ప్రకృతి నుంచి వచ్చే ప్రతి ఉత్పత్తిని ఏదో ఒక విధంగా మనం వినియోగించుకోవచ్చు. పండ్లు, పూలు, ఆకులు, వేర్లే కాదు. పండ్ల తొక్కలోనూ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
యాపిల్, దానిమ్మ, అరటి, నారింజ వంటి పండ్లు తిన్నాక.. వాటి తొక్క పారేయకుండా సరిగా ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు అందాన్ని పెంచుకోవచ్చు. ఏయే పండ్ల తొక్కల్లో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
దానిమ్మ తొక్క: ఎండబెట్టి పొడి చేసి దాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకోవాలి. ఆ నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. దానిమ్మ తొక్కలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు దద్దుర్లు, మొటిమలను తగ్గిస్తాయి. ఈ తొక్క పొడిలో రోజ్ వాటర్, తేనె కలిపి ఫేస్‌ప్యాక్ చేసుకోవచ్చు. దానిమ్మ తొక్క పొడిలో కొంచెం కొబ్బరి నూనె కలిపి చూర్ణంలా చేసి.. తలకు పట్టించి, తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
నారింజ పండు తొక్క: ఇందులో కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. నారింజ పండు తొక్క గాయాలు, ఇన్‌ఫెక్షన్లకు మందుగానూ వాడుకోవచ్చు. ఇందులో ఉన్న యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు గాయాలను త్వరగా తగ్గిస్తాయి.
మొటిమలతో ఇబ్బంది పడేవారు ఈ తొక్కను పొడి చేసి తేనె కలిపి ముఖానికి రాస్తే.. మంచి ఫలితం కనిపిస్తుంది.
అరటి తొక్క: పండులో కన్నా తొక్కలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు అధికం. అరటి తొక్కలో ఆరోగ్యానికి ఉపయోగపడే ‘ల్యూటిన్’ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. అరటి తొక్క తిన్నా మంచిదే. కాలిన గాయాలు, పుండ్లపై అరటిపండు తొక్కతో మర్దన చేస్తే త్వరగా మానుతాయి. తొక్క లోపలి భాగాన్ని దంతాలపై రుద్దడం వల్ల దంతాలు తెల్లగా అవుతాయి. అరటి పండు తొక్క పేస్ట్‌లా చేసుకోని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవచ్చు. ఈ విషయాన్ని అద్దం ముందు గంటల సమయాన్ని గడిపే మీ స్నేహితులకు పంపండి.