
మనల్ని ఆరోగ్యంగా ఉంచటంలో జింక్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. జింక్ మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గాయాలు నయం కావడానికి, ఎలర్జీలను అడ్డుకోవడానికి సహాయం చేస్తుంది. శరీరంలోని చర్మం, కాలేయం, క్లోమం, మూత్రపిండాల బలమైన కండరాల్లో జింక్ ఉంటుంది. విటమిన్-సి వలె జింక్ కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రుచి, వాసనల సరైన గ్రహించడం కోసం జింక్ చాలా అవసరం.
స్త్రీలకు రోజుకు 8మి.గ్రా, గర్భిణీలకు 11మి.గ్రా, పాలిచ్చే తల్లులకు 12మి.గ్రా, పురుషులకు 11మి.గ్రాముల జింక్ అవసరం. జింక్ సమద్ధిగా ఉంటే ఇన్సూలిన్ లెవల్స్ సరిగ్గా ఉంటాయి. జింక్ లోపం ఉంటే చర్మ సమస్యలు, జుట్టు రాలిపోవడం, చుండ్రు సమస్య, పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం, కంటిచూపు తగ్గడం, పురుషుల్లో టెస్టొస్టిరాన్ హార్మోన్ల సమస్య, మధుమేహం, కాలేయ సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఆహారపు అలవాట్లతో జింక్ లోపానికి చెక్
మాంసాహారులు రెడ్ మీట్ (బీఫ్, గొర్రె, పంది) మాంసాల ద్వారా జింక్ పొందవచ్చు. పుట్టగొడుగులు, గుడ్డు తీసుకోవడం ద్వారా కూడా జింక్ లోపాన్ని తగ్గించుకోవచ్చు. శాకాహారులకు అయితే శనగలు, చిక్కుడు కాయలు, గుమ్మడికాయ గింజలు, పుచ్చకాయ గింజలు, జనపనార విత్తనాలు, బీన్స్, జీడిపప్పు మొదలగు వాటిని తీసుకోవడం మంచిది. వీటిలో జింక్‌తో పాటు అనేక రకాల విటమిన్ల్, ప్రోటిన్‌లు అధికంగా పొందవచ్చు. వీలైనంత వరకు జింక్ పోషకాన్ని సహజంగా ఆహారపదార్థాల ద్వారానే పొందాలి.
తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే జింక్ సప్లిమెంట్‌లు వాడాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మన శరీరంలో జింక్ పోషకం అవసరానికి మించి ఉండకూడదు. బాడీలో జింక్ అధికంగా ఉంటే వికారం, వాంతులు, పొత్తి కడుపు తిమ్మిరి, అతిసారం, తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.