HEALTH & LIFESTYLE

అన్ని మరిచిపోతున్నారా?తస్మాత్ జాగ్రత్త

మతిమరుపు అనేది కొన్ని సమయాల్లో వరం అవుతుంది. మరి కొన్ని సమయాల్లో శాపమవుతుందని అంటారు. కానీ, మతిమరుపు అనేది నిజంగా శాపమవుతుంది. సాధారణ మతిమరుపునే అల్జీమర్స్ అంటారు. ఇది వయసు పెరుగుతున్న కొద్ది వచ్చే మానసిక సమస్య. దీని వల్ల మీరు చిన్న చిన్న విషయాలను మరిచిపోతుంటారు. ఈ వ్యాధికి చికిత్స చేయడమే కాకుండా కౌన్సిలింగ్ అవసరం. 

డెమెన్షియా 

ఇది అల్జీమర్స్‌లో ఒక రకం. ఇందులో మెదడుకు ఉన్న శక్తి క్రమంగా సన్నగిల్లుతుంది. డెమెన్షియా అంటే ఒక రోగం కాదు, అనేక రోగాల సముదాయం. మనిషి మెదడు లోపల కొన్ని కణాలు దెబ్బతినడం వల్ల మనిషిలో అనేక నైపుణ్యాలు కనుమరుగైపోతాయి. ముఖ్యంగా తెలివితేటలు, నేర్చుకునే సమర్థత, ఏకాగ్రత, పరిశీలనా శక్తి వంటివి బాగా తగ్గిపోతాయి. ఎంత జ్ఞాపకశక్తి ఉన్నా సరే ఈ వ్యాధుల భారిన పడితే తరుచూ మరిచిపోతుంటారు.  

డెమెన్షియా – అల్జీమర్స్ లక్షణాలు

ఏ వస్తువు ఎక్కడ పెట్టారో గుర్తు ఉండదు. కొత్త విషయాలు విన్నా వాటిని మరిచిపోతుంటారు. క్రమంగా ఈ సమస్య తీవ్రత పెరిగి ఏడాది లోపు జరిగిన సంఘటనలు కూడా మరచిపోతుంటారు. కొంతమంది బాధితులు కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఉంటుంది. తిన్న ఆహారం కూడా మరిచిపోతారు. తెలియకుండానే మూత్ర విసర్జన చేస్తుంటారు.

డెమెన్షియాలో పలు రకాలున్నా, ఇందులో సర్వసాధారణమైనది అల్జీమర్స్ వ్యాధి. డెమన్షియా వచ్చిన వారిలో సగం మందికి పైగా ఈ ఆల్‌జైమర్ డెమన్షియా వస్తుంది. దీనికి కారణాలు పూర్తిగా తెలియదు. వారసత్వంగా, ఆడవారిలో ఎక్కువగా వస్తాయని వైద్యులు మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 

అల్జీమర్స్ వ్యాధి మెదడులోని జీవకణాలను ఒక్కొక్కటిగా నిర్జీవం చేస్తూ, మెదడును సరిగా పనిచేయకుండా చేస్తుంది. అమిలాయిడ్ అనే ప్రోటీన్ పొరలుగా పేరుకుపోవడం, మెదడు జీవకణాల్లో ఉండే అతి సూక్ష్మ ఫిలమెంట్లు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోవడం ఈ వ్యాధి లక్షణాలు. వంశపారంపర్యంగా, జన్యులోపాల కారణంగా ఈ మానసిక వ్యాధులు వస్తాయని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది.

చికిత్స 

వృద్ధాప్యంలో తీవ్ర మతిమరుపును, తికమకను తెచ్చిపెట్టే అల్జీమర్స్‌ రోజువారీ పనులను బాగా దెబ్బతీస్తుంది. ముందు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని నివారించే వీలుంది.

* ఒమేగా-3, ఒమేగా-6, విటమిన్‌ ఈ, బీ12 దండిగా లభించే అవిసెలు, అక్రోటుపప్పు, పిస్తా, బాదం, జీడిపప్పు, పెరుగు, పాలు, మాంసం, చేపల వంటివి తరచుగా తీసుకోవాలి.

* వ్యాయామం వల్ల అల్జీమర్స్‌ ముప్పు తగ్గుతుంది. మెదడుకు రక్తం సరఫరా బాగా జరుగుతుంది. దీంతో కొత్త మెదడు కణాలు అభివృద్ధి చెందే ప్రక్రియ కూడా ప్రేరేపితమవుతుంది.

* మెదడుకు మేత పెట్టే చిక్కు సమస్యలను పరిష్కరించటం, పదఖాళీలు పూరించటం, చదరంగం ఆడటం వంటివి చేయాలి. మెదడులోని కణాలు చురుకుగా ఉండేలా చేస్తున్నకొద్దీ ఆరోగ్యకరమైన కణాలు సజీవంగా ఉంటాయి. రోజూ ధ్యానం మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

* వారానికి కనీసం మూడు సార్లైనా తాజా పండ్లు తినాలి. వీటిల్లోని ఫాలీఫెనాల్స్‌కు అల్జీమర్స్‌ను నివారించే సామర్థ్యముంది.

* తగినంత నిద్రపోవాలి. ఇది మెదడును తాజాగా ఉంచుతుంది. శరీరానికి, మనసుకు విశ్రాంతి కలిగిస్తుంది. వయస్సు మీద పడకుండా చేసే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు మెదడునూ చురుకుగా ఉంచుతాయి.

* మద్యం, ధూమపానం అలవాట్లకు దూరంగా ఉండాలి.

Show More
Back to top button