HEALTH & LIFESTYLE

షుగర్ కళ్లను దెబ్బతీస్తుందా..?

దేశవ్యాప్తంగా 11.4% మంది మధుమేహ వ్యాధితో బాధ పడుతున్నారు. ఈ వ్యాధి వల్ల శరీరంలో ఇతర అవయవాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే, పలు అధ్యయనాల్లో వెల్లడైంది ఏంటంటే.. మధుమేహం వల్ల కళ్లు తీవ్రంగా దెబ్బతింటాయట. దీనివల్ల ఎంతోమంది చిన్న వయసులోనే చూపు కోల్పోయే అవకాశాలు ఉన్నాయట. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో చాలా మందికి దీర్ఘకాలంలో ఎంతో కొంత రెటీనా దెబ్బతినటం కనిపిస్తుంటుంది.

మధుమేహం ఉన్నవారిలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్‌లోకి చేరుకుంటే.. ఎర్ర రక్త కణాలు సరిగా పనిచేయవు. అప్పుడు రెటీనా పొరకు తగినంత ఆక్సిజన్‌ అందక దెబ్బతినటం మొదలవుతుంది. దీన్నే డయాబెటిక్‌ రెటినోపతి అని అంటారు. రెటీనా దెబ్బతింటే దాన్ని సరి చేయడం కష్టం. కాబట్టి సరైన జీవన సైలిని అలవర్చుకుంటే మధుమేహం రాకుండా జాగ్రత్త పడవచ్చు.

డయాబెటిక్‌ రెటినోపతి వచ్చిన మొదట్లో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. ఇది ముదురుతున్న కొద్దీ అక్షరాలు వంకరగా కనిపించడం మొదలవుతాయి. మొదట్లో లక్షణాలు కనిపించకపోయినా.. కళ్ల లోపల సమస్య తీవ్రమై ఉంటుందని గమనించాలి. తొలిదశలో రెటీనా పొర మీద ఉండే రక్త కేశ నాళికల గోడలు దెబ్బతిని ఉబ్బుతాయి. అక్కడ రక్తంలోని కొవ్వులు, ద్రవాలు లీక్‌ అవుతాయి. ఈ దశలో చూపు నెమ్మదిగా మందగిస్తూ వస్తుంటుంది. తర్వాతి దశలో రక్తనాళాలు పూర్తిగా మూసుకుపోవచ్చు. దీంతో వాటిని భర్తీ చేసేందుకు కొత్త రక్తనాళాలు పుట్టుకొస్తుంటాయి. వీటి నుంచి రక్తం స్రవించి పొర మీదికి చేరుకోవచ్చు. ఈ దశలో హఠాత్తుగా చూపు పోవటం గమనార్హం. కాబట్టి షుగర్ ఉన్నవారు చూపులో ఎలాంటి తేడా కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

ఫండస్‌ ఎగ్జామినేషన్‌, స్లిట్‌ల్యాంప్‌ లాంటి వాటితో రెటీనా పోరను పరిశీలించవచ్చు. దీనివల్ల రెటీనాలోని సమస్యను గుర్తించవచ్చు. రెటీనా మీది రక్తనాళాలు ఉబ్బినవారికి ఫ్లోరోసిస్‌ యాంజియోగ్రఫీ పరీక్ష ఉపయోగపడుతుంది. రెటీనా మధ్యభాగంలో వాపు, నీరు వంటివి తెలుసుకోవటానికి ఆప్టికల్‌ కొహెరెన్స్‌ టొమోగ్రఫీ పరీక్ష తోడ్పడుతుంది. ఈ పరీక్షల్లో తేలిన దాని ప్రకారం చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

*షుగర్ నియంత్రణలో ఉంచుకుంటే.. రెటీనా పొర మీద వాపు, రక్తం లీక్‌ కావటం వంటివి రాకుండా జాగ్రత్త పడవచ్చు.

*రెటీనా పొరలో సూక్ష్మ రక్తనాళాలు ఉబ్బటం, వాటిలో నుంచి ద్రవాలు, కొవ్వులు లీకవటం లాంటివి ఉంటే చికిత్స తప్పనిసరి.

*ఆక్సిజన్‌ తగ్గినచోటును గుర్తించి, లేజర్‌తో దాన్ని మాడ్చేయటం వల్ల కొత్త రక్తనాళాలు పుట్టవు. అలాగే, దీనికోసం యాంటీ వీఈజీఎఫ్‌ ఇంజెక్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Show More
Back to top button