వంతరిగా పేరుగడించిన సుశ్రుతుడు సామాన్య శక పూర్వం 6వ శతాబ్దంలో వారణాసిలో జన్మించాడని కొన్ని గ్రంథాలు చెబతుంటే.. 9-10వ శతాబ్దంలో జన్మించినట్లు మరికొన్ని ఆధారాలు చెబుతున్నాయి. సుశ్రుతుని జీవితకాలంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉత్తర భారతదేశంలోని గంగానది తీరంలోని వారణాసి పట్టణంలో జన్మించిన సుశ్రుతుడు.. విశ్వామిత్ర మహర్షి కుమారుడు, కాశి రాజు అయిన ధన్వంతరి శిష్యుడు. ఆయన వద్దనుండే వైద్యశాస్త్రం అభ్యసించినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు.

సుశ్రుతుడు ప్రకృతి ఆరాధ్యకుడు. జంతు వృక్షలపై అనేక సుదీర్ఘ సంవత్సరాలుగా దృష్టి సారించి.. అమూల్య అంశాలను వివరించాడు. సంవత్సరంలోని భిన్న ఋతువులను ఆయా ప్రాంతాలకు అనుకూలంగా మలుచుకొని వ్యాధి రహితంగా, ఆరోగ్యంగా ఎలా మెలగాలో వివరించాడు. ఏయే కాలాలలో కూరగాయలు పండ్లు తినాలో కూడా వివరించారు. తృణ ధాన్యాలు, పప్పు దినుసుల వాడకం గురించి సోదాహరణంగా పలు ఆసక్తికర అంశాలను తెలిపాడు. 

మనిషికి వచ్చే సాధారణ వ్యాధులు 1120:

సుశ్రుతుడు తన గ్రంథ రచన ప్రారంభించక పూర్వమే ప్రకృతితో అనుసంధానమై వివిధ ప్రయోగాలను చేశాడు. ఏయే మొక్క మానవునికి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో కూలంకషంగా అధ్యయనం చేశాడు. అంతేకాదు ఆయన పూర్తిగా అధ్యాయనం చేసిన తర్వాతే తన శిష్యులకు భోధించేవాడు. ప్రాక్టికల్స్ కూడా దగ్గరుండి భోదించేవాడు. శస్త్ర చికిత్సకు ప్రాధాన్యత ఇస్తూనే వైద్య చికిత్సలో వాడే మూలికలను, క్షార పదార్థాలను, లోపాలను కూడా వర్గీకరించి వివరించేవాడు. దాదాపు 14 రకాల బ్యాండేజీలను ఆయా గాయాల తీవ్రత స్థాయిలను బట్టి వాటిని తయారు చేసే విధానాలను తన గ్రంథంలో వివరించాడు.

ఆ గ్రంథమే ‘శుశ్రుత సంహిత’. ప్రపంచ వ్యాప్తంగా వైద్య విధానాలను ఇందులో నుండే నేర్చుకున్నారు. ‘సుశ్రుత సంహిత’ అనే ఈ గ్రంథం ఆయుర్వేద వైద్యులకు కన్పించిన మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం. దీనికి సుశ్రుతుడు సంస్కృతంలో రచించాడు. ఈ గ్రంథంలో మొత్తం 184 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలో మనిషి సాధారణంగా గురికాబడే వ్యాధులు 1120గా నిరూపించబడ్డాయి. అలాగే మానవ శారీర నిర్మాణం గురించి, ప్రతి అవయవ నిర్మాణం గురించి విపులంగా చెప్పబడింది. 

శుశ్రుత సంహితలో 2 భాగాలు: 

700లకు పైబడిన ఔషధీ మొక్కల లక్షణ విశేషాలు, ఏ వ్యాధికి ఏ మొక్క ఔషధిగా ఎలా  ఉపయోగపడుతుంది అనే విషయాలు ఉదాహరణ పూర్వకంగా ఇందులో పొందుపరిచారు. 64 రకాల ఖనిజాల నుండి మందులను ఎలా తయారు చేసుకోవాలో అందులో విపులీకరించబడింది. అంతే కాకుండా జంతు సంబంధమైన అవయవాల నుండి 52 ఔషదాలు తాయారు చేసే వైద్య విజ్ఞానాన్ని ఈ శుశ్రుత సంహితలో పొందుపరిచారు. ఈ గ్రంధంలో ప్రధానంగా 2 భాగాలున్నాయి. మొదటిది పూర్వ తంత్ర కాగా రెండోది ఉత్తర తంత్ర. ఈ గ్రంథంలో ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడిన అష్టాంగ హృదయం కూడా చెప్పబడింది. వ్యాధిగ్రస్తమైన శరీరాన్ని మూడు భాగాలుగా విభజించి వ్యాధికి పూర్వం వ్యాధిగ్రస్తుడు అయినప్పుడు, వ్యాధి నయం అయిన తర్వాత రోగి శరీర తత్వాన్ని అవగాహాన చేసుకోవాలని ముఖ్యంగా ఆయా రోగులు శరీర తత్వాలను తెలుసుకొని వారి శారీరక మానసిక బలాలను ఓర్పును పరిశీలించి వైద్యం చేయాలని సూచించాడు. 

