CINEMA

చారడేసి కనుల చందమామ నటి కృష్ణ కుమారి

కృష్ణ కుమారి (6 మార్చి 1933 – 24 జనవరి 2018)

అమాయకమైన అందం.. అపురూపమైన అభినయం.. మూర్తిభవించిన లావణ్యం.. దానికి తగినంత నాజూకుతనం..  అమాయకత్వం చిందే శేష ప్రశాంతపు ముఖబింబం.. ఒక సౌందర్యానికి ప్రతీకగా ఆనాటి యువకుల గుండెల్ని కొల్లగొట్టిన అద్భుత అభినయం, పొందిక, ఆహార్యం, వెండితెరను రెండు దశాబ్ధాలు పైగా ఏలిన సౌందర్య లహరి, స్వప్న మంజరి నటి కృష్ణ కుమారి గారూ..

అందం అమాయకత్వం కట్టివేసే ప్రియురాలిగా.. చిలిపితనం, చలాకీతనం కలిగిన పడుచుపిల్లలా.. రాజసం, దర్పం ఉట్టిపడే అందాల రాజకుమారిగా.. గాంభీర్యం, హుందాతనం కలిగిన ప్రౌఢలా..  కృష్ణకుమారి గారూ తన నట ప్రస్థానంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలతో సహజసిద్ధమైన ప్రశాంతపు అభినయానంతో దక్షిణాదిని చిత్రపరిశ్రమలో తనదైన ముద్ర వేశారు.

కృష్ణ కుమారి గారూ నందమూరి తారక రామారావు గారూ, అక్కినేని నాగేశ్వరరావు గారూ, కృష్ణం రాజు గారూ, డాక్టర్ రాజ్ కుమార్ గారూ, శివాజీ గణేశన్ గారూ, కాంతారావు గారూ, మరియు జగ్గయ్య గారూ లాంటి అగ్రనటులతో నటించారు. 150 పైచిలుకు చిత్రాలలో నటించిన కృష్ణ కుమారి గారూ తెలుగులో కాకుండా కన్నడ, తమిళ, హిందీ చిత్రాలలో నటిస్తూ తన డబ్బింగ్ తానే చెప్పుకున్న ప్రతిభాశీలి వీరు.

జీవిత విశేషాలు:

జననం :   6 మార్చి 1933

స్వస్థలం :   పశ్చిమ బెంగాల్‌లోని, నైహతిలో…

తండ్రి :    టి. వెంకోజీ రావు..

తల్లి :         శచీ దేవి..

భర్త :       అజయ్ మోహన్ ఖైతాన్ ..

బంధువులు :    సౌకార్ జానకి (సోదరి)

పిల్లలు :          దీపిక…

నివాసము :       బెంగుళూరు..

నటించిన సినిమాలు :  దాదాపు 180 వరకు ,

నటించిన భాషలు :   తమిళ, కన్నడ , తెలుగు,

మరణం..     24 జనవరి 2018  బెంగళూరు, కర్ణాటక.

బాల్యం.

నటి కృష్ణ కుమారి గారూ 6 మార్చి 1933 లో పశ్చిమ బెంగాల్ లోని నౌహతి లో శచీదేవి, టి. వెంకోజీరావు దంపతులకు జన్మించారు. కృష్ణ కుమారి గారి నాన్న గారి ఉద్యోగరీత్యా వాళ్ళ కుటుంబం పశ్చిమ బెంగాల్ లో ఉండేవారు. వెంకోజీరావు గారికి ఎప్పుడూ ఎదో ఒక పట్టణానికి బదిలీ  అవుతుండడంతో కృష్ణ కుమారి గారి విద్యాభ్యాసం రాజమండ్రి, మద్రాసు, అస్సాం, కలకత్తా ఇలా అనేక చోట్ల సాగుతుండేది. కృష్ణ కుమారి గారి మెట్రిక్ పూర్తి అయ్యేనాటికి వాళ్ళు అస్సాంలో ఉండేవారు. తాను ఇంటర్లో చేరేటప్పటికీ వాళ్ళ నాన్నగారికి మరోసారి మద్రాసుకు బదిలీ అయ్యింది.

