
బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (1912 డిసెంబర్ 2 – 25 ఫిబ్రవరి 2004)..
విజయం.. ఎండా, వాన కలగలిసి ప్రభవించిన ఇంద్రధనుస్సూ కాదు. ఓ సుదీర్ఘ వెన్నెల రాత్రి ప్రసవించిన స్వప్నం కాదు. రక్తాన్ని చెమటగా మరిగిస్తే పుట్టిన ప్రతిబింబమూ కాదు. విజయం అంటే ఓ కళ. ఆ కళలో ఆరితేరిన వ్యక్తి బి.నాగిరెడ్డి..
సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, వ్యాపార దక్షుడిగా, విజయా-వాహినీ స్టూడియో అధినేతగా, ప్రముఖ నిర్మాతగా, పత్రికాధిపతిగా, క్రమశిక్షణతో, విలువలతో, అసాధారణ వ్యక్తిత్వంతో ఎదిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి విజయా సంస్థ సారథులు నాగిరెడ్డి.
కఠినశ్రమ, నిరాడంబరత, వినయం, నిర్దిష్ట పథకాలు రూపొందించడం, నాగిరెడ్డి గారి సహజ గుణాలు. వారు పలికే ప్రతి మాటలోనూ, చేసే ప్రతి పనిలోనూ భారతీయ తాత్విక దృష్టి, ముఖ్యంగా భగవద్గీత ప్రబోధించే కర్మసిద్ధాంత ప్రభావం స్పష్టంగా నాగిరెడ్డి గారిలో కనిపించేది.
తెలుగు సినీ జగత్తులో కీర్తి కిరీటంలా నిలిచిపోయిన చిత్రాలు పాతాలభైరవి.. మిస్సమ్మ.. మాయాబజార్.. జగదేకవీరుని కథ.. గుండమ్మ కథ.. ఈ చిత్రాల ప్రస్తావన లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమను ఊహించలేము. ఒక్కసారి ఊహించండి. ఈ చిత్రాలే గనుక మనకు రాకపోయివుంటే..?? తెలుగు చిత్ర సీమ ఎలా ఉండేదో..?? కిరీటం కోల్పోయిన ఛత్రపతిలా, జాబిల్లి లేని గగనంలా, పరిమళం తెలియని విరజాజిపూల మాలలా తెలుగు సినిమా ఆగుపించదూ.
ఎవరైనా ఒక్క మేలు చేస్తేనే గుండెల్లో పెట్టుకుంటాం. మరి ఇంత మేలు చేసిన బి.నాగిరెడ్డి గారి ఋణం ఎలా తీర్చుకోవాలి. ఓ విజయా సంస్థని, చందమామని, తెలుగు సినిమాకి ఒక సత్సంకల్పాన్ని, ఓ క్రమశిక్షణను అందించారు బి.నాగిరెడ్డి గారు.
జీవిత విశేషాలు..
జన్మదినం.. 2 డిసెంబర్ 1912
స్వస్థలం.. పొట్టిపాడు (కడప ),ఆంధ్రప్రదేశ్…
తల్లిదండ్రులు.. ఎరుకలమ్మ,బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి
సోదరులు.. బి.యన్.రెడ్డి(అన్నయ్య)కొండారెడ్డి, రామలింగారెడ్డి (తమ్ముళ్లు)
సంతానం.. ఇద్దరు అమ్మాయిలు..జయలక్ష్మి, శారద
ఇద్దరు అబ్బాయిలు.
బి.యల్.యన్. ప్రసాద్,వేణుగోపాల్ రెడ్డి, విశ్వనాథ రెడ్డి, వెంకట్రామి రెడ్డి..
పురస్కారాలు.. దాదాసాహెబ్ ఫాల్కే మరణం… 25 ఫిబ్రవరి 2004..
బాల్యం..
అనగనగా ఓ పల్లెటూరు. కడప జిల్లా పొట్టిపాడు. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని పొలాలు, సన్నగా వీచే పిల్ల గాలులు, పిచ్చుకలు, కోకిలలు, పచ్చిక బయళ్ళు, స్వచ్ఛమైన మనుషులు.వీటన్నిటి మధ్య పెరిగిన నాగిరెడ్డి గారిది కూడా స్వచ్ఛమైన మనస్సు. బి.నాగిరెడ్డి గారి నాన్నగారు బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి గారూ అంటే ఊళ్ళో మహా గౌరవం. వారికి నలుగురు కుమారులు. రెండవ వాడు బి.నాగిరెడ్డి గారూ.
