HEALTH & LIFESTYLE

‘ఫ్యాషన్’.. అందరి జీవితాల్ని ముంచేస్తుందా?

నేటి సమకాలీన జీవనం విధానంలో తినే అన్ని పదార్థాలు, అవసరాలకు వాడే అన్ని వస్తువులు కల్తీ అవుతున్నాయి. కానీ అన్నింటికంటే.. దారుణంగా కల్తీ అయింది మన మనస్సు. స్నేహపూరిత, కుటుంబిక, వ్యాపార, ఉద్యోగ, రాజకీయ, స్త్రీ, పురుషులపై ఆసక్తి ఇలా అన్ని కోణాల్లో మన మనస్సు కల్మషంగా మారింది. స్వార్థ పూరిత ఆలోచనలు, కుట్ర పూరిత ఆలోచనలు, లక్సరీ కోసం ఎంతటి దారుణానికైనా తెగించేస్తున్నాం. ఒకప్పటి జీవన విధానంలో ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండేది.. నమ్మకం తోనే మాట ఇచ్చి పుచ్చుకునేవారు. మాట తప్పాము అంటే మరణించినట్లే అన్నటుగా గౌరవంగా బ్రతికేవారు.

ఈ కాలంలో ఎవరికి ఎవరిపై నమ్మకం లేదు. చనుబాలలో మన ప్రాణాలు నిలిపిన అమ్మపై, నిన్ను పెంచి పోషించి విద్యావంతుణ్ణి చేసిన నాన్నపై అనుక్షణం తోడుండే అక్క చెల్లెలు అన్నా తమ్ముళ్లపై కూడ నమ్మకం లేదు. తమ స్వార్ధం కోసం అందరిని క్షణములో విడిచిపెట్టి సుఖం కోసం వెళ్లిపోతున్నా వారు ఇటీవల కాలంలో చాలానే చూస్తున్నాం. మనకు బుద్ధి తెలియనపుడు పెంచిన అమ్మను, మనకు అన్ని సపర్యలు చేసి, నిద్రాహారాలు మానేసి పెంచిన తల్లిదండ్రులను వారు వృద్దాప్యానికి వచ్చాక కనీసం వారి ముఖం కూడా చూడట్లేదు. చిన్నప్పుడు తన గుండెల మీద ఎంత బరువున్నా.. నిన్ను మోసింది. అదే పెద్దయ్యాక కన్న తల్లిదండ్రులే బరువయ్యారు. పుట్టినప్పటి నుంచి అపురూపంగా పెంచిన తల్లిదండ్రులే.. తమకు బరువయ్యారని అనాథాశ్రమంలో విడిచివెళ్తున్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితి ఏ తల్లి దండ్రికి రావద్దు.

మరికొందరైతే.. వృద్ధాప్యంలో తల్లి దండ్రులకు బుక్కెడు బువ్వ పెట్టడానికి కొట్టుకుంటున్నారు. తమ పుట్టుకకే కారణమైన తల్లిదండ్రులను మాటలతో చిత్రవధ చేస్తున్నారు. ఇటీవల కాలంలో మనసును రగిల్చే ఒక ఘటనను పరిశీలిస్తే.. నేటి విషంతో కూడిన మనుషుల మనస్తత్వం అవగతం అవుతుంది. 

ఇటీవలకాలంలో తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో హృదయవిదారక ఘటన విస్మయానికి గురిచేస్తోంది. జిల్లాలోని హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో 90 ఏళ్ల వెంకటయ్య అనే వృద్ధుడు ఆత్మాహుతి చేసుకోవడం విషాదకరంగా మారింది. తన చితి తానే పేర్చుకుని నిప్పంటించుకుని వెంకటయ్య ఆత్మహత్యకు చేసుకున్నాడు. హుస్నాబాద్ మండలం పొట్టపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య తన కొడుకులు పెట్టిన కష్టాలను బాధను దిగమింగలేక గ్రామ శివారులోని ఎల్లమ్మగుట్ట వద్ద చితి పేర్చుకున్నాడు. అనంతరం చితికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వంతుల వారీగా కుమారుల వద్దకు వెళ్లడం ఇష్టం లేకనే వెంకటయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

