HEALTH & LIFESTYLE

స్థూలకాయానికి బేరియాట్రిక్ సర్జరీ  

స్థూలకాయం అనేది వ్యాధి కాదు. ఇదొక సమస్య. ఇది అనేక రకాల దీర్ఘకాలిక రోగాలకు మూల కారణం అవుతుంది. డయాబెటిస్, కిడ్నీ నుంచి కీళ్ల నొప్పుల సమస్య వరకు ఒబెసిటీ కారణం కావచ్చు. అధిక బరువు నుంచి స్థూలకాయానికి చేరుకున్నాక వ్యాయామాలు, డైట్ ప్లాన్లు ఏవీ పని చేయవు. బేరియాట్రిక్ సర్జరీ ఒక్కటే మార్గం అని వైద్యులు అంటున్నారు.

స్థూలకాయం కారణంగా అధిక రక్తపోటు, గుండెపోటు, కీళ్ల నొప్పులు, కిడ్నీ వ్యాధులు, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆధునిక జీవన విధానంలో మార్పుల కారణంగా వచ్చిన అనారోగ్య సమస్యలన్నింటిని కలిపి మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. మన ఎత్తు, బరువు ఆధారంగా గణించి చెప్పేది BMI(బాడీ మాస్ ఇండెక్స్). సరైన మోతాదులో బరువు ఉన్న వ్యక్తుల BMI 25 పాయింట్లు ఉంటుంది. BMI విలువ 25-30 ఉంటే మంచి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కానీ BMI విలువ 35 కంటే ఎక్కువ ఉంటే షుగర్, హైపర్‌టెన్షన్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏ అనారోగ్య సమస్య లేకున్నా భవిష్యత్‌లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఇంత ప్రమాదకరమైన స్థూలకాయాన్ని చాలా ఖరీదైన బేరియాట్రిక్ సర్జరీతో తగ్గించుకుంటున్నారు. ప్రముఖులు, వ్యాపార వేత్తల, రాజకీయ నాయకుల పిల్లలకు బేరియాట్రిక్ సర్జరీ చేయిస్తున్నారు.

ఆపరేషన్‌ అంటే ఏం చేస్తారు?
ఊబకాయానికి సర్జరీ అంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు సర్జరీతో తీసేయడమే అని చాలామంది భావన. కానీ, లైపోసక్షన్ అనే ఈ పద్ధతిలో తొడలు, పిరుదులు, పొట్ట భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును తీసివేస్తారు. ఇదే లైపోసక్షన్ ఆపరేషన్. కొన్ని సంత్సరాల క్రితం ఈ చికిత్సకు ప్రాధాన్యత ఉండేది. ప్రస్తుతం వైద్యశాస్త్రంలో వచ్చిన టెక్నాలజీ కారణంగా లైపోసక్షన్ కంటే బేరియాట్రిక్ సర్జరీ మంచి ఫలితాలు ఇస్తుంది.

బేరియాట్రిక్ సర్జరీలో ఏం చేస్తారు?
బేరియాట్రిక్ సర్జరీ అంటే కొవ్వు పేరుకోకుండా అడ్డుకునే చికిత్స. శరీరం లోపల జీర్ణవ్యవస్థలో చిన్న మార్పులు చేయడంతో ఊబకాయాన్ని తగ్గించవచ్చు. ఈ ప్రక్రియలో జీర్ణకోశం పరిమాణం తగ్గించడం, ఆహారం పూర్తిగా జీర్ణం కాకుండా ఆనకట్ట వేస్తారు. జీర్ణకోశాన్ని నిలువుగా కోసి కొంత భాగాన్ని తీసివేయడం ద్వారా దాని పరిమాణాన్ని తగ్గిస్తారు. ఇలా తీసివేసే భాగంలో గ్రెలిన్(ఆకలిని పెంచే) హార్మోన్ ఎక్కువ విడుదల అవుతుంది. బేరియాట్రిక్ సర్జరీ చేయడంతో జీర్ణాశయ పరిమాణం తగ్గి కొద్దిగా తినగానే కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది. గ్రెలిన్ ఉత్పత్తి కూడా తగ్గడంతో ఆకలి అనిపించదు. ఈ ఆపరేషన్‌లో స్థూలకాయం తగ్గి సన్నబడతారు.
 
మాల్ అబ్‌సార్‌ప్షన్ పద్ధతి(రెస్ట్రిక్టివ్) ఆపరేషన్: పిన్‌లాంటి నిర్మాణంతో జీర్ణాశయం ఒక చివరను మూసేస్తారు.
సిలికాన్ బ్యాండింగ్: సన్నని ట్యూబ్ ద్వారా మాత్రమే ఆహారం ప్రయాణిస్తుంది. దీనివల్ల చాలా కొద్ది పరిమాణంలో ఆహారం జీర్ణాశయానికి వెళ్తుంది. మిగిలింది పూర్తిగా జీర్ణం కాకుండా బయటకు వెళ్లిపోతుంది. ఈ పద్ధతి ద్వారా అవసరాన్ని బట్టి బిగించిన చివరను వదులు చేసుకోవచ్చు.
బైపాస్ పద్ధతి ద్వారా కూడా ఆహారం పూర్తిగా జీర్ణం కాకుండా చేయవచ్చు. జీర్ణాశయం నుంచి డైరెక్ట్‌గా చిన్నపేగుకు చివరి భాగానికి బైపాస్ చేయడం వల్ల ఆహారం జీర్ణాశయం నుంచి వెంటనే ఆ చివరి భాగానికి వెళ్తుంది.

సురక్షితమేనా?
వంద కిలోలకు మించి బరువున్న వారికి ఆపరేషన్ చేయడం చాలా రిస్క్‌. ఇలాంటి పరిస్థితుల్లో కాలి రక్తనాళాల్లో గడ్డలు(క్లాట్స్) ఏర్పడే ప్రమాదం ఉంది. ఇవి ఊపరితిత్తుల వైపు సంభవిస్తే ప్రాణాపాయం ఉంటుంది. బ్లడ్ క్లాట్ కాకుండా ప్రత్యేక పరికరంతో కాళ్లకు వైబ్రేషన్స్ పంపిస్తారు. రక్తం పలుచపడటానికి బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్లు, హిపారిన్ ఇంజక్షన్ ఇస్తారు. స్లీప్ అప్నియా ఉంటే సర్జరీకి వారం ముందు నుంచే పడుకునేటప్పుడు బైపాస్ పరికరం ద్వారా ఆక్సిజన్ అందిస్తూ సర్జరీకి ప్రిపేర్ చేస్తారు.

సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
బరువు తగ్గించే మెడిసిన్ వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బేరియాట్రిక్ కీహోల్ ద్వారా చేస్తారు. కాబట్టి, శరీరంపై గాయం, ఇన్‌ఫెక్షన్ అవకాశం ఉండదు. ఎక్కువ రోజులు హాస్పిటల్‌లో ఉండాల్సిన అవసరం ఉండదు. వారం రోజుల తర్వాత అన్ని పనులూ యథావిధిగా చేసుకోవచ్చు. 6 నెలల నుంచి ఏడాదిలోగా బరువు తగ్గుతారని వైద్యులు చెబుతున్నారు. ఒక్కసారిగా బరువు తగ్గరు. కాబట్టి, మళ్లీ లావెక్కే అవకాశం ఉండదు. ఆపరేషన్ తర్వాత ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచుకుంటే స్థూలకాయ సమస్య మళ్లీ తలెత్తదు.

Show More
Back to top button