బి.నాగిరెడ్డి గారూ వేకువ జామున నిద్ర లేచారంటే నాలుగు అయినట్టే లెక్క. పశువుల కొట్టంలోకెళ్ళి చీపురు పట్టుకొని శుభ్రం చేసేవాడు. పశువులతో అటూ ఇటూ వాకింగ్ చేసేవాడు. సాయంత్రం అయ్యవారొచ్చేవారు. రామాయణం, భారతం, భాగవతం అన్నీ విడమరచి చెప్పేవారు. బి.నాగిరెడ్డి గారికి పన్నెండేళ్ళకే అన్నీ కంఠతా వచ్చేశాయి. భారత, భాగవతాలకు మించిన డిగ్రీలు, పి.హెచ్.డి లు ఏముంటాయి..?? పూరి గుడిసెకైనా, తాజ్ మహల్ కైనా పునాది గట్టిగా ఉండాల్సిందే. బి.నాగిరెడ్డి గారికి పొట్టిపాడే గట్టి పునాది.
వివాహం..
బి.నాగిరెడ్డి గారి తండ్రి నరసింహా రెడ్డి గారికి రకరకాల వ్యాపారాలు ఉండేవి. బి.నాగిరెడ్డి గారూ బడి ఎగట్టి తిరుగుతూ వుంటే తండ్రి మందలించడంతో, బి.నాగిరెడ్డి గారూ ఖద్దరు నెత్తిన పెట్టుకుని ఊరు ఊరు తిరిగి అమ్మేవారు. ఉల్లిగడ్డల వ్యాపారం నిమిత్తం రంగూన్ వెళ్ళాడు. వ్యాపారం అంటే ఎదో వ్యవహారం అన్నట్లుగా అందులో మార్మాల్ని బాగా ఆకలింపు చేసుకోగలిగాడు.
తిరిగి మద్రాసు వచ్చేశాడు. ఇంట్లో వాళ్ళు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. సంతోషకరమైన జీవితం. ఒకప్రక్క వ్యాపారం, మరోప్రక్కన సంసారం. వీరికి బి.యన్.కె. ప్రెస్ కూడా ఉంది. శుభలేఖలు, పుస్తకాలు అచ్చు వేస్తుంటారు. ఇవన్నీ బి.నాగిరెడ్డి గారే చూసుకునేవారు.
బి.నాగిరెడ్డి గారి అన్నయ్య బి.యన్.రెడ్డి గారూ సుమంగళి, భక్త పోతన లాంటి సినిమాలు తీశారు. వాటికి బి.నాగిరెడ్డి గారూ ప్రచారకర్త. తక్కువ డబ్బుతో ఎక్కువ ప్రచారం ఎలా చేయాలో బి.నాగిరెడ్డి గారికి బాగా తెలిసిపోయింది. కరపత్రాలు పంచడం, కటౌట్లు పెట్టించడం లాంటి ప్రయత్నాలు చేశారు. “జెమినీ” వాసన్ లాంటి వాడే ఈ ప్రచారానికి ఆశ్చర్యపోయాడు.
బి.యన్.కె. ప్రెస్ పునరుద్దరణ..
బి.నాగిరెడ్డి గారి అభిరుచి కేవలం సినిమాలే కాదు. వారు ఒక ప్రింటర్, గొప్ప ప్రచురణకర్త కూడా. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వ్యాపారం కాస్త దెబ్బతిని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ వాటిని తట్టుకుని 1943 ప్రాంతంలో వాళ్ళ అన్న గారు పది సంవత్సరాల క్రిందట ప్రారంభించిన బి.యన్.కె. ప్రెస్ ను పునరుద్ధరించి తన రెండవ ప్రయత్నం అన్నట్లుగా తన వ్యాపారాన్ని ప్రారంభించినారు.
1944 ప్రాంతంలో బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత, దర్శకుడు అయిన చక్రపాణి ( ఆలూరు వెంకట సుబ్బారావు ) గారితో పరిచయం కావడం, ఆ అనుబంధం జీవితాంతం పెనవేసుకోవడం, ఆ పరిచయం తరువాత ఈ బి.యన్.కె. ప్రెస్ నుండి 1945లో ఆంధ్రజ్యోతి అనే మాస పత్రికను ప్రారంభించడం జరిగింది..