వృద్దుడి భార్య గతంలో మృతి చెందగా.. తన పేరు ఉన్న పొలాన్ని నలుగురు కుమారులకు రాసిచ్చాడు. కొంతకాలం పాటు సొంత గ్రామంలో ఉంటున్న పెద్ద కుమారుడి ఇంట్లో ఉన్నాడు. అయితే ఐదు నెలల క్రితం వంతుల వారీగా నెలకు ఒకరు చొప్పున తండ్రిని పోషించాలని పెద్దల సమక్షంలో నలుగురు కుమారులు నిర్ణయించారు. ఇద్దరు కుమారులు సొంత గ్రామంలోనే ఉంటుండగా.. ఒకరు హుస్నాబాద్‌లో, మరొకరు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో నివాసం ఉంటున్నారు. అయితే సొంత గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్లడం వెంకటయ్యకు ఇష్టం లేదు. అందరి దగ్గరికి వెళ్లాల్సిందే అని కొడుకులు ఒత్తిడి చేయడంతో వంతుల వారీగా కుమారుల ఇళ్లల్లో ఉండటం ఇష్టం లేక మనస్తాపంతో వెంకటయ్య తన చితికి తానే నిప్పు పెట్టుకుని చనిపోయాడు.

కన్న తండ్రికి బుక్కెడు బువ్వ పెట్టలేని ధీన స్థితిలో ఉన్నామా? రేపు ఇదే పని నీకు పుట్టిన కొడుకులు చేస్తే నీకు ఎలా ఉంటుంది? ఒక్క సారైనా ఆలోచిస్తున్నామా. ఆహార పదార్థాలలో కల్తీ అయితే వైద్యుల దగ్గరికి వెళ్లి వైద్యం చేసుకోవచ్చు కానీ.. మన మనసే కల్తీ అయితే ఏ వైద్యుడు దీనికి వైద్యం చేస్తాడు. నీ కోట్ల సంపదన ఎవరికోసం. నా సంపాదన నా భార్య. పిల్లల కోసం. అని నిరంతరం తపిస్తూనే ఉంటాం. జీవితాంతం ఉరకలు వేస్తూనే ఉంటాం. రేపు పెద్దయ్యాక మీ కొడుకుకి కూడా పెళ్లి అవుతుంది. అతనికి వచ్చిన భార్యకూడా మిమ్మల్ని వృద్దాశ్రమంలో వేయమంటుంది. అప్పుడు మీరేం చేస్తారు? ఇది తప్పు అని ఐన అనగలరా? ఒక వేల నువ్వు అన్నా కూడా.. మీ తల్లిదండ్రులను మీరేం చేశారు అని వాళ్ళు వేలెత్తి చూపించరా? ఒక్కసారి ఆలోచించండి.

ఇకబోతే నేటి యువతరం మనసులో కల్తీ.. ఇది ఎంత దారుణంగా ఉందొ ఇప్పుడు పరిశీలిద్దాం. మన దేశ భవిష్యత్తు మొత్తం యువతరం మీదే ఆధారపడి ఉంది. నేటి యువతరం చేస్తున్న పెద్ద తప్పులనుంచి చిన్నచిన్న తప్పులవరకు అన్నింటిని పరిశీలిద్దాం. నేటి యువత అసలు యువతరం అంటే ఏంటో తెలుసుకో. మనిషియొక్క సంపూర్ణ భవిష్యత్తును తీర్చిదిద్దే అపూర్వమైన సమయం. బాలుడిగా ఉన్నప్పుడు నీకు జ్ఞానం ఉండదు.. పెళ్లయ్యాక అన్ని బాధ్యతలు, ముసలివారు అయ్యాక చేసే ఓపిక ఉండదు. మీరు మీ జీవితాన్ని మలుచుకునేది ఈ యవ్వన సమయంలోనే. మరి మీరు జీవితాన్ని ఎలా సెట్ చేసుకోవాలని భావిస్తున్నారు. మనిషి జీవితంలో ఎడ్యుకేషన్ పీరియడ్ చాలా ముఖ్యమైంది.

ఈ సమయంలోనే మన కెరీర్ ని సెట్ చేసుకోవాల్సి ఉంది. ఇంతటి అత్యంత ప్రాధాన్యమైన దశను కేవలం ఎంజాయ్ అన్న ముసుగులో నాశనం చేసుకుంటున్నాం. ఒక యువకుడు మనిషిగా పుట్టినప్పుడు తనకు చేయవలసిన కర్తవ్యం..తన కుటుంబానికి ఎలాంటి లోటు రాకుండా చూసుకోవడం. వీలైంతే సమాజంలోని నలుగురు పేదవాడి కడుపు నింపడం. ఇవాళ ఎంజాయ్ అనే ముసుగులో కొన్ని కోట్ల రూపాయలను వేస్ట్ చేస్తున్నాము. అమ్మాయిల వలలో పడి తమజీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకున్నాం.

