మార్కెట్‌లో దొరికే పాలలో కల్తీ ఎక్కువగా ఎలా జరుగుతుందంటే.. నీటిలో యూరియా కలిపి తయారుచేస్తారు. దీంతో అవి తెల్లగా పాలలాగా మారుతాయి. వీటితో పాటు చిక్కదనం వచ్చేందుకు డిటర్జెంట్, కొంచెం రిఫైన్డ్ ఆయిల్ కలుపుతారు. పాల వాసన వచ్చేందుకు కెమికల్‌తో తయారుచేసిన తెల్లని పౌడర్ కూడా మిక్స్ చేస్తారు. ఇలా తయారు చేసిన పాల కల్తీని ఎవరూ గుర్తించకుండా ఉండడానికి 40 లీటర్ల ఈ ద్రవాన్ని 60 లీటర్ల పాలతో కలిపి మార్కెట్‌లోకి పంపుతారు. ఇవి మీరు తాగినప్పుడు కూడా గమనించలేరు. అందుకే మీరు తాగే పాలు స్వచ్ఛమైనవా? కాదా? అని తప్పక తెలుసుకోవాలి. ఇందుకోసం పెద్దపెద్ద పరికరాలేవీ అవసరం లేదు. సులభంగా ఇంట్లో దొరికే వాటితోనే కల్తీపాలేవో కనుగొనవచ్చు. దీనికోసం కొన్ని పాలలో కొంచెం పసుపును కలిపి బాగా షేక్ చేయండి. తర్వాత అందులో రెడ్ లిట్మస్ పేపర్ ముంచండి. లిట్మస్ పేపర్ నీలంగా మారితే, పాలలో యూరియా కలిసిందని అర్ధం.
రసాయనాలతో పాలు
చిన్నపిల్లలకు పాలు తాగించే ముందు జాగ్రత్త వహించండి. సింథటిక్ పాలు కూడా మార్కెట్‌లో చలామణి అవుతున్నాయి. వీటిని గుర్తించడం చాలా సులభం. ఇవి చాలా చేదుగా ఉంటాయి. ఈ పాలను చర్మంపై రుద్దితే.. సబ్బు రుద్దిన ఫీలింగ్ రావడంతో పాటు పాలను వేడిచేస్తే పసుపు రంగులోకి మారుతాయి.
పాలలో కొన్ని అయోడిన్ చుక్కలు కలపండి. ఆ మిశ్రమం నీలి రంగులోకి మారితే ఆ పాలు కల్తీ జరిగినట్లే.
ఇంట్లో చదునైన బండపై రెండు చుక్కలు పాలు వేస్తే అది మెల్లగా ఏదో ఓవైపు పారుతుంది. అలా పాలు పారిన దారిలో తెల్లగా కనిపిస్తే అవి స్వచ్ఛమైన పాలుగా నిర్ధారించవచ్చు. కానీ పాలు వేగంగా ధారగా పారినా, పారిన దారిలో తెల్లగా లేకున్నా.. కల్తీ అని అర్థం.
పాలల్లో స్టార్చ్(పిండి) కలుపుతారు. దీన్ని గుర్తించడానికి లోడిన్ ద్రావణంలో ఒక చుక్క పాలు వేయండి. అవి బ్లూ కలర్‌కు మారితే పాలల్లో పిండి కలిపినట్లు నిర్ధారించుకోవచ్చు.
పీ.హెచ్ పేపర్‌తో పాల స్వచ్ఛత తెలుసుకోండి
పాల కల్తీని గుర్తించడానికి లాక్టోమీటర్ పరికరాన్ని ఉపయోగిస్తారు. ఇది మార్కెట్‌లో రూ.100 నుంచి రూ.300 మధ్య దొరుకుతుంది. దీనితో పాలల్లో నీళ్లు కలిపారో లేదో సులభంగా తెలుసుకోవచ్చు.
పాలతో కోవా చేసుకోవడం ద్వారా కూడా పాలల్లో కల్తీ గుర్తించవచ్చు. సన్నని మంటపై పాలను మరిగించినప్పుడు అది నూనెలా ఉంటే పాలలో కల్తీ జరగలేదని అర్థం. కానీ గట్టిగా ఉంటే మాత్రం ఆ పాలు కల్తీ అయ్యాయని నిర్ధారించవచ్చు.
పాలు ఎక్కువ కాలం పాడవ్వకుండా ఉండేందుకు అందులో ఫార్మాలిన్ కలుపుతుంటారు. దీన్ని గుర్తించడానికి.. 10ml పాలల్లో 5ml సల్ఫ్యూరిక్ యాసిడ్ కలపాలి. ఆ మిశ్రమం ఊదా రంగులోకి మారితే అందులో ఫార్మాలిన్ కలిపినట్లే.
PH పేపర్స్ తీసుకొని దానిపైన ఒక చుక్క పాలను వేయాలి. పాలు కల్తీ కానట్టైతే పీహెచ్ విలువ 6.4 – 6.6 మధ్య ఉంటుంది. అంతకన్నా ఎక్కువ లేదా తక్కువ ఉన్నట్టైతే పాలు కల్తీ అయినట్టే.