కృష్ణ కుమారి గారూ మద్రాసు పట్టణానికి చేరుకోవడమే ఆమె జీవితానికి పెద్ద మలుపు. చిత్రసీమలో తొలి అడుగు పడింది అక్కడే. తాను ఇంటర్లో చేరేలోపే వెండితెరపై వెలిగే అవకాశం రావడం, వారు చదువు ఆపివేయడం అంతా యాదృచ్ఛికంగా జరిగిపోయింది.

సినీ రంగ ప్రవేశం..

అనుకోకుండా ఒకరోజు మద్రాసులో “స్వప్న సుందరి” సినిమా చూడడానికి కృష్ణ కుమారి గారూ వాళ్ళ అమ్మ గారితో కలిసి వెళ్ళారు. సరిగ్గా అదే సమయానికి, అదే థియేటర్ కు తమిళనాడు టాకీస్ సౌందర్యరాజన్ గారి అమ్మాయి భూమా దేవి కూడా వచ్చారు. సినిమా హాల్లో సినిమా హాల్లో కృష్ణ కుమారి గారిని చూశారు. “నవ్వితే నవరత్నాలు” అనే సినిమా తీసేక్రమంలో అమాయకంగా కనిపించే కథానాయక పాత్ర కోసం అమ్మాయిని వెతికే పనిలో ఉన్నారు. కృష్ణ కుమారి గారూ భూమా దేవి గారికి అమాయకపు ఆడపిల్లలా ఆగుపించారు కాబోలు. వారి గురించి వాకబు చేశారు. మరుసటి రోజు నేరుగా కృష్ణ కుమారి గారి ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ గారిని అడిగారు.  అప్పటికి కృష్ణ కుమారి గారి నాన్నగారు కలకత్తాలో ఉన్నారు.

దాంతో వాళ్ళ నాన్న గారి అనుమతి తప్పనిసరి. అసలే మాది కృష్ణ కుమారి గారిది సంప్రదాయ కుటుంబం. దాంతో సినిమాలంటే ఆ రోజుల్లో చాలామంది ఇష్టపడేవారు కాదు. అలాంటిది సినిమాల్లో నటించడం అంటే మామూలు మాటలు కాదు. కృష్ణ కుమారి గారూ ఇక్కడి పరిస్థితిని వివరిస్తూ నాన్న గారికి ఒక ఉత్తరం వ్రాశారు. వారి దగ్గర నుండి వెంటనే సమాధానం ఇలా వచ్చింది. చెడిపోవడం అన్నది మనసును బట్టి ఉంటుంది. నీ వ్యక్తిత్వం, సంకల్పం బలమైనదే అయితే ఎక్కడున్నా చెడు జరగదు. నువ్వు సినిమాలో నటించడానికి నాకైతే ఏమీ అభ్యంతరం లేదు. మిగతాది నీ విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ అనుమతించేశారు. వాళ్ళ నాన్న గారికి తనపై ఉన్న నమ్మకానికి కృష్ణ కుమారి గారికి ఒకింత ఆశ్చర్యం ఆనందం కలిగాయి.

వాళ్ళ నాన్న గారూ వ్రాసిన ఆ ఉత్తరం తన దగ్గర భద్రంగా దాచుకున్నారు కృష్ణ కుమారి గారూ. వారి నాన్నగారి మాటలను మనసులో పెట్టుకొనే సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నారు కృష్ణ కుమారి గారూ. చాలా మంది కథనాయికల ప్రస్థానం మొదట్లో చిన్న చిన్న పాత్రలతో మొదలయ్యి ఆ తరువాత కథానాయికగా మలుపు తిరుగుతుంది. కానీ ఇందుకు భిన్నంగా కృష్ణ కుమారి గారికి తొలి చిత్రం “నవ్వితే నవరత్నాలు” నుండే తన సినీ జీవితంలో పూర్తి స్థాయి కథానాయిక పాత్ర చేయడం మొదలైంది.

తొలి సినిమా నుండే వెల్లువలా వచ్చిపడ్డ అవకాశాలు..