నిజమైన ప్రేమ ఎప్పుడూ అభివృద్ధి, గౌరవం, ఆప్యాయతనే కోరుకుంటుంది. కానీ నేటి యువత మలినమైన మనస్సుతో ఒక అమ్మాయి కాకుంటే మరొక అమ్మాయి, ఒక అబ్బాయి కాకుంటే మరొక అబ్బాయి అని పూటపూటకు మనుషుల్ని మార్చేసుకుంటున్నారు. నీజీవితం చివరి దశలో ఒక్కసారి నీ లైఫ్ ని చూసుకుంటే.. కాస్త సంతృప్తి అయినా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి.  

తినడానికి బుక్కెడు బువ్వలేక ఎంతోమంది దీనంగా చూస్తుంటే.. వారి కనులను దాటి మన స్వార్ధం కోసం డబ్బును విరివిగా ఖర్చుపెడుతున్నాం. మీరు మీ ఎంజాయ్ చేసుకోండి తప్పులేదు.. కాని డబ్బులను వృధాగా ఖర్చుపెడుతున్నాం. చాలా అంటే చాలా ఒక్కసారి ఆలోచించండి. చాలా తక్కువ ఖర్చుతో అయిపోతే దానిని.. డంబికాలకు పోయి ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. అదే సరైన రీతిలో నీవు డబ్బును ఉపయోగిస్తే.. అందులో ఎంతో కొంతైనా అడుక్కునే వాడికి ఇస్తే.. నిన్ను రోజంతా తలుచుకుంటాడు. నీరు ప్రత్యక్షంగా ఇవ్వకపోయినా.. పరోక్షంగానైన సహాయం చేసిన వాళ్ళము అయితాము. ఇంట్లో వండుకున్న ఫుడ్ చాలా వరకు వేస్ట్ అవుతుంది. ఆ ఫుడ్ ని డస్ట్ బిన్ లో వేయకుండా.. రోడ్డున ఉన్న అడుక్కునే వారికైనా ఇస్తే వారి కడుపు నిండుతుంది. మనం కొత్తగా మన డబ్బులు ఏమి ఇవ్వాల్సిన పని లేదు. కనీసం ఈ సహాయంగా చేయచ్చు. 

ఇకపోతే నేటి స్త్రీ,పురుషుల వేషధారణ. దీనినే మనం ఫ్యాషన్ గా డ్రెస్సింగ్ సెన్స్ అంటాం. ఒకప్పుడు బట్టలు వేసుకోవాలంటే.. చేనేత వారు చేసినవి చీరలు, పంజాబ్ డ్రెస్సులు, ధోవతి ఇలా ఆరోగ్యాన్ని చేకూర్చేలా కంఫర్ట్ గా ఉండేలా ఉండేవి. ఇప్పుడు మొత్తం జీన్స్, టీ షర్ట్ దే మొత్తం రాజ్యం. ఉబ్బేట్టుగా ఉండేటట్లు అంగ ప్రదర్శన చేయడం. జీన్స్ అంతా చింపుకొని వేసుకోవడం నేటి ఫ్యాషన్. ఇదే డ్రెస్సింగ్ సెన్స్ ను ఒక 80 ఏళ్ళు వెనక్కిగా వెళ్తే.. ఈ చిరిగిపోయిన డ్రెస్సును వేసుకొని కనబడేలా వేసుకోవడానికి నీకు డ్రెస్సులే లేవా అని అవహేళన చేసేవారు. ఒకప్పుడు చిరిగిపోయిన డ్రెస్సులు అంటే అసహ్యంగా ఉండేది. కానీ ఇప్పుడు అదే ఫాషన్ అయింది. మనిషి వికృత ఆలోచనలే నేటి ఈ మార్పు.

నేటి యువత ఈ ఫ్యాషన్ కు అలవాటు పడి అనేక అనర్థాలను కొని తెచ్చుకుంటుంది. ఫ్యాషన్ ఏ విధంగా ఉన్నా సౌందర్యాన్ని మరింత ద్విగుణీకృతం చేసేదిగా ఉండాలి కానీ అంగ ప్రదర్శన చేస్తూ దిగజారే తత్వంగా మారకూడదు అని పెద్దలు అంటున్నారు. పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలకు పరిమితమైనటువంటి ఫ్యాషన్ ప్రస్తుత కాలంలో పల్లెలకు కూడా పాకింది. కుగ్రామాలలో ఉండే యువత సైతం ఈ ఫ్యాషన్ ముసుగులో సహజత్వాన్ని కోల్పోతున్నారనేది వాస్తవం. ఏది ఏమైనప్పటికీ ఫ్యాషన్ మాయలో పడి యువత తమ జీవితాలను అగమ్య గోచరంగా మార్చుకోకుండా ఉండాలనేదే పెద్దలు చెబుతున్న మాట.

Show More
Back to top button