చందమామ..

స్వాతంత్య్రం రావడానికి సరిగ్గా నెలముందు 1947 జులైలో తెలుగు, తమిళంలలో “చందమామ” ను ప్రారంభించారు. 13 భాషల్లో ఈ పత్రిక వెలువడడం పెద్ద రికార్డు. పిల్లలకోసం ప్రారంభించిన ఈ పత్రిక, పెద్దలకూ ప్రియమైనదిగా అయిపోయింది. అంధులకోసం ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిలోనూ చందమామను అందించడం విశేషం. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళు నాగిరెడ్డి గారిని “చందమామ రెడ్డి” అని పిలిచేవారు.
చందమామ స్థాపించాలనే ఆలోచన పూర్తిగా “చక్రపాణి” గారిదే. భారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ చందమామ ఎప్పుడో ఒకప్పుడు చదివే ఉంటారనడం అతిశయోక్తి కాదు. చందమామ హిందీలో ప్రచురించే సమయానికి దాని సంపాదక భాధ్యతను చక్రపాణి గారూ వారి అన్న గారి కుమారుడు ప్రముఖ రచయిత అయిన ఆలూరి బైరాగి కి అప్పగించారు. సున్నిత హాస్యంతో, విజ్ఞాన, వినోదాత్మకమైన చక్కటి కథలతో ఆబాలగోపాలన్ని అలరించిన “చందమామ” పత్రికకు 1975లో బైరాగి గారూ మరణించే వరకూ సంపాదకుడిగా కొనసాగారు. అసలు “చందమామ” లేకపోతే మనకు “బాల సాహిత్యం” దక్కేది కాదు.
సినీ ప్రస్థానం..
విజయ వాహినీ స్టూడియో స్థాపన..

1950లో నిర్మాతగా మారి చక్రపాణితో కలిసి విజయా ప్రొడక్షన్స్ స్థాపించాడు. ఉన్నతమైన ప్రమాణాలతో పండితపామర జనరంజకంగా సినిమాలు తీసిన విజయా సంస్థ తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని సృష్టించింది.
నాగిరెడ్డి గారికి అవకాశాలు సృష్టించుకోవడం తెలుసు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమూ తెలుసు. వాహినీ సంస్థకు మూల స్థంభం అయిన మూలా నారాయణ స్వామికి ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసులు వచ్చాయి. అత్యవసరంగా స్వామికి డబ్బు కావాలి. బి.నాగిరెడ్డి గారే స్వయంగా రంగంలోకి దిగి, డబ్బులు సర్థుబాటు చేశారు. “వాహినీ” నాగిరెడ్డి గారి అజమాయిషీలోకొచ్చింది.
1950లో వచ్చిన షావుకారుతో మొదలైన ప్రస్థానం 1962లో వచ్చిన గుండమ్మ కథ వరకు ఉచ్ఛస్థితిలో కొనసాగింది. విజయుడనేది మహాభారత వీరుడు అర్జునుడి పేర్లలో ఒకటి. గెలుపును సూచించే ఆ పేరునే నాగిరెడ్డి తమ సంస్థకు ఎన్నుకున్నాడు. ఆ పేరు విజయా సంస్థకు సార్థకం కావడమే గాక పత్రికా ప్రచురణ, వైద్యం లాంటి ఇతర రంగాల్లో కూడా ఆయన్నే అంటిపెట్టుకుని ఆయన్ను విజయాధినేతగా మార్చింది.
అర్జునుడి పతాకంపై పర్వతాన్ని మోసుకొస్తున్న హనుమంతుడి బొమ్మ ఉంటుంది. “జెండాపై కపిరాజు(హనుమంతుడు)” అని అందుకే అంటారు. అర్జునుడి ఆ పతాకమే విజయావారి లోగోలోనూ ఉంటుంది. లోగోలో “క్రియా సిద్ధిఃన్సత్త్వే భవతి మహతాంనోపకరణే” అనేది భర్తృహరి సుభాషితం. మహాత్ములైన వారికి సామర్థ్యం వల్లనే పనులు సిద్ధిస్తాయి. నాగిరెడ్డి గారూ కూడా తన సామర్థ్యంతోనే వ్యక్తి నుంచి వ్యవస్థ స్థాయికి ఎదిగారు. “విజయ” సామ్రాజ్యాన్ని స్థాపించారు.
