
కరోనా మహమ్మారి ఆరోగ్యం విషయంలో మనకు కొత్త అలవాట్లు నేర్పింది. అందులో ఒకటి ఆన్లైన్ ట్రీట్మెంట్. దీంతో మన పనులన్నీ మానుకుని డాక్టర్‌ను కలిసేందుకు హాస్పిటళ్లలో గంటల తరబడి ఎదురుచూసే బదులు ఎక్కడినుంచైనా అవసరమైన డాక్టర్లను సంప్రదించవచ్చు. అన్ని రకాల స్పెషాలిటీల డాక్టర్లు అందుబాటులో ఉంటారు. అసలు ఏంటి ఈ ఆన్లైన్ ట్రీట్మెంట్? దీనిని ఎలా సంప్రదించాలి? దీని ద్వారా ఎటువంటి సేవలు పొందవచ్చు? వంటి విషయాలన్ని తెలుసుకుందాం పందండి. పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ–సంజీవని ఓపీడీ పేరుతో 2021లో ఆన్లైన్ కన్సల్టేషన్ ప్రారంభించింది.
ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన డాక్టర్లు ప్యానెల్లో ఉంటారు. దీంతో ఆన్లైన్లో e–ప్రిస్క్రిప్షన్ ద్వారా అవసరమైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తారు.
* ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
e–సంజీవని ఓపీడీ అధికారిక సైట్ లేదా యాప్‌లో పేషంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మీ మొబైల్ నెంబర్ కన్ఫార్మ్ అవుతుంది. తర్వాత పేషంట్ రిజిస్ట్రేషన్ ఫారంను పూర్తి చేయాలి. ఆ ప్రాసెస్ పూర్తయిన తర్వాత టోకెన్ కోసం రిక్వెస్ట్ పెట్టాలి. పాత హెల్త్ రికార్డులు ఏమైనా ఉంటే వాటిని అప్లోడ్ చేయాలి. ఇది పూర్తయ్యాక పేషంట్‌కు sms ద్వారా ఒక ఐడీ, టోకెన్ నంబర్లు వస్తాయి. ఐడీ నెంబర్‌తో అపాయింట్మెంట్ కోసం లాగిన్ కావాలి.పేషంట్ల సంఖ్యను బట్టి మీకు సీరియల్ నెంబర్ ఇస్తారు. ఎవరూ వెయిటింగ్లో లేకపోతే మీరు సీరియల్ నెంబర్ 1 రావొచ్చు. తర్వాత పేషంట్‌కు డాక్టర్‌ను కేటాయిస్తారు. అపుడు స్క్రీన్ మీద మీకు ”కాల్ నౌ” బటన్ యాక్టివేట్ అవుతుంది. 120 సెకండ్లలో యూజర్ దాన్ని క్లిక్ చేయాలి. అప్పుడు పది సెకండ్లలో డాక్టర్ మీకు వీడియోలో కనిపిస్తారు. డాక్టర్‌కు మీ సమస్య చెప్పుకోవచ్చు. మీ పాత రికార్డులను పరిశీలించిన తర్వాత డాక్టర్ మీకు ఈ-ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. దాంతో కాల్ ముగుస్తుంది.
పేషంట్ ఈ–ప్రిస్క్రిప్షన్‌ను సేవ్ చేసుకొని లేదా ప్రింట్ తీసుకొని లాగ్ అవుట్ కావొచ్చు. మొబైల్‌కు కూడా ఈ–ప్రిస్క్రిప్షన్ వస్తుంది. అయితే, ఓపీ ఒక్కో హస్పటల్లో ఒక్కో లా ఉంటుంది. కాబట్టి, ఓపీ తీసుకునే ముందు సమయం తప్పక తెలుసుకోవాలి. కొన్ని క్లినిక్‌లలో ఉదయం గం.9- మధ్యాహ్నం గం.2, కొన్ని చోట్ల ఉదయం గం.9- సాయంత్రం గం.4 వరకు అందుబాటులో ఉంటుంది.