సాధారణంగా సీజన్ మారితే కొందరిలో జ్వరం, జలుబు, దగ్గులాంటి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. దీంతో మూమూలు అనారోగ్య లక్షణాలు, వైరస్ వల్ల వచ్చే లక్షణాల మధ్య తేడా గుర్తించడం చాలా కష్టమవుతుంది. కొన్ని వైరస్‌ల లక్షణాలు గుర్తించడం చాలా కష్టం. అలాంటి వాటిలో ప్రస్తుతం అడెనో, ఇన్‌ఫ్లూయెంజా (H3N2) వైరల్ ఫీవర్స్ దేశమంతా విజృంభిస్తున్నాయి. ఈ వైరల్ ఫీవర్స్ పిల్లలతో పాటు పెద్దలకు కూడా సోకుతున్నాయి. కానీ, చిన్న పిల్లల్లో రోగనిరోధకశక్తి తక్కువ. కాబట్టి, పిల్లలు ఈ వైరస్‌ల బారిన ఎక్కువగా పడుతున్నారు.
అడెనో వైరస్:
తేలికపాటి జలుబు, జ్వరం, గొంతు నొప్పి, శ్వాసకోశ ఇబ్బందులు, న్యుమోనియా, కండ్ల కలక, కడుపులో మంట, తీవ్రమైన గ్యాస్ట్రో ఎంటెరిటిస్ వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వ్యక్తులు దగ్గడం, తుమ్మడం, తాకడంతో పాటు ములమూత్రాల ద్వారా కూడా ఇది ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశముందని డాక్టర్లు హెచ్చరించారు.
ఇన్‌ఫ్లూయెంజా:
జ్వరం, దగ్గు, ముక్కు కారటం, శ్వాసకోశ సమస్యలతో పాటు, ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు లేదా అతిసారం వంటివి H3N2 ఇన్‌ఫ్లుయెంజాలో ప్రధాన లక్షణాలు. ఉబ్బసం, ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు ఉన్న వారికి ఈ ఫీవర్ ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది.
చికిత్స – నివారణ
అడెనో వైరస్ పిల్లల్లో శ్వాసకోశ, ప్రేగులలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. వ్యాధి లక్షణాలు 4-5 రోజులకు మించి ఉంటే ‘స్వాబ్’ టెస్ట్ చేయించుకోవాలి. ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలు అని అనుమానం ఉంటే PCR (పాలిమరేస్ చైన్ రియాక్షన్) టెస్ట్ చేయించుకోవాలి. ప్రారంభ దశలో వైరల్ ఫీవర్‌ను గుర్తిస్తే తగు జాగ్రత్తలు పాటిస్తూ చికిత్స చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. వ్యాధికి కచ్చితమైన చికిత్స లేదు. కాబట్టి, నివారణే మార్గం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బయటికి వెళ్లినప్పుడు మాస్క్ ధరించాలి.
చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. తరచూ ముఖాన్ని తాకడం మానుకోవాలి.
ఫ్లూ విషయంలో, జ్వరం తగ్గిన తర్వాత కూడా 24 గంటల పాటు ఇంట్లోనే ఉండండి.
వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దగ్గినప్పుడు లేదా తుమ్మేటప్పుడు నోరు, ముక్కుకు కర్చీఫ్ అడ్డుపెట్టుకోవాలి.
వ్యాధితో బాధపడుతున్నవారు బయట తిరగకుండా హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలి.
లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే డాక్టర్‌ని సంప్రదించాలి. – తీవ్రతను బట్టి 1-2 వారాల్లో ఈ వైరల్ ఫీవర్స్ తగ్గుముఖం పడతాయి.