Telugu Special StoriesTRAVEL

ప్రకృతి ప్రియులకు స్వర్గధామం వంజంగి

అక్కడ సూర్యోదయం నేత్రానందం.. ఆంధ్ర కులుమనాలిగా పేరుపొందిన ప్రాంతం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రకృతి అందాలు చూపరులను ఆకట్టుకుంటాయి. విశాఖలో ప్రసిద్ధిగాంచిన అరకు లోయలు, బొర్రా గుహలు, కాఫీ తోటలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. అయితే ఈ మధ్యకాలం నుండి “వంజంగి” అనే పర్యాటక ప్రాంతం అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ గా గుర్తింపును పొందింది. పచ్చదనం పరుచుకున్న లోయలు, అందమైన ఘాటు రోడ్డు ప్రయాణం..బ్చుట్టూ ఎతైన కొండలు.. అబ్బురపరిచే వాతావరణం.. పక్షుల కిలకిల రావాలు.. చలిగాలుల సరిగమలు.. పాలసంద్రంలా ప్రవహించే దట్టమైన మంచు అన్ని కలిపి ప్రకృతి అందాలు మంత్రముగ్ధులను చేసే అద్భుతమైన ప్రదేశం వంజంగి.

ఈ వంజంగి ప్రాంతం గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా సమీపంలోనే ఈ వంజంగి ప్రాంతం ఉంటుంది. గిరిజన ప్రాంతమైనటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు మండలంలోని ఓ చిన్న గ్రామమే వంజంగి. ఇది పూర్తిగా ఆదివాసి గిరిజన గ్రామం. వంజంగి గ్రామం ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి. ఈ ప్రాంతం ఎప్పటినుండో ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ప్రకృతి సహజ సహజసిద్ధమైన అందాలతో వంజంగి ఆకట్టుకుంటుంది. ఈ ప్రాంతం గురించి చిన్న చిన్నగా బయట ప్రపంచానికి తెలియడంతో ఇప్పుడు అది ఒక పెద్ద టూరిజం స్పాట్ గా మారింది. పాల సముద్రాన్ని తలపించే వంజంగి మంచు అందాలను చూసేందుకు పర్యాటకులు బారులు తీరుతారు. ఇక్కడ గిరి శిఖరాలను తాకుతూ మంచు ప్రవహిస్తుంది. ఈ వంజంగి కొండపై సూర్యోదయం ఓ అద్భుతం. చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. అందుకే దీన్ని స్థానికులు “మేఘాలకొండ” అని కూడా పిలుస్తారు.

ఇక్కడ సూర్యోదయం స్పెషల్…

మంచు దుప్పటి కప్పుకున్న వంజంగి కొండను “ఆంధ్ర కులుమనాలి” అని పిలుస్తారు. ఈ వంజంగి హిల్స్ పై సూర్యోదయం ఓ అద్భుతం. చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. ఈ అద్భుతాన్ని ఒక్కసారి చూస్తే వావ్ అనాల్సిందే. ప్రత్యేకంగా ఈ సూర్యోదయాన్ని చూడడానికి అర్ధరాత్రి నుంచే పర్యాటకులు బారులు తీరుతారు. ఎందుకంటే అక్కడ సూర్యోదయం అనేది అంత స్పెషల్. మంచు దుప్పటిని కప్పుకొని ఉన్న కొండపై నుండి సూర్యోదయాన్ని అద్భుతమైన వీక్షణగా చెప్పుకోవచ్చు.. ఈ వంజంగి హిల్స్ పైనుంచి సూర్యోదయం చూడడం నిజంగా నేత్రానందంగా ఉంటుంది. మంచు దుప్పటి  చీల్చుకుంటూ సూర్యుడు నెమ్మదిగా ఉదయించే ఆ దృశ్యాలను చూస్తూ పర్యాటకులు మైమరచిపోతారు.

సూర్యోదయం కాగానే కళ్ళముందు సాక్షాత్కరించే మంచు దుప్పటి, తేలియాడే మబ్బులు, ప్రకృతి అందాలు కట్టిపడేస్తాయి. ముఖ్యంగా శీతాకాలంలో ఇక్కడ ప్రకృతి అందాలను చూడడానికి పర్యాటకులు ఎక్కువ ఇష్టపడతారు. మేఘాలపై విహరిస్తున్నామన్న అనుభూతి కలుగుతుంది. ఆకాశంలోని మేఘాల కన్నా ఇంకాస్త పైనే ఉన్నాము అన్నట్టు లోయలపైన తేలియాడే మేఘాలు కనువిందు చేస్తాయి. ఇటీవల కాలంలో ఈ ప్రాంతం ఎక్కువగా జనాలకు తెలియడంతో భారీ స్థాయిలో పర్యటకులు వంజంగి హిల్స్ చూడడానికి వెళుతున్నారు వీకెండ్ వచ్చిందంటే చాలు పర్యాటకుల తాకిడి మరింతగా పెరుగుతుంది. రిస్క్ చేసైనా ఆ రమణీయ దృశ్యాలను చూడాలనుకుంటూ పర్యాటకులు వంజంగి హిల్స్ చూసేందుకు వెళుతున్నారు. ఇటీవల కాలంలో పర్యటకుల తాకిడి మరింత ఎక్కువగా కావడంతో ఏపీ టూరిజం దానిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఆలోచనలు చేస్తోంది.