షావుకారు (1950)..
నిర్మాతకు సినిమా అనేది ఒక ఫక్తు వ్యాపారం. ఈ విషయం బాగా వంటబట్టిన వారు నాగిరెడ్డి గారూ. ఫక్తు వ్యాపారం నిజమే. కానీ విలువలు మరచిపోకుండా, విలువలు దిగజారకుండా కూడా అద్భుతంగా సినిమాలు తీయవచ్చు. ఇది నాగిరెడ్డి గారూ నమ్మిన సిద్ధాంతం. దీనినే చివరి వరకు కొనసాగిస్తూ వచ్చారు.
“విజయా” వారి సినిమా అంటే అశ్లీలతకు తావులేకుండా పిల్లా, పాపలు, చిన్న, పెద్ద, ఇంటిల్లిపాదీ అందరూ సంతోషంగా సినిమా చూడాలి. ఆనందంగా నవ్వుకుని వెళ్ళాలి. ఇది నాగిరెడ్డి-చక్రపాణి గార్ల నైతిక విలువలకు నిదర్శనం. అప్పట్లో నటీనటులను నెల జీతంకు పెట్టుకునేవారు. తొలి ప్రయత్నంలోనే ఎన్టీఆర్ గారూ కథనాయకుడు, శంకరమంచి జానకి గారూ నాయికగా 1950లో ఎల్వీప్రసాద్ గారి దర్శకత్వంలో తీసిన చిత్రం “షావుకారు”. నిజ జీవితంలో చిన్న చిన్న మనస్పర్థల కారణంగా కుటుంబాలు ఎలా చీలిపోతాయో చూపించిన చిత్రం. ఇందులో పాత్రలు సజీవంగా అనిపిస్తాయి. సినిమా బాగుంది. కానీ డబ్బులు రాలేదు.
పాతలభైరవి (1951)..
షావుకారు సినిమా అయితే బావుంది. డబ్బులయితే రాలేదు. నాగిరెడ్డి-చక్రపాణి గార్లకు జ్ఞానోదయమైంది. ప్రేక్షకుల నాడీ పసిగట్టేశారు. రెండో ప్రయత్నంగా కె.వి.రెడ్డి గారి దర్శకత్వంలో ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు, కె.మాలతి లాంటి నటీనటులతో “పాతలభైరవి” అనే చిత్రాన్ని తీసి ప్రేక్షకుల మీదికి వదిలారు. ఈసారి గురి తప్పలేదు. అంచనాలు నిజమయ్యాయి. కాసుల వర్షం కురిసింది.
పెళ్ళిచేసి చూడు (1952)…
ఇది ఒక హాస్యభరిత చిత్రం. ఇలా కూడా నవ్వించొచ్చా అనేవిధంగా మెప్పించారు నాగిరెడ్డి గారూ. ఎల్వీ ప్రసాద్ గారి దర్శకత్వంలో ఎన్టీఆర్, జి.వరలక్ష్మి, సావిత్రి
యస్.వీ.రంగారావు గార్లు నటించిన ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. తెలుగులో ఈ చిత్రం 11 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. అలాగే తమిళంలో చాలా సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. తెలుగులో విజయవాడలోని దుర్గా కళా మందిరంలో 182 రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుంది.
చంద్రహారం (1954)…
వరుస విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో ఈసారి భారీ బడ్జెట్ తో అంటే సుమారు పాతిక వేల రూపాయలు ఖర్చు చేసి “చంద్రహారం” తీశారు. పాతిక వేల రూపాయలు పెడితే ఆ రోజుల్లోనే పది సినిమాలు తీసేయవచ్చు. కమలాకర కామేశ్వరరావు గారికి దర్శకుడిగా తొలి చిత్రం.
ఎన్టీ రామారావు, సావిత్రి, శ్రీరంజని నటించిన ఈ చిత్రం యొక్క అంచనాలు తలక్రిందులయ్యాయి. బాక్సఫీసు వద్ధ బోల్తా కొట్టింది.
మిస్సమ్మ (1955)..