కృష్ణ కుమారి గారికి చిన్నప్పటి నుండి నటనలో ఎలాంటి అనుభవం లేదు. చిన్నతనంలో చదువుకునే రోజులలో ఆంధ్ర మహిళా సభ స్కూల్లో ఏదో చిన్న చిన్న కార్యక్రమాల్లో నాటకాల్లో పాల్గొనేవారు. “శ్రీకృష్ణతులాభారం” నాటకంలో కృష్ణ కుమారి గారూ రుక్మిణిగా నటిస్తే, వాళ్ళ అక్కయ్య షావుకారు జానకి సత్యభామగా, ఋష్యేంద్రమణి గారి అమ్మాయి శ్రీకృష్ణుడు. అలా పాఠశాలలోనే తప్ప కృష్ణ కుమారి గారికి నాటకా అనుభవం బొత్తిగా లేదు. కూచిపూడి నృత్యంపై ఆసక్తి ఉండటం వలన కొద్ది రోజులు వేదాంతం జగన్నాధ శర్మ గారి వద్ద మాత్రం కూచిపూడి నేర్చుకున్నారు. “నవ్వితే నవరత్నాల”లో అవకాశం వచ్చినప్పుడు న్యూటోన్ స్టూడియోలో మేకప్ స్టిల్స్ తీయించారు సౌందర్ రాజన్ గారు.

దర్శకులు పెట్టిన పరీక్షలో నెగ్గి తన అభిలాషను నెరవేర్చుకున్నారు కృష్ణ కుమారి గారూ. అమ్మాయి ఏది ఒకసారి నవరసాలు నటించి చూపించు అని దర్శకులు అడుగగానే, నటనలో పెద్దగా అనుభవం లేకపోయినా కృష్ణ కుమారి గారూ తనకు వచ్చినట్టు చేశారు. కృష్ణ కుమారి గారూ అప్పట్లో చాలా అమాయకంగా ఉండేవారు. తాను చేయబోయే పాత్రకి కూడా కావాల్సింది అదే కాబట్టి స్టిల్స్ కూడా బాగా రావడంతో కృష్ణ కుమారి గారిని తీసుకున్నారు. అందులో నటిస్తుండగానే మరో 14 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అప్పటికి కృష్ణ కుమారి గారి వయస్సు 16 సంవత్సరాలు.

నందమూరి తారక రామారావు గారూ, అక్కినేని నాగేశ్వరావు గారూ , కాంతారావు గారూ, జగ్గయ్య గారూ, హరినాథ్ గారూ లాంటి మహానటులందరితోనూ నటించిన అదృష్టం ఇంకా ఎంత గొప్పది. ఒకటా రెండ  “లక్షాధికారి”, “కుల గోత్రాలు”, “తిరుపతమ్మ కథ”,  “బందిపోటు”, “అగ్గిపిడుగు”,   “ఇలవేల్పు”, “సతీసుకన్య”,  “వద్దంటే పెళ్లి” ఇలా నందమూరి రామారావు గారితోనే 25 సినిమాలు చేశారు. అక్కినేని గారితో 18 సినిమాలు చేశారు. ఇంకా కాంతారావు గారూ, జగ్గయ్య గారూ, హరనాథ్ గారూ, రామకృష్ణ గారూ ఇలా అందరితో కలిసి సుమారు 110 సినిమాల పైనే నటించేశారు.

కన్నడంలో 15 చిత్రాల్లో నటించారు. తమిళ్లో అనేక అవకాశాలు  అందిపుచుకున్న కృష్ణ కుమారి గారూ అక్కడ పద్ధతులు అంతగా నచ్చకపోవడంతో తక్కువ చిత్రాలు చేశారు. కృష్ణ కుమారి అక్క గారైన షావుకారు జానకి గారూ చిత్ర సీమలోకి వచ్చిన కొద్ది నెలలకే కృష్ణ కుమారి గారూ చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ సమయానికే తనకు పెళ్లయ్యి కాపురానికి వెళ్లిపోయారు. వీరిరువురి సినిమా రంగ ప్రవేశానికి ఒకరికొకరు సంబంధం లేకుండానే జరిగిపోయింది. సినీ ప్రస్థానంలో కూడా వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలు సుమారు నాలుగు లేదా అయిదు అంతే. వీరిద్దరి మధ్య ఏనాడూ పోటీ ఉండేది కాదు.

ఆ రోజుల్లోనే బికినీ ధరించిన కృష్ణ కుమారి..