వంజంగి అందాలు చూడాలంటే నడవాల్సిందే…

ప్రకృతి రమణీయం అందమైన వంజంగి కొండను చూడాలి అంటే రిస్క్ చేయక తప్పదు. దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రాంతంలో ఉన్న ఈ అందమైన కొండను చేరుకోవాలంటే అరగంట పాటు నడవాల్సిందే ఎందుకంటే అక్కడికి ఎటువంటి వాహనము వెళ్ళదు కానీ ఆ తర్వాత అక్కడ ప్రకృతి అందాలను చూసినట్లయితే నడిచి వచ్చిన కష్టం మొత్తం ఒక్కసారిగా మాయమవుతుంది. సూర్యోదయాన్ని వీక్షించాలి అనుకునేవారు తెల్లవారుజామున 5:30 కల్లా కొండపైకి చేరుకోవాలి. అందుకోసం ముందు రోజు రాత్రి వంజంగి హిల్స్ సమీపంలోని గ్రామాలకు చేరుకోవాలి. దూర ప్రాంతాల్లో ఉండేవారు

వంజంగి హిల్స్ చూడాలనుకుంటే ముందుగానే ఫ్లైట్ లో గాని, ట్రైన్ లో గాని, బస్సులో గాని టికెట్ బుక్ చేసుకుని విశాఖపట్నం చేరుకోవాలి. విశాఖ నుంచి ప్రైవేట్ వెహికల్స్ ద్వారా కూడా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. అయితే అక్కడ విడిది చేసేందుకు హోటల్స్ సౌకర్యం ఉండదు. ఆ ప్రాంతం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి…

వంజంగి హిల్స్ చూడాలి అనుకుంటే ముందు రోజు రాత్రి సమీపంలోని గ్రామాలకు చేరుకోవాలి. అక్కడ వసతికి సంబంధించి ఎటువంటి సౌకర్యం ఉండదు కాబట్టి స్థానికంగా టెంట్లను అద్దెకు ఇస్తారు వాటిని తీసుకోవడం మంచిది. చలికాలంలో చలి విపరీతంగా ఉంటుంది కాబట్టి ఉన్ని దుస్తులను వెంట తీసుకువెళ్లాలి. కొండపైకి వెళ్లేటప్పుడు నడకలో ఇబ్బంది కలగకుండా బూట్లను ధరించాలి. అటవీ ప్రాంతం కాబట్టి తగు జాగ్రత్తలను తీసుకోవాలి. అక్కడ మంచినీటి సౌకర్యం కూడా ఉండదు కాబట్టి వాటర్ బాటిల్స్, స్నాక్స్ వంటివి తీసుకువెళ్లడం మంచిది.

సమీపంలో చూడాల్సిన  ప్రాంతాలు మరికొన్ని ప్రాంతాలు…

వంజంగి హిల్స్ తో పాటు ఇక్కడ మరొక పర్వత శిఖరం ప్రకృతి ప్రియులను ఆకర్షిస్తుంది. సముద్ర మట్టానికి 4,500 అడుగుల ఎత్తున ఉన్న “బోలెంగమ్మ పర్వత శిఖరం” ఇప్పుడిప్పుడే పర్యాటకులను ఆకర్షిస్తుంది. మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఏడాది వ్యవధిలో 2 లక్షల మంది పర్యాటకులు సందర్శించినట్లు అధికారులు చెబుతున్నారు. చలికాలం వచ్చిందంటే చాలు వంజంగి హిల్స్ చూడడం కోసం వచ్చే పర్యాటకులు బోలెంగమ్మ పర్వత శిఖరాన్ని కూడా చూస్తారు. దీని ద్వారా చుట్టూ ఉన్న గిరిజన పల్లెల గిరిజనులకు జీవనోపాధి కలుగుతుంది. అదేవిధంగా ఆంధ్ర కాశ్మీరుగా పిలిచే ‘లంబసింగి” కి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఈ వంజంగి ప్రాంతం ఉంది. ప్రాముఖ్యత కలిగినటువంటి “కొత్తపల్లి జలపాతం” కూడా వంజంగికి దగ్గర్లోనే ఉంది. వంజంగి చూడడానికి వచ్చిన పర్యాటకులు చుట్టూ ఉన్న ప్రాంతాలను కూడా సందర్శిస్తారు. 

వంజగికి ఎలా వెళ్లాలంటే…

వంజంగి కొండలను చూడాలనుకునేవారు ముందుగా విమానంలో కానీ, రైలులో కానీ విశాఖపట్నం చేరుకోవాలి. అక్కడనుండి పాడేరు మండలానికి డైరెక్ట్ గా ఆర్టీసీ బస్సులు, టాక్సీలు తిరుగుతాయి. వాటి ద్వారా లేదా, సొంత వాహనాల్లోనైనా అనకాపల్లికి చేరుకోవాలి. అక్కడనుండి వంజంగిని సులభంగా చేరుకోవచ్చు. వంజంగి గ్రామాన్ని చేరుకున్న తర్వాత అక్కడ నుండి కాలినడక ద్వారా వంజంగి కొండలను చేరుకోవచ్చు.

Show More
Back to top button