ప్రసవం ఎలా చేయాలో చెప్పిన సుశ్రుతుడు: 

గర్భ విరోచనంతో పాటు గర్భధారణ కూడా అనువైన ఔషదాలను యవ్వనానికి తగిన మందులను తన మూలికా వైద్య ప్రకరణంలో పేర్కొనాడు. సుఖ ప్రసవం కోసం కొన్ని క్లిష్ట పరిస్థితులలో సిజేరియన్ ఆపరేషన్ లను చేసిన మొట్టమొదటి వైద్యుడి సుశ్రుతుడు. విరిగిన ఎముకలను అతికించడంలో, కంటి శుక్లాలను రూపుమాపడంలో విశేష కృషి చేశాడు. ఆయుర్వేద వైద్యానికి శస్త్ర చికిత్సను జోడించి మానవునికి పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడంలో, విపత్కర పరిస్థితుల్లో తెగిన శరీర అవయవాలను శస్త్ర చికిత్స ద్వారా అతికించడంలో అందెవేసిన చేయి సుశ్రుతుడిది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే శస్త్ర చికిత్సకోసం 120 రకాల వైద్య పరికరాలను శుశ్రుతుడు ఉపయోగించేవాడు. 

ఊడిపోయిన ముక్కును అతికించిన మేధావి:

సుశ్రుతుని సంబంధించిన ఒక కథ ఆయన వైద్య విజ్ఞానానికి ఒక మచ్చుతునక. అత్యవసర పనిమీద ఒక వ్యక్తి అడవిలో ప్రయాణిస్తుండగా  మార్గ మద్యంలో అకస్మాత్తుగా ప్రమాదం జరిగి అతని ముక్కు తెగిపడింది. రక్తం ఏకధాటిగా కారుతుండగా తెగిన ముక్కు భాగాన్ని పట్టుకొని సమీప దూరంలో ఒక ఋషి ఆశ్రమానికి చేరుకొని తలుపుతట్టాడు. అది సుశ్రుతుని ఆశ్రమం. అర్ధరాత్రి వేళ సుశ్రుతుడు నిద్రనుంచి మేల్కొని తలుపు తీసి చూస్తే.. ఆ వ్యక్తి రక్తసిత్తమై రోదిస్తూ ఉన్నాడు. అతడి ముక్కు తెగిపోవడాన్ని సుశ్రుతుడు గమనించాడు. దీంతో ముందుగా అతనికి ధైరం చెప్పి లోపటికి తీసుకువెళ్లి వైద్యం మొదలు పెట్టాడు.

నీటితో అతని గాయాన్ని కడిగి మూలికా రసాన్ని అద్దాడు. ఆరోజుల్లో మనిషికి మత్తు కలిగించే మందు లేనందున.. అతనికి మత్తునిచ్చే నెపమున చిన్న గిన్నెడు సుర అంటే మద్యాన్ని ఇచ్చాడు. అతడు నెమ్మదిగా స్పృహ కోల్పోయిన తర్వాత అతిసూక్షమైన సూదులతో చికిత్స ప్రారంభించాడు. ఒక ఆకుతో అతని ముక్కును కొలిచి అతిచిన్నదైన పదునైన కత్తిని తీసుకొని దవడ భాగమైన మాంసపు ముక్కను తీసుకున్నాడు. దానిని బహు జాగ్రత్తగా 2 ముక్కలు చేసి అతని ముక్కుకుండలలో అమర్చాడు. అలా ముక్కు ఆకారాన్ని సరిచేసి బియ్యపు పిండిని అద్ది చందనపు పట్టు వేశాడు. దానిమీద దూదిని పెట్టి ఔషధులు పూసి చక్కని కట్టుకట్టాడు. వనమూలికనుంచి సేకరించిన మిశ్రమ నూనె బాగా పనిచేసింది. రెండ్రోజులలోనే అతను నెమ్మదిగా మత్తునుంచి కోలుకున్నాడు. అనంతరం అతను ఆహార విధానాలు ఏవి తినాలో ఏవి తినకూడదో చెప్పి తగు జాగ్రతలు చెప్పి పంపించాడు. 

ప్రపంచదేశాల్లోనూ ప్రసిద్ధి:

ఆనాటి కాలంలోనే ప్లాస్టిక్ సర్జరీలు, సిజేరియన్లు, ఎటువంటి శస్త్ర చికిత్సనైనా సునాయాసంగా చేయడమే కాక.. ఆ వైద్యాన్ని తరువాతి తరాలకు అందించాలని తపించి వైద్య విధానాలను గ్రంథ రూపంలో అందించిన మహనీయుడు సుశ్రుతుడు. ఆయన రచించిన గ్రంధాలు కొన్ని టిబెట్ ప్రాంతానికి తరలివెళ్లాయి. ఇటీవల కాలంలో కూడా నూతన విలీనీయం సందర్భంగా 2000వ సంవత్సరంలో బ్రిటన్ లోని వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ ఒక జాబితాను విడుదల చేసింది. అందులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శస్త్ర చికిత్స వైద్యుల ఫొటోలతో సహా వివరాలను పొందుపరిచారు.

ఆ జాబితాలో తొలి చిత్రం ఆచార్య సుశ్రుతుడు కావడం గమనార్హం. అంతే గాకుండా ఆయనను ప్రపంచంలోనే మొట్టమొదటి శస్త్ర వైద్య శిఖామణిగా పేర్కొనటం కూడా గమనార్హం. అంతటి మహనీయుడిని మనం మరచిపోవడం తగిన గుర్తింపు నీయకపోవడం మన చరిత్రకు మాయని మచ్చ మాత్రమే కాదు.. మన దేశానికి మనకు సిగ్గుచేటు కూడా.  మన పూర్వీకుల అతున్నంత మేధో శక్తిని, వారి విజ్ఞానాన్ని సగర్వంగా చాటి చెబుదాం. మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. జై భారత్.. జై హింద్.

Show More
Back to top button