కృష్ణకుమారి గారు సెక్సీ పాత్రలు, కథానాయిక పాత్రల్లో మోతాదు మించిన గ్లామర్ ని ఎప్పుడూ ప్రదర్శించలేదు. అలా అని ఆవిడ గారు మోడ్రన్ కాదనుకోవడానికి లేదు. ఎందువలనంటే ఆమె లక్షాధికారి (1963) చిత్రంలో బికినీ ధరించి నటించారు. దురదృష్టవశాత్తు అది సెన్సార్ కత్తెరకు బలైపోయింది గాని, ఆ దృశ్యాలు చిత్రంలో ఉండి ఉంటే ఆ రోజుల్లో అదో పెద్ద సంచలనం అయి ఉండేది. ఈ సందర్భంగా బాపు గారి కార్టూన్ ఒకటి కృష్ణకుమారి గారి గురించి వ్రాసింది గుర్తుకొస్తోంది. “అద్భుత నటనము హీరోయినులకు, అక్కరలేదని నమ్మిక జనులకు, వంపుల సొంపులు చెంపల కెంపులు, తారకు తప్పని సరియగు నింపులు, సన్నటి చక్కటి చిన్నది యున్నది, కృష్ణకుమారికి బిరుదైయున్నది”.

భానుమతి గారికి వీరాభిమాని..

చిన్నప్పటినుంచి భానుమతి గారు అంటే అమితంగా ఇష్టపడే కృష్ణ కుమారి గారు, భానుమతి గారికి విరాభిమాని. భానుమతి గారు నటించిన “స్వర్గసీమ” చూసిన తర్వాత ఆవిడకు చెల్లెలుగా పుడితే ఎంత బాగుండేదో అని ఎప్పుడూ అనుకునేవారట. అలాంటిది ఆ మహానటితో కలిసి నటిస్తానని అప్పట్లో కలలో కూడా ఊహించలేట కృష్ణ కుమారి గారు. “కుల గోత్రాలు”, “పుణ్యవతి” చిత్రాల్లో భానుమతి గారితో కలిసి నటిస్తున్నప్పుడు పట్టరాని సంతోషానికి లోనయ్యారట. ఆ మాటే భానుమతి గారి వద్ధ ప్రస్థావించినప్పుడు భానుమతి గారు కూడా చల్లగా నవ్వారావిడ అని ఆనందంతో చెప్పేవారు కృష్ణ కుమారి గారు. ఇక సావిత్రి గారు అయితే కృష్ణ కుమారి గారిని సొంత చెల్లెలా చూసుకునేవారట. అప్పట్లో నటీనటులు అందరూ ఎంతో అభిమానంగా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉండేవాళ్లం. నిజంగా అది స్వర్ణ యుగమే అని కృష్ణ కుమారి గారు చెబుతుండేవారు.

చిత్రీకరణ సమయంలో చేదు అనుభవాలు..

కృష్ణ కుమారి గారికి సినిమా చిత్రీకరణ సమయంలో మర్చిపోలేని అనుభవాలు రెండు ఉన్నాయి. రెండు కూడా భయపెట్టినవి. ప్రాణం మీదికి తెచ్చిన సంఘటనలు.

విఠలాచార్య “బందిపోటు” చిత్రీకరణ సమయంలో..

మొదటిది “బందిపోటు” సినిమాలో వగలరానివి నీవే పాట చిత్రీకరణ జరుగుతోంది. విఠలాచార్య గారూ తెరకెక్కించిన ఈ చిత్రంలో రామారావు గారు చెట్టుమీద కూర్చుని పాట పాడుతుంటారు. వారిని పట్టుకోవడానికి కృష్ణ కుమారి గారూ గుర్రం మీద వస్తుంటారు.  గుర్రపు స్వారీ తెలియని కృష్ణ కుమారి గారికి ఆ సీన్ చేయడానికి చాలా భయపడ్డారు. ఎందుకంటే కృష్ణ కుమారి గారికి గుర్రపు స్వారీ రాదు. చిత్రీకరణ సమయంలో ఇదే విషయం విఠలాచార్య గారికి చెప్పారు కృష్ణ కుమారి గారూ.