చంద్రహారం ఇచ్చిన చేదు ఫలితానికి నాగిరెడ్డి గారూ తొనకలేదు, బెనకలేదు, కలవరపడలేదు. అవరోధాలని ప్రక్కకు నెట్టి, కష్టాలను ఎదురీదగల గజ ఈతగాడు నాగిరెడ్డి గారూ. లక్ష్యం గురి తప్పని విలుకాడు. అసాధ్యాలను సుసాధ్యం చేయగల సమర్థుడు. ఈ సారి “మిస్సమ్మ”ను పంపించాడు. ఏ మాత్రం మిస్సవ్వలేదు. సానుకూల ఫలితం. అద్భుతమైన విజయం. ఎన్టీ రామారావు, సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు, జమున గార్లు నటించిన ఈ హాస్య ప్రధాన చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలియంది కాదు.
మాయాబజార్ (1957)..
చక్కటి కథాహారంలో ముచ్చటయిన సంగీతాన్ని పొదిగితే, తిరుగులేని సాంకేతిక ప్రతిభకు సాటిలేని నటన తోడైతే, అన్ని విభాగాల్లో అందరూ అత్యున్నతస్థాయి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తే, అదే “మాయాబజార్” అవుతుంది. ఎన్టీఆర్, యాస్వీయార్, ఏయన్ఆర్, సావిత్రి లాంటి అతిరథ మహారథులు కలిసికట్టుగా ఒకరిని మించి మరొకరు, ఒకరితో పోటీపడి మరొకరు అద్భుతమైన అభినయంతో సృష్టించిన ఈ “మాయాబజార్” గురించి ఒక ఉద్గ్రంధమే వ్రాయాలి. ఇప్పటికీ తెలుగు సినిమా అంటే “మాయాబజారే”. మాయాబజార్ నాగిరెడ్డినే కాదు తెలుగు సినిమాని కూడా ఎక్కడో కూర్చోబెట్టింది.
విజయా వారికి బాక్సాఫీసు గుట్టు తెలిసిపోయింది. “అప్పుచేసి పప్పుకూడు” (1959), “జగదేకవీరుని కథ” (1961), “గుండమ్మ కథ” (1962) ఇలా ఏ సినిమా అయినా సరే అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. తమిళం, హిందీ, కన్నడం ఏ భాషనూ వదిలిపెట్టలేదు. ఎక్కడ తీసినా, ఏం తీసినా విజయవిహారమే. ఎన్టీఆర్, యస్వీయార్, సావిత్రి, రేలంగి, పద్మనాభం లాంటి ఎందరో నటులు విజయా సంస్థలో నెల జీతంతో పనిచేసి పైకెదిగిన వాళ్లే. ఆ రోజుల్లో విజయా సంస్థలో అవకాశం రావడం అంటే ప్రభుత్వ ఉద్యోగం దొరికినంత సంతోషం. మార్కస్ బార్ట్లే, పింగళి, ఘంటశాల, గోఖలే, కళాధర్, డి.వీ.నరసరాజు లాంటి హేమాహేమీలంతా “విజయా” పునాదులతోనే సినీ విశ్వవిఖ్యాతి చెందారు.
దర్శకుడిగా బి.నాగిరెడ్డి గారూ..
నిర్మాతగా తిరుగులేని విజయాలను అందించిన నాగిరెడ్డి గారూ, దర్శకుడిగా కూడా సఫళీకృతులయ్యారు. దర్శకుడిగా తీసింది ఒకే ఒక్క చిత్రం. తమిళంలో “ఎంగవీట్టు పెణ్”. (తెలుగు షావుకారు). విజయనిర్మల కథానాయిక. యస్వీఆర్, విజయనిర్మల మధ్య సన్నివేశం. బక్కపలుచగా ఉన్న విజయనిర్మలను తీసి కె.ఆర్. విజయను పెట్టండి అని సలహా ఇచ్చారు యస్వీఆర్. ప్యాకప్ అని అరిచారు బి.నాగిరెడ్డి గారూ. తన పని అవుట్ అనుకుని రాత్రంతా ఒకటే నిర్మల గారూ ఏడుపు. మరుసటి రోజు షూటింగ్ కు రమ్మని కారు వచ్చింది. లొకేషన్ లో చుస్తే యస్వీఆర్ లేరు. యస్వీఆర్ గారి స్థానంలో యస్వీ.సుబ్బయ్య వున్నారు. అదీ డైరెక్టర్ అంటే. నాగిరెడ్డి నా..?? మజాకా నా..??