అది విన్న దర్శకులు విఠలాచార్య గారూ ఏం పర్వాలేదు అది మచ్చికైన గుర్రం. బాగా మెతకది కూడా అన్నారట. అది విన్న కృష్ణ కుమారి గారూ సరే అని గుర్రం ఎక్కేశారు. షాట్ మొదలవగానే గుర్రం ఉన్నట్టుండి వేగంగా పరుగు లంకించుకుంది. కృష్ణ కుమారి గారూ భయంతో గుర్రాన్ని గట్టిగా పట్టుకున్నారు. కానీ పరిస్థితిని ముందే ఉహించిన విఠలాచార్య గారూ ఇలాంటిది ఏదైనా జరగొచ్చు అన్న ముందు చూపుతో సెట్ కి కొద్ది దూరంలో ముందుకు నాలుగు మగ గుర్రాలని నిలబెట్టి ఉంచారు. వాటిని చూడగానే కృష్ణ కుమారి గారూ కూర్చున్న గుర్రం ఆగిపోయింది. దాంతో గండం గడిచిపోయిందనుకుని కృష్ణ కుమారి గారూ ఊపిరి పీల్చుకున్నారు.

లక్షాధికారి చిత్రీకరణ సమయంలో…

మరో సంఘటన లక్షాధికారి షూటింగ్ సమయంలో జరిగింది. “దాచాలంటే దాగదులే, దాగుడుమూతలు సాగవులే” పాటకు ఎంత బాగా పేరొచ్చిందో అందరికీ తెలిసిందే. ఆ పాట చివర్లో ఆఖరి సన్నివేశం తెరకెక్కిస్తున్నారు. కృష్ణ కుమారి, ఎన్టీఆర్ గారు చేయి చేయి కలిపి ఒడ్డు నుండి అలా సముద్రంలోకి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్లే సన్నివేశం అది. వారిద్దరూ అలా వెళ్తుండగానే ఒక పెద్ద కెరటం దూసుకొచ్చి ఇద్దరిని లోపలికి లాగేసింది.

కన్నుమూసి తెరిచేలోపు కొద్ది దూరం సముద్రం లోపలికి వెళ్లిపోయారు. కృష్ణ కుమారి గారూ భయంతో నీళ్లు తాగేశారు. కృష్ణ కుమారి గారి అదృష్టం ఏంటంటే అంత జరిగిన ఎన్టీఆర్ గారూ ఆమె చేతిని వదల్లేదు. అలాగే గట్టిగా పట్టుకొని ఎలాగోలా బయటికి లాక్కొచ్చారు. సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకున్నారు ఎన్టీఆర్ గారూ. ఇప్పటికీ ఆ సన్నివేశం తలుచుకున్నప్పుడల్లా భయం వేస్తుంది అని చెప్పుకొచ్చేవారు. ఈ రెండు సంఘటనలు కృష్ణ కుమారి గారి జీవితంలో మరచిపోలేనివి అని పలు ఇంటర్వ్యూలలో చెబుతుండేవారు.

వివాహం..

బెంగళూరుకు చెందిన అజయ్ మోహన్‌ ఖైతాన్ గారిని ప్రేమించిన కృష్ణకుమారి గారూ 1969లో వారినే పెండ్లాడారు. ఈమె భర్త అజయ్ మోహన్ గారూ వృత్తిరీత్యా వ్యాపారవేత్త. అతని కుటుంబం వారు రాజస్థానీయులు. స్నేహితుల ద్వారా జరిగిన వీరిద్దరి పరిచయం మొదట్లో ప్రేమగా చిగురించి చివర్లో వివాహబంధంగా మారింది. అజయ్ మోహన్‌ ఖైతాన్ గారూ వ్యాపారరీత్యా బెంగుళూరులో ఉంటుండడంతో కృష్ణ కుమారి గారూ కూడా మద్రాసు వీడి బెంగుళూరుకు తన మకాం మార్చారు. కుటుంబానికే ప్రాధాన్యతనిస్తూ నటనకు దూరంగా వున్న కృష్ణ కుమారి గారూ, కొంతకాలం విరామం తర్వాత అత్తమామల ప్రోత్సాహంతో తిరిగి నటించడం మొదలుపెట్టారు.

కృష్ణకుమారి, అజయ్ మోహన్‌ ఖైతాన్ దంపతులకు సంతానం కలగకపోవడంతో అనాథాశ్రమం నుంచి ఓ ఆడపిల్లను దత్తత తీసుకున్నారు. ఆమె పేరు దీపిక. తాము కొన్న భవంతికి దీపిక పేరే పెట్టుకున్నారు. బెంగుళూరిలో వీరికి ఐదెకరాల ఎస్టేటు ఉంది. ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలోని అందమైన ఇంట్లో ఈమె జీవితాన్ని చాలా ఆనందంగా, సుఖంగా గడిపింది. వీరి అల్లుడు విక్రం మైయా, మనవడు పవన్. దీపిక తన తల్లి జీవిత చరిత్రను తెలిపే మై మదర్ కృష్ణకుమారి అనే పుస్తకాన్ని ఆవిష్కరించింది.

పెళ్లి తరువాత నటనా జీవితం..

కృష్ణ కుమారి గారికి పెళ్లయ్యేనాటికి ఆవిడ గారూ నటించిన నిండు సంసారం, వరకట్నం చిత్రాలు విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నాయి. అలాగే పలు చిత్రాలకు ఒప్పందం కుదుర్చుకుని ఉన్నారు. అప్పటికే ఒక్క ఎన్టీఆర్ తోనే ఆరు సినిమాలకు సంతకం చేశారు. కానీ వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగడం కోసం అన్నింటిని రద్దు చేసుకున్నారు. దాంపత్య జీవితమే ముఖ్యమని భావించారు కృష్ణ కుమారి గారూ.

కానీ రెండేళ్ల తర్వాత బి.ఏ.సుబ్బారావు గారు అక్కినేని గారితో ఒక సినిమా చేస్తూ కథానాయిక పాత్ర కృష్ణ కుమారి గారితోనే వేయించాలనే ఉద్ధేశ్యంతో వారికి పదే పదే ఫోన్ చేసేవారు. ఒకసారి సుబ్బారావు గారూ ఫోన్ చేసిన సమయానికి రాజస్థాన్ నుంచి వచ్చిన కృష్ణ కుమారి గారి అత్తగారు విషయం ఏంటి అని ఆరా తీసి నటన అనేది ఉన్నతమైన కళ. నటిస్తే తప్పేముంది అని కృష్ణ కుమారి గారిని ప్రోత్సహించారు. కృష్ణ కుమారి గారి భర్త గారూ కూడా ఒప్పుకోవడంతో మళ్ళీ నటించడం మొదలు పెట్టారు కృష్ణ కుమారి గారూ.

మరణం..

కృష్ణ కుమారి గారూ రెండు దశాబ్దలకు పైగా చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానాన్ని కొనసాగించారు. క్రమక్రమంగా చిత్ర పరిశ్రమలో పరిస్థితులు మారుతూ ఉండడాన్ని గమనించిన తాను సినిమాల నుండి నిష్క్రమించి ప్రశాంతమైన జీవితాన్ని గడిపేయాలని తలచి తానే స్వతంత్రంగా నటనా జీవితానికి స్వస్తి పలికారు. బెంగళూరులో వారికున్న ఐదు ఎకరాలు ఎస్టేట్ లో ప్రశాంత వాతావరణంలో, చుట్టూ పచ్చటి చెట్ల మధ్యలో అందమైన ఇంటిలో ప్రశాంతమైన జీవనం కొనసాగించారు. వారి ఏకైక కూతురుకు పెళ్లయింది. తన మనవడితోనే కాలక్షేపం చేస్తూ, తన అక్క గారైన షావుకారు జానకితో తన పాత జ్ఞాపకాలతో ఆనందంగా గడిపేవారు కృష్ణ కుమారి గారూ.

తన సినీ ప్రస్థానంలో ధ్రువతారలా వెలుగొందిన కృష్ణ కుమారి గారూ జీవన మలిదశలో క్యాన్సర్‌ బారిన పడ్డారు. బోన్ మ్యారో క్యాన్సర్‌ బారిన పడిన కృష్ణ కుమారి గారూ దాదాపు రెండు సంవత్సరాలు కీమోథెరపీ చేయించుకున్నారు. వయోభారంతో చికిత్సకు శరీరం సహకరించకపోవడంతో కృష్ణ కుమారి గారూ తన 85 వ యేట 24 జనవరి 2018 నాడు బెంగుళూరులోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు.

Show More
Back to top button