నాగిరెడ్డి “విజయ” చిత్రాలు..
తెలుగు..
షావుకారు.. (1950)
పాతాళభైరవి.. (1951)
పెళ్లి చేసి చూడు.. (1952)
చంద్రహారం.. (1954)
మిస్సమ్మ.. (1955)
మాయాబజార్.. (1957)
అప్పుచేసి పప్పుకూడు.. (1959)
జగదేకవీరుని కథ.. (1961)
గుండమ్మ కథ.. (1962)
సత్య హరిశ్చంద్ర.. (1965)
సి.ఐ.డి.. (1965)
ఉమా చండీ గౌరీ శంకరుల కథ.. (1968)
గంగ మంగ.. (1974)
శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్.. (1976)
తమిళంలో..
పాతాళ భైరవి, కళ్యాణం పణ్ణిపార్, చంద్రహారం, మిస్సియమ్మ, గుణసుందరి, మాయాబజార్, కడన్ వాంగి కళ్యాణం, మనిదన్ మారవిల్లై, ఎంగవీట్టు పిళ్లై, ఎంగవీట్టు పెణ్, వాణి – రాణి, మీన్డుమ్ సావిత్రి..
కన్నడంలో..
మాయాబజార్, జగదేకవీరన కథే, సత్య హరిశ్చంద్ర, మడువే మాడినోడు…
హిందీలో..
మాయాబజార్, రామ్ ఔర్ శ్యామ్, నన్హా ఫరిస్తా, ఘర్ ఘర్ కీ కహాని, జూలీ, యహి హై జిందగీ, స్వర్గ్ – నరక్, స్వయంవర్, శ్రీమాన్ శ్రీమతి..
అవార్డులు
జాతీయ చలనచిత్ర అవార్డులు..
చిత్ర పరిశ్రమకు చేసిన విశేష సేవలకు గానూ, భారత ప్రభుత్వం 1986 వ సంవత్సరంలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డునిచ్చి సత్కరించింది.
కన్నడలో “మదువే మదినోడు” చిత్రానికి గానూ 1965 వ సంవత్సరంలో ఉత్తమ చలనచిత్రంగా, జాతీయ చలనచిత్ర అవార్డు వరించింది..
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు..
1957 వ సంవత్సరంలో మాయా బజార్ (తెలుగు) చిత్రానికి గానూ ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ ఫిల్మ్ అవార్డును అందుకున్నారు..
గుండమ్మ కథ (తెలుగు) చిత్రానికి గానూ 1962 వ సంవత్సరంలో ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ ఫిల్మ్ అవార్డును స్వీకరించారు.
నంది అవార్డులు..
1987 వ సంవత్సరంలో బి.నాగిరెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ప్రదానం చేసింది.
తమిళనాడు రాష్ట్ర అవార్డుల..
1972 వ సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వం బి.నాగిరెడ్డి గారికి కలైమామణి అవార్డును ప్రదానం చేసింది.
ఇతర గౌరవాలు..
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం మరియు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వారు బి.నాగిరెడ్డి గారికి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసి సత్కరించాయి..
ఆసుపత్రులు-ఆరోగ్యరంగం
ఆయన చెన్నై వడపళనిలో విజయా హాస్పిటల్, విజయా హార్ట్ ఫౌండేషన్, విజయా హెల్త్ సెంటర్ స్థాపించాడు. బెంగుళూరులోని ప్రసిద్ధ కంటి అసుపత్రి శంకర నేత్రాలయ కూడా విజయా హాసిటల్ ఆవరణలోనే ప్రారంభమైది.
మరణం..
చిత్ర నిర్మాణంలో విలువలకు పెట్టింది పేరుగా నిలిచిన నాగిరెడ్డి గారు 2004 ఫిబ్రవరి 25న నాగిరెడ్డి తుదిశ్వాస విడిచారు. ఒకప్పుడు ఆసియా ఖండంలోనే అతి పెద్ద స్టూడియోస్ గా విరాజిల్లిన ‘విజయా-వాహినీ స్టూడియోస్’ అధినేతగా, మరపురాని చిత్రాలు అందించిన ‘విజయాధినేత’గా జనం మదిలో నిలచిపోయారాయన..